‘భోపాల్ గ్యాస్ లీక్’ ఉద్యమం పై నిఘా పెట్టిన ‘డౌ కెమికల్స్’


Bhopal disasterభోపాల్ గ్యాస్ లీక్ బాధితులకు నష్ట పరిహారం కోసం పోరాడుతున్న సంస్ధలపైన అమెరికా కంపెనీ ‘డౌ కెమికల్స్’ అనేక సంవత్సరాలుగా నిఘా పెట్టిన సంగతి వెల్లడయ్యింది. అమెరికాలో టెక్సాస్ లో ఉన్న ‘స్ట్రాట్ ఫర్’ అనే ప్రవేటు డిటెక్టివ్ కంపెనీని ఇందుకు వినియోగించినట్లుగా వెల్లడ్యింది. ప్రవేటు డిటెక్టివ్ కంపెనీ ‘స్ట్రాట్ ఫర్’ కి సంబంధించిన 5.5 మిలియన్ల (55 లక్షలు) ఈ మెయిళ్ళు వికీ లీక్స్ కు అందడంతో స్ట్రాస్ ఫర్ పాల్పడిన పాపాల పుట్ట బద్దలయింది. ఈ ప్రవేటు డిటెక్టివ్ కంపెనీ బడా బడా కంపెనీలకు కావలసిన నిఘా కార్యకలాపాలను చేసే పెట్టిన అతి పెద్ద సంస్ధ. ఈ సంస్ధకు అమెరికాతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలోని ప్రభుత్వ అధికారులతోనూ, రాజకీయ నాయకులతోనూ, కంపెనీలతోనూ, చివరకు ప్రభుత్వ గూఢచార సంస్ధలతోనూ కూడా అక్రమ సంబంధాలు ఉన్నట్లుగా ఈ మెయిళ్ళ ద్వారా వెల్లడ్యింది.

గత రెండు రోజులుగా తనకు అందిన ఈ మెయిళ్లలోని సమాచారాన్ని వికీ లీక్స్ సంస్ధ తన వెబ్ సైట్ లో ప్రచురిస్తోంది. భారత దేశంలో ‘ది హిందూ’ పత్రికతో వికీ లీక్స్ అధినేత ‘జూలియన్ అస్సాంజ్’ కుదుర్చుకున్న ఒప్పందం మేరకు సదరు వివరాలను ఆ పత్రిక ప్రచురిస్తోంది. ప్రవేటు డిటెక్టివ్ కంపెనీ యే అయినప్పటికీ స్ట్రాట్ ఫర్ సంస్ధ అనేక దేశాల ప్రభుత్వ విభాగాలలోకీ, గూఢచార విభాగాల లోకీ ఎన్.జి.ఓ సంస్ధలలోకీ, చివరికి ప్రజా ఉద్యమాలలోకీ కూడా ఎలా చొచ్చుకొని వెళ్ళిందీ ఈ ‘ఈ-మెయిళ్ల’ ద్వారా వెల్లడవుతోందని వికీ లీక్స్ వెబ్ సైట్ తెలిపింది.

కార్పొరేట్ కంపెనీలు తమ వ్యాపారాల కోసం అనేక అనైతిక కార్యకలాపాలకు పాల్పడతాయని అందరికీ తెలిసిన సంగతే. వివిధ దేశాల ఆర్ధిక, వాణిజ్య విధానాలను ప్రభావితం చేయడం కోసం అవి పెద్ద ఎత్తున నిధుల్ని ఖర్చు చేస్తాయి. మూడో ప్రపంచ దేశాలలో రాజకీయ నాయకులు, ప్రభుత్వాధి కారులు వీటికి సేవ చేస్తూ తమ దేశాల వనరులను కట్టపెట్టడానికి సదా సిద్ధంగా ఉంటారు. తమ దేశ ప్రజల ప్రయోజనాలను అమెరికా, యూరప్ లకు చెందిన బడా కంపెనీలకు తాకట్టు పెట్టడానికి వీరికి అభ్యంతరాలేవీ ఉండవు.

వివిధ దేశాల్లో పర్యావరణ చట్టాలనూ, లైసెన్సింగ్ చట్టాలనూ, పన్నుల చట్టాలనూ, ఎగుమతి దిగుమతి చట్టాలనూ కార్పొరేట్ కంపెనీలు యధేచ్చగా ఉల్లంఘిస్తుంటాయి. అలా ఉల్లంఘించడానికి వీలుగా రాజకీయ నాయకులకూ, ప్రభుత్వాధికారులకూ కార్పొరేటు కంపెనీలు లంచాలు మేపుతాయి. ఈ చీకటి కార్యకలాపాలను వెల్లడి చేసే సంస్ధలు, సంఘాలూ, విజిల్ బ్లోయర్స్ పట్ల కార్పొరేట్ కంపెనీలు చాలా అప్రమత్తంగా ఉంటాయి. వీరందరిపైనా నిఘా పెట్టి తమకు ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి తగిన ఎత్తుగడలు వేసుకోవడానికి సమాచారాన్ని సేకరించి పెట్టుకుంటాయి. సమాచారం సేకరించడమే కాక తమ అక్రమాలపై తలెత్తే ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి సైతం ఇవి నిధుల్ని ఖర్చు చేస్తాయి. ఎన్.జి.ఓ సంస్ధలను దించి ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించేలా చూస్తాయి. తామే ప్రజల అసంతృప్తిని ఆర్గనైజ్ చేయడం ద్వారా ఆ ఉద్యమాలు ప్రమాదకరంగా మారకుండా చూస్తాయి. ప్రజా ఉద్యమాల వల్ల ప్రభుత్వ విధానాలు తమ అక్రమాలకు వ్యతిరేకంగా ప్రభావితం కాకుండా చూసుకుంటాయి.

Gas_Victims_Children_disabled_Bhopalఓ వైపు భోపాల్ గ్యాస్ పీడితులకు నష్ట పరిహారం చెల్లించడానికి నిరాకరిస్తూ వచ్చిన ‘డౌ కెమికల్స్’ కంపెనీ, భోపాల్ గ్యాస్ పీడితుల పైనా, వారిని ఆర్గనైజ్ చేసిన సంస్ధలపైనా నిఘా పెట్టి సమాచారాన్ని సేకరించడానికి మాత్రం పెద్ద ఎత్తున ఖర్చు చేసిన సంగతి స్ట్రాట్ ఫర్ ఈ మెయిళ్ల ద్వారా వెల్లడయింది. 1984 లో ‘మిక్’ అనే విషవాయువును విడుదల చేసి వేల మంది మరణానికీ, మరిన్ని వేల మంది రోగాలతో చనిపోవడానికీ, పిల్లలు అంగవైకల్యాలతో జన్మించడానికీ కారణమైన యూనియన్ కార్బైడ్ కంపెనీని 2001 లో ‘డౌ కెమికల్స్’ కంపెనీ కొనుగోలు చేసింది. అప్పటికి విష వాయు పీడితులకు నష్ట పరిహారాన్ని చెల్లించే పనిని యూనియన్ కార్బైడ్ కంపెనీ పూర్తి చేయలేదు. అసలు కోర్టు కేసులే తేలలేదు. దానితో యూనియన్ కార్బైడ్ పై ఉన్న ఆర్ధిక, నైతిక, సామాజిక బాధ్యతలన్నీ డౌ కెమికల్స్ కి బదయాల్యించినట్లయింది. అయితే, ఈ బాధ్యతను స్వీకరించడానికి డౌ నిరాకరిస్తూ వస్తోంది.

ఫలితంగా, భోపాల్ గ్యాస్ పీడితులు అనివార్యంగా డౌ కెమికల్స్ కంపెనీ పైన కూడా పోరాడవలసిన అగత్యం ఏర్పడింది. ప్రజల పోరాటాలపైనా డౌ కంపెనీ సేకరించిన సమాచారం ఏ ఒక్క అంశానికీ పరిమితం కాలేదు. డౌ కంపెనీ, యూనియన్ కార్బైడ్ కంపెనీల పేర్లను ప్రస్తావించిన ప్రతి వార్తనూ స్ట్రాట్ ఫర్ ద్వారా, మిచిగాన్ లోని ‘అల్లిస్ ఇన్ఫర్మేషన్ మేనేజ్ మెంట్ అనే మరొక కంపెనీ ద్వారా అది సేకరించింది. న్యూస్Bhopal disaster4 వైర్లు, వార్తా పత్రికలు, టెలివిజన్ ఛానెల్స్, వార్తల వెబ్ సైట్లు… ఇలా వార్తల కు సంబంధించిన ప్రతి దాన్నీ అది జల్లెడ పట్టింది. భోపాల్ విష వాయు పీడితుల తరపున పని చేస్తున్న సంస్ధల కార్యకర్తల ప్రతి కార్యకలాపం పైనా నిఘా పెట్టింది. కోర్టు కేసులు, పత్రిక ప్రకటనలు, బ్లాగ్ పోస్టులు, మెసేజ్ బోర్డులు, ఆన్ లైన్ పిటిషన్లు, ఫిల్మ్ స్క్రీనింగ్ లు, ఫండ్ రైజర్లు, పబ్లిసిటీ కార్యకలాపాలు, మెయిలింగ్ లిస్టులకు వెళ్ళిన ఈ మెయిళ్ళు, ఫేస్ బుక్ పేజీలు, ట్విట్టర్ ఫీడ్లు ఇలా అన్నింటినీ జల్లెడ పట్టి సమాచారాన్ని సేకరించుకుంది.

ఆన్ లైన్ పిటిషన్లపైన సంతకం చేసిన వారి వివరాలను కూడా డౌ సేకరించింది. అంతేనా!? బ్లాగ్ పోస్టులలో వ్యాఖ్యలు (కామెంట్స్) చేసినవారి వివరాలు, డౌ కంపెనీ పై ప్రచురితమైన ఆర్టికల్స్ ను రీ ట్వీట్ చేసిన వివరాలను  కూడా అది సేకరించింది. భోపాల్ పట్టణంలోని ఆందోళనల కార్యకర్తలు రచనా ఢింగ్రా, సటీనాధ్ సారంగ్ లాంటి వారి పేర్లు పెద్ద సంఖ్యలో ఈ మెయిళ్ళలో చోటు చేసుకున్నాయి. ఒక్క డౌ కెమికల్స్ వ్యతిరేక ఆందోళన కారుల వివరాలే కాకుండా మొట్ట కార్పొరేట్ కంపెనీల అక్రమాల పైన ఆందోళనలు చేసే వారి వివరాలూ, ఆర్టికల్స్ రాసేవారి వివరాలూ, సంస్ధల వివరాలూ కూడా అది సేకరించింది. ఈ జాబితాలో ఉన్న ‘యెస్ మెన్’ అనే సంస్ధపైన అది పెద్ద ఎత్తున నిఘా వేసి నట్లు ఈ మెయిళ్ల ద్వారా వెల్లడయింది. లండన్ ఒలింపిక్స్ కి బ్రిటన్ ప్రభుత్వం ఎంచుకున్న స్పాన్సరర్ గా డౌ కెమికల్స్ కంపెనీని ఎంచుకోవదానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలపైన 2011 రెండవ అర్ధ భాగంలో ప్రధానంగా స్ట్రాట్ ఫర్, డౌ లు కేంద్రీకరించాయి. (డౌ కంపెనీని స్పాన్సరర్ గా ఎన్నుకోవద్దని భోపాల్ పీడితులు ఆందోళనలు చేసినప్పటికీ కంపెనీల మిత్రుడు బ్రిటన్ ప్రధాని కామెరూన్ వినలేదు. తన చర్యను ఆయన అనేకసార్లు సమర్ధించుకున్నాడు. భారత ప్రభుత్వం కూడా డౌ స్పాన్సర్ షిప్ ను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎన్.జి.ఓ సంస్ధలు భారత ప్రభుత్వం తన నిరసన తెలియజేయడానికి లండన్ ఒలింపిక్స్ ను బహిష్కరించవనవసరం లేదని ప్రభుత్వానికి రాయితీ ఇవ్వడం పై కూడా అనేక అనుమానులున్నాయి)

Bhopal disaster8భోపాల్ దుర్ఘటన జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో స్ట్రాట్ ఫర్ విశ్లేషకులు ఆందోళన కారుల ‘వ్యూహాల’ పైన కేంద్రీకరించారు. కార్పొరేట్ కంపెనీల బాధ్యతా రాహిత్యం అనే అంశాన్ని ఎన్.జి.ఓ సంస్ధలు డౌ కంపెనీతో లింక్ చేసి చూస్తాయా లేదా అన్న అంశాన్ని ప్రముఖంగా వారు చర్చించినట్లు ఈ మెయిళ్ల ద్వారా తెలిసింది. ‘ఇతర భోపాళ్ళు’ సృష్టించబడే అవకాశాలపైన పెద్ద పెద్ద ఎన్.జి.ఓ సంస్ధలు ఏమనుకుంటున్నదీ తెలుసుకోవడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. డౌ కంపెనీ కుట్ర పూరితమైన నిఘా కార్యకలాపాలకు పాల్పడుతోందని గతంలోనే ‘యెస్ మెన్’ సంస్ధ ఆరోపించింది. తమ అక్రమాల బైటికి వస్తాయన్నా భయాలతో ‘పారానోయీ’ (అనుమానపు జబ్బు) పీడితురాలిగా మారిందని అది తెలిపింది. కార్పొరేట్ కంపెనీల వ్యవస్ధీకృత నేరస్ధ ప్రవర్తనల గురించి ఏ కొంచెం వెల్లడయినా భయపడే పరిస్ధితికి అవి చేరుకున్నాయని స్ట్రాట్ ఫర్ ఈ మెయిళ్లలో తమ సమాచారం పైన వ్యాఖ్యానిస్తూ ‘యెస్ మెన్’ సంస్ధ అన్నది.

అయితే, ఎన్.జి.ఓ సంస్ధలు చేసే ఉద్యమాలు కార్పొరేట్ కంపెనీలకు ఎప్పటికైనా ప్రమాదకరం కాజాలవు. కంపెనీల దోపిడీపైనా, వారితో అంటకాగే రాజకీయ నాయకులు, అధికారుల పైనా ఈ సంస్ధలు తమ ఆందోళనలను ఎక్కు పెట్టవు. ప్రజల ఆందోళనలు నిర్ణయాత్మక దశకు చేరుకోకుండా చూడడం కోసమే ఎన్.జి.ఓ లు రంగంలోకి దిగుతున్నాయి. ఈ ఎన్.జి.ఒలను పోషిస్తున్నది కూడా కార్పొరేట్ కంపెనీలే అని తెలుసుకుంటే ఎన్.జి.ఓ ల ఆందోళలనలపైన కార్పొరేట్ కంపెనీలు పెట్టుకునే భయాలు పూర్తిగా ఆధార రహితమని చెప్పవచ్చు. ఎన్.జి.ఓ ల తాత్కాలిక, ప్రజల్ని తప్పు దారి పట్టించే ఆందోళనల వల్ల ఎదురైయ్యే తాత్కాలిక ఇబ్బందులని ఎలా అధిగమించాలో తెలుసుకోవడం వరకే కంపెనీలు పరిమితమవుతాయే గానీ అవి చేసే ఉద్యమాల వల్ల తమకే అంతిమ ప్రయోజన అని వాటికి కూడా బాగానే తెలుసు. మహా అయితే శత్రు కంపెనీలు వేసే ఎత్తుగడలను ఎదుర్కొవడానికీ, లేదా పోటీ కంపెనీల వ్యాపారాలను దెబ్బ కొట్టడానికీ ఎన్.జి.ఓ ఉద్యమాల విశ్లేషణలను అవి వినియోగించుకోవచ్చు. వారికి కావలసింది వాస్తవానికి ఎన్.జి.ఓ ఉద్యమాల విశ్లేషణ కాదు. నిజమైన ప్రజా ఉద్యమాల విశ్లేషణే వారికి కావాలి. ఎన్.జి.ఓ ల ప్రయోగం బాగా విజయవంతం అయ్యాక కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న ఎన్.జి.ఓ ల నేపధ్యంలో నిజమైన ప్రజా ఉద్యమాలు తలెత్తడం అరుదుగా మారిపోయింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s