అమెరికా సైనికులున్న సైనిక స్ధావరంలో ఖురాన్ ప్రతులను అనేకం దగ్ధం చేసిన తర్వాత అక్కడ నిరసన ప్రదర్శనలు రోజు రోజుకీ తీవ్రమవుతున్నాయి. ఇద్దరు అమెరికా సైనికులతో సహా మొత్తం పదకొండు మంది ఆఫ్ఘన్ల నిరసనలలో మరణించారు. అమెరికా సైనికులు నిరసనకారుల చేతుల్లో చనిపోగా ఆఫ్ఘన్ నిరసన కారులు ఆఫ్ఘన్ పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా తమ సైనికుల చర్యకు క్షమాపణ చెప్పినప్పటికీ నిరసనలు చల్లారకపోవడంతో అమెరికా, ఆఫ్ఘన్ పాలకులు తలలు పట్టుకున్నారు.
ఒబామా చెబుతున్న క్షమాపణలను ఆఫ్ఘన్ ప్రజలు స్వీకరించడం లేదు. ఆఫ్ఘనిస్ధాన్ లోని నాటో అధిపతితో పాటు అమెరికా అధికారులు అనేక సార్లు క్షమాపణలు చెప్పీనప్పటికీ నిరసనలు తగ్గలేదు. చివరికి ఒబామా ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కి క్షమాపణలు కోరుతూ లేఖ రాసినప్పటికీ దాన్ని నిరసనకారులు తేలిగ్గా తీసేస్తున్నారు. అమెరికా క్షమాపణలు ఒట్టి బూటకమేనని వారు అభివర్ణిస్తున్నారు. నిరసన ప్రదర్శనలలో ‘అమెరికాకి చావు తప్పదు’ అనీ, ‘ఇస్లాం వర్ధిల్లాలి’ అని వారు నినాదాలిస్తున్నారు.
ఖురాన్ ముస్లింలకు పవిత్రమైన పుస్తకం. క్రైస్తవులకు బైబిల్ లాగానే ముస్లింలకు ఖురాన్ అలాంటిదేనని అందరికీ తెలిసిన సంగతి. అయితే ఖురాన్ పవిత్రతపైన ముస్లిం మతస్ధులు పాటించే క్రమ బద్ధత మరే మతంలోనూ తమ తమ మత గ్రంధాలపై పాటిస్తున్నట్లు కనపడదు. ప్రతి ఖురాన్ ప్రతినీ ముస్లింలు పరమ పవిత్రంగా భావిస్తారు. ఖురాన్ లోనివన్నీ దేవుడు పలికిన పలుకులుగా వారు పాటించడంలో అత్యంత భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు.
ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ అమెరికా సైనిక స్ధావరం బాగ్రామ్ ఎయిర్ బేస్ లో ఉన్న జైలు లైబ్రరీలోని ఖురాన్ ప్రతులను అమెరికా సైనికులు తగలబెట్టి మిగిలిన చిత్తుని బైట పడవేశారు. సైనిక స్ధావరం సమీపంలోని చెత్త కుప్పలో సగం కాలిన ఖురాన్ ప్రతులు, కాగితాలు ప్రత్యక్షం కావడంతో ఆఫ్ఘన్ ప్రజలు అగ్రహోదగ్రులయ్యారు. ఇప్పటికి నాలుగు రోజుల నుండి అక్కడి ప్రజలు నిరసన ప్రదర్శనలలో పాల్గొంటున్నారు. దేశంలోని అనేక చోట్ల ఈ ప్రదర్శనలు హింసాత్మకంగా మారుతున్నాయి.
ఖురాన్ ప్రతుల దగ్ధం ఉద్దేశ పూర్వకంగా జరిగింది కాదని అమెరికా సైన్యాధిపతులు చెపుతున్నారు. అమెరికన్ అధికారులను ఉటంకిస్తూ పత్రికలు అసలేం జరిగిందన్నది కూడా వెల్లడించాయి. సైనిక స్ధావరంలోని జైలులో ఒక లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో ఇతర పుస్తకాలలాగానే ఖురాన్ పుస్తకాలు కూడా ఉన్నాయి. జైలులోని తాలిబాన్ ఖైదీలు ఖురాన్ గ్రంధాలను తమ మధ్య సమాచారం ఇచ్చి పుచ్చుకోవడానికి సాధానలుగా వినియోగిస్తున్నారన్న అనుమానం అమెరికా సైనికాధికారులకు వచ్చింది. అనుమానం వచ్చిందే తడవుగా అక్కడి ఖురాన్ ప్రతులన్నింటినీ లైబ్రరీనుండి తొలగించారు. అక్కడి ఆగిపోకుండా చిత్తు కాగితాలతో కలిపి ఖురాన్ ప్రతులను దగ్ధం చేసారు. పూర్తిగా కాలిపోయాయని భావించి మిగిలిదానిని పారేశారు. అలా పారేసిన వాటిలో సగం కాలిన ఖురాన్ ప్రతులు ఉన్నా వారు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా పడవేశారు. ఫలితమే నిరసనలు.
ఖురాన్ పుస్తకాల ద్వారా మార్పిడి జరుగుతున్న సమాచారం పట్ల కూడా అమెరికా సైన్యం అప్రమత్తతతో ఉంటున్న సంగతి ఈ ఘటన ద్వారా వెల్లడవుతోంది. తాలిబాన్ ఖైదీల మధ్య తమకు తెలియకుండా సంబంధాలు నడుస్తున్నాయన్న ఊహలకే వారు వణికిపోయారు. ఆ వణుకుడులోనే మత గ్రంధాలను దగ్ధం చేస్తున్న విషయాన్ని వారు లక్ష్య పెట్టలేదు. సగం కాలిన ఖురాన్ పుస్తకాల వల్ల సమస్యలు వస్తాయన్న ఊహలు కూడా వారికి తట్టలేదు. తాలిబాన్ ఖైదీలన్నా కూడా ప్రపంచ అగ్రరాజ్య సైన్యాధిపతులు వణికిపోతున్నారంటే సామ్రాజ్యవాదం ‘మట్టికాళ్ల మహా రాక్షసి’ అన్న లెనిన్ మహాశయుడి సూక్తి అక్షర సత్యమని రుజువవుతోంది.
అమెరికా క్షమాపణలు బూటకమనీ ముస్లింల పవిత్ర గ్రంధం ఖురాన్ పట్ల వారికి గౌరవం లేనేలేదన్న సంగతి మరొకసారి రుజువయిందనీ ఇరానీ మత పెద్ద అహ్మద్ ఖటామీ ప్రకటించాడు. శుక్రవారం ప్రభుత్వ రేడియోలో మాట్లాడుతూ అన్నాడు. “అది పొరబాటు గా జరిగింది కాదు. ఉద్దేశ్యపూర్వకంగా చేసిందే. ఒక లక్ష్యం కోసం చేసిన పని అది” అని ఆయన అన్నాడని రాయిటర్స్ తెలిపింది. అమెరికా అధికారుల ద్వారా బైటికి వచ్చిన సమచారం బట్టి ఖటామీ చెప్పింది నిజమేనని అర్ధం చేసుకోవచ్చు. తాలిబాన్ ఖైదీల మధ్య రహస్య సమాచారం నడుస్తున్నదన్న అనుమానంతోనే ఖురాన్ ప్రతులను వారు దగ్ధం చేశారు.
“శాంతియుత నిరసనలు చేపట్టడం ప్రజల హక్కే అయినప్పటికీ, ప్రదర్శనలు హింసాత్మకంగా మారకుండా చూడాలని దేశ ప్రజలను కోరుతున్నాను” అని ఆఫ్ఘన్ హోం మత్రిత్వ శాఖ ప్రతినిధి సెదిక్ సెదిక్కి ప్రకటించాడు. అత్యంత హింసాత్మకంగా ఆఫ్ఘనిస్ధాన్ పై దాడి చేసి లక్షల మంది ఆఫ్ఘన్ ప్రజానీకాన్ని తమ దాడిలో చంపివేయడమే కాక తాలిబాన్ అనుమానితుల పేరుతోనో, మద్దతుదారులన్న అనుమానంతోనో నిత్యం అనేక మందిని చంపుతున్న ఆక్రమణ గుంపును దేశం నడిబొడ్డున ఉంచుకున్న ఆఫ్ఘన్ ప్రభుత్వం తమ దేశ ప్రజలను హింసనుండిఉ దూరంగా ఉండాలని బోధీంచడం సిగ్గుమాలినతనం తప్ప మరొకటి కాదు. ఆక్రమణదారుడి కనుసన్నల్లో ఏర్పడిన ప్రభుత్వంలో కూర్చుని దేశ ప్రజలకు హింస వద్దంటూ హిత బోధ చేసే అర్హత ఈ లొంగుబాటుదారులకు ఎక్కడినుండి వస్తుంది?
ఆఫ్ఘన్ భద్రతా బలగాలకు గురువారం తాలిబాన్ ఓ పిలుపునిచ్చింది. “తమ తుపాకులను విదేశీ దురాక్రమణ దారులపై ఎక్కుపెట్టాలని” ఆ పిలుపు కోరింది. ‘నాటో సైనికులను ఒక్కొక్కరిని పట్టి, కొట్టి చంపేయాలని’ ఆ పిలుపు పదే పదే విజ్ఞప్తి చేసిందని రాయిటర్స్ తెలిపింది.
ఖురాన్ దగ్ధం విషయంలో చెలరేగుతున్న ఆఫ్ఘన్ ప్రజల నిరసనలపై ఒక బ్రిటిష్ ముస్లిం పూజారి చేసిన ప్రకటన ఆలోచించేదిగా ఉంది. ఒక్క ఖురాన్ దగ్ధం అయితే వంద ఖురాన్ లు ముద్రించుకోవచ్చనీ, అసలు సమస్య ఖురాన్ దగ్ధం కాదనీ ఆయన అన్నాడని సి.ఎన్.ఎన్ తెలిపింది. ఒక స్వతంత్ర దేశాన్ని విదేశీ దురాక్రమణ దారులు ఆక్రమించుకోవడమే అసలు సమస్య అనీ, ఆక్రమణదారుల చేతుల్లో ఒక్క ఆఫ్ఘన్ దేశీయుడు చనిపోయినా దాన్ని తీవ్ర సమస్యగా గుర్తించవలసి ఉందనీ ఆయన అన్నాడు. అది నిజం. పదేళ్ళుగా దేశాన్ని ఆక్రమించుకుని ఉన్న విదేశీ సేనలను ఆఫ్ఘన్ గడ్డపైనుండి తరిమి కొట్టవలసిన కర్తవ్యాన్నే ఆఫ్ఘన్ ప్రజలు ప్రధానంగా చేపట్టవలసి ఉంది తప్ప ఖురాన్ దగ్ధం అన్నది పెద్ద సమస్య కానేరదు.