బహిరంగ స్ధలం అయిన ఓ హోటల్ లో పెద్దగా మాట్లాడవద్దన్న పాపానికి ఒక వ్యాపారిపై పిడిగుద్దులు కురిపించి అతని ముక్కు ఎముకను విరగ్గొట్టిన బాలీవుడ్ హీరో ఉదంతం ఇది. సినిమాల్లో విలన్లనూ, వారి అనుచరులనూ యధేచ్ఛగా కొట్టి, కాల్చి చంపే హీరోలు వాస్తవ జీవితంలో కూడా అదే పద్ధతిని కొనసాగించవచ్చని భావిస్తున్నారా?
ముంబైలో గల తాజ్ హోటల్ లో జరిగిందీ ఘటన. బుధవారం రాత్రి నలభై నాలుగేళ్ల ఇక్బాల్ నవీన్ శర్మ అనే ఎన్నారై వ్యాపారి సైఫ్ చేతిలో దెబ్బలు తిని ముక్కు విరగ్గొట్టుకున్నాడు. ఆ విషయం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైఫ్ తో పాటు మరో ఇద్దరిపైన పోలీసులు కేసు నమోదు చేసారు. శర్మతో పాటు ఆయన మామయ్యపైన కూడా సైఫ్ దాడి చేసి కొట్టాడని పోలీసులు తెలిపారు.
బుధవారం రాత్రి నవీన్ శర్మ తన కుటుంబంతో కలిసి ముంబైలోని తాజ్ మహల్ హోటల్ కి డిన్నర్ కోసం వచ్చాడు. అదే హోటల్ కి బాలీవుడ్ హీరో, ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ షర్మిలా టాగూర్ కొడుకు సైఫ్ ఆలీ ఖాన్ మరో పన్నెండు మంది తో కలిసి వచ్చాడట. ఆయనతో వచ్చినవారిలో ఆయన గర్ల్ ఫ్రెండ్ కరీనా కపూర్, మరొక హీరోయిన్ మలైకా ఆరోరా, మలైకా చెల్లెలు అమ్రితా అరోరా లు కూడా ఉన్నారు. వారు కూర్చున్న పక్క టేబుల్ వద్దనే నవీన్ కుటుంబం భోజనం చేస్తోంది.
“వారు చాలా పెద్ద పెద్దగా మాట్లాడుకుంటున్నారు. దానితో మేము వారిని మెల్లగా మాట్లాడుకోమని చెప్పవలసిందిగా హోటల్ మేనేజ్ మెంట్ ని కోరాము” అని శర్మ చెప్పాడు. చిన్నగా మాట్లాడుకోమని చెప్పాలని మూడు సార్లు చెప్పినప్పటికీ, మేనేజ్ మెంటు పట్టించుకోలేదు. సైఫ్ బృందమూ వినలేదు. దానితో నవీన్ కుటుంబం క్రింది అంతస్ధుకి వెళ్లి తమ విందు కొనసాగించాలని నిర్ణయించుకుని లేచారు. వారిమానాన వారు వెళ్ళడం కూడా సైఫ్ కి రుచించినట్లు లేదు. వెళ్లిపోతున్నవారి దగ్గరకు సైఫ్ దురుసుగా వచ్చి తిట్టడం మొదలు పెట్టాడు. తమ ఆనందాన్ని పాడు చేయడానికే వారు వచ్చామని ఆరోపిస్తూ ప్రశాంతంగా తినాలనుకుంటె ఏదన్నా లైబ్రరీకి వెళ్లి తినాలని సలహా ఇవ్వడమే కాక సంఘంలో తనకున్న పలుకుబడి గురించి కూడా గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించాడు.
ఈ సంఘటన అర్ధరాత్రి పన్నెండున్నర గంటలప్పుడు జరిగిందని పోలీసులు తెలిపారు. అలా మొదలైన ఘటన సైఫ్ హింసాత్మక దాడివరకూ దారి తీసింది. నవిన్ శర్మ కూడా తనను కొట్టాడని సైఫ్ ఆలీ చెబుతున్నాడు. తననూ, అరవై తొమ్మిదేళ్ల తన మామగారిని కూడా సైఫ్, అతని మిత్రులు దారుణంగా కొట్టారని శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెక్షన్ 325 (తీవ్రంగా గాయపరిచడం) కింద సైఫ్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సంఘటన జరిగాక ఆసుపత్రికి వెళ్లి కట్టు కట్టించుకున్న నవీన్ తెల్లవారు ఝాము మూడున్నర గంటల ప్రాంతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సైఫ్ కోసం వెతకడం ప్రారంభించారు. సైఫ్ తన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో అతని తో మాట్లాడ్డం సాధ్యం కాలేదని వారు తెలిపారు. నారీమన్ పాయింట్ లో ఉన్న లాయర్ ఛాంబర్ లో సైఫ్ ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. కోలాబా పోలీసు స్టేషన్ కి తెచ్చి సైఫ్ స్టేట్ మెంట్ నమోదు చేసుకున్నామని వారు తెలిపారు. చిన్న ఘటనగా ప్రారంభమైన ఘటన పెద్ద వివాదంగా మారి కొట్టుకునే వరకూ వెళ్ళిందని పోలీసులు తెలిపారు.
సైఫ్ ఆలీ ప్రకారం హోటల్ లాంటి పబ్లిక్ స్ధలాల్లో జనం ప్రశాంతంగా వచ్చినపని పూర్తి చేసుకోవడానికి వీల్లేదన్నమాట. పెద్దగా కాకుండా చిన్నగా మాట్లాడుకోమని మర్యాదగా చెప్పినపుడు మర్యాదస్తులెవరైనా సారీ చెప్పి చిన్నగా మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు. అయితే అలా చెప్పించుకోవడమే చిన్నతనంగా సైఫ్ భావించినట్లు కనిపిస్తోంది. ప్రశాంతంగా తినాలనుకుంటే లైబ్రరీకి వెళ్ళి తినమని చెప్పడం దురహంకారంతో కూడిన వ్యాఖ్య. తానొక బాలీవుడ్ హీరో. జనం అంతా ఆయన ఆటోగ్రాఫ్ కోసం ఎగబడుతుంటారు. అలాంటి తాను, ఇతర హీరోయిన్లతో కలిసి పబ్లిక్ స్ధలంలోకి రావడమే ఆ పబ్లిక్ స్ధలానికి గౌరవంగా సైఫ్ భావించినట్లు కనిపిస్తోంది. తన పలుకుబడి గురించి చెప్పుకోవడంతోనే సైఫ్ ఉద్దేశం స్పష్టం అవుతోంది. వెండి తెరపై దుష్ట శిక్షణ సాగించే హీరోకి తనను చిన్నగా మాట్లాడమని చెప్పిన తోటి హోటల్ సందర్శకుడు విలన్ గా కనిపించాడు. తన ఆనందాన్ని పాడు చేయడానికే వచ్చాడని నవీన్ ని దూషించడాన్ని బట్టి ఆయన ధోరణి అలాగే కనిపిస్తోంది. పబ్లిక్ స్ధలాల్లో విక వికలు పక పకలతో పక్క టేబుల్ వద్ద భోజనం చేస్తున్నవారికి ఇబ్బంది కలిగించడం సంస్కార హీనం అని బాలీవుడ్ హీరో నేర్చుకోకపోవడం ఓ వింత.
ఇంతకీ, తనను కొట్టిన వ్యక్తి ఓ బాలీవుడ్ హీరో అని నవీన్ శర్మకీ, ఆయన కుటుంబానికీ కూడా తెలియదట. దక్షిణాఫ్రికాలోని ఐ.ఎస్.ఎస్.ఆర్.ఎ కంపెనీకి ఎక్జిక్యూటివ్ ఛైర్మన్ గా నవీన్ పని చేస్తుండగా, ఆయన మామ గారు డాక్టర్ అట. తర్వాత రోజు మీడియాలో వార్తలు చూసేవరకూ సైఫ్ సినిమా హీరో అనీ, ఆయన పక్కన ఉన్నది హీరోయిన్లనీ తనకు తెలియదని నవీన్ చెప్పాడు. దక్షిణాఫ్రికాలో వ్యాపారం చేసుకునేవారికి బాలీవుడ్ హీరో తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదు. పక్క టేబుల్ వద్ద విందు చేస్తున్న బాలీవుడ్ హీరో, హీరోయిన్లను చూసి ఎంజాయ్ చెయ్యకపోగా గోల చెయ్యొద్దని హెచ్చరించడం, యాజమాన్యానికి ఫిర్యాదు చెయ్యడం మన హీరో, హీరొయిన్లకు నచ్చలేదని అర్ధం అవుతోంది.
వివాహ విషయాల్లో గానీ, కుటుంబ జీవనంలో గానీ బాలీవుడ్ హీరోలు అనేకమంది వెర్రి మొర్రి వేషాలు వేస్తూ పాశ్చాత్య సంస్కృతికి నకళ్లుగా తయారైనారు. భారతీయ సంస్కృతిని వంటబట్టించుకుని ఆ సంస్కృతికి ప్రతినిధులుగా వ్యవహరించడానికి బదులు పాశ్చాత్య విష సంస్కృతికి ప్రచారకులుగా తయారవుతున్నారు. తమ తమ ప్రవేటు జీవితాల్లో వికృత ధోరణుల్లో జీవిస్తున్న వీరు రోజు వారి జీవితాల్లో, సమాజంలో ఇతరులతో సంబంధం ఉండే ఘటనల్లో కూడా తమ ధోరణులను, పద్ధతులను అమలు చేయడానికి పూనుకుంటున్నారని ఈ ఘటన తెలియ జేస్తోంది. ఈ వికృత ధోరణి ఇంకా దక్షిణాది సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టకపోవడం ఒక విధంగా అదృష్టంగా భావించాలేమో.
లండన్లో ఒక హిందీ సినిమా హీరోయిన్ నగల షాప్లో దొంగతనం చెయ్యడానికి ప్రయత్నించి దొరికిపోయింది. తాను సినిమా నటిని కనుక తనని ఎవరూ ఏమీ చెయ్యలేరు అనుకుంది. కానీ అది ఇండియా కాదు కనుక ఆమెని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక అసమానతలు అన్ని దేశాలలో ఉన్నాయి కానీ డబ్బున్నవాళ్ళు తాము ఆకాశం నుంచి ఊడిపడ్డ దేవపుత్రులమని అనుకోవడం ఇండియాలో మాత్రమే ఉంది.