రేప్ బాధితురాలిని చచ్చిపొమ్మని బెదిరిస్తున్న గ్రామం


Rape victim threatenedపశ్చిమ బెంగాల్ లోని ఓ గిరిజన గ్రామం అది. కామాంధులైన ఐదుగురు చేతిలో సామూహిక మానభంగానికి గురయిన గ్రామ మహిళ ఒకరిని చావనైనా చావాలని లేదా ఊరొదిలైనా పోవాలనీ ఆ గ్రామం హింసిస్తోంది. ఇంటిపై దాడి చేసి తలుపులు పగల గొట్టి, చావబాది గ్రామ పెద్ద విధించిన ‘గ్రామ బహిష్కరణ’ శిక్షను అమలు చేయించడానికి ఆ గ్రామం అంతా ప్రయత్నిస్తోంది. సామూహిక అత్యాచారంతోనే షాక్ లో ఉన్న ఆ మహిళ, గ్రామస్ధుల హింసతో హతాశురాలై సాయం కోసం చూస్తోంది.

పశ్చిమ బెంగాల్ లో బీర్ భూమ్ జిల్లాలో నిర్మాణ కార్మికురాలుగా పని చేసుకుంటూ బతుకుతున్న బాధితురాలు ఫిబ్రవరి 26 తేదీన పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో సామూహిక అత్యాచారానికి గురయింది. అత్యాచారానికి గురయిన బాధితురాలిగా తోడుగా నిలవడానికి బదులు గ్రామం మొత్తం ఆమెను నేరస్ధురాలుగా చూస్తోంది. ఆమె ఉనికే గ్రామానికి అరిష్టంగా భావిస్తున్నది. ఆమెకు 12,000 రూపాయలు జరిమానా విధించి ఆమె వద్ద ఉన్న ఆవుల్ని లాక్కున్నారు.

“నన్ను ఆత్మ హత్య చేసుకొమ్మని వారు కోరుతున్నారు. ఉరి వేసుకొని చచ్చిపోవాలనీ లేదా ఏదైనా విషం ఐనా మింగి చావాలనీ చెబుతున్నారు. నన్ను ఊరొదిలి వెళ్ళమని చెబుతూ, అందుకోసం నా ఆవుల్ని లాగేసుకున్నారు. ప్రతి ఒక్కరూ నన్ను బెదిరిస్తూ కొడుతున్నారు. ఊరు వదిలిపెట్టి వెళ్లకపోతే నగ్నంగా ఊరేగిస్తామని హెచ్చరిస్తున్నారు. నాకు చాలా భయం వేస్తోంది. ఏం చేయాలో తెలియడం లేదు” అని బాధితురాలు చెప్పినట్లుగా ఎన్.డి.టి.వి తెలిపింది.

బ్లాక్ డివిజనల్ అధికారి కొయేలీ దాస్ కి విషయం తెలిసి గ్రామం సందర్శించాడు. “గ్రామస్ధులు ఆమెను బెదిరించి, కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశాం. పరిస్ధిని చూడడానికి ఇక్కడికి వచ్చాము. ఇటువంటి దుర్ఘటన ఎవరికైనా జరగొచ్చని గ్రామస్ధులకి చెప్పాము. బాధితురాలికి భద్రత సమకూర్చాలని ఉన్నతాధికారులకు చెప్పాము” అని దాస్ తెలిపాడు. అయితే బాధితురాలు గ్రామంలో ఉండడానికి వీలులేదని, ఆమెను శిక్షించాల్సిందేననీ గ్రామస్ధులు కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది.

“అక్రమ పనులు చేసే ఆడవారిని గ్రామస్ధులు, గ్రామ పెద్ద శిక్షిస్తారు. శిక్ష అనేక రకాలుగా ఉంటుంది. పెనాల్టీ వేయవచ్చు. లేదా గ్రామం నుండి గెంటేయవచ్చు. జరిగిన తప్పుకి ఆమెను శిక్షించాల్సిందే. ఇలాంటి స్త్రీలను మా సమాజంలో శిక్షిస్తాము. ఇవి మా నియమాలు, చట్టాలు. వాటిని మేము ఎప్పుడూ పాటిస్తాం” అని గ్రామ పెద్ద శ్యాం బేరా చెప్పాడు. అత్యాచారానికి గురయిన స్త్రీ, బాధితురాలు కాకుండా నేరస్ధురాలుగా గ్రామం ఏ కారణాలతో పరిగణిస్తున్నదీ తెలియరాలేదు.

భారత దేశంలో సామాజిక అభివృద్ధి దేశమంతటా ఒకే విధంగా జరగలేదు. ఓవైపు శతాబ్ధాల నాటి సామాజిక కట్టుబాట్లతో అనేక గ్రామాలు సాంస్కృతికంగా బాగా వెనుకబడి ఉండగా, మరొకవైపు దిగుమతి చేసుకున్న సంస్కృతిని ఒంట బట్టించుకుని కనీస మానవ సంబంధాలను సైతం పాటించకుండా విచ్చలవిడితనంతో విర్రవీగుతున్న మెట్రోపాలిటన్ నగరాలూ ఈ దేశంలో ఉన్నాయి. ఈ రెండింటి మధ్య వివిధ ప్రాంతాలు, రాష్ట్రాలూ, కులాలూ, తెగలూ వివిధ సామాజిక అభివృద్ధి స్ధాయిలలో ఉన్నాయి. అయితే ఈ సమాజాలన్నీ ఒకే ఒక్క అంశంలో ఏకీ భావంతో ఉన్నట్లు చూడవచ్చు. అదే మహిళల విషయం.

గిరిజన గ్రామం అత్యాచారానికి గురయిన స్త్రీనే నేరస్ధురాలిగా చూసే విపరీత ధోరణితో స్త్రీల పట్ల సంకుచితంగా ఉంటే, సంపదలకు వారసులని కనిచ్చే పనిముట్టుగా మాత్రమే స్త్రీలను చూస్తూ, ఇతరేతర విషయాలన్నింటిలోనూ వివాహేతర సంబంధాలను ఆమోదించే విపరీత ధోరణితో సో కాల్డ్ ఆధునిక సమాజాలు ఉన్నాయి. ఇవి రెండూ అంతిమంగా మహిళల మానసిక, సాంస్కృతిక, సామాజిక హక్కులనూ, భావాలనూ తృణీకరిస్తున్నాయి. ఈ రెండు చివరల మధ్య తర తమ స్ధాయిలలో ఉన్న సమాజాలు కూడా మహిళల పట్ల సంకుచితంగానే వ్యవహరిస్తున్నాయి. “స్త్రీకీ మెదడు, హృదయమూ, శరీరమూ ఉంటుంది. వాటికీ ఆలోచనా, బాధా, కోరికా ఉంటాయి” అని చలం మాహాశయుడు చెప్పి శతాబ్దం గడిచినా పరిస్ధితులు అలాగే కొనసాగుతున్నాయి.

బాధిత గిరిజన స్త్రీ కి గ్రామ బహిష్కరణతో పాటు 12,000 రూపాయల జరిమానా విధించడమే గాక ఆవులను కూడా లాక్కోవడం చూస్తే ఇందులో గిరిజన పెద్ద గానీ, ఆ గ్రామంలో పెత్తందారులు గానీ ఆర్ధికంగా లబ్ది పొందే కుట్రను కొట్టివేయలేము. గ్రామ కట్టుబాట్లు, గ్రామ పెద్ద తదితర పద బంధాల మాటున పెత్తందార్లు వసూలు చేసిన జరిమానాలతో గ్రామస్దులు తాగి తందనాలాడడం సాధారణ విషయం. గ్రామంలో ఉన్న ఆస్తులను వదిలిపెట్టి వెళ్లలేక, గ్రామం దాటి జీవనం గడిపే అవకాశాలు లేని పరిస్ధితుల్లో బాధితులు గ్రామ పెత్తందార్ల ఆజ్ఞాలను శిరసా వహిస్తుంటారు. భూస్వామ్య వ్యవస్ధ లో ఉండే స్ధాయిలో కుట్రలు లేకపోయినప్పటికీ కొన్నిచోట్ల గిరిజన గ్రామాలు ప్రత్యేకంగా మహిళల పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నాయి. స్త్రీల పట్ల ఊహించని స్ధాయిలో ప్రజాస్వామికంగా వ్యవహరించే గిరిజన గ్రామాలు కూడా అనేకం ఉన్నాయి.

ఈ తేడాలన్నీ భారత దేశ అసమ సామాజిక అభివృద్ధిని ఎత్తి చూపుతున్నాయి. దానితో పాటు సమాజాలన్నీ స్త్రీల పట్ల నిరంకుశంగానే వ్యవహరిస్తున్నాయని కూడా ఈ సంఘటన విప్పి చూపుతోంది. స్త్రీలనూ, స్త్రీలకు ఉన్న పునరుత్పత్తి శక్తినీ కూడా డబ్బు దృక్పధంతో చూడడం వల్లనే ఈ విపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెట్టుబడిదారీ సమాజం డబ్బు దృక్పధంతో మానవ సంబంధాలను చూడడంలో అన్నీ పరిధులనూ దాటిపోయింది. ఇక ఇది అంతమైతే తప్ప బడుగు, బాధిత వర్గాల ప్రజలకు విముక్తి లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s