ఇండియా ‘జిడిపి గ్రోత్’ కధ ఇక కంచికేనా?


ప్రపంచానికి గొప్పగా చూపుతూ వచ్చిన భారత దేశ జి.డి.పి వృద్ధి రేటు ఇక గత కాలపు జ్ఞాపకమేనా? ప్రపంచ ఆర్ధిక సంక్షోభాన్ని కూడా తట్టుకుని ఎనిమిది శాతం పైగా జీడీపీ పెరుగుదల రేటును నమోదు చేసిన భారత ఆర్ధిక వృద్ధి కధ ఇక కంచికేనా? 2011-12 సంవత్సరంలో మొదటి మూడు క్వార్టర్ల మొత్తం మీద భారత దేశ ఆర్ధిక వ్యవస్ధ నమోదు చేసిన వృద్ధి రేటు చూసీనా, మూడో క్వార్టర్లో నమోదయిన వృద్ధి రేటు చూసినా ఈ అనుమానాలు కలుగడం తప్పని సరి.

మూడో క్వార్టర్ లో (అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలలు) భారత దేశ ఆర్ధిక వృద్ధి 6.1 శాతం మాత్రమే నమోదయిందని ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గణాంకాలు తెలుపుతున్నాయి. గత రెండు సంవత్సరాలలో అత్యంత తక్కువ వృద్ధి నమోదు కావడం ఇదే మొదటిసారి. మాన్యుఫాక్చరింగ్, మైనింగ్, వ్యవసాయ రంగాలలో ఉత్పత్తి క్షీణించడంతో ఈ పరిస్ధితి తలెత్తిందని ప్రభుత్వం చెబుతోంది. గత ఆర్ధిక సంవత్సరం (2010-11) లో మూడవ క్వార్టర్లో నమోదయిన 8.3 శాతం ఆర్ధిక వృద్ధి కంటే ఇది చాలా తక్కువ.

అయితే, 2010-11 లో కూడా అనుకున్నంత వృద్ధి జరగలేదని ప్రభుత్వం తాజాగా వెల్లడించిన గణాంకాలు వెల్లడించాయి. మొదటి అర్ధ సంవత్సరంలో (2010 ఏప్రిల్ నుండి డిసెంబరు వరకు) 8.1 శాతం మేరకు భారత ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి చెందిందని గతంలో ప్రభుత్వం చెప్పినప్పటికీ అది కూడా తప్పేననీ వాస్తవానికి 6.9 శాతం మాత్రమే వృద్ధి జరిగిందని ప్రభుత్వం సవరించుకుంది. జి.డి.పి వృద్ధి రేటు కి సంబంధించి ప్రభుత్వం మొదట అంచనాలు వెల్లడిస్తుంది. ఆ తర్వాత వాస్తవ లెక్కలు ఏమిటన్నదీ వాస్తవ వివరాలు అందిన తర్వాత వెల్లడిస్తుంది. అలా వాస్తవ వివరాలు లెక్క గట్టి వెల్లడించడానికి అనేక నెలల సమయం పడుతుంది. పశ్చిమదేశాల్లో కూడా దాదాపు ఇదే పరిస్ధితి. ఐతే అక్కడ అంచనాలకీ, వాస్తవ గణాంకాలకీ ఇంత పెద్ద మొత్తంలో తేడా ఉండడం అరుదు.

డిసెంబరు 31, 2011 తో ముగిసిన మూడవ క్వార్టర్ లో మాన్యుఫాక్చరింగ్ రంగం లో ఉత్పత్తి ఘోరంగా 0.4 శాతం మాత్రమే నమోదయింది. 2010-11 లో ఇది 7.8 శాతం గా ఉండడం గమనార్హం. వ్యవసాయ ఉత్పత్తులది కూడా అదే పరిస్ధితి. గత సంవత్సరం మూడో క్వార్టర్ లో 11 శాతం నమోదు కాగా, ఈ సంవత్సరం 2.7 శాతం మాత్రమే నమోదయింది. మైనింగ్, క్వారీయంగ్ రంగాల్లో ఉత్పత్తి గత యేడు 6.1 శాతం కాగా, ఈ యేడు 3.1 శాతం మాత్రమే. నిర్మాణ రంగం ఇదే కాలంలో 8.7 నుండి 7.2 శాతానికీ, వాణిజ్యం, హోటళ్ళు, రవాణా, కమ్యూనికేషన్లు అన్నీ కలిపి వృద్ధి రేటు 9.8 నుండి 9.2 శాతానికి పడిపోయింది.

విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా రంగాల వృద్ధి మాత్రమే భారత ప్రభుత్వానికి సంతోష కలిగించింది. ఈ రంగాలు గత యేడు 3.8 శాతం వృద్ధి చెందగా, ఈ యేడు 9 శాతం వృద్ధి చెందాయి. ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ రంగాలతో కూడిన సర్వీసుల రంగం వృద్ధి ఇదే కాలంలో (మూడో  క్వార్టర్) 11.2 నుండి 9.9 శాతానికి పడిపోయింది.

సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ (సి.ఎస్.ఓ), 2011-12 లో భారత ఆర్ధిక వృద్ధి 6.9 శాతం మాత్రమే ఉంటుందని అంచనా వేస్తోంది. ప్రధాన మంత్రి ఆర్ధిక సలహా మండలి ఇది 7.1 శాతం ఉండగలదని అంచనా కడుతోంది. ఇక ప్రధాన మంత్రి అయితే 8 శాతంపైనే అంచనా వేస్తుండగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు అహ్లూవాలియా అద్భుతాలు జరగడం సాధ్యమేనని ఆశాభావంతో ఉన్నట్లు నెల క్రితం అన్నాడు. గత 2010-11 లో ఆర్ధిక వృద్ధి అంచనా 8.4 శాతంగా ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవ వృద్ధి మొదటి అర్ధ సంవత్సరంలో 6.9 శాతం మాత్రమేనని వెల్లడయిన నేపధ్యంలో, పూర్తి సంవత్సరానికి వాస్తవ వృద్ధి ఇంకా తగ్గిపోయే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.

2010-11 లో మొదటి మూడు క్వార్టర్లలో మాన్యఫాక్చరింగ్ వృద్ధి 7.6 శాతం కాగా ఇది 2011-12 లో 3.4 కి క్షీణించింది. మైనింగ్, క్వారీయింగ్ రంగాల్లో ఇదే కాలాలో వృద్ధి 6.7 శాతం నుండి -1.4 కు పడిపోయింది. వ్యవసాయం, ఫారెస్ట్రీ రంగాలు గత యేడు మొదటి తొమ్మిది నెలల కాలంలో 6.8 శాతం వృద్ధి చెందగా ఈ యేడు అది 3.2 మాత్రమే. నిర్మాణ రంగమైతే మొదటి తొమ్మిది నెలల్లో గత యేడు 7.7 శాతం వృద్ధి చెందగా ఈ యేడు 4.2 శాతమే వృద్ధి చెందింది.

ఆర్ధిక వృద్ధి పడిపోతున్న నేపధ్యంలో రిజర్వు బ్యాంకు పై వడ్డీ రేట్లు తగ్గించాలన్న ఒత్తిడి పెరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గించినట్లయితే బ్యాంకులకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయి. దానివల్ల బ్యాంకులు మరిన్ని అప్పులు పెట్టుబడిదారులకూ, కంపెనీలకూ ఇస్తాయనీ, ఫలితంగా పెట్టుబడులు పెరిగి ఉత్పత్తి పెరుగుతుందనీ సాధారణ అంచనా. పెట్టుబడిదారులకు అప్పులిచ్చి మరీ పెట్టుబడులు పెట్టించే ప్రభుత్వాలు, రైతులకు ప్రోత్సాహాకాలిచ్చి వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెంచే ఆలోచన మాత్రం చేయవు.

రైతులకు అప్పులిస్తే ఎగవేస్తారని బ్యాంకుల భయం. రైతులకు అప్పులివ్వమని ప్రభుత్వాలు ఒత్తిడి చేయవు. పెట్టుబడిదారులకు అప్పులు అందకపోతే మాత్రం పెద్ద యుద్ధాలే జరుగుతాయి. పత్రికలు అదే పనిగా రిజర్వ్ బ్యాంకు ద్రవ్య విధానంపై విమర్శలు ఎక్కు పెడతాయి. ఆర్ధిక పండితులు గోల గోల చేస్తారు. ఉత్పత్తి దారుల కష్టాలు ప్రభుత్వాలకు పట్టడం లేదని తెగ యాగీ చేస్తారు. అదే పెట్టుబడిదారులు రుణాలు మేసి ఎగ్గొట్టినా బ్యాంకులు నిరర్ధక ఆస్తుల కింద జమేసుకుని, ప్రభుత్వాల అనుమతి తీసుకుని మరీ రద్దు చేసేస్తాయి.

కానీ ఆరుగాలం కష్టించే వ్యవసాయ ఉత్పత్తి దారులకు గిట్టుబాటు ధరలు అందక లాభాలు దళారీలూ, వ్యాపారుల పాలవుతున్నా ప్రభుత్వాలకి చీమైనా కుట్టదు. పత్రికలు గోల చేయడంతోనే, ఆసోచాం, ఫిక్కీ, ఎఫ్.ఐ.ఐ లాంటి పెట్టుబడిదారుల సంఘాలు పైరవీలు చేయడంతోనే,  పెట్టుబడిదారులకు పెట్టుబడులు అందేలా రిజర్వు బ్యాంకు పరపతి విధానం సవరించుకోవడానికి కూడా ఆదేశాలు వెళ్తాయి. వారి వద్ద లంచాలు మింగి పనులు చేసి పెట్టడానికీ, నిర్ణయాలు తీసుకోవడానికీ మంత్రి పుంగవులు సైతం చేతిలో పెన్ను పట్టుకుని రెడీ గా ఉంటారు. అదే రైతు, కూలీ, కార్మిక సంఘాలు గోల చేస్తే పెన్నులకు బదులు గన్నులు ఎక్కుపెట్టబడతాయి.

ఇదిలా ఉంటే, భారత దేశ ఆర్ధిక వృద్ధి గాధ గురించి కొంత చెప్పుకోవడం అవసరం. భారత దేశంలో 1991 లో మన్మోహన్ సింగ్ ఆర్ధిక పెత్తనంలోనే ‘నూతన ఆర్ధిక విధానాలు’ దూకుడుగా మొదలయ్యాయి. అప్పటివరకూ ’20 వ శతాబ్ధంలోకి పయనం’ పేరుతోనో మరొక పేరుతోనో దొంగ చాటుగా సంపన్న కంపెనీలకూ, పెట్టుబడిదారులకూ, భూస్వాములకూ దోచి పెట్టే విధానాలను అమలు చేసిన పాలకులు ‘చెల్లింపుల సమతూక సంక్షోభం’ (Balance of payment crisis) బూచి చూపి ప్రత్యక్షంగా, అడ్డగోలుగా, బరి తెగించి సరళీకరణ, ప్రవేటీకరణ విధానాలను అమలు చేయడం ప్రారంభించారు.

నూతన ఆర్ధిక విధానాల అమలు ఉద్దేశం నిజానికి దేశాన్ని ‘చెల్లింపుల సమతూకం సంక్షోభం’ నుండి బైట పడేయడం కాదు. అదే లక్ష్యం అయితే ప్రభుత్వ రంగంతోనే దాన్ని సాధించవచ్చు. దేశాన్ని దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకోవాలన్న జ్ఞానం మన పాలకులకు ఉన్నట్లయితే అందుకు సరిపడా మానవ, ప్రకృతి వనరులు భారత దేశంలో పుష్కలంగా ఉన్నాయి. కానీ దళారీ మెంటాలిటీ ఉన్న పాలకులు విదేశాల పైన ఆధారపడడానికే మొగ్గు చూపారని చరిత్ర చెబుతోంది. అశేష భారత కార్మిక వర్గానికి పని చూపి అభివృద్ధి సాధించే బదులు విదేశీ కంపెనీలను ఆహ్వానించి ఉత్పత్తులు పెంచుకోవడానికే మనవారు ఆసక్తి చూపారు.  ఈ పరాయి దేశాలపై ఆధారతకు నిర్ణయాత్మక నాయకత్వ వహించిన వ్యక్తి అప్పటి భారత ఆర్ధిక మంత్రి, ఇప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగే. అమెరికా కంపెనీల అనుంగు అనుచరులు అహ్లూవాలియా, చిదంబరం, పవార్, ఆనంద శర్మ, కపిల్ సిబాల్ లాంటి దళారీ పెద్దలు ఈయనకు ఇప్పటి సామంతులు. అలాగని ఇతరులు పులుగడిగిన ముత్యాలని కాదు. మన్మోహాన్ బృందానికి ఇతరులు లిబరల్ ముఖోటాలు గానో లేదా నెహ్రూవియన్ ఆపాలజిస్టులుగానో చూడవలసి ఉంటుంది.

రాజకీయ నాయకుల పైరవీల జోక్యం వలన ప్రభుత్వ రంగ పరిశ్రమలు బలవంతంగా నష్టాల బాట పట్టాయి గానీ ప్రపంచంలో ఏ బడా కంపెనీల స్ధాయికైనా తీసిపోని ఉత్పత్తులను భారత ప్రభుత్వ పరిశ్రమలు తీసాయి. బి.హెచ్.ఈ.ఎల్, బెల్, డి.ఆర్.డి.ఎల్, బి.హెచ్.పి.వి లాంటి ఆణి ముత్యాల్లాంటి కంపెనీలు భారత పరిశ్రమలను సమున్నతంగా నిలిపాయి. అమెరికా, యూరప్ లు భారత దేశంపై అణు నిషేధం విధించినా అణు బాంబు తయారు చేసి భారత దేశ కీర్తి పతాకను సమున్నతంగా నిలిపింది ప్రభుత్వ పరిశ్రమలే. వాడేసిన యురేనియం ను రీసైక్లింగ్ చేసి మళ్ళీ వినియోగించే సాంకేతిక పరిజ్ఞానంలో భారత్ దే పై చేయి. దానిని సాధించింది ప్రభుత్వ పరిశ్రమలే. చంద్రయాన్ కి ఏర్పాట్లు చేసింది ప్రభుత్వ పరిశ్రమలే. విను వీధిలోకి ర్యాకెట్లు ప్రయోగించిందీ ప్రభుత్వ కంపెనీలే. వాణిజ్య స్ధాయిలో ర్యాకెట్లు ప్రయోగించగల పరిజ్ఞాన్ని అభివృద్ధి చేసిందీ ప్రభుత్వ కంపెనీలే.

అటువంటి ప్రభుత్వ రంగం పైన దుష్ప్రచారం ప్రారంభించిన పాలకులు, పూనుకుని మరీ నష్టాల బాట పట్టించారు. అనంతరం నష్టాల పేరు చెప్పి ప్రవేటు కంపెనీలకు అమ్మేశారు. ఇప్పుడు లాభాల కంపెనీలను కూడా డిజిన్వెస్టుమెంట్ పేరుతో దశలవారీగా షేర్లు అమ్మేస్తూ ప్రవేటు కంపెనీల పరం చేస్తున్నారు. ఈ కార్యక్రమం లక్ష్యం ఒక్కటే. భారత ఉత్పత్తి రంగాన్ని పూర్తిగా ప్రవేటు కంపెనీల పరమ్ చేయడమే దీని పరమార్ధం. తద్వారా అమెరికా, యూరప్ దేశాలకు చెందిన బడా, బడా ప్రవేటు కార్పొరేట్ కంపెనీలు పూర్తిగా భారత దేశ ఉత్ప్త్తత్తి రంగాన్ని ఆక్రమించుకునేందుకు తగిన ఏర్పాట్లను ప్రభుత్వాలు చేస్తున్నాయి. అందుకోసం సవా లక్ష సాకులు చూపుతున్నారు. ఇంకా కొత్త కొత్త సాకులు కనిపెడుతున్నారు. ఈ ప్రవేటు యజ్ఞంలో భారత దేశంలోని అశేష శ్రామిక జనం, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి జనం, రైతులు, కూలీలు… వీరంతా సమిధలే.

ఆర్ధిక వ్యవస్ధలను ప్రవేటు కంపెనీల పరం చేశాక అటువంటి ఆర్ధిక వ్యవస్ధలో కర్త, కర్మ, క్రియ అన్నీ కంపెనీలదే. అవి కూడా పశ్చిమ దేశాల కంపెనీలదే. మనం చూడడానికి రిలయన్సో, టాటా కంపెనీయో ఇంకా దేశీయ పేర్లతో కూడిన కంపెనీలు కనిపించినా వాస్తవానికి ఆ కంపెనీలలో మెజారిటీ షేర్లు విదేశీ కంపెనీల చేతుల్లో నే ఉంటాయి. విదేశీ కంపెనీలే భారతీయ కంపెనీల చర్యలను శాసిస్తాయి. విదేశీ కంపెనీలకు లాభాలే మార్గ దర్శకులు. తమ లాభాల కోసం అవి ఏవైనా చేస్తాయి. ప్రభుత్వాలను కూలుస్తాయి లేదా నిలబెడతాయి. తమకు నచ్చిన వారిని రాత్రికి రాత్రి నాయకులను చేస్తాయి. నచ్చని వారిని తెల్లవారే లోపు శంకర గిరి మాన్యాలు పట్టిస్తాయి. అందుకే వీరికి ప్రజాస్వామ్య ప్రభుత్వాలంటే గిట్టవు. ప్రజాస్వామ్యం అనగానే ప్రజలు ఒట్లేయాలి, ఆ ఓట్లు పొంది గెలవాలి, ఆ తర్వాత ప్రజా ప్రతి నిధులు సక్రమంగా మద్దతు కొనసాగించాలి.ఇదంతా కంపెనీలకు గిట్టదు. అదే సైనిక పాలకులు, నియంతలైతే ఉక్కు పాలనతో ప్రజలను, వారి నిరసనలనూ తొక్కిపెట్టి తమకు కావలసింది పొందవచ్చు.

అమెరికా, యూరప్ కంపెనీల ఆయుధ మద్దతు, ఆర్ధిక సహాయం లేకుండా ప్రపంచంలో ఏ దేశంలోనూ ఏ నియంతృత్వ ప్రభుత్వమూ నిలిచి కొనసాగలేదు. ఒక వేల నిలిచినా అలాంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అమెరికా, యూరప్ లు ఎన్ని కుట్రలు చేసి పడగొడతాయో ఆఫ్రికా, దక్షిణాఫ్రికా, ఆసియాలలో అనేక దేశాలు ఉదాహరణలుగా ఉన్నాయి. అదే కోవలో లిబియాను చూశాం. సిరియా, ఇరాన్ లను చూస్తున్నాం. 

ప్రవేటు కంపెనీలు ఉత్పత్తి రంగాలన్నింటినీ వశం చేసుకున్నాక ఆర్ధిక వ్యవస్ధలు జి.డి.పి రేట్లతోనే లెక్కింపబడతాయి. కంపెనీల లాభాలు ప్రతి రోజూ, నెలా, పావు సంవత్సరమూ, అర్ధ సంవత్సరమూ, సంవత్సరమూ, దశాబ్ధమూ ఇలా నిరంతరమూ పెరుగుతూ పోవడమే ఆర్ధిక వృద్ధికి, దేశ వృద్ధికీ, దేశాల అభివృద్ధికీ చిహ్నాలు. అశేష సంఖ్యలో ఉన్న కార్మికులు, రైతులు, ఉద్యోగులు, కూలీలు ఎన్ని కష్టాలు పడుతున్నా అది అభివృద్ధి లేమి కిందకు రాదు. దరిద్రం, ఆకలి, నిరుద్యోగం తాండవిస్తున్నా అవి అభివృద్ధి లేమిలో భాగం కాదు. అదే జి.డి.పి వృద్ధి పడిపోనివ్వండి. ఇక కొంప కొల్లేరే. దానికి కారణాలు ఏవైనా సరే.

కార్మికులు, ఉద్యోగులు తదితరులకు వేతనాలు పడిపోతే ఉత్పత్తులు కొనలేరు. దానివల్ల కంపెనీల ఆదాయాలు పడిపోతాయి. పన్నులు కట్టలేక ప్రభుత్వాల ఆదాయాలూ పడిపోతాయి. ఉత్పత్తులు పేరుకు పోతాయి. దానితో అనివార్యంగా కంపెనీలకు అప్పులిచ్చే బ్యాంకులలో పొదుపు ఖాతాలు నిండుకుంటాయి. ఫలితంగా కంపెనీలకు అప్పులు కూడా కష్టం అవుతాయి. వీటన్నింటికీ పరిష్కారంగా జనానికి పనులిచ్చి సరైన వేతనాలిచ్చి, ఆదుకుంటే ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఉత్పత్తులు అమ్ముడవుతాయి. ఆర్ధిక వ్యవస్ధలు వేగం పుంజుకుంటాయి. ఉత్పత్తులు కూడా ఇంకా పెరుగుతాయి. తద్వారా జి.డి.పి కూడా పెరుగుతుంది. కానీ ‘ఆ ఒక్కటీ అడక్కు’ అన్న చందంగా ఈ పరిష్కారానికి మాత్రం కంపెనీలు ఒప్పుకోవు. అవి చూపే ఏకైక పరిష్కారం వేతనాలు కోసేయడం. కార్మికులకు ఉన్న బెత్తెడు వేతనాలను కోసేసి ఆ భాగంతో తమ లాభాలు పెంచుకుంటూ ఆ విధంగా అధిక ఉత్పత్తి సంక్షోభాన్ని అధిగమించడానికే కంపెనీలు చూస్తాయి తప్ప వేతనాలు పెంచితే చివరికి అవి తమ వద్దకే వస్తాయన్న జ్ఞానం ఉండదు. ఆ జ్ఞానం ఉంటే వారు పెట్టుబడిదారులు కాదు.

ఈ నేపధ్యంలో పెట్టుబడిదారీ వ్యవస్ధల్లో ఎన్ని జీడీపీ లెక్కలు వేసుకున్నా, ఎన్ని ఆర్ధిక వృద్ధి రికార్డులు బద్దలైనా, లాభ శాతాలు ఎంత పెరిగినా, కంపెనీల ఆస్తులు ఎన్ని రెట్లు పెరిగినా అవి సంక్షోభాలవైపే నిరంతరం ప్రయాణమవుతూ ఉంటాయి. గతంలో ప్రతి పది సంవత్సరాల కొకసారి ఆర్ధిక సంక్షోభాలు బద్దలవుతూ ఉండేవి. ప్రతి సంక్షోభానికీ మరొక సంక్షోభాన్ని పరిష్కారంగా సృష్టించడమే తప్ప, కొత్త సంక్షోభాన్ని సృష్టించి పాత సంక్షోభం నుండి బైటపడడమే తప్ప, సంక్షోభాలకు శాశ్వత పరిష్కారం చూసుకునే ఆలోచన పెట్టుబడిదారీ వ్యవస్ధలు చేయవు.

సంక్షోభాలు పెరిగే కొద్దీ వాటి మధ్య వ్యవధి కూడా తగ్గిపోతోంది. 1995 నాటి ఆసియా టైగర్ల సంక్షోభం పూర్తిగా పరిష్కారం కాకముందే 2000 లో డాట్ కామ్ సంక్షోభం బద్దలవడం, అది పరిష్కారం కాకమునుపే జపాన్ సుదీర్ఘ కాలం డిఫ్లేషన్ లో మునిగిపోవడం, ఈ లోపే 2007 లో ప్రపంచ ద్రవ్య సంక్షోభం బద్దలై ఆర్ధిక సంక్షోభంగా రూపు దాల్చడం జరిగిపోయింది. దాని ప్రభావం నుండి అమెరికా, యూరప్ దేశాలు బైటికి రాక మునుపే యూరప్ ఋణ సంక్షోభం ప్రపంఛ దేశాలను పట్టి పల్లార్చుతోంది. యూరప్ ఋణ సంక్షోభం త్వరలోనే ప్రపంచ ఆర్ధిక సంక్షోభంగా మారే సూచనలు కనపడుతున్నాయని ప్రఖ్యాత పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలైన కృగర్, జోసెఫ్ స్టీగ్లిట్జ్ లాంటి నోబెల్ పురస్కార గ్రహీతలే చెబుతున్నారు.

భారత దేశ ఆర్ధిక వ్యవస్ధను, గత రెండు దశాబ్ధాలలో నూతన ఆర్ధిక విధానాల ద్వారా ప్రపంచ ద్రవ్య, ఆర్ధిక వ్యవస్ధలకు కట్టివేయడంతో వరుస సంక్షోభాలకు గురయ్యే రోజులు దాపురించాయి. లేదంటే ప్రపంచ ఆర్ధిక సంక్షోభాన్ని తట్టుకుని నిలబడిందని చెప్పిన రెండేళ్ళలోనే ఆర్ధిక వృద్ధి ఒకటిన్నర శాతానికి పైగా పడిపోవడం సాధ్యం కాదు. భారత ప్రజల ఆర్ధిక శక్తి పైన ఆధారపడి సాధించిన జీడీపీ వృద్ధి శాతం అయినట్లయితే అది పడిపోయే అవకాశం వచ్చేదే కాదు. అత్యధిక ప్రజానీకం దరిద్రం, ఆకలి, నిరుద్యోగం సమస్యలతో తీసుకుంటుంటే వారిపైన ఆర్ధిక వృద్ధి ఎలా ఆధారపడి ఉండగలదు? విదేశీ పెట్టుబడులపైనా, షేర్ మార్కెట్లలో వచ్చి పడుతున్న హాట్  మనీ పైనా, కొద్ది మంది సంపన్నులపైనా, తాగుడు జూదం లాంటి ప్రజల వ్యసనాలపైనా ఆధారపడి ఉన్న ఆర్ధిక వ్యవస్ధలు ఎంత కాలం నిలుస్తాయి?

దేశం దివాళా తీయక ముందే ప్రజలు మేల్కొనవలసిన అవసరం ఉంది. దేశ వనరులను విదేశీ కంపెనీలకు పందేరం పెడుతున్న పాలకుల విధానాలను వారు ప్రతిఘటించవలసి ఉంది. కావలసింది వృద్ధి లెక్కలు కాదు ప్రజల అభివృద్ధి అని పాలకులకు గుణపాఠం చెప్పవలసి ఉంది. దేశమంటే రిలయన్సులూ, టాటాలూ, విప్రోలూ కాదనీ దేశమంతే పొలాల్లో, పరిశ్రమల్లో కష్టించి పని చేసే జనం అనీ చెప్పవలసి ఉంది. అప్పటివరకూ మన్మోహనులూ, అహ్లూవాలియాల కాకి లెక్కలు పత్రికల పేజీలు నింపుతూనే ఉంటాయి. ఆకలి, దరిద్రం, పోషకార లోపం, నిరుద్యోగం లాంటి వేన వేల సమస్యలు కొనసాగుతూనే ఉంటాయి. అంతేనా? భారత దేశ రెండంకెల ఆర్ధిక వృద్ధి కధ కంచిలో సైతం దుర్భిణీ వేసి వెతికినా దొరక్క పోవచ్చు కూడా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s