ఢిల్లీ, జార్జియా, ధాయిలాండ్ పేలుళ్ల వెనక ఇరానియన్లు


బ్యాంకాక్ బాంబు పేలుడులో కాళ్ళు కోల్పోయిన వ్యక్తి

సోమవారం ఢిల్లీలో ప్రధాని నివాసానికి సమీపంలో ఇజ్రాయెలీ దౌత్య సిబ్బందిని లక్ష్యం చేసుకుంటూ జరిగిన బాంబు పేలుడుకూ, దాదాపు అదే సమయంలో జార్జియా లోనూ మంగళవారం ధాయిలాండ్ లోనూ జరిగిన బాంబు పేలుళ్లకూ దగ్గరి సంభంధం ఉందని ఇజ్రాయెల్ ఆరోపించింది. మరోవైపు ఇజ్రాయెల్ ఆరోపణలను ఆమోదించడం గానీ, నిరాకరించడం గానీ చేయబోవడం లేదని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది.

ఇరాన్ కు చెందిన అణు శాస్త్రవేత్తలను అనేక మందిని ఇజ్రాయెల్ ప్రభుత్వం పొట్టన బెట్టుకున్నట్లుగా ఇరాన్ గతంలో ఆరోపించింది. ఆ ఆరోపణలకు కూడా ఇజ్రాయెల్ ఈ విధంగానే స్పందించడం గమనార్హం. శాస్త్రవేత్తలను చంపింది తామేనని ఇరాన్ చేస్తున్న ఆరోపణలను ఆమోదించడం లేదనీ అలాగని నిరాకరించడం లేదనీ ఇజ్రాయెల్ అనేక సార్లు అహంభావ పూరిత ప్రకటనలు చేసింది. ఈ నేపధ్యంలోనే ఇజ్రాయెల్  టెర్రరిస్టు చర్యలకు ప్రతీకారంగానే ఇరాన్ ఈ పేలుళ్లకు పాల్పడిందని పత్రికలు, విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇరాన్, పాలస్తీనా తదితర దేశాలకు చెందిన దేశస్ధులను అనేకమందిని ఇజ్రాయెల్ గూఢచార సంస్ధ మొస్సాద్, క్రూరంగా హత్య గావించిన విషయం ప్రపంచానికి తెలిసిన విషయమే. ఇజ్రాయెల్ ప్రభుత్వమే ఈ టెర్రరిస్టు చర్యలకు పూనుకుంటోందన్న విషయాన్ని దాచి పెట్టడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా పెద్దగా ప్రయత్నించదు. అధికారిక ప్రకటనలలో హత్యలకు సంబంధించిన తమపై ఆరోపణలను ఇజ్రాయెల్ ‘తాను ఆమోదించడం లేదు, అలాగని నిరాకరించడం లేదు’ అని ప్రకటించినప్పటికీ,  సదరు హత్యలకు కారణం తామేనన్న సంగతిని మాత్రం ప్రచారంలోకి పెడుతుంది. ఇజ్రాయెల్ ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ పత్రికలు మొస్సాద్ సంస్ధే హత్యలను నిర్వహించినట్లు ప్రచురిస్తాయి. అటువంటి వార్తలను ఖండించడానికి ఇజ్రాయెల్ ఆసక్తి చూపదు. ఇదే పద్ధతిని ఇరాన్ తాజా పేలుళ్ల విషయంలో అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఢిల్లీలో జరిగిన పేలుళ్లకు సంబంధించి పోలీసులకు సమాచారం ఏమీ దొరకనప్పటికీ ధాయిలాండ్ పోలీసులు ఇద్దరు ఇరానియన్ దేశీయులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. వ్యక్తులను టార్గెట్ చేసుకుని మాత్రమే బాంబులు ప్రయోగించారనీ, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరపడానికి బాంబులు ఉద్దేశించలేదనీ ధాయిలాండ్ పోలీసులు ప్రకటించారు. ఇరానియన్ దేశీయుడు బాంబు పేలుడు జరిపి పారిపోతుండగా అడ్డుకోబోయిన పోలీసు అధికారిపై బాంబు విసిరారనీ, అలా విసిరిన బాంబు ప్రమాదవశత్తు చేతిలో పేలిపోవడంతో అతని రెండు కాళ్లూ పోయాయనీ వారు తెలిపారు. గాయపడిన ఇరానియన్ బ్యాంకాక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరొక ఇరానియన్ దేశీయుడిని దేశం విడిచి మలేసియా వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా విమానాశ్రయంలో అరెస్టు చేశామని ధాయిలాండ్ పోలీసులు తెలిపారు.

జార్జియాలో రాజధాని తబ్లిసిలో ఓ కారుకింద ఉంచిన బాంబును కనుగొని నిర్వీర్యం చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడులో ఇజ్రాయెల్ దౌత్య సిబ్బంది ఒకరు ప్రయాణిస్తున్న కారు ధ్వంసం అయింది. కారులో ఉన్న ఇద్దరితో పాటు వెనుక వస్తున్న మరొక కారులోని మరొక ఇద్దరు గాయపడ్డారని పత్రికలు తెలిపాయి. మోటార్ సైకిల్ పై వస్తున్న వ్యక్తి అయస్కాంత బాంబును కారుకు అంటించి పోయిన అనంతరం బాంబు పేలిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇరాన్ అణు ఇంజనీర్లను కూడా అయస్కాంత బాంబుల తోనే ఇజ్రాయెల్ గూఢచార సంస్ధ మొస్సాద్ చంపివేయడం గమనార్హం.

బ్యాంకాక్ లో జరిగిన పేలుళ్లకు, ఢిల్లీలో జరిగిన పేలుళ్లకూ సంబంధం ఉన్నదీ లేనిదీ తాము చెప్పలేమనీ, ధాయిలాండ్ పోలీసులు తెలిపారు. అయితే ధాయిలాండ్ పోలీసుల కస్టడీలో ఉన్న ఇరాన్ దేశీయుడు తాము ఇజ్రాయెలీయులను లక్ష్యంగా చేసుకుని బాంబు ప్రయోగించిన సంగతిని పోలీసుల వద్ద అంగీకరించినట్లుగా ధాయిలాండ్ పోలీసుల అనధికార సమాచారాన్ని ఉటంకిస్తూ ఇజ్రాయెల్ టీవి ఛానెల్ ప్రకటించింది. ఈ విషయంపై ఇరాన్ అధికారులు వ్యాఖ్యానించలేదు. “ఇరాన్ దేశం టెర్రరిస్టు చర్యలను కొనసాగిస్తున్నదనడానికి బ్యాంకాక్ పేలుళ్ళు ఒక ఉదాహరణ” అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యూద్ బారక్ సింగపూర్ లో మాట్లాడుతూ చెప్పాడు.

అయితే ఇటువంటి టెర్రరిస్టు చర్యలకు ఇజ్రాయెల్ అనేక సంవత్సరాలుగా పాల్పడుతూ వచ్చింది. ఇరాన్ అణు కర్మాగారాలను ధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్ అనేకమార్లు కుట్రలు చేసింది. ఇరాన్ అణు కర్మాగారాలలో ఉన్న కంప్యూటర్లలో ‘స్టక్స్ నెట్’ అనే విధ్వంసక వైరస్ ను ప్రవేశ పెట్టి కర్మాగారల పని నెమ్మదించేలా చేసింది. అనేకమంది అణు ఇంజనీర్లను చంపివేసింది. ఇజ్రాయెల్ దేశం అమెరికా, యూరప్ లకు మిత్ర దేశం అయినందున దాని టెర్రరిస్టు చర్యలను పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు ప్రచారం చెయ్యవు. చేసిన వాటిని టెర్రరిస్టు చర్యలుగా అవి గుర్తించవు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేనప్పటికీ, అణ్వాయుధం కోసం తాము ప్రయత్నించడం లేదని ఇరాన్ చెబుతున్నప్పటికీ ఆ దేశంపై అనేక విధాలుగా దుష్ప్రచారం చెయ్యడానికి మాత్రం అవి విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s