గుజరాత్ మత మారణకాండలో ‘హిందూ మూకల’ దాడిలో హత్యకు గురైన కాంగ్రెస్ ఎం.పి ఎహ్సాన్ జాఫ్రీ కేసులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఊరట లభించినట్లు తెలుస్తోంది. మోడి తో పాటు మరో అరవై మందిపైన ‘విచారించదగిన సాక్ష్యాలు’ ఏవీ లభించలేదని సుప్రీం కోర్టు నియమించిన ‘ప్రత్యేక దర్యాప్తు బృందం’ తన అంతిమ నివేదికలో తెలిపినట్లుగా, విశ్వసనీయ వర్గాలను’ ఉటంకిస్తూ ‘ఎన్.డి.టి.వి’ తెలిపింది.
ముస్లిం ప్రజలపై మారణ కాండకు పూనుకున్న హిందూ మూకలను చూసీ చూడనట్లు వదిలివేయాలంటూ ముఖ్యమంత్రి మోడి ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో కోరాడనీ ఆ సమావేశానికి తానూ హాజరైనాననీ చెప్పిన ఐ.పి.ఎస్ ఆఫీసర్ సంజీవ్ భట్ సాక్ష్యాన్ని సుప్రీం కోర్టు నియమించిన సిట్ కూడా పరిగణించలేదని తెలుస్తోంది. సంజీవ్ భట్ సాక్ష్యాన్ని ఆయన డ్రైవర్ ఒక్కడే సమర్ధించాడనీ, ఆయనపై గతంలో దాఖలైన ఫోర్జరీ కేసు లో సంజీవ్ భట్ సస్పెండ్ అయ్యాడనీ చెబుతూ ఆయన సాక్ష్యాన్ని పరిగణించడం లేదని సిట్ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
‘చర్యకు ప్రతి చర్య’ ఉంటుందన్న ‘న్యూటన్ లా ఆఫ్ ఫోర్స్’ ను చెబుతూ గుజరాత్ రాష్ట్ర ముస్లిం లపై ‘హిందూ గూండా మూకల’ దాడిని గుజరాత్ ముఖ్యమంత్రి బహిరంగంగానే సమర్ధించాడు. ఆ వార్తను దేశంలోని పత్రికలన్నీ ప్రముఖంగానే రాసాయి. గోధ్రా రైలు ఘటనను సాకుగా చూపి ఒక మతానికి చెందిన ప్రజలందరిపైనా హత్యాకాండని ప్రభ్యుత్వపరంగానే అమలు చేయించిన కిరాతకుడు నరేంద్ర మోడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఎవరు ముందుకు వస్తారు? ముందుకు వచ్చిన ఒకే అధికారి సంజీవ్ భట్ పైన అనేక తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకి పంపిన విషయం ప్రత్యక్షంగా దేశ ప్రజల కళ్లముందు ఉంది. రాష్ట్రాన్ని ఏలుతున్న ఓ కిరాతక వ్యక్తికి వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే ఏమవుతుందో సంజీవ్ భటే ఒక ఉదాహరణ.
“చట్టానికి కళ్ళు లేవు” అన్న సూత్రం నరేంద్ర మోడి లాంటి కిరాతక పాలకులకు చక్కగా ఉపయోగపడుతోంది.
మోడికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలపైన ఒక నిర్ణయం తీసుకోవడానికి సుప్రీం కోర్టు గతంలో నిరాకరించింది. దానికి బదులుగా ఆ విషయమై ట్రయల్ కోర్టుకే సిట్ తన అంతిమ నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. ఆ మాత్రానికే సుప్రీం కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తూ మోడి, బి.జె.పి నాయకులు సంతోషాతిరేకాలను వ్యక్తం చేశారు. ‘గాడ్ ఈజ్ గ్రేట్’ అంటూ ట్విటర్ లో వ్యాఖ్యానించి మోడి సైతం ఆ విషయంలో తానెంత ఆందోళన చెందినదీ పరోక్షంగా దేశ ప్రజలకు తెలియజేశాడు. సుప్రీం నిర్ణయం మోడి నిర్దోషి అని చెప్పడానికి రుజువు అని చెప్పేదాకా కూడా బి.జె.పి అగ్ర నాయకత్వం వెళ్లింది.
సుప్రీం కోర్టు నియమించుకున్న అమికస్ క్యూరీ రాజు రామచంద్రన్ నరేంద్ర మోడిని చట్టం ప్రకారం విచారించవలసి ఉందని చెబుతూ నివేదిక సమర్పించాడు. ఐ.పి.ఎస్ అధికారి సంజీవ్ భట్ సాక్ష్యం ఆధారంగా మరింత దర్యాప్తు జరపాలన్న రాజు రామచంద్రన్ వెలిబుచ్చిన అభిప్రాయాలను కూడా సిట్ పరిగణించలేదని అజ్ఞాత వనరులను ఉటంకిస్తూ ఎన్.డి.టి.వి తెలిపింది.
అప్పుడే అంతా ముగిసిపోలేదు. ‘సుప్రీం కోర్టు’ నియమించిన సిట్ నిర్ధారణలు అంతిమం కాదు. సిట్ నివేదికను ట్రయల్ కోర్టు ఎలా పరిగణిస్తుందో తెలియదు. ట్రయల్ కోర్టు నరేంద్ర మోడి కి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోకపోయినా కేసు సుప్రీం కోర్టు వరకూ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. చట్టాల ప్రకారం నరేంద్ర మోడి దోషిత్వం రుజువయ్యే అవకాశాలు లేకపోలేదు. అయితే, దేశంలో నెలకొని ఉన్న వాతావరణం ఆ అవకాశాలను బాగా బలహీనపరుస్తున్నాయి.
అమెరికా, యూరప్ లు దేశంపై రుద్దిన నూతన ఆర్ధిక విధానాలను సమర్ధవంతంగా రాజీ లేకుండా అమలు చేస్తున్నవారిలో నరేంద్ర మోడి అగ్రస్ధానంలో ఉన్నాడు. అటువంటి వ్యక్తులను దేశ, విదేశీ పెట్టుబడిదారీ ఆధిపత్య వర్గాలు వదులుకోవు. ఎంత పచ్చి నెత్తురు తాగే కిరాతకుడైనా, తమకు అనుకూల విధానాలు అమలు చేసినంతవరకూ, వారు నిస్సందేహంగా కాపాడుకుంటారు. కోర్టుల తీర్పుల్నీ, దర్యాప్తు బృందాల నివేదికలనూ ప్రభావితం చెయ్యడానికి కూడా సకల ప్రయత్నాలు చేస్తారనడంలో సందేహం లేదు.
గ్లోబలైజేషన్ని సమర్థిస్తున్నవాళ్ళలో ముస్లింలు కూడా నరేంద్ర మోడీని కోరుకుంటున్నప్పుడు హిందువులు మాత్రం అతన్ని వదులుకుంటారా? గుజరాత్ ఎన్నికలలో ముస్లిం మత పెద్దలు నరేంద్ర మోడీకే వోట్లు వెయ్యాలని తమ మతంవాళ్ళని కోరారని ఒక గ్లోబలైజేషన్ అనుకూల పత్రికలోనే వార్త వచ్చింది.
Hi,
Do you know the images you are using are from a Movie? can you specify that they are taken from a movie?
శేషు గారు, అవును మూవీ ఇమేజే అది. ఆ సంగతి వాటర్ మార్క్ చెబుతోంది కదా. వాస్తవం ఇంతకంటే ఘోరంగా ఉంటుంది. కత్తితో గర్భిణీ స్త్రీ పొట్ట చీల్చి బిడ్డను కూడా అదే కత్తితో చంపగల క్రౌర్యం ఏ కెమెరా పట్టివ్వగలదు? బహుశా అంతటి దుర్మార్గాన్ని ఈ సినిమా బొమ్మ చూపలేకపోతోందని మీరు చెప్పదలుచుకున్నట్లుంది. కాని హిందూ మతం పేరు చెప్పుకుంటున్న మూకలు ఇంతటి దారుణానికి ఒడిగట్టాయని చెప్పడానికి ఈ బొమ్మ సరిపోతుందనిపించింది.
నరేంద్ర మోడీ నరహంతకుడైతే అతను ఎన్నికలలో ఎలా గెలిచాడు అని అడిగేవాళ్ళు ఉన్నారు. నరేంద్ర మోడీకి ముస్లింలలోని ధనవంతుల సపోర్ట్ ఉంది. బిజెపితో గొడవ పెట్టుకుంటే ముస్లింలపై మళ్ళీ దాడులు జరుగుతాయనీ, కనుక బిజెపితో గొడవపెట్టుకోకుండా బిజెపిని ఎన్నికలలో గెలిపించాలనీ ముస్లిం మత పెద్దలే గుజరాత్ ఎన్నికల సమయంలో తమ మతంవాళ్ళతో చెప్పారు. ఈ వార్త అప్పట్లో “వార్త” దిన పత్రికలో వచ్చింది.