(“మార్క్సిజం పుట్టుక పరిణామం, మానవ స్వభావం, సోషలిజం అనివార్యత” పేరుతో ఈ బ్లాగ్ లో రాసిన వ్యాసం కింద కొద్ది రోజుల క్రితం ‘మౌళి గారు’ రాసిన వ్యాఖ్యకి సమాధానాన్ని టపా గా ప్రచురిస్తున్నాను -విశేఖర్)
బాల గోపాల్ గారు మార్క్సిజంలో ఖాళీలున్నాయని రాసారు. మానవ ప్రవృత్తి అనేది ప్రత్యేకంగా ఒకటుంటుందనీ, దానిని మార్క్సిజం పట్టుకోలేక పోయిందని ఆయన అభిప్రాయ పడ్డాడు. భౌతిక సమాజ నియమాలకు అతీతంగా మానవ ప్రవృత్తి ఉంటుందని ఆయన అభిప్రాయం. ఇంకా అలాంటివి మరి కొన్ని ఆయన రాసాడు.
రంగనాయకమ్మ గారు ఆయన అభిప్రాయాలను సవివరంగా చర్చించారు. బాలగోపాల్ గారు, తాను కనిపెట్టానంటున్న ఖాళీలు, నిజానికి కొత్తగా కనిపెట్టినవి కావనీ, అనేక దేశాలకు చెందిన అనేక పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలు, తత్వవేత్తలు, సామాజిక పండితులు ఆ అంశాలను వివిధ రూపాలలో ప్రస్తావించినవేననీ, వాటినే బాల గోపాల్ మరొక రూపంలో ప్రస్తావిస్తున్నారనీ రంగనాయకమ్మ గారు తన విమర్శలో రాసారు. సదరు విమర్శలకు సమాధానాలు అప్పటికే రికార్డయి ఉన్నాయనీ చెబుతూ బాల గోపాల్ విమర్శలు ఎందుకు సరైనవి కావో వివరిస్తూ ఆవిడ తన విమర్శని పాఠకులకు అందించారు.
దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత బాలగోపాల్ గారిపైన ఉంటుంది. మీరన్నట్లు ‘రంగనాయకమ్మ గారి కంటే నేనే గొప్ప‘ అని నిరూపించుకునే బాధ్యత బాల గోపాల్ గారి పైన ఉంది అని ఇక్కడ చెప్పడం లేదు. బాల గోపాల్ గారు ‘మార్క్సిజం లో ఖాళీల‘ పేరుతో మార్క్సిజం పై విమర్శ రాయడం ఒక ముఖ్యమైన ఘటన. మార్క్సిజాన్ని విశ్వసిస్తున్నవారితో పాటు, మార్క్సిజం గురించి తెలియని వారికి కూడా ఆ ఘటన ఒక సమాచారాన్ని అందిస్తుంది. బాల గోపాల్ గారు ఒక విమర్శ రాసి పడేశాక అది అలాగే స్తబ్దంగా ఉండదు. అది అనేక మందిని ప్రభావితం చేస్తుంది. అందువల్ల తాను రాసే విమర్శలకు బాలగోపాల్ గారు బాధ్యత తీసుకోవలసి ఉంటుంది.
తాను కనిపెట్టిన ఒక విషయాన్ని ‘అది మీరు కని పెట్టింది కాదు. ఇప్పటికే ఆ వాదనలు ఉన్నాయి. వాటికి సమాధానాలు కూడా ఉన్నాయి. ఆ సమాధానాలు ఇవే‘ అని చెబుతూ మరొకరు చెప్పాక బాల గోపాల్ గారిపైన మరొక కొత్త బాధ్యత వచ్చి చేరుతుంది. ఏమిటా బాధ్యత? “కాదు, కాదు. నేను ప్రస్తావించినవి నేను కనిపెట్టినవే. మీరు చెప్పినట్లుగా అవి పాతవి కాదు. కొత్తవే. ఇదిగో ఈ కారణాల వల్ల అవి కొత్తవి. అవి పాతవేనంటూ మీరు చూపిన కారణాలు, ఉదాహరణలు ఫలానా కారణాల వల్ల సరైనవి కావు” అని చెప్పవలసిన బాధ్యత అది. ఆ బాధ్యతను బాల గోపాల్ గారు స్వీకరించలేదు అన్నది నా విమర్శ.
‘నేను సమాధానం ఇస్తే ఆమె మరొకటి రాస్తారు‘ అని బాల గోపాల్ గారు భావించడం సరైంది కాదు అన్నది నా విమర్శ. తన తప్పుల్ని మరొకరు ఎత్తి చూపినపుడు అవి తన తప్పులు కావు అని చెప్పవలసిన బాధ్యత ఆయన పైన ఉన్నా దాన్ని స్వీకరించలేదన్నది నా విమర్శ. ఆయన తన గొప్పను నిరూపించుకోవాల్సిందేనని నేను అనడం లేదు. అసలిక్కడ ఆయన గొప్పతనం గురించే నాకు అనవసరం. ఒక సైద్ధాంతిక చర్చకు ఆయన సిద్ధపడ్డాక చిన్న సాకు చూపి అర్ధంతరంగా ఆ చర్చ నుండి ఆయన ఉపసంహరించుకోవచ్చునా? కూడదు అని నా అభిప్రాయం.
మార్క్సిజం లో ఖాళీలున్నాయి అని బాల గోపాల్ గారు అభిప్రాయపడ్డాక ఆయనిక మార్క్సిజానికి కట్టుబడి లేరు. ఆయన దృష్టిలో మార్క్సిజం రెలెవెన్స్ కోల్పోయింది. కనుక రంగనాయకమ్మగారు, బాల గోపాల్ గార్ల విషయంలో “వారిద్దరి దారులు వేరు అయినా, ఆశయాలు ఒకటే అయినపుడు” అని మీరు అన్నది కరెక్టు కాదు. బాల గోపాల్ ముందు ఇక ఏ దారీ లేదు. ముఖ్యంగా మార్క్సిజం అన్న దారి అసలు లెదు. ఎందుకంటే ఆయన దృష్టిలో అందులో ఖాళీలున్నాయి కనుక. ఖాళీలున్న మార్గంలో పయనించాలని ఆయనెందుకు భావిస్తారు?
బాల గోపాల్ గారు చర్చను కొనసాగించడం అన్నది ఆయన గొప్పతనాన్ని రుజువు చేసుకోవడానికి కాక వారి చర్చను అనుసరిస్తున్న పాఠకులు, కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తల అవగాహన రీత్యా అవసరం అన్నది గుర్తించాలి. తన కంటే ఎక్కువ సైద్ధాంతిక అవగాహన బాల గోపాల్ గారికి ఉంటుందని పాఠకులు, కార్యకర్తలు భావిస్తారు. కనుక ఒక సైద్ధాంతిక చర్చను మధ్యలో ముగిస్తే అది వారిని గందరగోళంలో పడేస్తుంది. ఒక్క గందరగోళం మాత్రమే జరగలేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే కాక భారత దేశంలోనే గొప్ప ఉద్యమంగా కొనసాగిన ఎ.పి.సి.ఎల్.సి నాయకత్వంలోని ‘పౌరహక్కుల ఉద్యమం‘ రెండుగా చీలిపోవడానికి బాల గోపాల్ సైద్ధాంతిక చర్చ దారి తీసింది.
అది చిన్న పరిణామం కాదు. భారత దేశంలోని పౌర హక్కుల ఉద్యమానికి ఎ.పి.సి.ఎల్.సి ఒక దిక్సూచిగా ఉన్న పరిస్ధితి ఎ.పి లో నెలకొని ఉండగా, అటువంటి గొప్ప ఉద్యమాన్ని ఆయన లేవనెత్తిన సైద్ధాంతిక చర్చ ఒక్కసారిగా పక్కకు మళ్ళించింది. ఆయన చర్చ తర్వాత పౌర హక్కుల ఉద్యమం బలహీనపడింది. ఆ తర్వాత కూడా పౌర హక్కుల ఉద్యమం నడిచినప్పటికీ, ఆయన స్ధాపించిన మానవ హక్కుల ఉద్యమం, పౌర హక్కుల ఉద్యమంతో భిన్నమైనది అన్న వాతావరణం భారత దేశంలో చొప్పించబడింది. పౌర హక్కులను ప్రభుత్వాలు పాశవికంగా అణచివేస్తున్న సంగతి పక్కకుపోయి, ‘మానవ హక్కులు‘ భంగం కావడంలో ‘మానవ ప్రవృత్తి‘ పాత్ర వహిస్తోందన్న కొత్త వాదన ముందుకు వచ్చింది.
పౌర హక్కులు ఎందుకు భంగం అవుతున్నాయి? అన్న ప్రశ్న ముందు మనం వేసుకోవాలి. దానికి సమాధానం చెప్పుకోవాలి.ఐతే ఆ సమాధానం కొద్ది మాటల్లో చెప్పలేము.
సమాజం రెండు వర్గాలుగా విభజించబడి ఉంది. అతి కొద్ది సంఖ్యలో ఉన్న ధనికులు సమాజంలో ఉన్న ఉత్పత్తి సాధనాలన్నింటినీ (భూములు, పరిశ్రమలు, యంత్రాలు, కంప్యూటర్లు మొ.వి) తమ వశంలో పెట్టుకుని, ఆ ఉత్పత్తి సాధనాలపైన జరిగే శ్రమ ద్వారా జనిస్తున్న సమస్త సంపదలనీ తమ వసం చేసుకుంటున్నారు. అధిక సంఖ్యాక వర్గాలు ఆ ఉత్పత్తి సాధనాలపైన శ్రమ చేస్తున్నందువల్లనే ఉత్పత్తి జరుగుతుండగా, శ్రమ చేస్తున్నవారు అనేక కష్టాల్లో, రోగాల్లో, రోజు గడవని పరిస్ధితుల్లో రోజులు వెళ్లదీస్తుండగా,ఆ ఉత్పత్తులను స్వాధీనం చేసుకుంటున్న కొద్ది మంది ధనికులు విలాసాల్లో తేలియయాడుతున్నారు. ఇది శ్రమ దోపిడి. ఈ దోపిడి సజావుగా కొనసాగించుకోవడానికి వారు అనేక ఏర్పాట్లు చేస్తుకున్నారు. ఆ ఏర్పాట్లలో ముఖ్యమైనది రాజ్యాంగ యంత్రం. పార్లమెంటు, కోర్టులు, బ్యూరోక్రసీ, పోలీసులు, సైన్యం ఇవన్నీ కలిసి రాజ్యాంగ యంత్రంగా చెప్పుకుంటున్నాం. ఈ యంత్రాన్ని సాధనంగా చేసుకుని దోపిడి వర్గం తమ దోపిడిని యధేచ్ఛగా సాగిస్తోంది.
శ్రమ చేసేవారు తమపై సాగే దోపిడిని ఎల్లకాలం చూస్తూ ఊరుకోరు. తమ శ్రమ ఫలితాన్ని తామే అనుభవించడానికి వస్తూన్న అడ్డంకుల్ని తొలగించుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే తిరుగుబాటు. తిరుగుబాటు ఎల్లప్పుడూ ఒకే రూపంలో ఉండదు. సంఘటిత రూపం తీసుకున్నపుడు తిరుగుబాటు గా మనకు కనిపిస్తుంది గానీ, అంతకు ముందు కూడా అది అనేక రూపాల్లో వ్యక్తం అవుతుంటుంది.
మొన్నీ మధ్య యానాంలో ఒక సిరమిక్ ఫ్యాక్టరీలో కార్మికులు సంఘం పెట్టుకుని సమ్మె చేస్తుంటే ఆ సంఘం నాయకుడిని పోలీసులు కొట్టి చంపారు. అప్పటికి నెల రోజుల నుండి కార్మికులు తమ వేతనాలు పెంచమని సమ్మె చేస్తున్నారు. ఇరవై, పాతికేళ్లనుండి పని చేస్తున్నా వారి సర్వీసు రెగ్యులరైజ్ చెయ్యకుండా కాంట్రాక్టు కార్మికులుగానే కొనసాగిస్తూ వచ్చింది యాజమాన్యం. ఆ విధంగా మూడు నెలల కంటే ఎక్కువ కాలం వరుసగా పని చేసినవారిని రెగ్యులరైజ్ చేయ్యాలని కార్మిక చట్టాలు చెబుతున్నాయి. వందమందికి పైగా కార్మికులు సంఘం పెట్టుకోవచ్చనీ, అలా పెట్టుకున్న సంఘాలను యాజమాన్యంగుర్తించి చర్చలు జరపాలనీ చట్టాలున్నాయి. ఈ చట్టాలను అమలు చేయాలని నెల రోజులుగా సమ్మె చేసినా కార్మికులకు సహాయంగా పోలీసులు రాలేదు. కాని పాతికేళ్లనుండి చట్ట విరుద్ధంగా తక్కువ జీతాలిచ్చి లాభాలు సంపాదిండడమే కాక కనీసం కార్మికులకి ఇవ్వవలసిన జీతాలు కూడా ఇవ్వని యాజమాన్యానికి మాత్రం పోలీసులు పాతికేళ్ళుగా వత్తాసుగా వస్తూనే ఉన్నారు. ఈ సారి కార్మికుల నాయకుడి ప్రాణాలను కూడా బలి తీసుకున్నారు. (కార్మికుల ప్రతి దాడిలో కంపెనీ ఉపాధ్యక్షుడు చనిపోయాడని వార్తలు వచ్చాయి. వాస్తవానికి కార్మికుల ముసుగులో ఉన్న మాఫియా చేతిలో ఆయన చనిపోయినట్లు ఆ తర్వాత పత్రికలె చెప్పాయి. ఇది వేరే విషయం)
కొన్ని సంవత్సరాల క్రితం గుర్ గావ్ లో హోండా ఫ్యాక్టరీ లో కార్మికులు కూడా ఇలాగే సంఘం పెట్టుకున్నారు. కేవలం సంఘం పెట్టుకున్న పాపానికే వారిని పనిలోనుండి తీసేశారు. వారంతా ఎ.పి నుండి వలస వెళ్లినవారే. పనిలోనుండి తీసేస్తే కార్మికులు ఊరుకోకుండా సమ్మె చేపట్టారు. ఆ సమ్మెను పోలీసులు అత్యంత దుర్మార్గంగా అణచివేసారు. కార్మికులని అరెస్టు చేసి ఒక పబ్లిక్ పార్క్ లో ఉంచి చుట్టూ పోలీసులు చేరి లాఠీలతో కుళ్లబొడిచారు. ఈ హింసను టి.వి చానెళ్ళు ప్రత్యక్ష ప్రసారం చేశాయి కూడా. కంపెనీవాడు జపానోడు. ఇక్కడికొచ్చి ఇక్కడి కార్మికుల శ్రమతో వాహనాలు తయారు చేయడానికి ఎందుకొచ్చాడు? ఎందుకంటే భారత దేశంలో కార్మిక చట్టాలను అమలు చేయాలని ఇక్కడి ప్రభుత్వాలు పట్టుబట్టవు కనుక. అదే జపాన్ లోనో, యూరప్, అమెరికాల్లోనో అయితే ఖచ్చితంగా చట్టాలు అమలు చేయాలని చూస్తాయి. అదే ఫ్యాక్టరీ ఇక్కడ పెడితే చౌకగా దొరికే కార్మికుల శ్రమ, కార్మికుల చట్టాల అమలుకు ఆసక్తి చూపని ప్రభుత్వాలు, బలహీన మైన పర్యావరణ చట్టాలు, వీటన్నింటివల్ల వారి లాభాలు అనేక రెట్లు పెరుగుతాయి. ఈ దోపిడిని అడ్డుకోవడానికి ఉన్న కనీస చట్టాలను భారత దేశ ప్రభుత్వాలు ఎందుకు అమలు చేయవు?
యానాం, గుర్ గావ్ లాంటి ఉదాహరణలు చిన్నవీ, పెద్దవీ భారత దేశంలో కొన్ని లక్షలు ఉన్నాయి. అవి రోజూ జరుగుతున్నాయి. వాటిని రాస్తూ పోతే పత్రికలకు ఇతర వార్తలకు చోటు దొరకదు.
ఈ రెండు ఉదాహరణలు ఏమి చెబుతున్నాయి? చట్టాలు, కోర్టులు, పోలీసులు, పార్లమెంటు ఇవన్నీ ఉన్నది ప్రజల కోసం కాదని. మరి ఎవరి కోసం? ఎవరైతే ఉత్పత్తి సాధానాలను తమ ఆధీనంలో ఉంచుకుని శ్రమ దోపిడి చేసి, కోటి కోట్ల రూపాయల ప్రజల డబ్బుని స్విస్ బ్యాంకుల్లో దాచారో వారి కోసమే.
అందువల్లనే, పది లక్షలు లంచం తీసుకున్నాడని స్వయంగా మద్యం సిండికేట్ మెంబరు సాక్ష్యం చెప్పినా మంత్రి మోపిదేవిని ఈ చట్టాలు ముట్టుకోవు. లక్ష కోట్ల జగన్ అవినీతిపైన సి.బి.ఐ అనేక సాక్ష్యాలు సంపాదించినా జగన్ అరెస్టు కాడు. భవిష్యత్తులో అరెస్టు అయినా ఏదో విధంగా బైటికి రావడం ఖాయం. రాజివ్ గాంధీ అవినీతి కి పాల్పడిన బోఫోర్స్ కుంభకోణం పాతికేళ్ళు నాని, నాని కనీసం ఒక్కడైనా శిక్ష పడకుండా విచారణ ముగిసిపోయింది. పది వేల మంది భోపాల్ ప్రజలను విషవాయువు తో చంపిన యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ యజమాని యాండర్సన్ ను అప్పటి మధ్య ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ దగ్గరుండి రాష్ట్ర ప్రభుత్వ విమానం ఎక్కించి మరీ సాగనంపాడు. అప్పటి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలమేరకే తానాపని చేశానని అర్జున సింగ్ పోయినసంవత్సరం చెప్పాడు. కామన్ వెల్త్ కుంభకోణంలో సురేష్ కల్మాడి ఒక్కడే దోషా? టుజి కుంభ కోణంలో రాజా, కనిముళి మాత్రమే దోషులా? రాజా చేస్తున్న పందేరాన్ని గుడ్లప్పగించి చూస్తూ నిలబడ్డ మన్మోహన్, చిదంబరం లు దోషులు కాకుండా ఎలా పోతారు? కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి గా ఉంటూ తన ఇంటికి వందకు పైగా ఫోన్ లైన్లు వేసుకున్న దయానిధి మారన్ ఎప్పటికీ అరెస్టు కాడు. శిక్షలు తర్వాత సంగతి. ఈ సవాలక్ష కుంభకోణాలు ప్రధాని, మంత్రులు, అధికారులు, దర్యాప్తు సంస్ధల అధికారులు వీరందరికీ భాగ స్వామ్యం లేకుండానే జరిగిపోతున్నాయా?పాలక, ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులతో సహా వీరందరికీ ఈ అవినీతిలో భాగం లేకుండా ఈ నేరాలు జరగడం అసాధ్యం.
కనుక ఈ చట్టాలు సమాజానికి ఆధిపత్యం వహిస్తున్న వర్గాలను ముట్టుకోవు. వారు తప్పించుకుపోవడానికి అవసరమైన రాజ మార్గాలను చట్టాల్లోనే వారు ఏర్పరుచుకుంటారు. కాని అవే చట్టాలు శ్రమ చేసేవాడు ఎంత దోపిడికి గురవుతున్నా చూస్తూ ఊరుకుంటాయి. వారెప్పుడయినా తెగించి ప్రశ్నిండడానికి సిద్ధపడితే ఆధిపత్య వర్గాల తరపున జులుం చేయడానికి మాత్రం సదా సిద్ధంగా ఉంటాయని గుర్ గావ్, యానాం లాంటి లక్షల ఉదాహరణలు చెప్పడం లేదా?
రాజ్యాంగ యంత్రాన్ని అడ్డుపెట్టుకుని ఆధిపత్య దోపిడి వర్గాలు అనేక వందల ఏళ్లనుండి తమ దోపిడిని నిరాటంకంగా కొనసాగిస్తున్న పరిస్దితుల్లోనే, ప్రజలు సాగించిన అనేక తిరుగుబాట్ల ఫలితంగా కొన్ని హక్కులు అమలులోకి వచ్చాయి. ఆ హక్కులు అమలు చేయవలసిన బాధ్యత చట్టాలు, కోర్టులపైన ఉండగా, అవి ఉన్నోడి జేబులో ఉన్నందున శ్రామిక వర్గాలకు అక్కరకు రాకుండా పోతున్నాయి. ఈ నేపధ్యంలోనె పౌర హక్కుల ఉద్యమం ప్రముఖంగ ముందుకు వచ్చింది.
ఆదిపత్య వర్గాలు తాము సాగిస్తున్న దోపిడిని సజావుగా సాగించుకోవడానికి రాజ్యంగ యంత్రాన్ని వినియోగిస్తూ హక్కులు అడుగుతున్న ప్రజలను పాశవికంగా అణచివేస్తున్న పరిస్దితిని ఈ కొద్ది వివరణలో చెప్పడానికి నేను ప్రయత్నించాను.
ఇక్కడ ‘మానవ ప్రవృత్తి‘ వాదులు కొత్త వాదనలు ముందుకు తెస్తున్నారు. వీరి వాదన దోపిడి సాగిస్తున్న వారికి మాత్రమే ఉపయోగపడుతుంది. వీరి ప్రకారం దోపిడికి, అణచివేతలకు, సమ్మెలకు, తిరుగుబాట్లకు అన్నింటికి ఒకే సమాధానం వస్తుంది. అదే ‘మానవ ప్రవృత్తి‘. మనిషి స్వతహాగా స్వార్ధ జీవి అనీ, తన స్వార్ధం కోసం అనేక తప్పులు చేస్తారనీ ఆ తప్పుల్లో భాగమే ఈ దోపిడి, అణచివేత, సమ్మె, తిరుగుబాటు అనీ వీరు చెబుతారు.
అంటే ఆధిపత్య వర్గాలు తమ దోపిడీని సజావుగా కొనసాగించుకోవడానికి దోపిడి పై తిరగబడుతున్న శ్రామికుల పౌర హక్కులను అణచివేస్తూ తీవ్ర నిర్భంధాలకు పూనుకుంటున్నారన్న వాస్తవాన్ని ఈ ‘మానవ ప్రవృత్తి‘ వాదం తిరస్కరిస్తుంది. కళ్లెదుట కనిపిస్తున్న ఈ సాధారణ వాస్తవానికి వీరు తమ తిక్క వాదనతో మసిపూరి మారేడు కాయ చేసి అంతిమంగా ఆధిపత్య వర్గాల దోపిడి, తిరుగుబాట్లు లేకుండా కొనసాగడానికి దోహద పడుతున్నారు తప్ప దోపిడి నుండి విముక్తి కోరుకుంటున్న శ్రామికులకు ఈ వాదన ఏ మాత్రం సాయం చేయదు, పైగా హాని చేస్తుంది. ఉదాహరణకి చూడండి.
రాజా అంత చీప్ గా 2 జి లైసెన్సులని కంపెనీలకు ఎందుకు ఇచ్చాడు? కంపెనీలనుండి లంచాలు దిగమింగి ఆ పని చేశాడన్నది సమాధానం. అయితే అన్ని కోట్లు అతనేం చేసుకుంటాడు? సమాధానం: “అది అతని మానవ ప్రవృత్తి, మనిషి స్వతహాగా స్వార్ధ జీవి.”
భారత ప్రజలకి ఉపయోగపడాల్సిన ఇనుప ఖనిజాన్ని గాలి జనార్ధన్ రెడ్డి అంత దారుణంగా చట్ట విరద్ధంగా తవ్వి విదేశాలకి ఎందుకు పంపాడు? ప్రజలకు హాని చేసి సంపాదించిన అన్ని వేల కోట్లు అతనికెందుకు? సమాధానం: “అది అతని మానవ ప్రవృత్తి, మనిషి స్వతహాగా స్వార్ధ జీవి.”
వెయ్యి మందికి పైగా ముస్లింలని నరేంద్ర మోడి ఎందుకు చంపించాడు? గోధ్రా రైలు తగలబెడితే దోషుల్ని పట్టుకుని శిక్షించవలసిన స్ధానంలో ఉండి కూడా ఆ పని చేయకుండా మొత్తం ముస్లిం ప్రజానీకంపై దమనకాండకు ఎందుకు తెగబడ్డాడు? తద్వారా రాష్ట్రంలోని హిందువుల్లో శాశ్వత స్ధానం సంపాదించుకుని ఎల్లకాలం ముఖ్యమంత్రిగా కొనసాగడానికి. ఎల్లకాలం ముఖ్యమంత్రిగా ఉండి ఏం సాధిస్తాడు? మహా అయితే కోట్లు వెనకేసుకుంటాడు. అన్ని కోట్లేంజేసుకుంటాడు? సమాధానం: “అది అతని మానవ ప్రవృత్తి, మనిషి స్వతహాగా స్వార్ధ జీవి.”
నెహ్రూ, ఇందిర, రాజీవ్ ఇలా తాతలు తండ్రులు సంపాదించింది ఉండగా ఇంకా అధికారంలో ఉంటూ మరిన్ని కోట్లు వెనకేసుకోవలసిన అవసరం సోనియా, రాహుల్, ప్రియాంకలకు ఏం ఉంది? అన్ని కోట్లేంజేసుకుంటారు? సమాధానం: “అది వారి మానవ ప్రవృత్తి, మనిషి స్వతహాగా స్వార్ధ జీవి.”
టాటా, బిర్లా, అంబానీ, కిర్లోస్కర్, సింఘానియా, ఖేతాన్, విప్రో …. ఈ కుటుంబాలకి ఇప్పటికే అనేక కోట్లున్నాయి. తరాలు తిన్నా తరగని సంపద వారిది. ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు. ఐనా అంబానీ సోదరులు ఆస్తుల కోసం కొట్టుకుని వీధిన పడతారు. నానో కారు క్లిక్ కాకపోవడంతో టాటాకి నిద్ర ఉండదు. మోర్ అంటూ రిటైల్ కంపెనీ పెట్టి మోర్ సంపాదన కోసం బిర్లాలు రాత్రింబవళ్ళు పని చేయిస్తుంటారు. కొత్త కొత్త కాంట్రాక్టుల కోసం వీరంతా అనేక కుట్రలకు, రాజకీయాలకూ, లంచాలకూ పాల్పడుతూనె ఉంటారు. ఎందుకివన్నీ? ఇంత సంపాదించిన వీరు అదంతా ఏం జేసుకుంటారు? సమాధానం: “అది వారి మానవ ప్రవృత్తి, మనిషి స్వతహాగా స్వార్ధ జీవి.”
అనేక ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన పవార్ పక్షవాతం వచ్చినా మంత్రిగా కొనసాగుతున్నాడు. అది చాలక బిసిసీఐ పీఠం మీద కూడా కూర్చున్నాడు. ఐపిఎల్ పెట్టి కోట్లు దండుకుంటున్నాడు. ఎందుకిదంతా? మూట గట్టుకు పోతాడా? సమాధానం: “అది అతని మానవ ప్రవృత్తి, మనిషి స్వతహాగా స్వార్ధ జీవి.”
ఈ మానవ ప్రవృత్తి వాదనలో వీళ్లంతా సాగిస్తున్న దోపిడి లెక్కకు రాదు. అవినీతి లెక్కకు రాదు. అణచివేత లెక్కకు రాదు. పౌర హక్కుల హరణ పట్టించుకోనవసరం లేదు. అంతా మానవ ప్రవృత్తి కిందకు వచ్చేస్తుంది. మానవ ప్రవృత్తి వల్లనే ఇదంతా జరుగుతున్నపుడు ఇక శ్రామికులు అనుభవిస్తున్న అనేక సమస్యలు… ఆకలి, దరిద్రం, నిరుద్యోగం, అనేక రకాల హింస అన్నీ మానవ ప్రవృత్తి ఖాతాలోకే చేరిపోతాయి. అపుడిక వారు తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినా ఫలితం ఉండదని ఈ వాదన చెబుతుంది. ఎందుకంటే అదంతా మానవ ప్రవృత్తి కిందకే వస్తుంది కదా. పొట్ట గడవక, చేయడానికి పని లేక అనివార్య పరిస్ధితిలో చిన్న దొంగతనం చేయడానికి కారణం మానవ ప్రవృత్తే. తరాలు తిన్నా కరగని సంపదలున్నా ఇంకా కాంట్రాక్టుల కోసం నానా అడ్డదారులు తొక్కుతున్న అంబానీ ది కూడా మానవ ప్రవృత్తే.
కనుక సమాజంలో ఆర్ధిక వర్గాలు లేవు. కొద్ది మంది ఉత్పత్తి సాధనాలు ఆధీనంలో పెట్టుకుని సమస్త సంపదలను వశం చేసుకుంటున్న ఆధిపత్య వర్గాలు లేవు. అనేక సమస్యలతో కునారిల్లుతున్న శ్రామిక జనం లేరు. ఇవేవీ లేవు. ఉన్నదల్లా మానవ ప్రవృత్తే.
ఇక శ్రామికులకు మిగిలిన కర్తవ్యం ఏముంటుంది? ఎదురైన ప్రతి కష్టాన్ని మానవ ప్రవృత్తి కిందకి నెట్టేసుకుని అందింది తినడం లేదా ఎదురైన ప్రతి హింసని సహిస్తూ బ్రతకడం.
మానవ ప్రవృత్తి వాదన చివరికి దీనికే దారి తీస్తుంది. ఈ మానవ ప్రవృత్తి వాదన నిన్నటివరకూ కర్మ సిద్ధాంతం రూపంలో ఉంది. మనిషి ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకీ ‘అదంతా నీ కర్మ ఫలమే‘ అని ఆ సిద్ధాంతం చెబుతూ వచ్చింది. అదింకా పూర్తిగా పోలేదనుకోండి.
మానవ ప్రవృత్తి వాదన యాదృచ్ఛికంగా ఉనికి లోకి వచ్చిందనుకుంటె పొరబాటు. సమాజంలోని ఆధిపత్య వర్గాలు తమ ఆధిపత్యం, దోపిడి కొనసాగడానికి నిరంతరం అనేక ఎత్తులు వేస్తాయి. అనేక సిద్ధాంతాలను ప్రచారం లో పెడతాయి. అందులో పోస్ట్ మోడర్నిజమ్ (ఆధునికానంతర వాదం) ఒకటి. అవి కొన్ని కాన్షియస్ గా జరగొచ్చు. మరికొన్ని యధాలాపంగా వచ్చినట్లు కనిపించవచ్చు. వాటికి మూలం మాత్రం ‘ఆదిపత్య ప్రయోజనాలను కాపాడుకునే‘ ప్రయత్నమే.
ఈ విధంగా అప్పటికే వివిధ రూపాల్లో ఉనికిలో ఉన్న వాదనలని బాల గోపాల్ ‘మార్క్సిజం లో ఖాళీల‘ పేరుతో కొత్త పదజాలంతో నెత్తి కెత్తుకున్నాడు. ఆయన దృష్టిలో అది సైద్ధాంతిక చర్చగానే ఉన్నా దాని అంతిమ ప్రయోజనం దోపిడి వర్గాలకే చేరుతుంది.
బాల గోపాల్ గారు తన కొత్త వాదన తర్వాత కూడా మానవ హక్కుల కోసం తన కృషిని కొనసాగించాడు. ఆ విషయంలో ఆయన నిస్వార్ధంగా పని చేసాడు. ఆంద్ర ప్రదేశ్ లో ఆయన ఉనికే హక్కుల ఉద్యమానికి ఒక మద్దతుగా, ఒక పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చింది. ఆ విషయంలో భిన్నాభిప్రాయానికి తావు లేదు.
కాని పౌర హక్కుల ఉద్యమాన్ని ‘మానవ హక్కుల ఉద్యమం‘ గా పక్కదారి పట్టించడంలో బాల గోపాల్ వేసిన తప్పటడుగుని లేదా తప్పు అడుగుని విమర్శించకుండా, ఉతికి ఆరేయకుండా ఉండడానికి వీల్లేదు. బాల గోపాల్ తన జీవిత కాలంలో సాధించిన సాధికారత దృష్ట్యా ఆయన తప్పుల్ని విమర్శించవలసిన బాధ్యత మరింత ప్రముఖంగా ముందుకు వస్తుంది. ఆ బాధ్యతని రంగనాయకమ్మ గారు సమర్ధవంతంగా నిర్వహించారు.
ఆయన సైద్ధాంతికంగా ఒక పొరబాటు అభిప్రాయానికి, భావజాలానికి గురైతే దానిని తిరస్కరించకుండా, వాదించి ఖండించకుండా, తర్కించి తప్పులను ఎత్తి చూపకుండా ఉండడం వీలు కాదు. హక్కుల ఉద్యమంలో ఆయన చేసిన గొప్ప కృషి ఆయన సైద్ధాంతిక దిగజారుడుకి మద్దతుగా నిలవజాలదు. ఆయన సాగించిన భౌతిక కృషి, ఆయన గురయిన సైద్ధాంతిక పతనాన్ని పూర్వ పక్షం చేయజాలదు.
విశేఖర్ గారు,
బాలగోపాల్ గారి పై నా అభిమానం ‘మార్క్సిజం’ కు సంబంధించినది కాదు. మనవ హక్కులకు సంబంధించినది కావచ్చు లేదా వ్యక్తి గా మాత్రమే కావచ్చు. కాబట్టి ఆయన వ్యాసం వల్ల కలిగిన కష్ట నష్టాలకు నేను సమాధానం ఇవ్వలేను. ఆయన తొందరపాటు లో ఒక సిద్దాంతం వ్రాస్తారని అనుకోను. ఆయన కనుక్కొన్న వాటిని ముందే ఎందఱో చర్చించి ఉండవచ్చును. కాని మళ్ళీ వ్రాసారంటే, తనకి సమాధానం దొరకలేదనే అర్ధం కదా..అవన్నీ మరల రంగనాయకమ్మ గారు వ్రాసినా తేడా ఎలా వస్తుంది. ఆమె కొత్తగా తనదైన వాదన వినిపించి ఉండాల్సినది.
ఆయన సిద్దాంత వ్యాసం వ్రాసారు. అయితే సైద్దాంతిక చర్చ కు సిద్దపడ్డారని అనుకోలేను. తన నమ్మకాన్ని వ్యాసం గా చెప్పారు. చెప్పగలిగిన ది అంతా వ్యాసం లోనే చెప్పి ఉండవచ్చు. తను తప్పు చేసానని ఆయనకి అనిపించనంత వరకు మనం సమాధానం కోసం చూసినా లాభం ఉండదు. మీరు కలిసినపుడే మీ ప్రశ్నలు గా అడిగి ఉండాల్సినది. మీ ప్రశ్నలకు జవాబు దొరికేదేమో .
ఇద్దరి దారులు ఒకటే అన్న నా అభిప్రాయం లో ‘మార్క్సిజం’ అన్న ఉద్దేశ్యం లేదు. అలాగే ఆయన ‘మార్క్సిజం’ కు వ్యతిరేకం గా వెళ్ళారని కుడా నేను అనుకోవడం లేదు.
బాలగోపాల్ గారు చెప్పిన ‘మానవ ప్రవృత్తి’ ని నేను ఇంకో విధంగా అర్ధం చేసికొన్నాను. మానవ ప్రవృత్తి మార్చలేము అని బాలగోపాల్ గారు తన పంథాను మార్చుకొన్నారు. అలాగని సమర్దించినట్లు కాదు కదా. నిజానికి ఆయన కేవలం ఆదివాసీలనే ఎందుకు ముఖ్యం గా ఎంచుకొన్నారో ముందు తెలియలేదు కాని. ఇపుడు మీరు చెపుతున్న ఈ సిద్దాంతమే అయి ఉండొచ్చు అనిపిస్తున్నది. . మీరు చెప్పిన టాటా బిర్లాలు, రాజా , అంబానీ ..వీరి స్థాయి లో నే కాక, ఈ స్వార్ధం, ఆశ అధిక శాతం ప్రజల స్వభావం గా మారింది కాబట్టి, ఆయన తన దారి మార్చుకొన్నారని నేను అనుకొంటున్నాను.
ఆయన సిద్దాంతం కారణం గా పౌర హక్కుల ఉద్యమం చీలిపోవడంకు, ఆయన మాత్రమె కారణం ఎలా అవుతుంది. అసలు చీల్చాలన్న ఆలోచనే ఆయనకు ఉండదు. అది ఒక పరిణామమే కావచ్చు కదా.
కొంత మంది ఇంకో వాదన మొదలు పెట్టారు. వాళ్ళ వాదన ప్రకారం మనిషిలోని స్వార్థానికి పుట్టుకతో వచ్చే జన్యువులూ, మెదడులోని రసాయనాలూ కారణం అట! ఒక సాధారణ పెట్టుబడిదారుని కంటే ఒక సామ్రాజ్యవాదికి స్వార్థం ఎక్కువగా ఉంటుంది. అలాగని పెట్టుబడిదారుని శరీరంలో స్వార్థాన్ని పెంచే జన్యువుల కంటే సామ్రాజ్యవాది శరీరంలో స్వార్థాన్ని పెంచే జన్యువులు ఎక్కువగా ఉంటాయని అనుకోగలమా?
మౌళి గారూ, బాల గోపాల్ విమర్శ ప్రధానంగా మార్క్సిజం పైన. బాలగోపాల్ గారిపైన మీ అభిప్రాయమేమో మార్క్సిజానికి సంబంధించినది కాదని మీరంటున్నారు. కనుక మార్క్సిజంపైన ఆయన చేసిన విమర్శ, దానికి రంగనాయకమ్మ గారి విమర్శ మున్నగు అంశాలపైన మీతో చర్చించడానికి నాకు ప్రాతిపదిక దొరకడం లేదు. నేనిక ఎంత రాసినప్పటికీ మన మధ్య చర్చ ఫలవంతంగా ఉండకపోవచ్చు.
బాలగోపాల్ తొందరపాటులో రాసారని నేను అనలేదు కదా. ఆయన తొందరపాటులు రాసారని భావిస్తే రంగనాయకమ్మ గారు ప్రతివిమర్శ ఎందుకు రాస్తారు? ఏదో తొందరపడి ఉంటారని తేలిగ్గా తీసుకుని వదిలేసి ఉండేవారు. ఆయన సీరియస్ రాసారు కనకనే పట్టించుకోవడం.
సైద్ధాంతిక చర్చకు బాలగోపాల్ గారు సిద్ధపడ్డారని మీరు నేను అనుకోవడం కాదు. ఆయన రాసిన అంశాలే ఆయన చర్చకు సిద్ధపడ్డారా లేదా అన్నది నిర్ణయిస్తాయి. మార్క్సిజంలో ఫలానా అంశాలు లేవని చెబుతూ గతంలోనూ కొందరు రాసారు. అది పిడివాద సిద్ధాంతం అనీ, అభివృద్ధి చెందలేదనీ, పడికట్టు పదాలనీ వివిధ రకాల వాదలు ప్రచారంలో ఉన్నాయి. వాటన్నింటికీ ఆయా కాలాల్లో మార్క్సిస్టు మేధావులు సమాధానాలు చెప్పారు. మార్క్సిజం మారిన జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులకు అనుగుణంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. కారల్ మార్క్స్ చెప్పిన సిద్ధాంతాల పునాదిపైనే మారిని పరిస్దితులను ఎలా అర్ధం చేసుకోవచ్చో లెనిన్, స్టాలిన్, మావో లు సిద్ధాంత రీత్యా వివరించారు. వారితో పాటు యూరప్, అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో ఉన్న జాతీయ మార్క్సిస్టు మేధావులు కూడా తమ తమ దేశాల పరిస్ధితులను మార్క్సిజం-లెనినిజం౦-మావోయిజం వెలుగులో విశ్లేషించి రచనలు చేశారు. తాము రచనలు చేస్తూ మార్క్సిజంపై వచ్చిన విమర్శలకు సమాధానాలు చెప్పారు. అవేవీ కాకుండా బాలగోపాల్ గారు కొత్తగా రాసిన అంశాలేవీ లేవని రంగనాయకమ్మ గారు సోదాహరణంగా వివరించారని నేను చెప్పాను. బాలగోపాల్, రంగనాయకమ్మ గార్ల విమర్శ, ప్రతివిమర్శలను నేనూ చదివాను కనుక బాలగోపాల్ రాసిన అంశాల్లో కొత్తవేమీ లేవని నేనూ చెప్పగలుగుతున్నాను. కాదు కొత్తగా ఉన్నాయని మీరేమన్నా చెప్పగలిగితే వాటికి సమాధానం చెప్పడానికి నేనూ సిద్ధంగా ఉన్నాను.
అయితే ఇద్దరి రచనలూ మీకు తెలియదనీ, బాలగోపాల్ గారి పైన మీ అభిమానం మార్క్సిజానికి సంబంధించినది కాదనీ మీరంటున్నారు. కనుక మీరన్నట్లు మీతో ఈ విషయంలో నేను చర్చించడం కుదరకపోవచ్చును. మీరన్నట్లు బాలగోపాల్ గారు సిద్ధాంత వ్యాసం రాయలేదు. సిద్ధాంత విమర్శ రాసారు. ఆయన రాసింది మార్క్సిజం పైన విమర్శ అని మీరు గ్రహించాలి. సిద్ధాంత వ్యాసం అంటే కొత్తగా ఒక సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించి ఉండాలి. అలాంటిదేమీ ఆయన చేయలేదు.
ఒక విషయం చెప్పదలిచాను. మార్క్సిజం-లెనినిజం గురించిన అధ్యయనం లేకుండా బాలగోపాల్ పోరాట జీవితం లేదు. పౌర హక్కుల ఉద్యమంలో ఆయన సాగించిన కృషికి పునాది, ఉపరితలం అన్నీ మార్క్సిజం-లెనినిజానికి సంబంధించినదే. అది లేకుండా బాలగోపాల్ ఉద్యమ జీవితం గానీ, ఆయన ప్రతిష్ట గానీ లేదు. బాలగోపాల్ గారిని నేను నా విద్యార్ధి జీవితం గురించీ ఎరుగుదును. పౌర హక్కుల ఉద్యమ కార్యకర్తగా ఆయన నిర్మించిన ఉద్యమం లేకుండా తర్వాత కాలంలో మానవ హక్కుల ఉద్యమం కూడా ఉండదు. పౌరహక్కుల నేతగా ఆయన ఎదుగుదలను చూసినవారికే ఈ విషయం అర్ధం కాగలదు తప్ప దూరం నుండి చూసిన వారికి అర్ధం కావడం దుస్సాధ్యం. పౌరహక్కుల ఉద్యమం పునాదిపైనే ఆయన మానవ హక్కుల సంస్ధ స్ధాపించపడింది. ఆయన పోయాక మానవ హక్కుల ఉద్యమం తన ఉనికిని దాదాపుగా కోల్పోయింది. కాని పౌర హక్కుల ఉద్యమం మాత్రం కొనసాగుతోంది. ఒక్క ఎపిసిఎల్సి గానే కాక పి.యు.సి.ఎల్, ఒ.పి.డి.ఆర్, పి.యు.డి.ఆర్ లాంటి ఇతర పౌర హక్కుల సంస్ధలు తమ కృషిని కొనసాగిస్తున్నాయి. బాలగోపాల్ గారికి వచ్చిన ప్రతిష్ట ఎ.పి.సి.ఎల్.సి ద్వారా వచ్చినదే. మార్క్సిజం-లెనినిజం సిద్ధాంత పరిజ్ఞానం తో కూడిన పౌర హక్కుల అవగాహన లేకుండానే పౌర హక్కుల ఉద్యమంలో బాలగోపాల్ వ్యక్తిగత కృషి సాగిందని ఎవరైనా చెప్పదలుచుకుంటే అది వాస్తవ దూరం అవుతుంది. ఎ.పి.సి.ఎల్.సి సైద్ధాంతిక అవగాహన నుండి బాలగోపాల్ ని వ్యక్తిగా విడదీయడం సాధ్యం కాదు. మానవ హక్కుల సంఘం గా ఆయన స్ధాపించిన సంఘానికి భౌతిక పునాది కూడా ఎ.పి.సి.ఎల్.సి ద్వారా వచ్చినదే.
బాలగోపాల్ గారు మానవ ప్రవృత్తి పై చెప్పిన సంగతులను ఆయన చెప్పిన అర్ధంలోనే మీరు నేనూ అర్ధం చేసుకోవాలి తప్ప మరొక రకంగా అర్ధం చేసుకుని ఆయన ఇది చెప్పారేమో అని ఊహాగానాలు చేయడం సరికాదు.
ఆదివాసీలు ఈ దేశ మూలవాసులు. ఇతరులంతా వివిధ ప్రాంతాలనుండీ, ఖండాలనుండీ వలస వచ్చి స్ధిరపడినవారే. కాని ఈదేశ సంపదలను పొందడంలో అత్యంత వెనకబడినవారు మాత్రం ఆదివాసీలే. వారి సంస్కృతిని కూడా నాశనం చేస్తూ, వారి సహజ నివాస స్ధలాలనుండి తరిమివేయడానికి నేటి ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. దేశ ప్రజల గురించి ఆలోచించేవారెవరైనా మొదట ఆదివాసిల గురించే ఆలోచిస్తారు. ఆదివాసీలతో కల్సి జీవిస్తున్నవారిని అడవుల్లో ఉంటున్నవారిగా ప్రస్తావించేవారు అక్కడ కూడా జనం ఉన్న సంగతినీ, వారు అనేక రకాలుగా అణచివేతకూ, దోపిడికీ గురవుతున్నారన్న సంగతిని గుర్తించరు. బాలగోపాల్ గారు కూడా అందుకే ఆదీవాసీల సమస్యలతో తన పనిని జత కలిపారు.
ఎ.పి.సి.ఎల్.సి నాయకత్వంలోని పౌర హక్కుల ఉద్యమం చీలిపోవడానికి బాలగోపాలే కారణం. అందులో అనుమానం అనవసరం. ఆయన మానవ హక్కుల వాదనే ఆ ఉద్యమాన్ని చీల్చింది. మీరు చేసే వాదన కాంక్రీట్ గా ఉన్నట్లయితే చర్చించడానికి నాకూ వీలవుతుంది. అలా కాక అయిఉండవచ్చు అని మీరనేపనైతే నేనేమీ చెప్పలేను.
వాళ్ల బొంద.
ఆ విషయం గురించి చర్చ ఇక్కడ జరుగుతోంది: https://plus.google.com/111113261980146074416/posts/f2FZtUohAMC
మీ వ్యాసం ,బాలగోపాల్ గారు సమాధానం ఇవ్వకుండా వదిలేసారన్న ఆరోపణ కు సంబంధించినది. అది కమ్యునిజం కానివ్వండి , ఇంకేదయినా కావచ్చు.
బాల గోపాల్ గారు చేసినది విమర్శ అని మీకనిపించినా, అది ఆయన అభిప్రాయం అని నా నమ్మకం. అలాగే ఆయన కొన్ని ఖాళీలు గురించి అభిప్రాయ పడినంత లోనే , అప్పటివరకు నమ్మిన వాటిని వదిలేసినట్లు కాదు. మనిషి లో తర్కం రావడం సహజం. అదీ తానప్పుడు చేస్తున్న పోరాటం లో సంతృప్తి లేనపుడు , తను చేసికొన్న విశ్లేషణ లో వ్యాసం వ్రాసారు. తానొ క్కడు మాత్రమె చెయ్యలేరు కాబట్టి తన అభిప్రాయం వ్యాసం ద్వారా అందరికీ వెలిబుచ్చారు. ఆయన మొండితనం కూడా తెలుసు .
రంగనాయకమ్మ గారు ఎంత బాగా సోదాహరణంగా వివరించగలరు అనడం లో సందేహం లేదు( ఇక్కడ చాలామంది చర్చించే ‘రామాయణం’ కధ గురించి విన్నాను) అదే సమయం లో రంగనాయకమ్మ గారు చెప్పక ముందే అవన్నీ బాలగోపాల్ గారు ఆలోచించి ఉంటారు అని నా నమ్మకం. కాబట్టి వారి ప్రతివిమర్శ కు సమాధానం రాకపోవడం లో ఆశ్చర్యం లేదు.
>> కారల్ మార్క్స్ చెప్పిన సిద్ధాంతాల పునాదిపైనే మారిని పరిస్దితులను ఎలా అర్ధం చేసుకోవచ్చో లెనిన్, స్టాలిన్, మావో లు సిద్ధాంత రీత్యా వివరించారు.>>
నిజమే కావచ్చు . అదే సమయం లో బాలగోపాల్ గారి లా ఇంకొకరు ఉండాలని ఆశించలేము. అది దాదాపు గా అసాధ్యం. అలాగే బాలగోపాల్ గారును.
>>బాలగోపాల్, రంగనాయకమ్మ గార్ల విమర్శ, ప్రతివిమర్శలను నేనూ చదివాను కనుక బాలగోపాల్ రాసిన అంశాల్లో కొత్తవేమీ లేవని నేనూ చెప్పగలుగుతున్నాను.>>
మీరు చెపుతున్నవి పూర్తిగా నమ్ముతున్నాను. నేను వాటిని చూడనవసరం లేదు.
>>మార్క్సిజం-లెనినిజం గురించిన అధ్యయనం లేకుండా బాలగోపాల్ పోరాట జీవితం లేదు. పౌర హక్కుల ఉద్యమంలో ఆయన సాగించిన కృషికి పునాది, ఉపరితలం అన్నీ మార్క్సిజం-లెనినిజానికి సంబంధించినదే. అది లేకుండా బాలగోపాల్ ఉద్యమ జీవితం గానీ, ఆయన ప్రతిష్ట గానీ లేదు.>>
100 శాతం మీ అభిప్రాయం తో నాకు ఏకీభావం ఉంది. కాబట్టే ఆయన మార్క్సిజం నుండి పూర్తి గా వైదొలిగినట్లు కాదు అని చెపుతున్నాను మొదటి నుండి కూడా.
>>>బాలగోపాల్ గారు మానవ ప్రవృత్తి పై చెప్పిన సంగతులను ఆయన చెప్పిన అర్ధంలోనే మీరు నేనూ అర్ధం చేసుకోవాలి తప్ప మరొక రకంగా అర్ధం చేసుకుని ఆయన ఇది చెప్పారేమో అని ఊహాగానాలు చేయడం సరికాదు. >>>
నేను ఆయన చెప్పిన సంగతులు కొన్నే విన్నాను(చాలా తక్కువ). వాటిలో ఇవేవి లేకపోవచ్చును కూడా. వారు ఆదివాసీ లపైనే ఎందుకంత దృష్టి పెట్టారు అన్నది ,మీరు వ్రాస్తున్న వ్యాసాలు ద్వారా మాత్రమె నాకు అవగాహన కలిగినది అని కూడా చెపుతున్నాను కదా .
అలాగే బాలగోపాల్ గారు వ్రాసిన వ్యాసం పౌర హక్కుల ఉద్యమం చీలిపోవడానికి కారణం కావచ్చు, కాని ఆయన కారణం కాదు. ఎందుకంటే ఆయన ఉద్యమాన్ని చీల్చే ఉద్దేశ్యం తో వ్రాయరు కాబట్టి అని మాత్రమె నేను చెప్పదలుచుకొన్నాను.
బాలగోపాల్ అనే వ్యక్తీ ని నేను తెలుసుకోన్నదే ఆయన మరణం వల్ల, కాబట్టి మార్క్సిజం గురించి నేను చర్చించడము అసాధ్యం. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి మానవ హక్కుల ఉద్యమం దాదాపు లేనట్లే. కాబట్టి వారంతా మళ్ళి పౌరహక్కుల ఉద్యమం లో కి రావడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కాని ఇప్పుడు ఆయన్ని విమర్శించడం , ప్రశ్నించడం ద్వారా మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది అని నా పూర్తి నమ్మకం.
“కాని ఇప్పుడు ఆయన్ని విమర్శించడం , ప్రశ్నించడం ద్వారా మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది అని నా పూర్తి నమ్మకం.”
మౌళి గారూ, నా వ్యాసం తో మీ అభ్యంతరం ఇదే అనుకుంటాను. ఆయన లేనప్పుడు విమర్శ చేయడం సరికాదని మీరు చెప్పదలుచుకున్నట్లు నాకు అర్ధం అవుతోంది.
నా ఈ విమర్శ కొత్తది కాదు. ఆయన ఉండగానే రంగనాయకమ్మ గారు ఇతర వ్యాసాల్లో ఆయనపై చేసిన విమర్శనే నేను ప్రస్తావించాను.
మార్క్సిజం గుర్తించని మానవ ప్రవృత్తి గురించి ఓ బ్లాగర్ ప్రస్తావించినందున అటువంటి అంశం అప్పటికే రంగనాయకమ్మ గారు చర్చించారనీ, బాలగోపాల్ గారు రాసిన విమర్శ విషయంలో ఆవిడ ఆ చర్చ చేశారనీ నా పాత వ్యాసంలో ప్రస్తావించాను. జరిగిన చర్చను ప్రస్తావిస్తూ, బ్లాగర్ (బొందలపాటి గారనుకుంటా) చెప్పిన అంశాలకు మళ్ళీ అదే సమాధానం వర్తిస్తుందని చెప్పడానికి బాలగోపాల్-రంగనాయకమ్మ గార్ల విమర్శ ప్రతివిమర్శల విషయాన్ని ప్రస్తావించాను. అయితే బొందలపాటి గారు తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. అది వేరే సంగతి. నా వ్యాసంలో బాలగోపాల్ గారిది ఒక ప్రస్తావనే తప్ప అదే మొత్తం కాదు. ఆయన పై విమర్శతో వ్యాసం ప్రారంభం కావడం వల్ల మీకలా తోచి ఉండవచ్చు.
మరొక సంగతి. సైద్ధాంతిక అంశాలు, వాటి పై వచ్చే విమర్శలపైన చర్చలు వాటిని చేసిన వ్యక్తులు భూమిపై ఉన్నారా లేదా అన్న దానితో సంబంధం లేకుండా కొనసాగుతుంటాయి. ఆ చర్చల వల్ల మరింత అవగాహన కొత్త పాఠకులకు ఏర్పడుతుంది తప్ప నష్టం జరుగుతుందని చెప్పి చర్చలను చేయకుండా ఉండలేము. మీరన్నట్లు నష్టం జరుగుతుందని నాకు అనిపించడం లేదు. ఏమన్న జరిగితే లాభమే జరుగుతుంది.
మార్క్సిజం-లెనినిజం నుండి బాలగోపాల్ పూర్తిగా వైదొలిగారా లేదా అన్న విషయం ఆయన రాసిన విమర్శ ద్వారా తేల్చుకోవలసిన విషయం. ఆయన విమర్శాంశాలను చర్చించకుండా ఈ అంశాన్ని మనం చర్చించుకోలేము.
పౌరహక్కుల ఉద్యమాన్ని చీల్చే ఉద్దేశ్యం ఆయనకి ఉందో లేదో నాకు తెలియదు. కాని ఆయన మారిన అవగాహన వల్లనే ఉద్యమం చీలింది. తన మారిన అవగాహన మేరకు పౌర హక్కుల సంస్ధనుండి చీలి మానవ హక్కుల సంస్ధను బాలగోపాల్ ఏర్పాటు చేశారు. అలాంటప్పుడు ఆయన చీల్చక ఎవరు చీల్చినట్లు? ఈ అంశాన్ని గుర్తించడానికి మీకు అభ్యంతరం ఎందుకు? ఆయనే స్వయంగా సంఘాన్ని చీల్చి వేరు సంఘం పెట్టాక ఆయన చీల్చలేదని అనడం…?
విశేఖర్ గారు ,
ఆయన లేనప్పుడు విమర్శ చేయడం సరికాదని నేను అనడం లేదండీ, అటువంటి అభిప్రాయాలకు అతీతం గా బ్రతికరాయన. మంచిది కాదు అన్నది ఆయన గురించి కాదండీ. మీరు ఆశించే ప్రయోజనాలకే మంచిది కాదు.
>>కాని ఆయన మారిన అవగాహన వల్లనే ఉద్యమం చీలింది. >>
ఇది నిజమే కావచ్చు , ముందే చెప్పాను ఆయన అభిప్రాయాలు కారణం అయినంత మాత్రాన ఆయన్ని నిందించడం లో అర్ధం లేదు. ఆయన్ని అనుసరించిన వారి గురించి వ్రాయండి. మంచో చెడో .