ఢిల్లీ బాలిక ‘ఫాలక్’ కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు


వొళ్లంతా కొరికిన గాయాలతో పాటు, చిట్లిన కపాలం, విరిగిన కాలి, చేతి ఎముకలతో ఢిల్లీ ఆసుపత్రిలో చేరిన రెండేళ్ల పాప ‘ఫాలక్’ కేసులో ప్రధాన నిందితుడిని శనివారం అరెస్టు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ‘ఫాలక్’ (ఆకాశం) గా ఆసుపత్రి సిబ్బంది పేరు పెట్టిన పాపను జనవరి 18 తేదీన పద్నాలుగేళ్ల బాలిక ‘పాపకు తానే తల్లినంటూ’ ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ లో చేర్చిన సంగతి విదితమే. ముంబై టాక్సీ డ్రైవర్ రాజ్ కుమార్ అరెస్టుతో కీలక నిందితుడిని అరెస్టు చేసినట్లేనని పోలీసులు తెలిపారు.

ఫాలక్ కేసులో విచారణ ప్రారంభించిన పోలీసులు పాపను ఆ స్ధితికి చేర్చిన అనేక నేరాలను, నేరస్ధులను వెలికి తీసారు. పద్నాలుగేళ్ల బాలికను ఆమె ఖర్మానికి వదిలిపెట్టడం, లైంగిక హింస, వ్యభిచార కూపంలోకి బలవంతంగా దింపడం, అంతర్రాష్ట్ర వ్యభిచార ముఠా, తానెదుర్కున్న లైంగిక హింస నేపధ్యంలో మానసిక నిస్పృహతో పాపను హింస పెట్టిన పద్నాలుగేళ్ల బాలిక… మున్నగు నేరాలు రెండేళ్ళ పాప కేసులో వెలుగు చూశాయి. దేశ వ్యాపితంగా వెల్లడువుతున్న ఇలాంటి సంఘటనల వెనుక ఎన్నెన్ని సామాజిక, నేరస్ధ కోణాలు ఉండేదీ ఫాలక్ కేసు వెల్లడిస్తోంది.

ఫాలక్ తల్లి ఇరవై రెండేళ్ల యువతిగా తెలుస్తోంది. ఈమె బీహార్ రాష్ట్రానికి చెందిన ముజఫర్ పూర్ జిల్లా నివాసి. అమ్మాయిలను మోసం చేసి వ్యభిచారంలోకి దింపే ముఠా చేతిలో ఈమె మోస పోయింది. వ్యభిచార ముఠాకు చెందిన ప్రతిమ అనే పాట్నాకు చెందిన మహిళ రెండవ పెళ్ళి చేస్తామని చెప్పి ఫాలక్ తల్లిని మోసగించి వ్యభిచారంలోకి బలవంతంగా దింపింది. ఫాలక్ తల్లికి ఫాలక్ తో పాటు ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. వారినందరినీ వ్యభిచార ముఠాకి చెందిన ప్రతిమ మరొక స్త్రీకి అప్పగించినట్లు తెలుస్తోంది. ఫాలక్ తల్లిని వ్యభిచారంలోకి దింపిన ముఠా సభ్యులు మరో ఇద్దరు మహిళలు లక్ష్మి, కాంత లను గత ఆదివారమే పోలీసులు అరెస్టు చేశారు. రాజ్ కుమార్ తో పాటు ప్రతిమను వ్యభిచార రాకెట్ లో పాత్ర ధారులుగా పోలీసులు గుర్తించారు.

కేసు వెలుగులోకి వచ్చినప్పటినుండీ పోలీసులు అనేకమందిని అరెస్టు చేసినప్పటికీ వారు ప్రధాన నిందితుడుగా భావిస్తున్న రాజ్ కుమార్ ని మాత్రం శనివారం ఉదయం అరెస్టు చేశారు. ఇంతా చేసి ప్రధాన నిందితుడిగా పోలీసులు చెబుతున్న టాక్సీ డ్రైవర్ రాజ్ కుమార్ వయసు ఇరవై రెండేళ్ళు మాత్రమే. ముంబైలో టాక్సి డ్రైవర్ గా పని చేస్తున్న రాజ్ కుమార్ వ్యభిచార ముఠా సభ్యుడుగా ముంబై, ఢిల్లీలతో మధ్య తిరుగుతుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

తండ్రి నిరాదరణకు గురైన పద్నాలుగేళ్ల ఢిల్లీ బాలికను ఇతను చేరదీసి ఆమె చేత కూడా వ్యభిచారం చేయించాడనీ తెలుస్తోంది. రాజ్ కుమార్ తనను లైంగిక హింసకు గురి చేశాడని, తన ఇంటి వద్ద ఉన్నపుడు కూడా పొరుగు వారు తనను లైంగికంగా హింసించారని బాలిక పోలీసులకు తెలిపింది. తోడు ఉంటాడనుకున్న రాజ్ కుమార్ ఫాలక్ ని తనకు అప్పగించి ముంబై వెళ్లి పోవడంతో నిస్పృహతో ఉన్న బాలిక ఫాలక్ ను హింసించిందని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఫాలక్ శరీరంపై ఉన్న కొరికిన గాయాలు తనవి కాదని బాలిక చెప్పడం గమనార్హం. బాలిక తండ్రిపై మైనర్ బాలికను వదిలి పెట్టిన కేసును పోలీసులు మోపారు. బాలిక తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో తన కూతురుని ఆ తండ్రి సరిగా పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు.

వ్యభిచార ముఠాలో కీలక నిందుతుడైన రామ్ కుమార్ మిశ్రా కోసం పోలీసులు వెతుకుతున్నారు. బీహార్ కి చెందిన రామ్ కుమార్ మిశ్రా ఈ నేరాలన్నింటికి బాధ్యుడిగా పది రోజుల క్రితం పోలీసులు తెలిపారు. ఫాలక్ తండ్రి విషయం ఏమిటన్నదీ పోలీసుల నుండి సమాచారం లేదు. ఫాలక్ తల్లి రెండో పెళ్లి కోసం ప్రయత్నించవలసిన అగత్యానికి అతను గురి చేశాడన్నది స్పష్టం అవుతోంది.

భర్త నిరాదరణకు గురవ్వడం వల్లనో, మరే ఇతర కారణం వల్లనో ఫాలక్ తల్లి రెండవ పెళ్లి చేస్తామన్న పాట్నా వ్యభిచార ముఠా సభ్యురాలు ప్రతిమ మోసానికి గురయింది. ఆ విధంగా ఆమెను వ్యభిచార ముఠాకి అప్పగించిన ప్రతిమ, ఆమె ముగ్గురు పిల్లలను ఢిల్లీలోని వేరోక స్త్రీకి అప్పగించారు. అలా ఇద్దరు స్త్రీల చేతులు మారిన ఫాలక్ చివరికి పద్నాలువేళ్ల బాలిక మహి గుప్త వద్దకు చేరింది. అప్పటికే తండ్రి నిరాదరణకు గురైన మహి కూడా మరో ముఠా ద్వారా వ్యభిచార ముఠా చేతికి చిక్కింది. తోడు ఉంటాడనుకున్న రాజ్ కుమార్ వెళ్లిపోవడంతో తన నిరాశా నిస్పృహల ప్రభావాన్ని ఫాలక్ పైన చూపింది. పాలక్ ను గాయపరిచినప్పటికీ మహి పాపను ఆసుపత్రికి తీసుకురావడం గమానర్హం. ఎముకలు విరిగేంతగా, మెదడు గాయపడేంతగా పాపను మహి గాయపరచగలదా అన్న సందేహం కలుగుతోంది.

ప్రతిమ, రాజ్ కుమార్ గుప్తా లు సభ్యులుగా ఉన్న వ్యభిచార ముఠా చేతికి చిక్కాక మహి కూడా అనేకసార్లు అత్యాచారానికి గురయ్యింది. తన తండ్రి జితేంద్ర కుమార్ గుప్తా వద్ద ఉన్నపుడు మహిని అనేక సార్లు కొట్టేవాడని పోలీసులు తెలిపారు. పోలీసులు మరో ముగ్గురిని మహిని వ్యభిచారంలోకి దింపిన కేసులో ఫిబ్రవరి 2 న అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో ఒక స్త్రీ పేరు ఆర్తి కాగా, మిగతా ఇద్దరు సందీప్ పాండే, పూజ లు భార్యా భర్తలు. ఆర్తి స్వయంగా ఓ కూతురికి తల్లి అనీ ఆర్తి, పూజ, సందీప్ పాండే లు మహిని వ్యభిచారంలోకి బలవంతంగా దింపారని పోలీసులు తెలిపారు. మహి పైన సందీప్ పాండే అనేకసార్లు అత్యాచారం జరిపాడనీ, ఓ గదిలో బంధించి ఉంచాడనీ సౌత్ వెస్ట్ ఢిల్లీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అజయ్ చౌదరి చెప్పినట్లుగా డెక్కన్ హెరాల్డ్ పత్రిక తెలిపింది.

జనవరి చివరి వారంలో వెంటిలేటర్ సౌకర్యం కలిగించిన పరిస్ధితి నుండి ఫాలక్ కోలుకున్నదని డాక్టర్లు చెప్పారు. అయితే పాపకు ఊపిరి తీసుకోవడంలో సమస్యలు తలెత్తడంతో మళ్లీ వెంటిలేటర్ లో ఉంచవలసి వచ్చిందని శుక్రవారం డాక్టర్లు తెలిపారు. రక్తం లోనూ, ఊపిరితిత్తులలోనూ ఉన్న ఇన్ఫెక్షన్ నయం అయినప్పటికీ మెదడులో చేరిన ఇన్ఫెక్షన్ నయం కాలేదని డాక్టర్లు చెప్పారు. మెదడు ఇన్ఫెక్షన్ నయం అయ్యాక మెదడుకు మరొక సారి ఆపరేషన్ చేయవలసి ఉందని వారు తెలిపారు. ఇప్పటికే మూడు ఆపరేషన్లకు గురైన పాప మరొక ఆపరేషన్ కు గురికానుంది. అంత చేసిన పాప అందరిలా మామాలు స్ధితికి రావడం సాధ్యం కాదని డాక్టర్లు గతంలో స్పష్టం చేశారు. జీవితాంతం మరొకరిపైన ఆధారపడే పరిస్ధితే పాపకు కలుగుతుందని వారు తెలిపారు. మెదడుకు తగిలిన గాయం వల్ల ఫాలక్ మామూలు స్ధితికి రావడం కష్టమని స్వంత అవసరాలకు కూడా మరొకరిపై ఆధారపడవలసిందేననీ వారు తెలిపారు.

ఫాలక్ లాంటి కేసులు దేశంలో నిత్యం వందలు వేలు జరుగుతున్నాయి. పత్రికల దృష్టికి వచ్చిన ఒకటి రెండు కేసులు మాత్రమే ప్రజల దృష్టికి వస్తున్నాయి. ఒక్క ఫాలక్ కేసు లోనే సమాజంలో నెలకొన్న అనేక ఘోరాలు వెలుగులోకి వచ్చాయి. తల్లి లేని బాలికలపై నిరాదరణ, భర్త లేని పేద స్త్రీల దారుణ స్ధితిగతులు, ఒంటరి స్త్రీలను వారి మానాన వారిని బతకనివ్వకుండా వ్యభిచార కూపంలోకి దింపే ముఠాలు, తల్లి లేని పిల్లల దీన స్ధితి గతులు, రాష్ట్రాల సరిహద్దులను గూడా అధిగమిస్తూ సాగుతున్న వ్యభిచార  ముఠాల కార్యకలాపాలు… వీటన్నింటికీ ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సిందే. పురుషాధిక్య వ్యవస్ధలో స్త్రీలపై సాగుతున్న అనేక అత్యాచారాలను ఫాలక్ కేసు మరొకసారి వెల్లడి చేసింది. పురుషాధిక్యత అనగానే భార్యలపై భర్తల ఆధిపత్యం అన్న కోణం వరకే పరిమితం కారాదు. అది కుటుంబ పరిధిల్లో కనిపించే దుర్మార్గం మాత్రమే. కాని పురుషాధిక్య వ్యవస్ధలో స్త్రీలు ఇంకా ఎన్ని దురాగతాలకు బలయ్యేదీ రెండేళ్ల పాప ‘ఫాలక్’ కేసు వెల్లడించింది. ఇపుడున్నది పురుషాధిక్య వ్యవస్ధ కాదనీ, స్త్రీలు అనేక రంగాల్లో రాణిస్తున్నారనీ వాదించే పురుష పుంగవులు ఫాలక్ కేసు ఓ సారి అధ్యయనం చేసి అందులో ఉన్న అనేక కోణాలను అర్ధం చేసుకోవలసిన అవసరం ఉంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s