రష్యా సహాయంతో నిర్మించిన తమిళనాడు, కుదంకుళం అణు కర్మాగారానికి వ్యతిరేకంగా జరుగుతున్నా ప్రజాందోళనలకు ఆర్ధిక సహాయం చేసి రెచ్చగొడుతున్నాయన్న ఆరోపణలతో నాలుగు ఎన్.జి.ఓ (నాన్-గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్) సంస్ధలపైన కేసులు నమోదు చేయడానికి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రెండు సంస్ధలపై సి.బి.ఐ కేసు నమోదు చేయగా, మరో రెండింటిపైన తమిళనాడు పోలీసులు కేసులు పెట్టారని కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి ఆర్.కె.సింగ్ మంగళవారం విలేఖరులకు తెలిపాడు.
కుదంకుళం కర్మాగారానికి వ్యతిరేకంగా అమెరికా, స్కాండినేవియా దేశాలు ఆందోళనకు రెచ్చగొడుతున్నాయని ప్రధాని ఆరోపించిన కొద్ది రోజులకే ఎన్.జి.ఓ లపై ప్రభుత్వాలు విరుచుకుపడుతున్నాయి. ఈ సంస్ధలు ‘విదేశీ సహాయ నియంత్రణా చట్టాన్ని’ (ఎఫ్.సి.ఆర్.ఏ) ఉల్లంఘించి తమ నిధులను ఆందోళనలకు మళ్ళిస్తున్నాయని ఆర్.కె.సింగ్ తెలిపాడు. ఎన్.జి.ఓ సంస్ధలకు షోకాజ్ నోటీసు ఇచ్చామనీ, వారి బ్యాంకు ఖాతాలను స్తంభింప జేశామనీ కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. తమ చర్యలను కప్పి పుచ్చుకోవడానికి పెద్ద పెద్ద మొత్తాలకు ఇవి అర్జెంటుగా రసీదులు సృష్టిస్తున్నాయని హోంశాఖ అధికారులు తెలిపారు.
కనీసం పన్నెండు ఎన్.జి.ఓ సంస్ధలు తమ నిధులను ఖర్చు చేయడంలో అనేక అక్రమాలకు పాల్పడినట్లుగా గుర్తించామని హో శాఖ అధికారులు చెపుతున్నారు. వీటిలో అధికం తమిళనాడులోనే ఉన్నాయని తెలిపారు. ఈ ఆరోపణలను ‘అణు విద్యుత్ వ్యతిరేక ప్రజా ఉద్యమం’ (పి.ఏం.ఏ.ఎన్.ఇ) కన్వీనర్ ఎస్.పి.ఉదయ కుమార్ తిరస్కరించాడు. విదేశీ నిధులతో ప్రజాందోళనలు జరుగుతున్నాయంటూ ప్రధాని ఆరోపించినందుకు, ఆయనపైనా ‘పరువు నష్టం’ దావా వేయబోతున్నట్లుగా ఆయన శనివారం పత్రికలకు తెలిపాడు. ఆందోళనలపైనా ప్రభుత్వం దుష్ప్రచారానికి దిగుతోందని ఆయన ఆరోపిస్తున్నాడు.
ఇదిలా ఉండగా నాగర్ కోయిల్ లో అరెస్టు అయిన జర్మన్ దేశీయుడు హెర్మన్ ‘టూరిస్టు వీసా’ పై ఇండియా వచ్చాడని హోమ్ శాఖ అధికారులు తెలిపారు. కుదంకుళం ఆందోళనలకు సహాయం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఆయనని దేశం నుండి వెళ్లగొట్టిన సంగతి తెలిసిందే. టూరిస్టు వీసా నిబంధనలకి విరుద్ధంగా ప్రజలను ఆందోళనలకి రెచ్చగొడుతున్నందున ఆయనపైనా ‘లుక్ ఔట్ నోటీసు’ ఇచ్చామని హోమ్ శాఖ అధికారులు తెలిపారు. “ఆయనకి నాగర్ కోయిల్ లో పనేమీ లేదు. వీసా రూల్స్ అన్నింటినీ ఆయన ఉల్లంఘించాడు. అందుకే దేశం నుండి వెళ్లగొట్టాము” అని హోంశాఖ సీనియర్ అధికారులు చెప్పారు.
భారత దేశంలో జర్మనీ రాయబారిగా ఉన్న ‘కార్డ్ మీర్ క్లోడ్త్’ ‘జర్మనీ దేశస్ధుడిని వెళ్ళగొట్టిన సంగతి తనకు తెలియదని’ విలేఖరులకి చెప్పాడు. “ఈ అంశంలో భారత అధికారులతో నేను మాట్లాడలేదు” అని ఆయన తెలిపాడు. సాధారణంగా ఇలాంటి విషయాల్లో ఆ దేశ రాయబారులతో చర్చిస్తారు. అలాంటిదేమీ జరగలేదని జర్మన్ రాయబారి చెప్పడం నమ్మదగ్గదిగా లేదు. ఘటనపైనా మరిన్ని ప్రశ్నలు ఎదురుకాకుండా తప్పించుకోవడానికే జర్మన్ రాయబారి తనకు తెలియదని చెప్పి ఉండవచ్చు.
విదేశీ ఎన్.జి.ఓ సంస్ధలు మూడవ ప్రపంచ దేశాల్లో ఈ విధంగా ప్రజాందోళనలకు సహాయం చెయ్యడం కొత్త విషయమేమీ కాదు. మూడవ ప్రపంచ దేశాలలో పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలు ఎన్.జి.ఓ సంస్ధల ముసుగులో అనేక కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. ఆయా దేశాల్లో సామ్రాజ్యవాద దేశాల ప్రయోజనాలు కాపాడుకోవడానికి వీలుగా ఎన్.జి.ఓ ల ముసుగులో అవి ప్రపంచవ్యాపితంగా నిఘా పెడతాయి. సామ్రాజ్య వాడ దేశాల ఆర్ధిక ప్రయోజనాలు దెబ్బతీసేలా జరిగే ప్రజల ఆందోళనలను దెబ్బ తీయడానికి అవి తమ నిధులను ఖర్చు చేస్తాయి. ప్రజల్లో తలెత్తే అసంతృప్తినీ, ఆందోళనలను సొమ్ము చేసుకుంటూ ప్రజల ఆందోళనలను తమకు అనుకూలంగా వినియోగించుకోవడానికి కూడా అవి కృషి చేస్తాయి.
కుదంకుళం ఆందోళనలపైనా ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు నిజమే అయిన పక్షంలో సామ్రాజ్య వాద దేశాలు తమలో ఉన్న వైరుధ్యాల పరిష్కారానికి కూడా భారత ప్రజల ఆందోళనలను వినియోగించుకుంటున్నాయని అర్ధం చేసుకోవలసి ఉంటుంది. తమ ఆర్ధిక ప్రయోజనాలు నెరవేరనట్లయితే తమ వైరి దేశపు ఆర్ధిక ప్రయోజనాలను దెబ్బతీయడానికి కూడా భారత ప్రజల ఆందోళనలను వినియోగించుకుంటున్నాయని అర్ధం చేసుకోవలసి ఉంది. ఇది కూడా భారత ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిన పరిణామమే.
అయితే ఈ ముసుగులో భారత ప్రజలు నిర్వహిస్తున్న ప్రతి ఆందోళననూ విదేశీ కుట్రగా భారత ప్రభుత్వాలు కొట్టిపారేసే ప్రమాదం పొంచి ఉంది. కుదంకుళం ఉద్యమ కన్వీనర్ భారత ప్రధాని పైన పరువు నష్టం దావా కూడా వేయడానికి సిద్ధపడినందున భారత ప్రభుత్వ ఆరోపణలను నమ్మడానికి వీల్లేకుండా ఉంది. విదేశీ నిధులతో నఢిచే ఎన్.జి.ఓ లు ప్రధానంగా విదేశీ ప్రయోజనాల కోసమే కృషి చేస్తాయని నిర్ద్వంద్వంగా అనేక సార్లు రుజువయిన నేపధ్యంలో ఎన్.జి.ఓ ల ఉద్దేశ్యాలు పవిత్రమైనవని చెప్పలేము. ఈ వివాదంలో పడి విదేశీ అణు కంపెనీల ప్రయోజనాల కోసం ప్రమాదకరమైన, అత్యంత ఖరీదైన అణు విద్యుత్ వైపు మొగ్గు చూపుతున్న భారత పాలక వర్గాల కుట్రలను ప్రజలు విస్మరించదానికి వీల్లేదు.
విదేశీ కంపెనీల కోసం భారత రైతుల భూములు లాక్కుని మరీ అప్పగిస్తున్న భారత పాలక వర్గాలు ప్రజల ఆందోళనలను అణచివేయడానికి అనేక ఎత్తుగడలను అనుసరిస్తున్నాయి. ఈ ఎత్తుగడలలో భాగంగా ఆందోళనల వెనుక విదేశీ హస్తం ఉండని ఆరోపించే కొత్త ఎత్తుగడ పాలక వర్గాల అణచివేత ఆయుధాలలో కొత్తగా వచ్చి చేరడమే ఇక్కడ బాగా ఆందోళన కలిగిస్తున్న విషయం.
ఎంజీవోలపై కేసులుపెట్టడం సత్సాంప్రదాయం కాదేమోనండీ. ఇదిలాకొససాగి మీరన్నట్లు ప్రతి ఆందోళన మీదా కేసులుపెడతారేమో ఇకపై.