2008 లో సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం వల్ల ఎదురైన నష్టాలను పూడ్చుకునేందుకు అమెరికా, యూరప్ లకు చెందిన బడా కార్పొరేట్ కంపెనీలు అక్కడి ప్రభుత్వాల ద్వారా ప్రజలపైన దారుణమైన పొదుపు ఆర్ధిక విధానాలను అమలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానాల ఫలితంగా అనేక యూరప్ దేశాలు క్షత గాత్ర దేశాలుగా మారిపోయాయి. అభివృద్ధి చెందిన దేశాలుగా తమను తాము అభివర్ణించుకునే ఈ దేశాల ప్రభుత్వాలు తాము వత్తాసు పలికే పెట్టుబడిదారీ కంపెనీలకు ఇచ్చిన బెయిలౌట్లు వసూలు చేసుకున్నట్లయితే సంక్షోభం నుండి బైటికి రావడం పెద్ద కష్టమేమీ కాదు. కంపెనీలకు ఇచ్చిన బెయిలౌట్లు వసూలు చేసినట్లయితే ఉద్యోగులు, కార్మికులు, ఇతర ప్రజానీకానికి ఇస్తున్న సంక్షేమ సౌకర్యాలను ‘పొదుపు విధానాల’ పేరుతో రద్దు చేయడమో, కత్తిరించడమో చేయవలసిన అగత్యం కూడా తలెత్తదు. కాని వారి పధకాలు వేరు. ప్రభుత్వాలు కంపెనీల ప్రయోజనాల కోసమే పని చేసేవే తప్ప ప్రజల ప్రయోజనాల కోసం పని చేసేవి కావు.
ఫలితంగా ప్రజలపై అమలు చేస్తున్న ‘పౌదుపు ఆర్ధిక విధానాలు’ ప్రజల ఆదాయ వనరులనూ, పొదుపు ఖాతాలనూ కొల్లగొడుతున్నాయి. వేతనాలు, బోనస్ లూ, ఉద్యోగాలూ, సంక్షేమ పధకాలు కత్తిరిస్తున్న ఫలితంగా దేశాల ఆర్ధిక వ్యవస్ధలు కూడా బక్క చిక్కి పోతున్నాయి. కొత్త సంవత్సరంలో యూరో జోన్ దేశాల ఉమ్మడి ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి జారిపోవడం ఖాయమని యూరో జోన్ అధికారిక ఆర్ధిక విశ్లేషకులే తేల్చేశారు. బడా కార్పొరేట్ కంపెనీలు, బ్యాంకులు, ఇన్సూరెన్సు సంస్ధలు ప్రజల పన్నులతో ఇచ్చిన బెయిలౌట్లు మేసి సంక్షోభం నుండి బైటపడగా ప్రజలు, ప్రభుత్వాలు మాత్రం తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో తీసుకుంటున్నారు.
అప్పులు తెచ్చి కంపెనీలకు ఇచ్చిన బెయిలౌట్లు తడిసి మోపెడై యూరో జోన్ దేశాల ఆర్ధిక వ్యవస్ధలకు పెను భారంగా పరిణమించాయి. ఈ భారాన్ని పొదుపు విధానాల పేరుతో ప్రజలపై మోపడం వల్ల పన్నుల వసూలు దారుణంగా పడిపోయింది. ప్రజల ఆదాయాలు తగ్గిపోవడంతో మార్కెట్లో సరుకులు అమ్ముడుపోక ఉత్పత్తులూ పడిపోయాయి. దానితో ఆ దేశాల జిడిపి లు కుచించుకుపోతున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్, ఫ్రాన్సు అధ్యక్షుడు సర్కోజీ నాయకత్వంలో యూరో జోన్ దేశాలపై మరిన్ని పొదుపు విధానాలు అమలు చేయడానికి ఒత్తిడి పెరుగుతోంది.
2 thoughts on “‘పొదుపు విధానాల’ క్షతగాత్ర ‘యూరప్’ -కార్టూన్”
శెఖర్ గారూ బైల్ ఔట్ పొందిన కంపెనీలూ లేదా బ్యాంకులూ ,ఆ బైల్ ఔట్ తిరిగి ప్రభుత్వం రాబట్టుకుంటుందా లేదా వాటికే వదిలేస్తుందా . మీ సమాదానం కొసం ఎదురుచుస్తూ …………
తిరిగి రాబట్టుకుంటాం అని ప్రభుత్వాలు చెబుతాయి. కాని వాస్తవంలో అది జరగదు. తిరిగి రాబట్టుకునే పనైతె పొదుపు విధానాలను అమలు చేసే అవసరమే ఉండదు. బెయిలౌట్ లని వివిధ పేర్లతో బ్యాలన్స్ షీట్ల నుండి తప్పించే చట్టాలు, లూప్ హోల్స్ ప్రభుత్వాలు ముందే ఏర్పరచుకుంటాయి. వాటిని వెలికి తీయాల్సిన పత్రికలు కూడా కంపెనీలు పెట్టినవే కనుక అవి ఎప్పటికీ బైటికి రావు.