కుదంకుళం అణు కర్మాగారం, ప్రధాన మంత్రిపై పరువు నష్టం దావా


రష్యా సహకారంతో మొదటి దశ నిర్మాణం పూర్తి చేసుకున్న కుదంకుళం అణు విద్యుత్ కర్మాగారంపై పోరాటం చేస్తున్న ఎన్.జి.ఓ (నాన్-గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్) సంస్ధలకు అమెరికా, స్కాండినేవియా దేశాల నుండి డబ్బు ముడుతోందంటూ వ్యాఖ్యానించిన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పై ‘పరువు నష్టం’ దావా వేయడానికి ఉద్యమ నాయకుడు ఉదయ కుమార్ సిద్ధమవుతున్నాడు. తమకు ఏ దేశం నుండీ నిధులు అందడం లేదనీ, ఆమేరకు ప్రధాని చేసిన వ్యాఖ్యలు దురుద్దేశపూరితంగా ఉన్నాయనీ ఉదయకుమార్ ఆరోపిస్తున్నాడు. అణు విద్యుత్ ప్రాజెక్టుల వల్ల భారత దేశ ప్రజలకు జరగనున్న నష్టాల గురించి పట్టించుకోకుండా, ప్రజల ఉద్యమం చేస్తున్న డిమాండ్లకు సరైన సమాధానం చెప్పకుండా అమెరికా నిధులతో ఉద్యమాలు నడుపుతున్నట్లు ప్రచారం చేయడానికే భారత ప్రభుత్వం అధిక ఆసక్తి కనబరుస్తున్నది.

తమిళనాడులోని కుదంకుళం వద్ద నిర్మించిన అణు విద్యుత్ ప్రాజెక్టు కు వ్యతిరేకంగా ‘పీపుల్స్ మూవ్‌మెంటు ఎగైనెస్ట్ న్యూక్లియర్ ఎనర్జీ’ సంస్ధ నేతృత్వంలో పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమిస్తున్న సంగతి విదితమే. స్వీడన్ కి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెమొక్రటిక్ అండ్ ఎలక్టోరల్ అలయెన్స్ (ఐడియా) సంస్ధకు అనుభంధితంగా ఉన్న రికన్సిలేషన్ రిసోర్స్ నెట్‌వర్క్ (ఆర్.ఆర్.ఎన్) లో నిపుణుల పానెల్ లో తాను సభ్యుడుగా ఉన్నమాట వాస్తవమేననీ, కాని తనకు ఆ సంస్ధలో జరిగే డబ్బు చెల్లింపులతో సంబంధం లేదనీ ఉదయ్ కుమార్ చెప్పాడు.

అంతకుముందే ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి వి.నారాయణ స్వామి ఇవే ఆరోపణలను ఉదయ కుమార్ పై చేయగా, నారాయణ స్వామి పైన దావే వేయగలనని హెచ్చరిస్తూ ఆయనకి ఉదయ కుమార్ ఒక లేఖ రాసాడు. ఉదయ కుమార్ నడుపుతున్న ఎన్.జి.ఓ సంస్ధకు విదేశీ నిధులు అందుతున్నాయని నారాయణ స్వామి ఆరోపించాడు. ఉదయ కుమార్, ఆయన భార్య మీనా లు ఎస్.ఎ.సి.సి.ఇ.ఆర్ అనే ఎన్.జి.ఓ కు ట్రస్టీలు గా ఉన్నారనీ ఐడియాకు చెందిన ఆర్.ఆర్.ఎన్ తో ఆ సంస్ధ రిజిస్టర్ అయి ఉన్నదనీ చెబుతూ నారాయణ స్వామి తన ఆరోపణలు చేశాడు.

“కుదంకుళం వ్యతిరేక నిరసనకారులకు అమెరికా, స్కాండినేవియా దేశాలనుండి నిధులు అందుతున్నాయని ప్రధాని దీనినే ఉద్దేశిస్తూ అన్నారేమో నాకు తెలియదు. ఈ ఉద్యమానికి నేను కన్వీనర్ గా వ్యవహరిస్తున్నందున ఆ ఆరోపణలు నాపై చేస్తున్నవిగానే నేను పరిగణిస్తున్నాను. నేను ప్రధాన మంత్రి పైన పరువు నష్టం దావా వేయడానికి నిర్ణయించుకున్నాను” అని ఉదయ కుమార్ పత్రికలతో చెప్పినట్లుగా ‘ది హిందూ’ పత్రిక తెలిపింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కుదంకుళం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడుతున్న తన ప్రజల వైపు నిలబడతారనే ఆశిస్తున్నట్లుగా ఉదయ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

అమెరికాతో ‘పౌర అణు ఒప్పందం’ కుదిరిన తర్వాత భారత దేశానికి అణు రియాక్టర్లు సరఫరా చేయడానికీ, యురేనియం ఖనిజం అమ్మడానికీ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్.ఎస్.జి) దేశాలు ముందుకు వస్తున్నాయి. యురేనియం నిల్వలు అధికంగా కలిగిన ఆస్ట్రేలియా దేశం కూడా ఇండియాకు యురేనియం అమ్మడానికి ముందుకు వచ్చింది. తాము అమ్ముతున్న యురేనియం ఇంధనాన్ని ఇండియా అణు బాంబులు నిర్మించడానికి ఉపయోగించినట్లు తెలిసినప్పటికీ తాము యురేనియం అమ్మడాన్ని కొనసాగిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని గిల్లార్డ్ రెండు రోజుల క్రితమే ప్రకటించింది. ఫ్రాన్సు, బ్రిటన్, జర్మనీ, రష్యాలకు చెందిన ప్రభుత్వాధిపతులు గత సంవత్సరం వరుసగా ఇండియా సందర్శించి తమ అణు రియాక్టర్లు అమ్ముకోవడానికి భారత ప్రభుత్వంతో మంతనాలు జరిపి వెళ్లారు.

అయితే అమెరికా మాత్రం ‘పౌర అణు ఒప్పందం’ కుదిరిన తర్వాత కూడా ఇండియాకు అణు రియాక్టర్ల అమ్మడానికి ఇంకా ముందుకు రావడం లేదు. దానికి కారణం భారత పార్లమెంటు ఆమోదించిన ‘అణు ప్రమాద పరిహార చట్టం.’ భారత దేసానికి లోపాలతో కూడిన లేదా కాలం చెల్లిన అణు పరికరాలు సరఫరా చేసినట్లయితే వాటివల్ల భవిష్యత్తులో ఫుకుషిమా లాంటి అణు ప్రమాదాలు సంభవించినట్లయితే ప్రమాదంలో నష్టపోయినవారికి అమెరికా కంపెనీలు కూడా నష్టపరిహారం చెల్లించవలసి ఉంటుందని ఆ చట్టంలో పొందుపరచడంతో అమెరికా దానికి అభ్యంతరం చెబుతోంది.తమ కంపెనీలు నాసిరకం అణు పరికరాలు సరఫరా చేసినప్పటికీ, దానివల్ల అణు ప్రమాదం సంభవించినప్పటికీ భారత దేశ ప్రభుత్వం గానీ, నష్టపోయిన భారత ప్రజలు గానీ నోరు మూసుకుని ఉండవలసిందేనని అమెరికా డిమాండ్ చేస్తోంది. ఇతర దేశాలకు ఆ చట్టం అమలు చేసినా తన కంపెనీల వరకైనా ఆ చట్టాన్ని మినహాయించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది.

భోపాల్ విషవాయువు ప్రమాదంలో పది వేలమంది కి పైగా భారతీయులను చంపడమే కాక ఇప్పటికీ దాని దుష్ఫలితాలు అనుభవించేలా కారకులైన అమెరికా కంపెనీ యూనియన్ కార్బైడ్ ను ఇండియా ప్రభుత్వం అలాగే వదిలి పెట్టింది. కంపెనీ అధిపతి భారత దేశం వచ్చినప్పటికీ అరెస్టు చేయకుండా అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రత్యేక విమానంలో అమెరికాకి సాగనంపారు. భవిష్యత్తులో అమెరికా నాసిరకం అణు పరికరాల వల్ల ప్రమాదం సంభవించినా ఇదే పద్ధతిలో అమెరికా కంపెనీలను నష్టపరిహారం కోసం వత్తిడి చేయకుండా వదిలిపెట్టాలని అమెరికా కోరుతోంది. నిజానికి భారత ప్రభుత్వం చేసిన అణు ప్రమాద పరిహార చట్టం వల్ల అణు పరికరాలు సరఫరా చేసిన కంపెనీలు చెల్లించవలసిన నష్టపరిహారం చాలా తక్కువ (రు.1500 కోట్లు). అణు ప్రమాదాల వల్ల సంభవించే నష్టానికి ఇది ఏమాత్రం సాటి రాదు.

ఈ కొద్ది మొత్తాన్ని చెల్లించడానికి కూడా చట్టంలో అనేక అడ్డంకులను భారత ప్రభుత్వం సృష్టించింది. అణు కర్మగారం నిర్మించడం ప్రారంభించిన ఐదు సంవత్సరాల లోపు ఆ ప్రమాదం జరిగి ఉండాలనీ నిబంధన విధించారు. వాస్తవానికి అణు కర్మాగారం నిర్మాణానికి, అంతా అనుకున్నది అనుకున్నట్లు జరిగితే కనీసం ఐదు సంవత్సరాలు పడుతుంది. మరికొన్ని పరిస్ధితుల్లో కర్మాగారం ముగిసిన సంవత్సరం లోపు అణు ప్రమాదం సంభవించినా కాంట్రాక్టు ఒప్పందం లో పొందుపరిస్తే మాత్రమే నష్టపరిహారం కోరడానికి హక్కు ఉంటుంది. కర్మాగారం నిర్మాణం పూర్తయ్యాక దాని పని సరిగ్గా ప్రారంభం కావడానికే అధమం సంవత్సరం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అన్ని అడ్డంకులు దాటినప్పటికీ అణుపరికరాల సరఫరా దారు నష్టపరిహారం చెల్లించవలసి వస్తే ఆ మొత్తం ఆపరేటర్ (అణు కర్మాగారం నడిపే భారత ప్రభుత్వ కంపెనీ) చెల్లించినదానికి మించకూడదన్న మరొక అడ్డంకి ఉంది. అంటే ప్రమాదం జరగడం, కోర్టుల విచారణ ముగియడం, నష్టపరిహారం మొత్తం నిర్ణయం కావడం అంతా సంవత్సరం లోపే జరిగిపోయి అప్పటికి భారత ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించి ఉండాలన్నమాట.

ఇవన్నీ అడ్డంకులు దాటినప్పటికీ నష్టపరిహార మొత్తాన్ని ప్రమాద ఘటన లో జరిగిన నష్టం తప్ప దాని పర్యవసానంగా ప్రజలకు, పర్యావరణానికి జరిగే నష్టాలను సరఫరాదారు కంపెనీలు చెల్లించనవసరం లేదు. ఇది అన్ని రకాల సహజ జాతీయ, అంతర్జాతీయ చట్టాలకు పూర్తి విరుద్ధం. అన్నీ కుదిరినా నష్టపరిహారం రు.1500 కోట్లకు మించరాదని చట్టంలో నిబంధన విధించారు. ఈ మాత్రం ఒప్పందానికే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచామని అప్పట్లో బి.జె.పి గొప్పలు చెప్పుకుంది. అంటే పాలక ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి దుర్మార్గమైన నష్టపరిహార ఒప్పందాన్ని భారత ప్రజల నెత్తిపై రుద్దాయన్నమాట! ఇన్ని అడ్డంఉలతో ఉన్నప్పటికీ, పూర్తిగా నీరుగార్చిన చట్టాన్ని భారత ప్రభుత్వం ఆమోదించినప్పటికీ దాన్ని సైతం అమెరికా అంగీకరించడం లేదు. భారత కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గాన్ని ఒక విధంగా బ్లాక్ మెయిల్ చేసి మన్మోహన్ ఒప్పించిన అణు ఒప్పందం పర్యవసానం ఇది. అణు ఒప్పందాన్ని ఆమోదించనట్లయితే తాను ప్రధానిగా రాజీనామా చేస్తానని అప్పట్లో మన్మోహన్ సింగ్ బెదిరించాడు. ఇంతటి బ్లాక్ మెయిలింగ్ కి మన్మోహన్ దిగింది ఎవరి ప్రయోజనాల కోసమయ్యా అంటే కేవలం అమెరికా కంపెనీల ప్రయోజనాల కోసమే. అయినప్పటికీ ఇంతవరకూ అమెరికా నుండి ఒక్క అణు రియాక్టర్ కొనుగోలు ఒప్పందం కూడా మన్మోహన్ కుదుర్చుకోలేకపోవడం ఆయన కి తల కొట్టేసినట్లుగా పరిణమించింది.

అమెరికాతో పరిస్ధితి ఈ విధంగా ఉండగా రష్యా సహకారంతో నిర్మించిన కుదంకుళం అణు కర్మాగారం నిర్మాణం ప్రారంభమై ఐదు సంవత్సరాలకు పైనే అయింది. అంటే ఇండియాకు అణు రియాక్టర్లు అమ్మడానికి అమెరికా, యూరప్ దేశాలు మీన మేషాలు లెక్కిస్తున్న కాలంలోనే రష్యా తక్కువ షరతులతో భారత దేశానికి అణు రియాక్టర్ల ను సరఫరా చేసిందన్నమాట! భారత దేశంతో పౌర అణు ఒప్పందం కుదుర్చుకుని తద్వారా అణు నిషేధం నుండి ఇండియాను బైటపడవేసింది తాము కాగా తమ ప్రమేయం ఉన్న అణు కర్మాగారం ఒక్కటి కూడా నిర్మాణం ప్రారంభం కాకుండానే రష్యా నిర్మించిన అణు కర్మాగారం ప్రారంభం కావడానికి సిద్ధం కావడం పశ్చిమ దేశాలకు నచ్చలేదనీ అందుకే కక్ష సాధింపుతో నిధులు సమకూర్చి ఎన్జీవో ల ద్వారా కుదంకుళం ప్రాజెక్టు ముందుకు సాగకుండా పశ్చిమ దేశాలు కుట్ర చేస్తున్నాయనీ భారత పత్రికలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలను భారత ప్రభుత్వమే ప్రచారంలోకి తీసుకువస్తోందనడం సరైనది. వాస్తవాలు ఏమిటన్నది ఏనాటికైనా బైటికి రాక మానదు.

కుదంకుళం అణు కర్మాగారానికి వ్యతిరేకంగా తమిళనాడు ప్రజలు చేస్తున్న ఉద్యమం వెనుక అమెరికా, స్కాండినేవియా దేశాల పాత్ర ఉందన్న ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ అణు కర్మాగారాల నిర్మాణంలో అణు పరికారాలు సరఫరా చేస్తున్న విదేశీ కంపెనీల ప్రయోజనాలు నెరవేర్చడమే తప్ప భారత ప్రజల ప్రయోజనాలకు దీర్ఘకాలంలో జరగనున దారుణ నష్టాలను భారత ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవడం లేదన్నది యధార్ధం. కుదంకుళం నిరసనల ఉద్యమాల వెనుక పశ్చిమ దేశాల కుట్ర ఉన్నందున పట్టించుకోమని భారత ప్రభుత్వం చెప్పదలుచుకున్నట్లయితే ఏ విదేశీ కుట్రా లేకుండానే భారత ప్రజలు చేస్తున్న అనేక చావు బ్రతుకుల పోరాటాలను ఎందుకు పట్టించుకోవడం లేదో మన్మోహన్ ప్రభుత్వం చెప్పవలసి ఉంది. వేదాంత అల్యూమినియం రిఫైనరీకి వ్యతిరేకంగా అడవి బిడ్డలు చేసిన పోరాటాలను దారుణంగా అణచివేశాయి భారత కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు. దక్షిణ కొరియా కంపెనీ పోస్కో ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఒడిషాలో గిరిజనుల ఊళ్ళు ఖాళీ చేయడానికి భారత, ఒడిషా ప్రభుత్వాలు సిద్ధపడ్డాయి. గిరిజనులకు ఉన్న అటవి హక్కుల చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ విశాఖ మన్యంలోనూ, జార్ఖండ్, చత్తీస్ ఘడ్ లలోనూ అటవీ భూములను అల్యూమినియం కంపెనీలకు ఇచ్చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయి. నెల రోజుల క్రితమే ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నాయకత్వంలో పదుల కొద్దీ ఎమ్మెల్యేలు అరకు డిక్లరేషన్ పేరుతో జిందాల్ బాక్సైట్ కంపెనీకి భూములు ఇచ్చేయాలని ప్రచారం చేసి వచ్చారు. వీరంతా పని చేస్తున్నది భారత దేశ మూల వాసులైన ఆదీవాసీ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగానే. వారే స్వయంగా పార్లమెంటులోనూ, అసెంబ్లీలలోనూ ఆమోదించిన అటవీ హక్కుల చట్టాన్ని వారే స్వయంగా ఉల్లంఘీస్తూ వారీ దుర్మార్గాలకు పాల్పడుతున్నారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s