‘నీలి వీడియో’ మంత్రుల రాజీనామా


సాక్ష్యాత్తూ అసెంబ్లీలోనే మొబైల్ ఫోన్ లో ‘నీలి వీడియో’ లు చూస్తూ పట్టుబడిన ముగ్గురు కర్ణాటక మంత్రులు రాజీనామా చేసారు. తాము ‘స్వచ్ఛంధంగానే’ రాజీనామా చేసామని సదరు మంత్రులు పత్రికలకు తెలిపారు. మంత్రులు స్వచ్ఛంధంగానే రాజీనామా చేశారని కర్ణాటక ముఖ్యమంత్రి సదానంద గౌడ కూడా తెలిపాడు. రాజీనామా చేసిన మంత్రులు, ముఖ్యమంత్రి ఏమి చెబుతున్నప్పటికీ రాజీనామా చేయడానికి మంత్రులు నిరాకరించినట్లుగా పత్రికలు బుధవారం వార్తలు ప్రచురించాయి. బి.జె.పి సారధి నితిన్ గడ్కారీ ఎట్టి పరిస్ధితుల్లోనూ మంత్రులు రాజీనామా చేయవలసిందేననీ, రాజీనామా చేయడానికి నిరాకరిస్తే బర్తరఫ్ చేయడానికి సైతం వెనకాడవద్దనీ హెచ్చరించిన నేపధ్యంలోనే మంత్రుల రాజీనామాలను చూడవలసి ఉంది.

సహకార శాఖ మంత్రి లక్ష్మణ్ సవాది, స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి సి.సి.పాటిల్, పోర్టులు, పర్యావరణం శాఖల మంత్రి క్రిష్ణ పాలేమర్ రాజీనామాలు సమర్పించారు. వీరు ముగ్గురూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే మొబైల్ ఫోన్ లో నీలి వీడియోలు చూస్తూ పత్రికా విలేఖరుల గ్యాలరీలో ఉన్న కెమెరాలకు దొరికిపోయారు. ముగ్గురు మంత్రులూ పదే పదే విలేఖరుల గ్యాలరీవైపుకి చూస్తుండడంతో తమకు అనుమానం వచ్చిందనీ, ఫోకస్ చేసి చూడగా వారు చేస్తున్న పని అర్ధమై రికార్డు చేశామనీ మంత్రుల వ్యవహారాన్ని రికార్డు చేసిన కెమెరా మెన్ ని ఉటంకిస్తూ ‘ది హిందూ’ పత్రిక తెలిపింది. తన పేరు బైట పెట్టవద్దని కెమెరా మెన్ కోరినట్లుగా ఆ పత్రిక తెలిపింది.

ముగ్గురు మంత్రుల రాజీనామాలను గవర్నర్ భరద్వాజ ఆమోదించాడు. గవర్నర్ భరద్వాజ కూడా ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న బి.జె.పి ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పించడానికి తాము రాజీనామా చేశామని సవాది తెలిపాడు. ఈ వ్యవహారంపై ‘విచారణ’ జరిపించాలని స్పీకర్ బోపయ్య ను కోరామని ఆయన తెలిపాడు. విచారణలో తాము మచ్చ లేకుండా బైటపడతామన్న విశ్వాసాన్ని సవాది వ్యక్తం చేశాడు. అసెంబ్లీ సమావేశాలలో నీలి చిత్రాలు చూసినందుకే రాజీనామా చేస్తూ తాము మచ్చ లేకుండా బైటపడతామని వారెలా చెప్పగలరో అర్ధం కాని విషయం. కన్నంలో వేలుతో దొరికినా మరొకందుకు వేలు పెట్టామంటున్న వీరినేమనాలి?

ప్రతిపక్ష కాంగ్రెస్, జె.డి(ఎస్) లు ‘మంత్రులు రాజీనామా చేయడంతో సరిపోదనీ, వారిని అసెంబ్లీ నుండి బర్తరఫ్ చేయాలనీ’ డిమాండ్ చేశారు.

రాజీనామా చేసిన మంత్రి లక్ష్మణ్ సవాది, మంగళవారం పత్రికలతో మాట్లాడుతూ తన చర్యను సమర్ధించుకోజూడడం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. ఓ స్త్రీతో కొంతమంది పురుషులు డాన్స్ చేస్తున్న దృశ్యాన్ని తాము చూశామనీ, డాన్స్ అనంతరం ఆ స్త్రీని పురుషులు ‘గ్యాంగ్ రేప్’ చేశారనీ ఆయన చెప్పాడు. రేపిస్టులను పోలీసులు ఆ తర్వాత అరెస్టు చేశారనీ, వారిని బహిరంగంగా రాళ్లతో కొట్టారనీ సవాదీ చెబుతూ, ‘రేవ్ పార్టీల’ లపై అసెంబ్లీలొ చర్చ జరుగుతున్న సందర్భంగా ఆ వీడియో తాము చూడవలసి వచ్చిందని ఆయన సమర్ధించుకున్నాడు. ఉడుపి లో జరిగిన ఓ రేవ్ పార్టీ పై శాసన మండలి లో చర్చ జరుగుతున్న సందర్భంలో ఆ వీడియో చూడవలసి వచ్చిందని ఆయన సమర్ధించుకున్నాడు.

నిజానికి, మంత్రులు చూసింది ఒక్క వీడియో కాదనీ, వరుసగా నాలుగైదు నీలి వీడియో క్లిప్పింగ్ లను వారు చూశారనీ ‘ది హిందూ’ పత్రిక తెలిపింది. వివిధ ఛానెళ్లలో ప్రసారమైన వీడియో క్లిప్పింగ్ లలోనే ఆ విషయం తేటతెల్లమైనట్లుగా ‘హి హిందూ’ వార్తను బట్టి తెలుస్తోంది.

భారత దేశంలోనూ, ఇతర ప్రపంచ దేశాల్లోనూ ఉన్నది ‘పురుషాధిక్య వ్యవస్ధ’. ‘పురుషాధిక్య వ్యవస్ధ’ లో స్త్రీలను తేలిక గా చూడడం, వారిని కోరికలు తీర్చే పనిముట్లుగా చూడడం సర్వామోద సూత్రం. భార్యలను కొట్టే హక్కు భర్తలకు ఉంటుందంటూ పోలీసులు సైతం ఆమోదం తెలిపే వ్యవస్ధలో ‘మగ’ మంత్రులు ఈ విధంగా దిగజారి ప్రవర్తించడం ఆశ్చర్యం కాకపోవచ్చు. వారు అసెంబ్లీలలో కూర్చుని పెంచి పోషిస్తున్న పురుషాధిక్య సంస్కృతే వారా విధంగా దిగజారడానికి తగిన సామాజిక ఏర్పాటును కల్పించింది. తమ ఆర్ధిక దోపిడి ని కొనసాగించడానికి సమాజంలోని సకల సామాజిక వైకల్యాలను చూసీ చూడనట్లు పోయే పెట్టుబడిదారీ, భ్యాస్వామ్య పాలకులు స్త్రీలను గౌరవిస్తారనుకోవడం భ్రమే కాగలదు.

9 thoughts on “‘నీలి వీడియో’ మంత్రుల రాజీనామా

 1. అసెంబ్లీ సమావేశాలలో నీలి చిత్రాలు చూసినందుకే రాజీనామా చేస్తూ తాము మచ్చ లేకుండా బైటపడతామని వారెలా చెప్పగలరో అర్ధం కాని విషయం. కన్నంలో వేలుతో దొరికినా మరొకందుకు వేలు పెట్టామంటున్న వీరినేమనాలి?_____________పాపం, అసలే చచ్చారు!చచ్చిన పాముల్ని ఇంకా ఎందుకు చంపుతారు..? :-))

  అందులో ఒకడు స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రిట! దేవుడా….! !

 2. సాధారణంగా స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి పదవి స్త్రీలకి ఇస్తారు కదా. పురుషాధిక్యత బలంగా ఉన్న టర్కీ లాంటి దేశాలలో కూడా స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి పదవి స్త్రీలకే ఇస్తారని విన్నాను.

 3. Praveen, స్త్రీల సమస్యల పట్ల సాటి స్త్రీలుగా అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో అలా ఇస్తారు ఎక్కడైనా! కానీ రాజకీయాల్లో అడుగు పెట్టాక స్త్రీలు లేదు, పురుషులూ లేదు…అంతా రాజకీయ నాయకులే! ముఖ్యంగా మన దేశంలో! ఎవరి వల్లా ఒరిగేది ఏమీ లేదు.

 4. 3g ఫోన్ కదా అని యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోలు చూసి ఉంటారు. ఆ మంత్రులని అరెస్ట్ చేసే ముందు యూట్యూబ్‌ని కూడా నిషేధిస్తే బాగుంటుంది. నీలి వీడియోలకి అడల్ట్ లేబెల్ పెట్టడం తప్ప యూట్యూబ్ ఏమీ చెయ్యడం లేదు.

 5. 3g ఫోన్ ఉంటే? శాసన సభలో బ్లూ ఫిల్ములు చూసేయడమేనా? తమ హోదా ఏమిటో, ఎవరికి జవాబు దారీయో, ఏమీ ఆలోచించక్కర్లేదా?

  యూ ట్యూబు కాకపొతే, Daily motion, అది కాకపోతే మరోటి! యూ ట్యూబ్ ని నిషేధించడం కాదు, నీలి వీడియోలు యూ ట్యూబ్ లాంటి చోట్ల అప్ లోడ్ చేయడం నిలిపేయాలి. కానీ యూ ట్యూబ్ దేశ సేవ కోసం ఏర్పడలేదు కాబట్టి వాళ్ళు అడల్ట్ లేబుల్ పెట్టడం తప్ప ఇంకేమీ చేయరు .

 6. యూట్యూబ్ సంగతి మీకు తెలిసినట్టు లేదు. పుట్టపర్తి సాయిబాబా మేజిక్‌లు ఎలా చేస్తాడో చూపించే వీడియోలు నేను అప్‌లోడ్ చేసినప్పుడు ఆ వీడియోలు ఒక మతంవాళ్ళని కించపరిచేలా ఉన్నాయని చెప్పి ఆ వీడియోలని వెంటనే డిలీట్ చేశారు. వీడియోలు అప్‌లోడ్ చేసిన ఐదు నిముషాలలోపే అవి డిలీట్ అయిపోయాయి. వాళ్ళు వీడియోలు చూడకుండానే డిలీట్ చేసేశారు. సాయిబాబా గురించి నిజాలు చూపించే వీడియోలు హిందువులు కాకపోతే క్రైస్తవులైనా చూస్తారు. అది వాళ్ళ వ్యాపారానికి పెద్ద సమస్య కాదు. ప్రపంచ జనాభాలో సఘం మంది మహిళలే. మహిళలు చూడని నీలి వీడియోలు డిలీట్ చేస్తే వాళ్ళకి నష్టం ఏమీ లేదు. అయినా ఆ వీడియోలని ఎందుకు ఉంచుతున్నట్టు?

 7. అవును ప్రవీణ్, నాకు చాలా విషయాలు తెలీవు. మీకు వీలు కుదిరినపుడు చెప్తే తెలుసుకుంటాను. Google ప్లస్ లో నిమిషానికో పొస్టు పెడుతుంటారుగా, వాటి నుంచైనా కొంత తెల్సుకుంటాను.

  ఇక్కడ మీరు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే…మతం వేరు, బ్లూ వీడియోలు వేరు అని! వేటిని ఎక్కువమంది చూస్తారో “పెద్దలకు మాత్రమే” వీడియోలు తెచ్చి ప్లస్ లో పెట్టే మీకు నేను చెప్పక్కర్లేదు కదూ!

  అయినా….సమాచారం కోసం చెప్తున్నా….సాయి బాబా ఛీటింగ్ పేరుతో లెక్కకు మించిన వీడియోలు యూ ట్యూబ్ లో ఉన్నాయి. మీవే డిలీట్ చేశారంటే కారణం ఇంకేదైనా అయి ఉండొచ్చేమో, ఆలోచించండి

 8. అవి కడుపు నుంచి లింగం తియ్యడం, చేతుల నుంచి గొలుసులు తియ్యడం లాంటి టెక్నిక్‌లు చూపించే వీడియోలే. ఒక సాయిబాబా వ్యతిరేకి తన వెబ్‌సైట్‌లో పెట్టిన wmv ఫైల్స్‌ని డౌన్‌లోడ్ చేసి యూట్యూబ్‌లో పెట్టాను. ఆ వెబ్‌సైట్ నిర్వాహకుడే ఆ వీడియోలకి కాపీ రైట్ లేదు అని అన్నాడు కనుక అది కాపీ రైట్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్ కూడా కాదు.

 9. ఇంకో విషయం. కొన్ని పెయిడ్ వీడియో సైట్లు నీలి వీడియోలని అనుమతించవు. పెయిడ్ వీడియో సైట్లకి అడ్వర్టైజ్‌మెంట్ల నుంచి ఆదాయం రాదు కాబట్టి అడ్వర్టైజర్లని రాబట్టడానికి నీలి వీడియోలని అనుమతించాల్సిన అవసరం వాళ్ళకి కనిపించదు. యూట్యూబ్ లాంటి ఉచిత వీడియో సైట్లతోనే ఇక్కడ సమస్య ఉంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s