అరగంటకోసారి విశ్రాంతి కోరే పని అది, పదేళ్ళుగా సెలవే లేదు


భారత దేశ రాజధాని న్యూఢిల్లీలోనే వాజీర్ పూర్ పారిశ్రామిక ప్రాంతంలో గల అనేక స్టీల్ ప్లాంట్లలో పదేళ్ళుగా సెలవన్నది తెలియకుండా పని చేస్తున్న కార్మికుల సంగతి వెలుగులోకి వచ్చింది. వారానికొక విశ్రాంతి దినం కోసం అక్కడి కార్మికులు స్వచ్ఛందగా సమ్మెకు దిగడంతోనే ఇప్పటికైనా వారి దుస్థితి వెలుగులోకి వచ్చింది. దాదాపు పదేళ్ళ తర్వాత మొదటిసారిగా వాజీర్ పూర్ స్టీల్ ప్లాంటుల కార్మికులు బుధవారం రోజు (ఫిబ్రవరి 29) వారాంతపు సెలవు దినాన్ని పొందనున్నారు. ఆ రోజు వారు ఇంట్లోనే విశ్రాంతిగా గడపనున్నారు.

వాజీర్ పూర్ పారిశ్రామిక వాడలో (ఇండస్ట్రియల్ ఏరియా) ఇరవై ఏడు ‘హాట్ రోలింగ్ స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి. ఇందులో పదకొండు వందలకు పైగా కార్మికులు రెక్కలు ముక్కలు చేసుకుని పని చేస్తున్నారు. వారికి గత పదేళ్ళుగా ఒక్క రోజు కూడా సెలవు దినం లేదు. కనీసం వారాంతపు విశ్రాంతి దినం కూడా లేదు. ఎంత అసంఘటిత రంగం లో పని చేస్తున్నా, ప్రతి ఆదివారం గానీ లేదా నిర్ధిష్ట పరిశ్రమకు వీలయిన రోజున గానీ వారానికి ఒక రోజు విశ్రాంతి దినం ఉండాలని కార్మిక చట్టాలు చెపుతున్నాయి. వేతన చేల్లింపుతో కూడిన అత్యవసర సెలవు దినాలు కనీసం పదిహేను ఉండాలని కూడా ఆ చట్టాలు చెపుతున్నాయి. ఇవేవీ వాజీర్ పూర్ కార్మికులకు పదేళ్ళుగా లేవు. ప్రతి రోజూ వారు పని చేయవలసిందే. లేదంటే జీతం కోత తప్పదు. రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ ప్రకటించే జాతీయ సెలవు దినాలు కూడా వీరికి అమలు కాలేదు. ప్రజలకోసం పని చేసే ప్రజాస్వామ్య ప్రభుత్వాలున్నాయని చెపుతున్నప్పటికీ ఈ దుర్మార్గం కొనసాగుతూ వచ్చింది.

ఈ కార్మికులకి ఎనిమిది రోజుల పని దినం సైతం ఈ పదేళ్ళుగా అమలు కాలేదు. వీరు రోజుకు పన్నెండు గంటలు పని చేయవలసిందే. ఇతర రాష్ట్రాల నుండి, గ్రామాల నుండీ నిత్యం రాజధానికి వలస వచ్చే కార్మికులే ఈ ప్లాంటుల లాభార్జనకు మూలాధారం. పని దొరకడమే చాలనుకునే కార్మికులపై దుర్మార్గమైన రీతిలో శ్రమ దోపిడీ చేయడానికి యాజమాన్యాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఎవరైనా పని లోంచి వెళ్ళిపోయినా వారి స్ధానాన్ని భర్తీ చేయడానికి, బతకడానికి శ్రమను అమ్ముకోవడం తప్ప ఏ సాధనమూ, ఆధారమూ లేని వలస కార్మికులు సదా సిద్ధంగా ఉండడంతో యాజమాన్యాల ఆటలు కొనసాగుతున్నాయి.

హాట్ రోలింగ్ స్టీల్ ప్లాంట్లలో ఫర్నేసులు నిరంతరం మండుతూ ఉండవలసిందే. వీటిని ఆర్పినట్లయితే తిరిగి మండించడానికి కొన్ని గంటల సమయం తీసుకుంటుంది. దానితో ఒక బ్యాచి పనిలో నుండి దిగితే వెంటనే మరొక బ్యాచి పనిలోకి ఎక్కాలి. ‘ఎనిమిది గంటల పని దినం’ అమలు కాకపోవడం వల్ల ఒక్కో షిఫ్టుకి పన్నెండు గంటలు కార్మికులు పని చేస్తున్నారు. సాధారణ ఉష్ణోగ్రత కంటే అనేక రేట్లు ఎక్కువ ఉష్ణోగ్రతలో కార్మికులు పని చేయడం వల్ల ప్రతి అర గంటకూ వారు విశ్రాంతి తీసుకోవలసి ఉంటుంది. అది కూడా చలికాలంలో. వేసవి కాలంలోనైతే ప్రతి పావు గంటకీ వారు పని స్ధలం నుండి పక్కకు రావలసి ఉంటుంది. అలా విశ్రాంతి తీసుకున్నట్లయితేనే వారు మరొక అరగంటా పని చేయడానికి శక్తి పుంజుకోగలరు. ప్రతి అరగంగంటకూ వారు లీటర్ నీరు తాగవలసి ఉంటుంది. లేదంటే అత్యధిక వేడి వల్ల డీ హైడ్రేషన్ కు గురై కార్మికులు నిత్యం రోగాల బారిన పడుతుంటారు. 

వీరి నెల జీతం ఐదు వేల నుండి ఎనిమిదిన్నర వేలు మాత్రమే. ఈ వేతనం వీరి కి ఏ మూలా సరిపోదు. కానీ పని దొరకని వలస కార్మికులు మరో దారి లేక ఇక్కడ పని చేస్తుంటారు. నిత్యం రోగాల బారిన పడే పరిస్ధితులు ఉన్నా వైద్య సౌకర్యం వీరికి అందడం చాలా కష్టం. కొన్ని వందల పరిశ్రమలు వాజీర్ పూర్ లో ఉండగా అన్నింటికీ ఒకటే ఈ.ఎస్.ఐ ఆసుపత్రి ఉంది. రోగులందరికీ ఇక్కడ వైద్యం అందదు. వైద్యం అందినవాడు అదృష్టవంతుడే. కాంట్రాక్టు కార్మికులు కావడం వల్ల ఈ ఆసుపత్రిలో ఈ కార్మికులకి ప్రవేశం ఉండదు. ఈ సమస్యలకు తోడు సాంస్కృతిక వెనుక బాటు తనం వీరికి అదనపు సమస్యలను తెచ్చిపెడుతుంది. ప్రభుత్వాలు ప్రతి చిన్న సందులో అందుబాటులో ఉంచే మద్యం దుకాణాలు వీరి ఆదాయాలని ఇట్టే కరిగించేస్తాయి. కనుక వీరి పిల్లలకు చదువులు దొరికే భాగ్యం ఉండదు. వారూ బాల కార్మికులుగా బతుకులు వెళ్ళదీస్తుంటారు.

ఈ పరిస్ధితుల్లో  ఫిబ్రవరి 15 న అనూహ్య ఘటన జరిగింది. సుదీర్ఘ కాలంగా అనుభవిస్తున్న కష్టాలతో విసిగి పోయిన కార్మికులు ఆ రోజుల ఒక్కసారిగా ఆగ్రహించారు. కార్మికుల్లో అనేక మంది తమ ఫ్యాక్టరీల బైట సమావేశం అయ్యారు. పనిని నిలిపేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. యాజమాన్యాలు వినలేదు. ఫిబ్రవరి 20 న వారు మాట్లాడుకుని సమ్మెకు పిలుపిచ్చారు. సమ్మెలో భాగంగా పని నిలిపివేశారు. ఆ ఒక్క రోజు సమ్మె చేసి మరుసటి రోజు పనుల్లో చేరారు. ఈ చర్యతో యాజమాన్యాలు కంగు తిన్నాయి. కార్మికులపై ప్రతి దాడికి దిగాయి. మరుసటి రోజు పనుల్లో చేరిన కార్మికులకు వారి సేవలు ఇక అవసరం లేదని చెప్పేసాయి. పదేళ్లనుండి సెలవు అడగాని వారు వారాంతపు సెలవు కావాలని కోరడం వారు సహించలేకపోయారు.

దానితో కార్మికులకు కర్తవ్యం బోధపడింది. హక్కులు లాక్కోవలసిన అవసరం గుర్తించారు. మళ్ళీ సమ్మె ప్రారంభించారు. ఈసారి మరింతమంది సమ్మేలో చేరారు. దానితో ఇనుము దుంగలను ఉక్కుగా మార్చే పని ఆగిపోయింది. దాని ప్రభావం ఇతర కార్యకలాపాలపై పడింది. ఈ ఫ్యాక్టరీల్లో ప్రాసెస్ చేసిన ఉక్కు అనేక ఇతర పరిశ్రమలకు ముడి సరుకుగా ఉండడంతో ఇతర పరిశ్రమల్లో కూడా పని ఆగిపోయింది. పెద్ద పెద్ద ఉక్కు పాత్రలు, ఉక్కు ఉపకరణాలు, ఇంకా అనేక ఉక్కు సరుకులు తయారు చేసే ఫ్యాక్టరీల్లో పని జరగలేదు.

ఫలితంగా ఫిబ్రవరి 24 న యజమానులు దిగి వచ్చారు. కార్మికుల డిమాండ్లలో రెండింటిని ఒప్పుకున్నారు. సెలవులు ఇవ్వడానికీ, ఇ.ఎస్.ఐ కార్డులు జారీ చేయడానికీ అంగీకరించారు. అంటే, కార్మికులు జబ్బు పడే పరిస్ధితుల్లో సైతం యజామాన్యాలు పదేళ్లుగా ఇ.ఎస్.ఐ కార్డులు ఇవ్వలేదన్నమాట! కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యాలు తమంతట తాము సిద్ధపడవని వారు మరొకసారి రుజువు చేశారు. యాజమాన్యాలు ఒప్పుకున్న డిమాండ్లు నిజానికి చాలా చిన్నవి. తప్పని సరిగా అమలు చేయాల్సిన సౌకర్యాలవి. అంగీకరించిన డిమాండ్లను సైతం ప్రభుత్వాలే అమలు చేయని పరిస్ధితులు నెలకొని ఉన్నాయి. వాటిని అమలు చేయించుకోవడానికి వారు మళ్ళీ సమ్మె చేయవలసిన పరిస్ధితి ఏర్పడవచ్చు.

కార్మికులు ఇంకా అనేక డిమాండ్లు సాధించుకోవలసి ఉంది. ఫర్నేసుల వద్ద వేడిని తట్టుకోవడానికి రక్షణ తొడుగులను యాజమాన్యాలు సరఫరా చేయవలసి ఉండగా అవేవీ లేవు. దానివల్లనే ఎంతటి ఆరోగ్య వంతుడైనా కొద్ది కాలంలోనే రోగాల బారిన పడుతున్నారు. ఫ్యాక్టరీల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఉండవు. అసలా ఆలోచనే యాజమాన్యాలకు లేదు. కనీస వేతనాల సంగతి సరే సరి. జాబ్ కార్డులు లేవు. ఈ డిమాండ్లను హోలీ పండగ తర్వాత చర్చిస్తామని యాజమాన్యాలు చెప్పాయట. ఫ్యాక్టరీ యాజమానుల సంఘానికి ఎన్నికలు జరిగాక మిగిలిన డిమాండ్లు చర్హిస్తారట. అంటే తాము సంఘటిత పడడానికి సమయం కోరుతున్నారన్నమాట.

ఎనిమిది గంటల పనిదినం కోసం అమెరికాలో చికాగో కార్మికులు సమ్మె చేసి యాజమాన్యాలు, ప్రభుత్వము అమలు చేసిన క్రూర నిర్భంధంలో అమరులై ఇప్పటికీ నూట పాతికేళ్ళు అయింది. శతాబ్ధాల తరబడి కార్మికులు చేసిన పోరాటాల ఫలితంగా మాత్రమే ఎనిమిది గంటల పనిదినం అమలులోకి వచ్చింది. అయితే ప్రపంచంలోని అనేక చోట్ల కోట్ల మంది కార్మికులకు ‘ఎనిమిది గంటల పని దినం’ సుదూర స్వప్నం గానే ఉండిపోయింది. వారానికొక రోజు విశ్రాంతి దినం, జాతీయ సెలవు దినాలు, సంవత్సరానికి పది హేను రోజుల అత్యవసరమ సెలవులు… ఇవన్నీ కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి, త్యాగాలు చేసి సాధించుకున్నవే తప్ప పెట్టుబడిదారీ వర్గం గానీ, దానికి కొమ్ము కాసే ప్రభుత్వాలు గానీ ఆయాచితంగా మానవత్వం తో ఇచ్చినవి కాదు. యాజమాన్యాలకు లాభాలు తప్ప మానవత్వం గానీ, మానవ ప్రవృత్తితో గానీ సంబంధ ఉండదనీ, లాభాల కోసం వారు కార్మికులపైన ఎలాంటి నిర్భంధ పరిస్ధుతులను అమలు చేయడానికైనా సిద్ధంగా ఉంటారనీ వాజీర్ పూర్ హాట్ రోలింగ్ ఉక్కు పరిశ్రమల యాజమాన్యాలు మరొక సారి నిర్ద్వంద్వంగా నిరూపించాయి.

హాజీర్ పూర్ హాట్ రోలింగ్ ఉక్కు పరిస్ర్మల కార్మికులు తమ హక్కుల సాధనకై ఎంకా ఎంతో దూరం ప్రయాణించవలసిన అవసరం ఉంది.

(ది హిందూ సౌజన్యంతో)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s