అమెరికా-తాలిబాన్ చర్చలు, ‘కాల్పుల విరమణ’ కోసం దేబిరిస్తున్న అమెరికా


Mullah Omarతాలిబాన్ తో జరుగుతున్న చర్చల్లో అమెరికా ‘కాల్పుల విరమణ’ కోసం దేబిరిస్తుండగా, తమ సుప్రీం నాయకుడి కోసం ‘రాజ్యాంగ హోదా’ కావాలని తాలిబాన్ డిమాండ్ చేస్తోంది. గ్వ్యాంటనామో బే లో ఖైదీగా ఉన్న తమ నాయకులను, కమాండర్లనూ విడుదల చేయాలనీ, కీలు బొమ్మ కర్జాయ్ ప్రభుత్వం రూపొందించిన రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేయాల్సిందేననీ తాలిబాన్ డిమాండ్ చేస్తోంది. ఋణ సంక్షోభం, మళ్ళీ రిసెషన్ లోకి జారిపోతుందేమోనని భయపెడుతున్న ఆర్ధిక వ్యవస్ధ, నిరుద్యోగం లాంటి సమస్యలతో సతమతమవుతున్న అమెరికా, తాలిబాన్ డిమాండ్లకు తలొగ్గలేక అలాగని యుద్ధం కొనసాగించలేక మేకపోతు గాభీర్యం నటిస్తోంది.

అమెరికా తాలిబాన్ ల మధ్య జరుగుతున్న చర్చల వివరాలు వెల్లడి కానప్పటికీ అమెరికా, యూరప్ ల రాయబారుల ద్వారా కొన్ని వివరాలు వెల్లడవుతూనే ఉన్నాయి. తాలిబాన్ సుప్రీం నాయకుడు ‘ముల్లా ఒమర్’ కు రాజ్యాంగ హోదా కల్పించాలన్న డిమాండు ప్రముఖంగా ముందుకు వస్తున్నట్లుగా చర్చలతో సంబద్ధం ఉన్న యూరోపియన్ డిప్లొమాట్ ఒకరిని ఉటంకిస్తూ ‘ది హిందూ’ పత్రిక తెలిపింది. పచ్చి ముస్లిం మతవాద నియంతలు పాలిస్తున్న కతార్ దేశపు రాజధాని దోహా లో అమెరికా-తాలిబాన్ చర్చలు నడుస్తున్న సంగతి విదితమే. ఇరాన్ ప్రభుత్వానికి రాజ్యాంగ బద్ధ ‘పయామే మాఘామే మోజమే రాఃబరి’ పదవి ఉన్నట్లుగా  ఆఫ్ఘన్ ప్రభుత్వానికి కూడా అలాంటి పదవి ఏర్పరచాలనీ, సదరు పదవిలో ‘ముల్లా ఒమర్’ కొనసాగుతాడనీ తాలిబాన్ డిమాండ్ చేస్తోంది.

ఏప్రిల్ 1996లో తాలిబాన్ అధికారం చేజిక్కించుకున్నాక ముల్లా ఒమర్ ‘అమీర్ ఆల్-ముమిమిన్’ (commander of the faithful) టైటిల్ తో ప్రభుత్వాధినేతగా కొనసాగాడు. మహమ్మద్ ప్రవక్త కి చెందినదిగా భావిస్తున్న పొడవాటి వస్త్రం ఆయన వీపున వేలాడుతూ ఉండేది. కాందహార్ మసీదులో తాళాలు వేసి భద్రా పరచబడి ఉన్న వస్త్రాలను సంపాదించిన (retrieve) వ్యక్తి గొప్ప నాయకుడు అవుతాడని స్ధానిక నమ్మకం. అయితే, ముల్లా ఒమర్ అమెరికా టెర్రరిస్టుల జాబితాలో ప్రధాన వ్యక్తిగా ఉన్నాడు. సెప్టెంబర్ 11 దాడుల్లో నిందితుడుగా అమెరికా ప్రభుత్వం అతన్ని పేర్కొంటోంది. ఇప్పుడాయన కరాచీలో పాకిస్ధాన్ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ డైరెక్టొరేట్ సంరక్షణలో ఉన్నట్లుగా ప్రపంచం భావిస్తోంది.

తాలిబాన్ ప్రధాన నాయకుడు ప్రధాన నిందితుడుగా పరిగణిస్తున్నప్పటికీ అమెరికా ఆ సంస్ధతో చర్చలు జరుపుతొంది. తాలిబాన్ తో చర్చలు జరగడానికి అమెరికా, పాకిస్ధాన్ పైన అనేక విధాలుగా ఒత్తిడి తీసుకువచ్చింది. తాలిబాన్ సైతం ప్రారంభంలో చర్చలకు అంగీకరించనప్పటికీ ప్రస్తుత చర్చలు జరుగుతున్నాయి. విదేశీ బలగాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్లకుండా తాము చర్చలకు అంగీకరించేది లేదని తాలిబాన్ చెప్పినప్పటికీ చర్చలు జరుగుతున్నాయి. అమెరికాతో చర్చలు జరుపుతున్నంత మాత్రాన తాము ఆ దేశంతో రాజీ పడినట్లు కాదనీ, తమ జీహాద్ ను వదిలి పెట్టినట్లు కాదనీ తాలిబాన్ జనవరిలో చేసిన ప్రకటనలో పేర్కొంది. కీలుబొమ్మ ప్రభుత్వం రూపొందించిన రాజ్యాంగాన్ని తాము అంగీకరించినట్లు కాదనీ అది తెలిపింది. “జీహాద్, మిలట్రీ ప్రతిఘటన లతో పాటు రాజకీయ విభాగాన్ని కూడా తాలిబాన్ వినియోగిస్తున్నది. తద్వారా ఆఫ్ఘనిస్తాన్ దేశ జాతీయ, ఇస్లామిక్ ఆకాక్షలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నది” అని తాలిబాన్ ప్రకటన పేర్కొన్నది.

అయితే, తాలిబాన్ తో చర్చల విషయంలో అమెరికా ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధానం తాలిబాన్ డిమాండ్లకు పూర్తి విరుద్ధంగా ఉంది. అక్టోబరు 2011లో ‘హౌస్ ఫారెన్ రిలేషన్స్ కమిటీ’ ముందు హాజరైన అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, తాలిబాన్ తో రాజీ లేదని ప్రకటించింది. “తాలిబాన్ హింసను విడనాడాలి. ఆల్-ఖైదా ను విడిచి పెట్టాలి. ఆఫ్ఘనిస్ధాన్ రాజ్యాంగానికీ, చట్టాలకీ కట్టుబడి ఉన్నట్లు ప్రకటించాలి. స్త్రీలు, మైనారిటీలు రక్షణ కోసం ఉన్న చట్టాలను అమలు చేయాలి” అని హిల్లరీ తెలిపింది. “ఈ ఎర్ర గీతలను తిరుగుబాటు దారులు పాటించనట్లయితే, వారు నిరంతర దాడులను ఎదుర్కోవలసిందే” అని ఆమె తేల్చి చెప్పింది. కానీ అప్పటి నుండీ అమెరికా అధికారులు గానీ, మిలట్రీ అధికారులు గానీ తాలిబాన్ తో చర్చల కోసం చేస్తూ వచ్చిన ప్రయత్నాలు వారి ప్రకటిత విధానాల నుండి చాలా దూరం వచ్చేసినట్లు స్పష్టం చేస్తున్నాయి.

ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ ల కోసం అమెరికా ప్రత్యేక ప్రతినిధి గా నియమితుడైన మార్క్ గ్రాస్ మెన్, ఆయన ప్రత్యేక సలహాదారు బార్నెట్ రూబిన్ లు అనేక సార్లు దోహా ను సందర్శించారు. ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ అసంతృప్తిని తోసి రాజని దోహాలో తాలిబాన్ కోసం ప్రత్యేక కార్యాలయాన్ని తెరిపించారు. గ్వాంటనామో జైలు నుండి తాలిబాన్ కమాండర్లు ఇద్దరినీ విడుల చేసి దోహా కార్యాలయంలో కూర్చుండబెట్టారు. యుద్ధ నేరాలకు పాల్పడ్డాడని ఐక్య రాజ్య సమితి ఆరోపించిన ముల్లా ముహమ్మద్ ఫజల్ నూ, ఇతర తాలిబాన్ కమాండర్లనూ విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా అమెరికా సెనేట్ కమిటీకి అమెరికా ప్రభుత్వం నివేదించుకుంది. వారి విడుదల తప్పనిసరేమీ కాదని గ్రాస్ మెన్ చెప్పినప్పటికీ  అడుగులు అటువేపే పడుతున్నాయి. జీహాదిస్టు యుద్ధ ప్రభువు సిరాజుద్దీన్ హక్కానీ అన్న డాక్టర్ నసీరుద్దీన్ హక్కానీ కూడా ఇటీవల దోహా సందర్శించి తాలిబాన్ తరపున  ప్రతినిధిగా ఉన్న తయ్యేబ్ ఆఘా ను కలుసుకుని చర్చల పురోగతిని తెలిపినట్లు వార్తలు చెబుతున్నాయి.

ఋణ భారంతో సతమతమవుతూ, ఆఫ్ఘనిస్తాన్ నుండి ఎంత త్వరగా బయటపడదామా అని చూస్తున్న అమెరికా అక్కడ సైనికుల సంఖ్య తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ‘ఆఫ్ఘన్ ప్రజల ఆకాంక్షలు సాధించుకోవడం కోసమే అమెరికాతో జిహాద్ కొనసాగిస్తూనే రాజకీయ చర్యలకు దిగుతున్నామని’ తాలిబాన్ చేస్తున్న ప్రకటనలు అమెరికా లక్ష్యానికి విరుద్ధంగా సాగుతున్నాయి. ఈ పరిస్ధితిలో ‘కాల్పుల విరమణ’ కు అంగీకరిద్దామని అమెరికా తాలిబాన్ ను దేబిరిస్తున్నది. అందుకు తాలిబాన్ ససేమిరా అంటోంది. కాల్పుల విరమణ పాటించడానికి ‘నమ్మకం ప్రోది చేసే చర్యల’ పేరుతో తాలిబాన్ విధిస్తున్న అమెరికా పరువు తీసేలా ఉండడంతో అమెరికా మింగలేక కక్కలేక ఉంది. తాలిబాన్ కోరిన చర్యలలో ఒకటైన తాలిబాన్ కమాండర్లను విడుదల చేయడం అంటే 9/11 దాడుల్లో నిందితుడైన వారిపై టెర్రరిస్టు ఆరోపణలను ఉపసంహరించుకోవడమే. ఇదే జరిగితే అమెరికా ప్రజలకే గాక ప్రపంచ ప్రజలకు కూడా ఆఫ్ఘన్ పై దాడి కి దిగినందుకు జవాబు చెప్పుకోవలసిన అగత్యం అమెరికా ప్రభుత్వానికి తలెత్తుతుంది. ఆల్-ఖైదా కోసం ఆఫ్ఘనిస్ధాన్ పై దాడికి పూనుకోవడం నీటి మాలిన చర్య అని అమెరికా అంగీకరించవల్సి ఉంటుంది. అది జరుగుతుందా?

ఇదిలా ఉండగా భారత ప్రభుత్వ పరిస్ధితి కూడా అడకత్తెర లో పోక చెక్కలా తయారయింది. తాలిబాన్ తో చర్చలంటే భారత కంపెనీలకు ఆఫ్ఘనిస్ధాన్ లో స్ధానం లేనట్లే. హిల్లరీ ప్రకటించిన ఎర్ర గీతలను అమెరికాయే ఉల్లంఘిస్తుందన్న భయాలను భారత ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. చర్చలలో భాగంగా పాకిస్ధాన్ సైతం కొన్ని ప్రతిపాదనలను ముందుకు తెచ్చింది. పాకిస్ధాన్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ కయానీ ఆఫ్ఘనిస్ధాన్ లో అధికారం పంచుకోవడానికి తమవైన ప్రతిపాదనలు చేశాడు. ఆఫ్ఘనిస్ధాన్ లోని వివిధ ప్రాంతాలలో ప్రభావం కలిగి ఉన్న సాయుధ గ్రూపులకు ఆ ప్రాంతాల్లో అధికారం కట్టబెట్టాలని కయానీ ప్రతిపాదించాడు. దానికి వీలైన ఫెడరల్ ఏర్పాటు ఉండాలని ఆయన ప్రతిపాదన కోరుతోంది. అదే జరిగితే దక్షిణ ఆఫ్ఘనిస్ధాన్ లో ఉన్న తొమ్మిది రాష్ట్రాలలో తాలిబాన్ అధికారం చేజిక్కించుకుంటుంది. భారత ప్రభుత్వానికి ఇది అంగీకార యోగ్యం కాదు. ఈ ప్రతిపాదన తో అధికారం చేజిక్కించుకునే ఇస్లామిస్టులు భారత్ వ్యతిరేకులని ఇండియా అభ్యంతరం వ్యక్తం చ్యేస్తోంది. దానివల్ల ఇన్నాళ్ళూ తాము పెట్టిన పెట్టుబడులను వదులుకోవలసిందేనని భారత్ భావిస్తోంది. అదేమీ జరగదని అమెరికా చెపుతున్నప్పటికీ జరిగేది ఖచ్చితంగా అదే. అయితే ఆఫ్ఘనిస్ధాన్ చర్చలలో ఇండియా అభ్యంతరాలు అమెరికా లెక్క చేయదు. ఇండియా కంపెనీలు అమెరికా కంపెనీలకు కనీసం జూనియర్ పార్టనర్లు కూడా కాదు. కేవలం అనుచర కంపెనీలు లేదా సేవక కంపెనీలు మాత్రమే. తమ కింద పనిచేసే కంపెనీల కోసం తమ ప్రయోజనాలు వదులుకోవడానికి అమెరికా కంపెనీలు ససేమిరా ఒప్పుకోవు.

ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ అమెరికా-తాలిబాన్ చర్చలు ఆఫ్ఘన్ ప్రజలకు పూర్తి వ్యతిరేకంగా సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. అమెరికా సైన్యాలు ఆఫ్ఘనిస్ధాన్ నుండి పోతే తప్ప ఆఫ్ఘన్ ప్రజల ప్రయోజనాలు నెరవేరడానికి తగిన పరిస్ధితి ఏర్పడదు. స్త్రీలు, మైనారిటీల హక్కులు తాలిబాన్ ప్రభుత్వం కాపాడాలని అమెరికా కోరడం ఒట్ఠి బూటకం. అమెరికాలో స్త్రీల హక్కులు, నల్లవారి హక్కులు, ఇతర దేశాల ప్రజల హక్కులు ఉల్లంఘించబడుతున్నా ఏమీ చేయని అమెరికా ప్రభుత్వాలు ఆఫ్ఘన్ స్త్రీల హక్కుల కోసం కట్టుబడి ఉన్నట్లు చెప్పడం కేవలం నటన. పశ్చిమాసియాలోనూ, దక్షిణాసియాలోనూ అమెరికాకి ఉన్న వ్యూహాత్మక ఆర్ధిక, మిలట్రీ ప్రయోజనాలు ఆఫ్ఘనిస్ధాన్ తో ముడిపడి ఉన్నాయి. అవి ఆఫ్ఘన్ ప్రజల ప్రయోజనాలను పూర్తిగా హరించేవి. అందుకే ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా ని తరిమికొడితేనే అక్కడి ప్రయోజనాలకు రక్ష.

2 thoughts on “అమెరికా-తాలిబాన్ చర్చలు, ‘కాల్పుల విరమణ’ కోసం దేబిరిస్తున్న అమెరికా

  1. అఫ్హనిస్తన్ నుండి అమెరికాని తరిమికొడితె, అక్కద శాంతిభద్రతల సంగతి ఏంటి సర్.
    ఆమెరిక కన్న తాలిబన్ బెటెర్ అని చెప్తున్నార ?
    టాలిబన్ దురాగతాలు గురించి ప్రపంచంలొ అందరికి తెలుసు. మీకు నచ్చని ఆమెరిక విధానలు ఆర్దికపరమైనవి. తాలిబన్ విధానాలు అత్యంత క్రూరమైనవి. అవి ఎలాంటివొ అందరికి తెలుసు. మనుషులను రాక్షసంగ హింసించె విధానాలు అవి. పిల్లలు, ముసలివాళ్ళు అన్న కనికరం కూడ లేకుండ. ఆమెరిక తన అర్దికపరిస్తితి బాగొలెక ఈ చర్చలు జరుపుతున్నాది అది నిజమె. కాని అమెరిక సహయం లేకపొతె ఈ పాటికి ఆఫ్ఘనిస్తాన్ మంటకలిసిపొయెది.

  2. వెంకట్ గారూ మరీ ఇంత అమాయకత్వమా?
    అత్యాధునిక విధ్వంసక మారణాయుధాలతో, కార్పెట్ బాంబర్లతో, తాము తయారు చేసిన సరికొత్త మారణాయుధాలను పరీక్షిస్తూ దురాక్రమణదారులు ఆఫ్ఘనిస్ధాన్ పై న దాడి చేసింది అక్కడ శాంతిభద్రతలు కాపాడడానికా? రోడ్లు, వంతెనలు, రైలు మార్గాలు, కమ్యూనికేషన్లు లాంటి సమస్త మౌలిక నిర్మాణాలను సర్వ నాశనం చేస్తూ, లక్షల మందిని పొట్టనబెట్టుకుంది శాంతిభద్రతలను కాపాడ్డానికా? టెర్రరిజం పై యుద్ధం పేరుతో లక్షల మంది పౌరులను పొట్టబెట్టుకుంటోంది అందుకేనా? జనాన్ని చంపి స్మశానంలో శాంతిభద్రతలను స్ధాపిస్తారా? జన హననం గత పది సంవత్సరాలుగా జరిగింది. ఇంకా కొనసాగుతోంది. శాంతి భద్రతలను సర్వ నాశనం చేసి, ప్రజా జీవితాల్ని అల్లకల్లోలం చేసి, దేశాన్ని కుక్కలు చింపిన విస్తరిని చేసిన అమెరికా, దాని మిత్ర మూకలు శాంతి భద్రతలను స్ధాపిస్తున్నాయా?

    తమకు ఎవరు కావాలో ఆఫ్ఘన్ ప్రజలు నిర్ణయించుకుంటారు. తమ దేశం భవిష్యత్తు నిర్ణయించుకునే హక్కు ఆఫ్ఘన్లదే. భారత దేశాన్ని అన్ని వందల సంవత్సరాలు ఆక్రమించుకున్న బ్రిటన్ కూడా మన దేశాన్ని అభివృద్ధి చేసిందని చెప్పుకుంటుంది. నమ్ముదామా? భారత దేశ సహజ, మానవ వనరులను దోచుకుని బలిసిన బ్రిటన్ మన దేశాన్ని అభివృద్ధి చేశామని చెప్పుకోవడం ఎంత నిజమో ఆఫ్ఘన్ దురాక్రమణ వల్ల ఆఫ్ఘన్ ప్రజలకి మేలు అనుకోవడం అంతే నిజం. ఒక దేశాన్ని మరొక దేశం ఆక్రమించుకోవడం వల్ల మంచి జరుగుతుందని ఎలా భావిస్తారండీ?

    అమెరికా కన్నా తాలిబాన్ బెటరో కాదో అనేది ప్రశ్న కాదు. అసలు పరాయి దేశం పై దురాక్రమన చేసే హక్కు పశ్చిమ దేశాలకు ఎవరిచ్చారన్న ప్రశ్న వేసుకోండి.

    అమెరికా, యూరప్ దేశాల దాడివల్ల అక్కడి మౌలిక సౌకర్యాలన్నీ ధ్వంసం అయ్యాయి. లక్షల మంది చచ్చిపోయారు. ఇంకా చస్తున్నారు. ఇవన్నీ ఆఫ్ఘన్లకు మేలు చేస్తాయని ఎలా భావిస్తున్నారు?

    ఇంతకీ ఇరాక్ పైన ఎందుకు దాడి చేసినట్లు. ఇరాక్ పైన దాడి జరక్క ముందు ఆ దేశం భేషుగ్గా ఉంది. భారత దేశం కంటే అత్యున్నత జీవన ప్రమాణాలు అక్కడ ఉన్నాయి. భారత దేశంలో కంటే అక్కడ స్త్రీలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించారు. ప్రజలందరికీ విద్యా, వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. అలాంటి ప్రశాంత ఇరాక్ పైన దాడి చేసి దాన్ని అంతర్గత కుమ్ములాటలకు కేంద్రంగా మార్చారు. సెక్టేరియన్ ముఠాలదే ఇప్పుడక్కడ రాజ్యం. నిత్యం తగువులాటల్తో ఇరాక్ తీసుకుంటోంది. దరిద్రం, ఆకలి, నిరుద్యోగం, సామాజిక అశాంతి లాంటి సమస్యలు ఇరాక్ ని ముంచెత్తుతున్నాయి. ఇవన్నీ శాంతి భద్రతలేనా?

    అమెరికా, యూరప్ ల కంపెనీలకు కొత్త మార్కెట్లు సంపాదించుకోవడం కోసం, ఆయా దేశాల సహజ వనరుల్ని దోచు కోవడం కోసం, తమ వ్యాపార ప్రయోజనాలు నిర్విఘ్నంగా కొనసాగేలా ఉండడానికి వీలుగా మిలట్రీ రక్షణలు అందించడానికి మిలట్రీ స్ధావరాలు ఏర్పాటు చేసుకోవడం కోసం అమెరికా, యూరప్ లు దురాక్రమణ దాడులు చేశ్తాయి. సామూహిక విధ్వంసక మారణాయుధాల సాకుతో ఇరాక్ పై దాడి చేసి సద్దాంని చంపినా, ప్రజాస్వామ్యం పేరుతో లిబియాని దురాక్రమించి కీలుబొమ్మ ప్రభుత్వం నిలిపినా, అణు బాంబుల సాకు చూపి ఇరాన్ పైన యుద్ధానికి కాలు దువ్వుతున్నా… అన్నీ వ్యాపార ప్రయోజనాల కోసమే. ఈ సంగతి ముందు మీరు తెలుసుకోవాలి వెంకట్ గారూ.

    మీకు తాలిబాన్ పైనో, ముస్లింల పైనో ద్వేషం ఉంటే అందుకు ఆఫ్ఘన్ దురాక్రమణని సమర్ధించడం, ఒక దేశంపైన మరొక దేశం దండేత్తి ఆక్రమించుకోవచ్చని చెప్పడం సరికాదు. పేద దేశాలపైన ధనిక దేశాలు చేస్తున్న పెత్తనాన్ని వ్యతిరేకించడానికి బదులు పెత్తనం వల్ల మేలు జరుగుతుందని చెప్పడం సరికాదు. అమెరికా దురాక్రమణ వల్లనే ఆఫ్ఘనిస్ధాన్ కొన్ని దశాబ్దాలు వెనక్కి పోయిందని గమనించండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s