ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలు గల్లంతు కాగా ప్రతిపక్షం లో ఉన్న పార్టీలు అధికారం దిశలో పయనిస్తున్నాయి. మణి పూర్ పంజాబ్ లలో మాత్రం కాంగ్రెస్, బి.జె.పి కూటమి తిరిగి నిలబెట్టుకునే వైపుగా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తగా చూస్తే యు.పి.ఏ, ఎన్.డి.ఏ రెండు కూటములకూ నిరాశ కలిగించేవిగానే ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. గాంధీల కంచుకోటలుగా భావించే అమేధీ, రాయబరేలలోనూ కాంగ్రెస్ అభ్యర్ధులు వెనకబడి ఉన్నారని తెలుస్తోంది.
ఉత్తర ప్రదేశ్ లో అధికార బి.ఎస్.పి ఓటమీ పాలయింది. ములాయం నాయకత్వం లోని సమాజ్ వాదీ పార్టీ సాధారణ మెజారిటీ పొందేందుకు సిద్ధంగా ఉంది. ఎక్జిట్ పోల్ ఫలితాలు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉండడం ఈ సారి విశేషం.
గత యు.పి అసెంబ్లీలో 97 స్ధానాలు పొందిన ఎస్.పి ఈసారి (ఆధిక్యత లో ఉన్న స్ధానాలు కలుపుకుని) 213 స్ధానాలు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బి.ఎస్.పి బలం 206 నుండి 87 కు పడిపోనున్నాయి. బి.జె.పి స్వల్ప స్ధానాలు కోల్పోతుండగా, కాంగ్రెస్ కొద్దిగా మెరుగ్గా కనిపిస్తోంది.
కాన్షీరామ్ నేతృత్వంలో ‘బహుజనులు ఒక్కటైతే” అధికారం చేజిక్కించుకోవచ్చన్న సిద్ధాంతంతో బి.ఎస్.పి పార్టీ ప్రారంభమై దిన దిన ప్రవర్ధనమవుతూ వచ్చింది. కాన్షీరామ్ మరణానంతరం మాయావతి ‘బహుజన సిద్ధాంతం’ వదిలి పెట్టి ‘సర్వ జన సిద్ధాంతం’ పేరుతో ఆగ్ర కులాల వారిని కూడా కలుపుకుని అధికారంలోకి రాగలిగింది. అయితే, సర్వ జన సిద్ధాంతం కనిపెట్టిన మాయావతి ఆగ్ర వర్గాలను తాత్కాలికంగా ఆకర్షించినప్పటికీ బహుజనులను దూరం చేసుకున్నట్లు ఈ ఎన్నికల ఫలితాల్లో కనిపిస్తోంది. దళితుల పార్టీగా ప్రారంభమై సర్వ జన సిద్ధాంతం పేరుతో దళిత పార్టీ ముద్రను బి.ఎస్.పి కోల్పోయిందా అన్నది భవిష్యత్తులో జరగబోయే మరిన్ని పరిణామాలలో స్పష్టం కావచ్చు.