తన ప్రభుత్వంలో జరుగుతున్న హత్యలకు 34 ఏళ్ల లెఫ్ట్ ఫ్రంట్ పాలనే కారణం అంటూ బెంగాల్ ముఖ్య మంత్రి మమత బెనర్జీ తన భాద్యతలను ఎలా తప్పించుకోగలదని కోల్ కతా హై కోర్టు తీవ్రంగా విమర్శించింది. సి.పి.ఐ(ఎం) పార్టీ నాయకులను చంపిన కేసులో పోస్టు మార్టం రిపోర్టు కూడా మృతుల బంధువులకు ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. శుక్రవారం నాలుగు గంటల లోగా పోస్టు మార్టం రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. లెఫ్ట్ ఫ్రంట్ 34 ఏళ్ల పాలన వల్ల ఏర్పడిన పాలనా వైఫల్యాల వల్లనే పోస్టు మార్టం రిపోర్టు కోర్టుకు సమర్పించలేకపోయామని మమత చెప్పడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది.
ఫిబ్రవరి 28 నాటి దేశ వ్యాపిత సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరుతూ సి.పి.ఎం నాయకుల ఆధ్వర్యంలో బర్ద్వాన్ లో ప్రదర్శన నిర్వహిస్తుండగా, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రదర్శనపై దాడి చేసి ఇద్దరు నాయకులను నరికి చంపారు. ఈ హత్యలపై వివరణ కోరిన విలేఖరులతో మాట్లాడుతూ మమతా బెనర్జీ సి.పి.ఎం నాయకులను ఎవరూ నరకలేదనీ, ఆ పార్టీలో ఉన్న అంతర్గత కలహలాల వల్లే వారు చనిపోయారనీ ఒక హాస్యాస్పద ప్రకటన జారీ చేసింది.
34 సంవత్సరాల లెఫ్ట్ ఫ్రంట్ పాలనలో పశ్చిమ బెంగాల్ లో వ్యవస్ధ తీవ్రంగా దెబ్బతిన్నదనీ, తద్వారా ఏర్పడిన పరిస్ధితుల కారణంగానే సి.పి.ఎం నాయకులు హత్యకు గురయ్యారనీ బెంగాల్ ముఖ్య మంత్రి తన పార్టీ కార్యకర్తలను వెనకేసుకురావడానికి ప్రయత్నించింది. కొద్ది రోజుల క్రితం తనపై కొందరు దుండగులు కారులో సామూహిక అత్యాచారం జరిపారని ఆరోపించినపుడు కూడా మమత ఇదే పద్ధతిలో స్పంధించింది. తన ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికే సి.పి.ఎం నాయకులు ఈ అత్యాచారం నాటకాన్ని సృష్టించారని ఆమె ప్రకటించి విమర్శలకు గురయింది.
హత్యకు గురయిన సి.పి.ఎం నాయకులలో ఒకరైన ప్రదీప్ తా మాజీ ఎం.ఎల్.ఏ కాగా మరొకరు సి.పి.ఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు. హత్యలకు పాల్పడిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం కూడా జరిగింది. దాడికి పాల్పడినవారు శూలాలు, బరిసెలు, రాడ్లు, కత్తులు ధరించి సి.పి.ఎం పార్టీ ఊరేగింపుపై దాడికి పాల్పడ్డారని బర్ద్వాన్ జిల్లా ఎస్.పి సామ్ మీర్జా ప్రకటించినప్పటికీ పోలీసుల దర్యాప్తును ప్రభావితం చేసి తన పార్టీ కార్యకర్తలను తప్పించడానికే మమత ప్రయత్నిస్తోందని బెంగాల్ కి చెందిన అనేక మంది మేధావులు ఓ ఉమ్మడి ప్రకటన జారీ చేశారు. తన పాలనలో జరుగుతున్నా నేరాలను జరగలేదని తిరస్కరించడాన్ని మమతా ఒక అలవాటుగా చేసుకున్నట్లు కనిపిస్తోందని వారు తీవ్రంగా విమర్శించారు.
ఈ నేపధ్యంలో కోక్ కతా హై కోర్టు ఇచ్చిన ఆదేశాలు ముఖ్య మంత్రి మమతాకు చెంప పెట్టులా పరిణమించాయి. చీఫ్ జస్టిస్ జేనారాయణ్ పటేల్, జస్టిస్ సంబుద్ధ చక్రవర్తి లతో కూడిన డివిజన్ బెంచి మమతా వ్యాఖ్యలను తూర్పారబట్టింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్ధపైన నెపం నేడుతూ, తన బాధ్యతలను తప్పుకో జూడడం తగదని విమర్శించింది. హత్యలపై సి.బి.ఐ దర్యాప్తు కోరుతో దాఖలైన ‘ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం’ ను విచారిస్తూ హై కోర్టు ఈ వ్యాఖ్యలను చేసింది. హత్యలపై విచారణను పర్యవేక్షించడానికి కూడా హై కోర్టు నిర్ణయించిందని ‘ఐ.బి.ఎన్ లైవ్’ న్యూస్ చానెల్ తెలిపింది.
మమత అధికారం లోకి వచ్చినప్పటినుండీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సి.పి.ఐ(ఎం) పార్టీ కార్యాలయాలపైనా, కార్యకర్తలపైనా దాడులు పెరిగిపోయాయి. మాజీ ముఖ్యమంత్రి బుద్ధ దేవ్ భట్టా చార్య, మమతల మధ్య రోజూ ప్రకటనల యుద్ధం జోరుగా నడుస్తోంది. తృణమూల్ కార్యకర్తలు తమ కార్యకర్తలపైనా, ఆఫీసులపైనా దాడులు చేయడానికి వ్యతిరేకంగా బుద్ధ దేవ్ నాయకత్వంలోనే రాష్ట్రంలో ప్రదర్శనలు జరుగుతున్నాయి. సి.పి.ఎం దుష్ప్రచారం చేస్తోందంటూ తృణమూల్ పార్టీ కూడా ప్రదర్శనలు నిర్వహిస్తోంది. పార్టీల మధ్య కలహాలు ఎలా ఉన్నప్పటికీ తమ పార్టీ కార్యకర్తల నేరాలను కూడా వెనకేసుకురావడానికి మమత ప్రయత్నించడం గర్హనీయం. తమ కార్యకర్తలు పాల్పడుతున్న హత్యలకూ, దాడులకూ గూడా లెఫ్ట్ ఫ్రంట్ పాలననే కారణంగా చూపడం అంటే మునుముందు మరిన్ని హత్యలు దాడులు జరుగుతాయని పరోక్షంగా చేస్తున్న హెచ్చరికలా కనపడుతోంది.