గుజరాత్ నరమేధంపై అమెరికా కాంగ్రెస్ తీర్మానం సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసమే


Gujarat pogramగుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్ర మోడి ప్రత్యక్ష పర్యవేక్షణలో ముస్లిం లపై సాగిన దారుణ నరమేధం జరిగి దశాబ్దం పూర్తయిన సందర్భంగా అమెరికా ప్రతినిధుల సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. గుజరాత్ రాష్ట్రంలో అన్నీ మతాల వారూ మత స్వేచ్చతో బతికే సుహృద్భావ పూరిత వాతావరణం కల్పించాలని గుజరాత్ లోని నరేంద్ర మోడి ప్రభుత్వాన్ని ఆ తీర్మానం కోరింది. 2002 నాటి ‘ముస్లింల హత్యాకాండ’లో బాధితులైన వారికి నరేంద్ర మోడి ప్రభుత్వం సరైన న్యాయం కల్పించేందుకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదన్న ఒబామా ప్రభుత్వ అభిప్రాయంతో తీర్మానం ఏకీభవించింది. ముస్లింల ‘నరమేధానికి’ పాల్పడిన హిందూ మూకలతో నరేంద్ర మోడి కుమ్మక్కు కావడంపైన జర్నలిస్టులు, మానవ హక్కుల సంస్ధలు వెలువరించిన నివేదికలతో తాము ఇంకా ఆందోళనతోనే ఉన్నామని అమెరికా ప్రతినిధుల సభ సభ్యులు తీర్మానం ద్వారా తెలిపారు.

‘హౌస్ రిసోల్యూషన్ 569’ ద్వారా అమెరికా ప్రతినిధుల సభ “విషాదకరమైన గుజరాత్ మత హింస పదవ వార్షిక దినాన్ని గుర్తిస్తున్నట్లు”గా ప్రకటించింది. తీర్మానాన్ని డెమోక్రటిక్ పార్టీకి చెందిన మిన్నెసోటా ప్రతినిధి కీత్ ఎల్లిసన్ ప్రతిపాదించాడు. “గుజరాత్ లోని అన్నీ మతాల వారికీ మత స్వేచ్ఛను పునఃస్ధాపించాలని” అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ చేసిన సిఫారసులను అంగీకరించాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వాన్ని తీర్మానం కోరింది.

2002లో ముస్లింలపై ఎక్కుపెట్టబడిన హిందూ మూకల దాడిలో 2000 కు పైగా ప్రజలు చనిపోయారనీ, లక్ష మందికి పైగా జనం శరణార్ధి శిబిరాల్లో తలదాచుకోవలసిన పరిస్ధితి ఏర్పడిందనీ తీర్మానం పేర్కొంది. జాతీయ మానవ హక్కుల సంస్ధ, భారత సుప్రీం కోర్టు లు సమర్ధవంతంగా పని చేయడం వల్ల గుజరాత్ అల్లర్లలో కొందరు దోషులపై నేర నిర్ధారణ జరిగిందనీ, మోడీ ప్రభుత్వం లోని కొందరు ఉన్నత స్ధాయి వ్యక్తులు అరెస్టు అయ్యారనీ పేర్కొంది. హిందూ మూకల దాడుల్లో జరిగిన దారుణ హింసా ఘటనలను కొన్నింటిని తీర్మానం ప్రస్తావించింది.

2002 లో ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్ధ ప్రచురించిన “మిమ్మల్ని రక్షించడానికి మాకు అనుమతి లేదు” (We Have No Orders to SaveGujarat pogramm You) అన్న పేరుతో ప్రచురించిన నివేదిక అంశాలను ఉటంకించింది. “2002 ఫిబ్రవరి 28 మార్చి 2 తేదీన మధ్య దాడులు చేసినవారు అహ్మదాబాద్ నగరంపై వేల సంఖ్యలో మిలీషియా మాదిరిగా విరుచుకు పడ్డారు” అన్న హ్యూమన్ రైట్స్ వాచ్ పరిశీలనను తీర్మానం పేర్కొంది. “చంపడంటూ రెచ్చగొట్టే నినాదాలు ఇచ్చుకుంటూ, ముస్లింల కుటుంబాలూ వారి ఆస్తుల చిరునామాలతో కూడిన జాబితాల కంప్యూటర్ ప్రింటవుట్ లను చేత బట్టుకుని హంతక దాడులకు పాల్పడ్డారు. పోలీసులు తమతోనే ఉన్నారన్న పూర్తి విశ్వాసంతో వారు దాడులకు పాల్పడ్డారు” అని హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదికను ఉటంకించింది.

గుజరాత్ భాషా పత్రికలు గోధ్రా దుర్ఘటనపై అనేక కట్టు కధలను, ప్రకటనలనూ ప్రచారం చేశాయనీ, గోధ్రా దుర్ఘటనకు ప్రతీకారం తీర్చుకోవలసిందిగా బహిరంగంగానే పిలుపునిచ్చాయనీ అమెరికా ప్రతినిధుల సభ తీర్మానం ఆరోపించింది. “గుజరాత్ మారణ కాండ విషయంలో ఎక్కడైనా న్యాయం జరిగినట్లయితే అది గుజరాత్ ప్రభుత్వం సృష్టించిన అనేక అడ్డంకులను దాటుకుని మరీ జరిగిందే తప్ప గుజరాత్ ప్రభుత్వం వల్ల ఎటువంటి న్యాయమూ జరగలేదు” అని తీర్మానం స్పష్టంగా పేర్కొన్నది.

గుజరాత్ నరమేధం పై తీర్మానం చేయడం ద్వారా అమెరికా ముస్లింలకు వ్యతిరేకం కాదని ప్రపంచానికి చెప్పదలుచుకున్నదేమో తెలియదు గానీ తీర్మానం చేసే నైతిక, రాజకీయ, సామాజిక హక్కులు అమెరికా ప్రతినిధుల సభకు లేవన్నది స్పష్టమే. అచ్చోసిన ఆంబోతులా ప్రపంచం పై బడి దేశాల సార్వభౌమాధికార హక్కులను కాలరాస్తూ సర్వ మానవ, పౌర హక్కులను కాలరాసే అమెరికా ప్రభుత్వానికి మరొక దేశంలో జరిగే నరమేధాల్ని ఖండించే హక్కు ఎలా వస్తుంది? ఇరాక్ దేశంలో ‘సామూహిక మారణాయుధాలు ఉన్నాయంటూ పచ్చి అబద్ధాల్ని పదే పదే అనైతిక ప్రచారం చేసి ఇరాక్ లో ప్రజాస్వామ్యం స్ధాపింస్తానంటూ ఆ దేశంపై దాడి చేసి రోడ్డు, రైలు, విమాన మార్గాలను సర్వనాశనం చేసి, ప్రభుత్వ, ప్రవేటు కట్టడాలను నేల మట్టం చేయడమే కాక లక్షల మందిని అమాయక పౌరులను పొట్టన బెట్టుకున్న అమెరికా, గుజరాత్ ముస్లింలకు సానుభూతి ప్రకటించడం ‘మొసలి కన్నీరు’ తో కూడా పోల్చలేని పరమ దుర్మార్గం.

ఇండియాతో సహా ప్రపంచంలోని అనేక దేశాల కంటే అత్యున్నత జీవన ప్రమాణాలు కలిగిన లిబియా పై దుర్మార్గంగా దాడి చేసి ఆ దేశాధ్యక్షుడిని చంపేసిన అమెరికా గుజరాత్ ముస్లింలకు న్యాయం జరగలేదని బాధపడడం పచ్చి మోసం తప్ప మరొకటి కాదు. తమ రక్షణ కోసం అణ్వాయుధాలతో పాటు ఈ ఆయుధాన్నైనా తయారు చేసుకోగల హక్కు ప్రతి స్వతంత్ర దేశానికి ఉండగా, ప్రపంచాన్ని అనేక వందలసార్లు భస్మీపటలం చేయగల అత్యాధునిక అణు బాంబులను తన దగ్గర పెట్టుకుని, ఇరాన్ అణు బాంబు వల్ల ప్రపంచానికి ప్రమాదం అంటూ కుత్సిత ప్రచారం చేస్తూ, ఆ దేశంపై నాలుగుసార్లు అంతర్జాతీయ వాణిజ్య, వ్యక్తిగత ఆంక్షలు విధించడమే కాక, సాయుధ దాడి చేయడానికి సైతం సన్నాహాలు చేస్తున్న అమెరికా, గుజరాత్ లో మత స్వేచ్చ గురించి పాఠాలు చెప్పడమా?

మారణాయుధాలు లేకుండా చేస్తానంటూ ఇరాక్ పైన దాడి చేసిన అమెరికా ఇరాక్ ప్రజలపైనా సామూహిక విధ్వంసక ఆయుధాలు ప్రయోగించిన నీచ చరిత్ర అమెరికాది. వియత్నాం దురాక్రమణపై పోరాడుతున్న వియత్నాం ప్రజలపై నాపామ్ బాంబులు, డైయాక్సిన్ లూ ప్రయోగించి సామూహికంగా చంపిన నర హంతక చరిత్ర అమెరికాది. డైయాక్సిన్ల వల్ల వియత్నామ్లో ఇప్పటికీ అంగవైకల్యంతో పుడుతున్న పరిస్ధితి ఉంది. ఒక్క వియాత్నామీయుడైనా, ఏ అమెరికా పౌరుడిపైన దౌర్జన్యం చేశాడని ఇంతటి దారుణానికి అమెరికా ఒడిగట్టింది?  ఇరాక్ నగరం ఫల్లూజాలో పౌరుల ఆవాసాలపై తెల్ల భాస్వరం (ఫాస్ఫరస్ పెంటాక్సైడ్) జల్లిన సిగ్గుమాలిన క్రూర చరిత్ర అమెరికా రాజ్యానిది. తెల్ల భాస్వరం గాలిలోని తేమలో కరిగి ఉదజహరికామ్లాన్ని సృష్టిస్తుంది. అది ఒంటిపైన బడి అనేకమంది ఇరాకీయులు చర్మం కాలి ఆసుపత్రి పాలయ్యారు. ఇరాక్ యుద్ధం సందర్భంగా, వాడిన యురేనియం ను కూడా ఇరాక్ ప్రజలపై వాడి పరీక్షించుకున్న అమెరికా, ఏ అంతర్జాతీయ చట్టాల ప్రకారం, ఏ సమితి నిబంధనల ప్రకారం, ఏ మానవ హక్కుల పరిరక్షణ కోసం ఈ దుర్మార్గానికి పాల్పడినట్లు?  ఎందరు ఇరాకీయులు అమెరికాపైనో, యూరప్ పైనో దండెత్తితే ఆ దేశాలు కట్టగట్టుకుని వచ్చి ఇరాక్ ప్రజల జీవితాల్ని విధ్వంసం కావించినట్లు?

ఓ పెద్ద మనిషి గుర్తు చేసినట్లు, వంద అడుగుల ఎత్తున ప్రపంచానికి అమెరికా చూపే ‘స్వేచ్చా మాత విగ్రహం’ (Statue Of Liberty) నిజానికి ఫ్రాన్సు నుండి బహుమానంగా పొందిన విగ్రహం మాత్రమే. కేవలం విగ్రహాన్ని చూపుతే ప్రపంచానికి ‘స్వేచ్చా ప్రజాస్వామ్యానికి’ రారాజునావుతానని అమెరికా భావిస్తోంది కాబోలు. స్త్రీలకు స్వతహాగా ఉండే అబార్షన్ హక్కులను కాలరాస్తూ, విచ్చలవిడి సెక్స్ సంస్కృతికి కట్లు విప్పి, చివరికి స్వలింగ హక్కుల పేరుతో స్వలింగ పెళ్ళిళ్ళను కూడా చట్ట బద్ధం చేసినంత మాత్రాన “స్వేచ్చ”కు అమెరికా ఛాంపియన్ అయిపోతుందా? నైతిక పతనంగా, కుటుంబ విలువల దిగజారుడుగా చూడవలసిన “విచ్చలవిడి సెక్స్” ను మానవ హక్కుల సరసన కూర్చుండ బెట్టి, తద్వారా జనించిన “ఎయిడ్స్” జబ్బును ప్రపంచానికి బహుమానంగా ఇవ్వడమే కాక, ‘ఎయిడ్స్’ నెపాన్ని నోరులేని ఆఫ్రికా చింపాంజీ లపైకి నెట్టేసిన నీచ చరిత్ర అమెరికా రాజ్యానిది.

నిజమైన ప్రజల హక్కులైన రాజకీయ, ఆర్ధిక, సామాజిక హక్కులనన్నింటినీ వాల్ స్ట్రీట్ కంపెనీలకు రాసిచ్చి ప్రజలు మాత్రం, అబార్షన్ హక్కుల రద్దు లేదా కొనసాగింపు కోసమో లేదా స్వలింగ హక్కుల కోసమో, స్వలింగ పెళ్ళిళ్ళ కోసమో కొట్టుకు చచ్చే అధములుగా దిగజార్చిన అమెరికా రాజ్యం స్వేచ్చా ప్రజాస్వామ్యానికి ‘బూటకపు నకలు’ అవుతుందేమో గాని ఛాంపియన్ మాత్రం కాజాలదు.

ప్రజాస్వామ్యం పైన గానీ, స్వేచ్చా పైన గానీ నీటి పాఠాలు చెప్పే హక్కుగానీ, బాధ్యత గానీ అమెరికా రాజ్యానికి ఈ కోశానా లేదు. అమెరికా రాజ్యం దృష్టిలో స్వేచ్ఛ అంటే కేవలం వాల్ స్ట్రీట్ కంపెనీలు వాటికి ప్రపంచ వ్యాపితంగా ఉన్న అనుచర, సేవక కంపెనీలకు మాత్రమే ఉండే స్వేచ్ఛ. ప్రజల లేదా పౌర లేదా మానవ హక్కులు అంటే దాని దృష్టిలో అబార్షన్ హక్కులు, విచ్చల విడి సెక్స్ హక్కులు మాత్రమే.  ఈ హక్కుల కోసం అమెరికా ప్రజలు పోరాడుతున్న వార్తలే తప్ప ప్రపంచ దేశాలపై దాడి చేయడానికి వ్యతిరేకంగా అమెరికా లో జరుగుతున్నా పోరాటాలు గానీ, కంపెనీల దుర్మార్గాలపై పోరాడుతున్న కార్మికుల పోరాటాలు గానీ, ఉద్యోగ హక్కుల కోసం, పర్యావరణ రక్షణ కోసం, సమాన విద్యా సౌకర్యాలు పొందే హక్కుల కోసం అమెరికా ప్రజలు చేస్తున్న పోరాటాల వార్తలను అమెరికా, యూరప్ పత్రికలు ఎప్పుడైనా ప్రపంచానికి తెలియజేసాయా? అలాంటి పత్రికలు భారత దేశంలో ముస్లింల మత స్వేచ్చ కోసం పుంఖాను పుంఖాలుగా వార్తలు మాత్రం రాస్తాయి.

గుజరాత్ లో జరిగిన అరమేధం నిస్సందేహంగా దుర్మార్గమైనదే. కానీ మతపరమైన అల్లర్లనూ, విధ్వంసాన్నీ రెచ్చగొట్టి ప్రజల మధ్య తగాదాలు సృష్టించి, ఒకరినొకరు చంపుకునే పధకాలను భారత పాలకులు రచిస్తున్నది ఎందుకోసం? సమాధానం స్పష్టమే. అధికారం కోసం. తద్వారా చేజిక్కించుకున్న అధికారంతో నరేంద్ర మోడి లాంటి దుర్మార్గ పాలకులు సేవ చేస్తున్నది అమెరికా, యూరప్ ల కంపెనీలకు కాదా? నరేంద్ర మోడి చేసిన నరమేధాన్ని మాత్రమే ఖండించి, తద్వారా అధికారం చేజిక్కుంచుకున్నది వాల్ స్ట్రీట్ కంపెనీల సేవల తరించడానికే నాన్న వాస్తవాన్ని మాత్రం అమెరికా వెల్లడించదు. విధ్వంసాన్ని ఖండించడం, ఆ విధ్వంసం ఫలితంగా వచ్చిన అధికారంతో చేసిన పనులను విస్మరించడం వెనుక అమెరికా పాలకులు కుత్సిత కుట్ర దాగి ఉంది. ఆ పేరుతో భారత ప్రజల్లో సానుభూతి సంపాదించి, అమెరికా పట్ల పాజిటివ్ దృక్పధాన్ని ప్రేరేపించి అది ప్రపంచ వ్యాపితంగా చేసే దుర్మార్గాలకు కూడా పనిలో పనిగా ఆమోద ముద్ర వేసుకునే కుట్ర అది.

పాకిస్ధాన్ వరకూ తన సైనిక హస్తాన్ని చాచిన అమెరికా అక్కడితో సరిపెట్టుకుంటుందని భావిస్తే అంతకంటే పెద్ద పొరబాటు మరొకటి ఉండదు. పాకిస్ధాన్ సరిహద్దుల వరకూ సైనిక హస్తాన్ని చాచి, భారత సరిహద్దుల నుండి మాత్రం ప్రజాస్వామిక హస్తాన్ని మాత్రమే అమెరికా చాస్తుందనీ, భారత దేశంలో ఉన్న అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్ధను అది గౌరవిస్తుందనీ భావించడం అమాయకత్వం అవుతుంది.

సామ్రాజ్యవాదికి దేశాల సరిహద్దులతోనో, ప్రజాస్వామిక వ్యవస్ధలతోనో పని లేదు. దానికి కావలసింది తన కంపెనీల ప్రయోజనాలు మాత్రమే. ఆ ప్రయోజనాలు నెరవేరితే ప్రజాస్వామ్యమైనా, నియంతృత్వమైనా దానికి ఒకటే. అందుకే అమెరికా ఓ పక్క ప్రజాస్వామ్యం కబుర్లు చెబుతూనే, మరో పక్క పచ్చి నియంతలను సాకుతూ వారిని కాపాడుకుంటుంది. మన పొరుగు దేశంపై దురాక్రమణ చేస్తూనే భారత దేశంలో, గుజరాత్ రాష్ట్రంలో మత స్వేచ్ఛ లేదని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ముస్లిం దేశాలైన ఆఫ్ఘన్, ఇరాక్, లిబియా, సిరియా, ఇరాన్ పౌరులపై ఆంక్షలు విధిస్తూ, వారి సర్వ మానవ, పౌర హక్కులను హరించివేస్తూనే భారత దేశంలో ముస్లింల మానవ హక్కుల కోసం పరితపిస్తుంది. అలాంటి అమెరికా భవిష్యత్తులో భారత దేశంలో సైతం వేలు పెట్టి కేలకడానికి తగిన వాతావరణాన్ని ఏర్పరుచుకుంటోందని అమెరికా ప్రతినిధుల సభ తీర్మానం బట్టి అర్ధం అవుతోంది. పొట్ట కూటి కోసం అమెరికా చేరి అమెరికా కంపెనీలు విదిలించే అరా, పావూ జీతాలే మహాద్భాగ్యంగా ఎంచి కొండొకచో పౌర సత్వం కూడా సంపాదించి అమెరికా సాగిస్తున్న సమస్త దుర్మార్గాలనూ వెనకేసుకొస్తున్న భారతీయ సోదరులు ఈ వాస్తవం గ్రహించవలసి ఉంది. అశేష భారత ప్రజానీకం అమెరికాకి సంబంధించిన వాస్తవాలను ఎంత త్వరగా గ్రహిస్తే దేశానికి అంత మంచిది.

ఈ రోజు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టిన అమెరికా ప్రతినిధుల సభ అక్కడితో ఆగదు. రేపు ఆంధ్ర ప్రదేశ్ లో మరొక స్వేచ్ఛ లేదని అన్నా అంటుంది. భారత దేశంలో దళితులకు హక్కులు లేకుండా పోయాయనీ, మన్మోహన్ ప్రభుత్వంలో దళితుల హక్కుల గురించి పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడనీ అమెరికా రాయబారి బాధపడినట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇవన్నీ భారత దేశ ప్రజల్లో అమెరికా రాజ్యం పట్ల ‘హక్కులను కాపాడే ఛాంపియన్’ గా ముద్రను పొందే ప్రయత్నాలే. భారత ప్రజల్లో “హక్కుల ఛాంపియన్” గా అమెరికా రాజ్యం (ప్రజలు కాదు సుమా!) ఆమోదం పొందినట్లయితే భవిష్యత్తులో భారత దేశ అంతర్గత వ్యవహారాల్లో, భారత ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో అమెరికా పెట్టాబోయే వేలు దూరడానికి కూడా భారత ప్రజల్లో కొద్ది మేరకయినా ఆమోదం సంపాదించినట్లే. కొద్ది మేరకు సంపాదించిన ఆమోదాన్ని “ఇంతింతై వటుడింతై” అన్నట్లుగా విశ్వరూపంగా మలుచుకోవడం అమెరికాకి పెద్ద కష్టమేమీ కాదు. అందుకు తగిన సాంకేతిక, మీడియా వనరులు అమెరికాకి సమృద్ధిగా ఉన్నాయి. భారత ప్రజల దృష్టిలో భారత పాలకులను పలుచన చేయడానికి తగిన అవకాశాలు భారత దేశాంలోనే పుష్కలంగా ఉన్నాయి. అరవై ఏళ్ల స్వంతంత్ర భారతంలో కూడా అభివృద్ధి తర్వాత సంగతి, కడుపునిండా కూటికీ, వంటినిండా బట్టకీ నోచుకోని కోట్లాది జనం కూడా అమెరికా కుత్సిత బుద్ధికి వనరే.

దక్షిణాసియాలో భారత దేశంతో సహా ఐదు దేశాల్లో అమెరికా ప్రత్యేక బలగాలు తిష్టవేసుకుని ఉన్నాయని ఇటీవల అమెరికా సైనికాధికారి అడ్మిరల్ రాబర్ట్ విల్లర్డ్ అమెరికా కాంగ్రెస్ (ప్రతినిధుల సభ) ముందు ప్రకటించినట్లు వార్తలు వస్తున్న విషయం ఈ సందర్భంగా గమనించాలి. భారత దేశంలో అమెరికా సైనికులేవరూ లేరని భారత ప్రభుత్వం ఖండించినప్పటికీ అమెరికా సైనికాధికారి ఒకరు తమ దేశ అత్యున్నత రాజ్యాంగ సభలో అబద్ధం చెపుతాడని భావించలేము. అయితే భారత ప్రభుత్వం భారత ప్రజలతో అబద్ధం చెబుతుందని భావించగలమా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. “నిస్సందేహంగా” అన్నదే దానికి సమాధానం.

భారత పాలకులు అనేకసార్లు భారత ప్రజలకు అబద్ధాలు చెప్పారు. వారు ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలకు అబద్ధాలు చెబుతూ వంచనకు పాల్పడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోవడం అటుంచి, చెప్పని అనేక విధానాలను భారత ప్రజలపై వారు రుద్దుతూ వచ్చారు. నూతన ఆర్ధిక విధానాలంటే ప్రభుత్వ కంపెనీలను అయినకాడికి విదేశీ ప్రవేటు కంపెనీలకు అమ్మడమేననీ, స్పెషల్ ఎకనామిక్ జోన్ లు పెట్టి విదేశీ కంపెనీల సేవలో తరిస్తామనీ, బాక్సైట్, ఇనుము తదితర అనేక ముఖ్యమైన ఖనిజ వనరులను తవ్వుకుని తరలించుకెళ్ళడానికి విదేశీ కంపెనీలకు విచ్చలవిడి అనుమతులు ఇస్తామనీ భారత పాలకులు ఎన్నడైనా ఎన్నికలప్పుడు చెప్పారా? సంక్షేమ పధకాలు కేవలం ఓట్లకేననీ, అధికారంలోకి వచ్చాక వాటిని నీరు గార్చడానికి అన్నీ విధాలా ప్రయత్నిస్తామనీ ఎన్నడైనా చెప్పారా? సంక్షేమ పధకాలు కూడా రాజకీయ నాయకులో, బ్యూరోక్రాట్ అధికారులో లేదా వారి వారి బంధువులూ, స్నేహితులూ, అనుచరులూ పక్కదారి పట్టించి భోచేయడానికేననీ వారెప్పుడైనా చెప్పారా?

కనుక అమెరికా ప్రత్యేక బలగాలు భారత దేశంలో ఉన్నాయన్నది పచ్చి నిజం. దానికి ఆధారం అమెరికా అత్యున్నత రాజ్యాంగ సభలో అమెరికా మిలట్రీ లో అత్యున్నత అధికారి చెప్పిన సాక్ష్యమే. అయితే అమెరికా బలగాలు అనగానే అల్లా మిలట్రీ యూనిఫారంలో ఉన్నవారేనని సహజంగా భావిస్తాము. అమెరికా లాంటి కుత్సిత, దుర్మార్గ రాజ్యాలకి యూనిఫారం ఒక లెక్క కాదు. విదేశాల పైన అమెరికా ప్రయోగించేది సి.ఐ.ఏ బలగాలనే. వీరు అనేక రూపాల్లో ఉంటారు. అధికారుల రూపంలో వారు ఉండవచ్చు. రాయబార కార్యాలయాల్లో ఉద్యోగుల రూపాల్లో ఉండవచ్చు. అమెరికా నిధులతో పని చేసే ఎన్.జి.ఓ సంస్ధల రూపంలో ఉండవచ్చు. ఫోర్డ్ ఫౌండేషన్ అనో, వాల్ స్ట్రీట్ కంపెనీలు నిధులిచ్చి స్ధాపించే అనేకానేక ఫౌండేషన్ల రూపంలోనో వారు ఉండవచ్చు. భాత సైనికులకు ఉగ్రవాదం పై ఎలా పోరాడాయలో నేర్పడానికి వచ్చిన అనేక మిలట్రీ ఏజన్సీల రూపంలో వారు ఉండవచ్చు. వీరంతా అమెరికాకి ప్రత్యేక బలగాలేనని గ్రహిస్తే అమెరికా సైనికాధికారి చేపినది ఎంత వాస్తవమో అర్ధం అవుతుంది. కాకపోతే ఆ వాస్తవాన్ని కప్పి పెట్టాడానికి మన ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలనే మనం గుర్తించవలసి ఉంది.

అడ్మిరల్ రాబర్ట్ విల్లర్డ్ నిజానికి అమెరికాలో రక్షణ కోసం నియమితమైన సైనికాధికారి కాదు. ఫసిఫిక్ సముద్రం చుట్టూ ఉన్న దేశాలలో  అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం ‘ఫసిఫిక్ కమాండ్’  అధిపతిగా నియమితుడైన సైనికాధికారి. ఏ దేశమైనా సైనిక వ్యవస్ధను తన దేశ రక్షణ కోసమే ఏర్పరుచుకుంటుంది. అందుకోసం తన దేశాన్ని ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర జోన్ లు (ఇంకా వీలయతే మరిన్ని జోన్లు) గా విభజించుకుని వాటికి అధిపతులను నియమించుకుంటుంది. అమెరికా అలా మాత్రమే కాక ప్రపంచం మొత్తాన్ని సైనిక కమాండ్లుగా విభజించుకుని వాటికి సైనిక ఉద్యోగులను నియమిస్తుంది. అలా ఏర్పడిన ఫసిఫిక్ కమాండ్లో భారత దేశం కూడా ఉంది. ఈ ఏర్పాటులోనే అమెరికా సామ్రాజ్యవాదపు సైనిక కుట్రలను మనం గుర్తించవచ్చు. అమెరికా తన సామ్రాజ్యవాదం ప్రయోజనాల కోసం విదేశాలను కూడా తన సైనిక కమాండ్లుగా విభజించి నియమించుకున్న ఒక అత్యున్నత సైనికాధికారి తనకు అప్పగించిన విధుల విషయంలో అమెరికా కాంగ్రెస్ ముందు ప్రోగ్రెస్ రిపోర్టు ఇస్తూ భారత దేశంలోనూ అమెరికా ప్రత్యేక బలగాలను విజయవంతంగా నియమించామని చెపితే అది అబద్ధం కాజాలదు.

టెర్రరిజంపై యుద్ధం అన్నా, విదేశీ సైనికులకు ఉరవాదంపై పోరాటంలో శిక్షణ అన్నా, అన్నీ అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం ఉద్దేశించినవే. ఆయా సందర్భాలను బట్టి ఆ ప్రత్యేక బలగాలు ఉపయోగాలు నిర్దేశించబటాడాయి తప్ప అంతిమ ప్రయోజనం అమెరికా సామ్రాజ్యవాదానిదే. ఏ పేరుతోనైనా విదేశీ బలగాలను భారత ప్రభుత్వం అనుమతించడానికి వీల్లేదు. పొరుగు దేశంలో సైనియంగా తిష్ట వేసి ఉన్న అమెరికా లాంటి పరమ దురాక్రమణ, దుష్ట దేశం విషయంలో అసలే వీల్లేదు. అయినా వారు ఇక్కడ ఉన్నారు.

ఈ నేపధ్యంలోనే, అమెరికా తన సమరాజ్యవాద ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తుందన్న అవగాహన నేపధ్యంలోనే మోడి పై అమెరికా కాంగ్రెస్ తీర్మానాన్ని చూడవలసి ఉంది. అలా కాకుండా మోడి పైన తీర్మానాన్ని మరోలా అర్ధం చేసుకోవడానికి అవకాశాలు లేవు. భారత ప్రజలారా, తస్మాత్ జాగ్రత్త!

5 thoughts on “గుజరాత్ నరమేధంపై అమెరికా కాంగ్రెస్ తీర్మానం సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసమే

  1. “భారత్ లో సమస్యలను భారత్ పరిష్కరించుకో గలదు. భారత ప్రజాస్వామ్యానికి ఇంకా ఆ శక్తి నశించలేదు.”

    రావుగారూ,
    భారత పాలక వర్గాల నిర్వీర్యతను, పచ్చి ద్రోహచింతనను ఇంత పెద్ద కథనం విప్పి చెప్పిన తర్వాత కూడా భారత ప్రజాస్వామ్యానికి ఆ శక్తి నశించలేదని మీరు ప్రకటించడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇంతకూ మీరంటున్నది పాలక వర్గాల ప్రజాస్వామ్యమా లేదా ప్రజల ప్రజాస్వామ్యమా అన్నది నాకు స్పష్టం కావటం లేదు. భారత ప్రజలకే గనుక ఇంత శక్తి ఉంటే మన పాలకవర్గాలు ఇంత బరితెగించి నిత్య ద్రోహానికి పాల్పడుతూ ఉండవని, ఉండలేవని నా ఉద్దేశం.

    పదేళ్ల క్రితం భారత అంతర్గత విషయాలపై అమెరికా ఇంత బరితెగించి ప్రకటించే పరిస్థితిలో లేదు. మన పాలకులు ఎంత దిగజారిపోయారో, బలహీనపడిపోయారో దీన్ని బట్టే అర్థమవుతోంది కదా.

    ఇది మీపై విమర్శ కాదు. గ్రహించగలరని అభ్యర్థన.

    విశేఖర్ గారూ,
    అమెరికా సైనిక బలగాలు మన దేశంలో ఉన్నాయా లేదా అన్న సందేహం కూడా పటాపంచలైపోయింది. “సారొస్తారొస్తారా వచ్చేశారా” అంటూ ఈరోజు ఆంధ్రజ్యోతి సంపాదకీయం తేల్చేసింది చూడండి.

    సారొస్తారొస్తారా వచ్చేశారా
    – కె. శ్రీనివాస్
    https://www.andhrajyothy.com/editorial.asp?qry=dailyupdates/editpagemain

  2. రాజు గారూ జ్యోతి సంపాదకీయం ఓ మిత్రుడు చెప్పగా చదివాను. బాగా రాశారు. ఈ పరిస్ధితి తీవ్రత సాధారణ జనానికి అంత త్వరగా అర్ధం అవుతుందా లేదా అన్నదే అనుమానం. జనం సంగతి పక్కన పెట్టినా, మేధావులు అనుకుంటున్న వారు కూడా పశ్చిమ పత్రికల ప్రచారం ధాటికి నిజాలు గ్రహించలేక పోతున్నారు.

    ఇంకెంతకాలమో?

  3. విశేఖర్ గారూ !
    నేను చెప్పేది భారత జాతి గురించి . పాలక వర్గాల గురించి కాదు.
    పాలకవర్గాలకు అమెరికాకు ఊడిగం చేసేందుకు పోటీ పడతాయి కదా ?
    అమెరికా అసలు ఆంతర్యం యొక్క ప్రమాదం గురించి .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s