అమెరికా, చైనా దేశాల పార్లమెంటు సభ్యులలో ఎవరు ఎక్కువ సంపన్నులై ఉంటారు? సాధారణంగా అమెరికా కాంగ్రెస్, సెనేట్ సభ్యులే ఎక్కువ సంపన్నులై ఉంటారని భావిస్తాం. కానీ అది నిజం కాదని ‘బ్లూమ్ బర్గ్’ పత్రిక చెబుతోంది. చైనా పీపుల్స్ కాంగ్రెస్ సభ్యులతో గానీ, చైనా కమ్యూనిస్టు పార్టీ లోని ఉన్నత స్ధానాల్లో ఉన్న నాయకులతో గాని పోల్చి చూస్తే అమెరికా కాంగ్రెస్, సెనేట్ సభ్యులు కడు పేదలని ఆ పత్రిక చెబుతోంది. అమెరికా కాంగ్రెస్ లో మొత్తం 535 మంది సభ్యులు ఉన్నారు. గత సంవత్సరం (2011) వీరంతా కలిసి కూడబెట్టిన దానికంటే ఎక్కువ మొత్తంలో చైనా చట్ట సభలోని టాప్ 70 మంది ధనిక సభ్యులు కూడబెట్టినట్లు ఆ పత్రిక తెలిపింది.
చైనా సభలో ఆర్ధికంగా పై నుండి మొదటి 70 స్ధానాల్లో ఉన్న సభ్యుల సంపద 2011 లో 565.8 బిలియన్ యువాన్లకు (89.8 బిలియన్ డాలర్లు) చేరుకుందట. ఒక్క 2010 లోనే వీరు 11.5 బిలియన్ డాలర్లు సంపాదించారని బ్లూమ్ బర్గ్ పత్రిక తెలిపింది. షాంఘై ఆధారంగా పని చేసే హూరూన్ అనే మ్యాగనైన్ ప్రచురణ సంస్ధ ప్రచురించిన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. చైనా సంపన్నుల వివరాలను ఈ సంస్ధ సేకరిస్తుందని బ్లూమ్ బర్గ్ తెలిపింది. అమెరికా ప్రభుత్వంలో మూడు విభాగాల్లో ఉన్నత స్ధానాల్లో ఉన్న 660 మంది అధికారులంతా కలిసి 7.5 బిలియన్ డాలర్లు మాత్రమే కూడబెట్టారని ఆ నివేదిక తెలిపింది.
అమెరికాలో జరుగుతున్నట్లుగానే చైనాలో కూడా సంపదలు కొద్ది మంది వద్దనే కేంద్రీకృతం అవుతోందని ఈ లెక్కల ద్వారా అర్ధమవుతోంది. ఇంకా చెప్పాలంటే, అమెరికా కంటే ఎక్కువగా చైనాలోనే సంపదల కేంద్రీకరణ జరుగుతోందని తెలుస్తోంది. అయితే అమెరికా, చైనా ల పెట్టుబడిదారుల సంపదలు ఇక్కడ లెక్కలో లేవని గ్రహించాలి. అమెరికా పెట్టుబడిదారులకు రెండు శతాబ్దాల దోపిడీ చరిత్ర ఉండగా, చైనా పెట్టుబడిదారుల దోపిడీ చరిత్ర కేవలం మూడు దశాబ్దాల నాటిదేనని కూడా గ్రహించాలి.
కేవలం చట్ట సభల్లో ఉన్న ధనికుల లెక్కలను చూసి అమెరికా కంటే చైనా సంపన్నులు ఎక్కువ సంపాదిస్తున్నారని అనుకోనవసరం లేదు. కాకుంటే ప్రజల ప్రయోజనాలను పరిరక్షిస్తామనీ, దేశ ప్రయోజనాలను కాపాడతామనీ అధికార స్ధానాలకూ, ప్రభుత్వ పెట్టణాన్నీ చేజిక్కుంచుకున్న వారు నిజానికి తమ సంపదలను పెంచుకోవడంలోనే మునిగిపోయారనీ ఇండియాయే కాక అమెరికా, చైనాలు కూడా అందుకు మినహాయింపు కాదనీ ఈ సందర్భంగా గ్రహించవలసి ఉంది.
హురూన్ నివేదిక ప్రకారం 2010 లో చైనా తలసరి ఆదాయం 2,425 డాలర్లు కాగా అమెరికా తలసరి ఆదాయం 37,527 డాలర్లు. అంటే చైనాలో పోగవుతున్న సంపద ప్రధానంగా ఉన్నత వర్గాల వద్దనే కేంద్రీకృతం అవుతోందన్న మాట. అలాగని అమెరికాలో సంపదలు సమాన పంపిణీ ఉండని కాదు. అమెరికాలో ఉన్నత వర్గాల వారి ఆదాయం చైనా కంటే అనేక రేట్లు ఎక్కువ ఉందన్నదే దీని అర్ధం. చైనాలో అక్రమ భూ ఆక్రమణలు, అవినీతి పెచ్చరిల్లిపోతున్నాయనీ, ఈ సంవత్సరం అధికారం చేపట్టనున్న కొత్త చైనా నాయకత్వానికి సామాజిక అశాంతి స్వాగతం పలకనున్నదనీ బ్లూమ్ బర్గ్ పత్రిక అభిప్రాయపడింది.
చైనాలో ‘నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్’ (ఎన్.పి.సి) అత్యున్నత ప్రభుత్వ సంస్ధ. ఇందులో 3000 మంది సభ్యులు ఉంటారు. ఎన్.పి.సి ని కేవలం రాబరు స్టాంపుగానే పశ్చిమ పత్రికలు తరచుగా చెబుతుంటాయి. కానీ ఇందులో దేశంలోని ఉన్నత ఆదాయ వర్గాలే సభ్యత్వం పొందగలరు. చైనాలో శక్తివంతమైన రాజకీయ నాయకులు, అధికారులు దీనిలో సభ్యులుగా ఉన్నారు. వారు తమ తమ రాష్ట్రాలలో రాజకీయాలనూ, ప్రభుత్వాన్నీ శాసిస్తూ ఉంటారు.
హూరూన్ సంస్ధ పబ్లిక్ గా అందుబాటులో ఉండే వనరుల ద్వారానే ఈ నివేదిక తయారు చేసినట్లు చెప్పింది. ఉదాహరణకి కార్పొరేట్ సంస్ధలు ప్రభుత్వం వద్ద దాఖలు చేసే డాక్యుమెంట్ల వివరాలను అది సేకరించింది. ఆ తర్వాత ఎన్.పి.సి సభ్యుల వివరాలతో కార్పొరేట్ ఫైలింగ్స్ వివరాలను సరిపోల్చుకుని ఎన్.పి.సి సభ్యుల ఆదాయాలు, సంపదల వివరాలను క్రోడీకరించింది. అంటే ప్రభుత్వానికి సమర్పించిన లెక్కల ద్వారా లెక్క కట్టిన ఎన్.పి.సి సభ్యుల ఆదాయాలే అంత మొత్తంలో ఉన్నాయి. చైనాలో అవినీతి, మాఫియా, అక్రమ ఆస్తులు అన్నింటిని పరిగణలోకి తీసుకుంటే హురూన్ ప్రకటించిన దాని కంటే కొన్ని రేట్లు సంపదలు తేలుతాయి.
చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ సంపన్న ప్రవేటు పెట్టుబడిదారులను కూడా కమ్యూనిస్టు పార్టీ సభ్యులుగా చేర్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించి దశాబ్దం క్రితం సఫలం కూడా అయ్యాడు. ఫలితంగా చైనా కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడు సంపన్నులతో నిండిపోయింది. కంపెనీల అధిపతులు, బ్యూరోక్రాట్ ఉన్నతాధికారులూ, మాఫియా కింగులూ… ఇలాంటి జాతి అంతా ఇప్పుడు చైనా కమ్యూనిస్టు పార్టీ నీడలో సేద దీరుతూ ఉన్నారు. చైనాలో కమ్యూనిస్టు పార్టీయే అతి పెద్ద అధికార కేంద్రం అన్న సంగతి గుర్తుంచుకుంటే చైనా దోపిడీ వర్గం కమ్యూనిస్టు పార్టీ పేరుతోనే తమ శ్రమ దోపిడీ ని సాగిస్తున్నట్లు అర్ధం చేసుకోవచ్చు. చైనాలో శ్రమ దోపిడీని అంతం చేసే లక్ష్యంతో అవతరించిన చైనా కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడు అక్షరాలా శ్రమను దోచుకుంటూ సంపదలు కూడపెడుతున్న దోపిడి దొంగలకు నెలవుగా మారిందన్నమాట! చీమలు పెట్టిన పుట్టల్లో పాములు దూరడం అంటే ఇదే.
ఎన్.పి.సి లో అత్యంత ధనికుల్లో మూడో స్ధానంలో ఉన్న లు గువాంగ్ క్వియు చైనా ఉపాధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ తో కలిసి ఫిబ్రవరి 14 న అమెరికా వెళ్ళాడు. అక్కడ వారు అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్, ట్రెజరీ సెక్రటరీ తిమోతి గీధనర్ లను కలుసుకుని వ్యాపార విషయాలు మాట్లాడుకున్నారు. ఎన్.పి.సి లో సభ్యులుగా ఉన్నవారు ఇండియా పార్లమెంటు సభ్యులకు మల్లేనే, తమ తమ వ్యాపారాల వృద్ధికి, సంపదల పెంపుకూ కృషి చేయడమే తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం చాలా తక్కువ. ఎన్.పి.సి సభ్యత్వాన్ని వారు తమ విరోధులపై పై చేయి సాధించడానికీ, వ్యాపార ప్రత్యర్ధులపై పై చేయి సాధించడానికీ ఉపయోగ పెట్టుకుంటున్నారు. కమ్యూనిస్టు పార్టీ, బ్యూరోక్రసీ లు చైనా సంపన్నుల సంపదల వృద్ధికి ఉపయోగపడే అతి పెద్ద వ్యవస్ధలుగా విలసిల్లుతున్నాయి. సంపన్నుల పక్షం వహించడం అంటే దేశంలో కోట్లాదిమంది కార్మికులు, ఉద్యోగులు, రైతులు, కూలీలు… తదితర సామాన్య జనం ప్రయోజనాలకి వ్యతిరేకంగా పని చేయడమే.
భారత దేశం, అమెరికా, యూరప్ లలో లాగానే చైనాలో కూడా ప్రభుత్వంలో అధికారం చెలాయించేవారు తమ ఆస్తుల వివరాలు ప్రజలకు చెప్పరు. చెప్పినా పచ్చి అబద్ధాలే చెబుతారు. అత్యున్నత రాజకీయ నాయకులుగా ఉన్న అధ్యక్షుడు హూ జింటావో, ప్రధాని వెన్ జియాబావో లు తమ వ్యక్తిగత ఆస్తుల వివరాలు గానీ, తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు గానీ ఎన్నడూ వెల్లడించలేదని బ్లూమ్ బర్గ్ తెలిపింది. చైనా ఆర్ధిక వృద్ధితో మధ్యతరగతి వర్గం గణనీయంగా పెరిగింది. అయితే ఈ వర్గం క్రమంగా తమ ఆదాయాలను కోల్పోతోంది. కార్మిక చట్టాలు బలహీనంగా ఉండడంతో కనీస వేతనాలు, పర్యావరణ చట్టాలు అమలు కావు. దానితో కార్మికులు, ఉద్యోగులకు వేతనాల రూపంలో చెందవలసిన భాగంలో గణనీయ మొత్తం తిరిగి సంపన్నులకే చేరుతోంది. ఫలితంగా ఆదాయ అంతరాలు మునుపటి కంటే తీవ్ర స్ధాయిలో పెరుగుతున్నాయి.
చైనాలో సమ్మెలు, ఆందోళనలు నిత్య కృత్యం. ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో అక్కడ ఆందోళనలు జరుగుతాయి. కొందరు చైనీయులు నడిపే బ్లాగుల ద్వారా, హాంగ్ కాంగ్ లాంటి నగరాల నుండి నడిచే పత్రికల ద్వారా ఆందోళనల వివరాలు బైటికి రావడమే తప్ప చైనా ప్రభుత్వ పత్రికలు ఆ వివరాలు చెప్పవు. ఈ ఆందోళనలు మరింత సంఘటిత రూపం తీసుకుని కార్మిక వర్గం చైతన్యవంతం అయితే తప్ప అక్కడ పరిస్ధితి మారదు.
మావో చైనా ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులలో ఉన్నప్పుడు చైనా ప్రజల పేదరికాన్ని పంచుకున్నాడు. దేశాధ్యక్షుడుగా ఉండి కూడా తమ కుటుంబానికి అందే రేషన్‌కు మించి అదనంగా ఒక సౌకర్యాన్ని కూడా అదనంగా పొందని స్వభావం తనది. తనకిచ్చే రేషన్ సరిపోక కళాశాలనుండి ఆకలితో అలమటిస్తూ తన నివాసానికి వచ్చిన కూతురిని తమ కిచ్చే రేషన్ ఆహారంతోటే సరిపెట్టాడు తప్పితే కాస్తంత రుచికరమైన భోజనం ఆశించిన కన్నబిడ్డ కనీస కోరిక కూడా తీర్చడానికి ప్రయత్నించలేదు మావో.
ఉత్తర కొరియాలో అమెరికా దురాక్రమణ సైన్యాలకు వ్యతిరేకంగా్ పోరాడుతూ కన్నకొడుకు నేలకొరిగితే కన్నీళ్లు కార్చడానికి కూడా ప్రయత్నించకుండా కోడలిని ఓదార్చిన నిర్మలాంతఃకరణకు మావో ప్రతీక. కన్నకొడుకుకోసం విచారిస్తే కోట్లాది మంది చైనా ప్రజల త్యాగాలను మలినపర్చినట్లవుతుందని భావించిన నిజమైన ప్రజానేత మావో.
50 ఏళ్లు గడిచిన తర్వాత ఒక మహాదేశం ఎలా మారిపోయింది. నవ-పెట్టుబడిదారీ-చైనా నేతలు ఎంత ఘోరంగా దిగజారిపోయారో? చెట్టు లోపలినుంచే పురుగు దొలిస్తే ఎంత భయంకంగా ఉంటుందో అటు రష్యా, ఇటు చైనా రెండూ మన కళ్లముందే సజీవ ఉదాహరణగా నిలుస్తున్నాయి.
“సంపన్నుల పక్షం వహించడం అంటే దేశంలో కోట్లాదిమంది కార్మికులు, ఉద్యోగులు, రైతులు, కూలీలు… తదితర సామాన్య జనం ప్రయోజనాలకి వ్యతిరేకంగా పని చేయడమే.”
ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా మనుషులుగా ఉండేవాళ్లు అటా ఇటా అని తేల్చుకోవడానికి సరిగ్గా సరిపోయే గీటురాయి ఇది.