పాకిస్ధాన్ విభజనపై అంబేద్కర్, గోల్వాల్కర్ అభిప్రాయాలను పోల్చతగదు


ముస్లింల గురించి ఆర్.ఎస్.ఎస్ గురువుగోల్వాల్కర్ చెప్పిన అంశాలను ఉటంకిస్తూ ఈ బ్లాగ్ లో ఒక పోస్టు ప్రచురితమయ్యింది. ఆ పోస్టు కింద అంతర్యానం గారు ఓ వ్యాఖ్య రాసారు. అదియధాతధంగా ఇలా ఉంది.

వి. శేఖర్ గారు

థాట్స్ ఆన్ పాకిస్తాన్అనే పుస్తకంలో అంబేద్కర్ అంటారు “…..దేశవిభజనతోపాటు మహమ్మదీయులందరినీ పాకిస్తాన్ పంపాలి. పాకిస్తాన్ లోనిహిందువులను, బౌద్ధులను భారతదేశానికి తరలించాలి. టర్కీ, గ్రీసు దేశాలలో ఇదిజరిగింది. తమ మత గ్రంధాల ప్రకారం ముస్లీములు భారతదేశాన్ని మాతృదేశంగాభావించడం సాధ్యం కాని పని”….

భారతదేశంలో ఉండాలి కాబట్టి ఈ దేశ సంస్కృతిని ఆచరించాలని గోల్వాల్కర్చెబితే, వాళ్ళు ఉండలేరు కాబట్టి వాళ్ళని పాకిస్తాన్ పంపేయాలని అంబేద్కర్అన్నారు.

ఈ రెండు విషయాలను మీరు విశ్లేషిస్తే చదవాలని ఉంది.

అంతర్యామిగారు ఉటంకించిన వ్యాఖ్యలను ఏ సందర్భంలో అంబేద్కర్ చేసినదీ ఆయన చెప్పలేదు. ఆసందర్భం కోసం నేను అంబేద్కర్ రచనలను వెతికాను. అంబేద్కర్ రచనలులోఎనిమిదవ భాగం పాకిస్ధాన్ విభజన విషయమై అంబేద్కర్ తయారు చేసిననివేదికకే పూర్తిగా కేటాయించారు. దానిని చదవగా అంబేద్కర్ ప్రస్తావనకూ, గురుగోల్వాల్కర్ ప్రస్తావనకూ సంబంధం లేదని అర్ధం అవుతుంది. ఆ విషయమే ఈటపాలో వివరించబడుతుంది.

అంబేద్కర్ చర్చించిందేమిటి?

బ్రిటిష్ భారత దేశాన్ని విభజించి పాకిస్ధాన్ ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే అటువంటి విభజన వల్ల తలెత్తే సమస్యలను అంబేద్కర్ తన గ్రంధంలో చర్చించారు. ముస్లిం మెజారిటీ ప్రాంతాలను పాకిస్ధాన్ గా విభజించదలిస్తే పాకిస్ధాన్ భూభాగంలో ఉన్న హిందువుల పరిస్ధితిని గురించి అంబేద్కర్ అందోళన చెందాడు. ముఖ్యంగా పశ్చిమ, తూర్పు పాకిస్ధాన్ లు గా విభజించదలుచుకున్న రాష్ట్రాలను ఏ భూభాగాలవద్ద విభజన రేఖ గీయాలన్న సమస్యను అంబేద్కర్ పట్టించుకున్నాడు. విభజన జరిగాక పాకిస్ధాన్ లో మత సామరస్యం నెలకొల్పబడితే తప్ప అక్కడ హిందువులకు రక్షణ దొరకదని అంబేద్కర్ ఊహించి దాని కనుగుణమైన పరిస్ధితుల ఏర్పాటుకు తగిన చర్యలను ఆయన ప్రతిపాదించాడు. పాకిస్ధాన్ విభజన జరిగాక అది ముస్లిం రాజ్యంగా ఏర్పడితే అక్కడ అల్ప సంఖ్యాక వర్గాలుగా మిగిలిపోయే హిందువులకు రాజ్యాంగ రక్షణలు ఏర్పాటు చేయడమా లేక సరిహద్దులు నిర్ణయించడంలో హిందూ మెజారిటీ ప్రాంతాలను భారత దేశంలో కలపడమా లేక ఇతర మార్గాలేమన్నా ఉన్నాయా అన్న విషయాలను అంబేద్కర్ చర్చించాడు.

ఈ సందర్భంగా అంబేద్కర్ తన విస్తృత మేధా సంపత్తికి పని పెట్టాడు. ప్రపంచంలో ఇదే తరహా సమస్యలు తలెత్తిన చోట అవి పరిష్కారం చేసుకున్న విధానాన్ని పరిశీలించాడు. టర్కీ, గ్రీసు, బల్గేరియా, ఐర్లండు లాంటి దేశాలలో ఇటువంటి సమస్యలు తలెత్తాయని ఆయన తన గ్రందంలో ఉదహరించాడు. అక్కడ సజావుగా సమస్యలు పరిష్కరించబడిన ఉదాహరణలనూ, సజావుగా సమస్యలు పరిష్కారం కాక సమస్య మరింత జఠిలమైన ఉదాహరణలను అంబేద్కర్ ప్రస్తావించాడు. సఫలమయైన ప్రయత్నాలను చర్చించి ఎందుకు సఫలమైందీ వివరించాడు. అలాగే విఫలమైన పరిష్కార మార్గాలను కూడా ఉదహరించి అవెందుకు విఫలమైందీ చర్చించాడు. సఫలమైన పద్ధతులను భారత దేశ ఉదాహరణకు ఎలా విజయవంతంగా అమలు చేయవచ్చునో కూడా అంబేద్కర్ వివరించాడు.

తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో హిందూ, ముస్లిం ప్రజలు ఏయే ప్రాంతాల్లో విస్తరించి ఉన్నదీ అంబేద్కర్ అధ్యయనం చేశాడు. తూర్పు పాకిస్ధాన్ (బెంగాల్, అస్సాం) విభజించబడడానికి బాగా అనుకూలంగ ఉందనీ, పశ్చిమ పాకిస్ధాన్ (వాయవ్య రాష్ట్రాలు, సిందు, పంజాబ్) సరిహద్దు ప్రాంతాలు సమస్యలు లేకుండా విభజించబడడానికి అంతగా అనుకూలంగా లేవనీ అంబేద్కర్ గమనించాడు. తూర్పు పాకిస్ధాన్ లోని సరిహద్దు జిల్లాల్లో ముస్లిం మెజారిటీ జిల్లాలు, హిందూ మెజారిటీ జిల్లాలు పక్కపక్కనే తూర్పు పాకిస్ధాన్, భారత్ లలో కలపడానికి వీలుగా ఉండగా, పశ్చిమ పాకిస్ధాన్ సరిహద్దులోగల హిందూ మెజారిటీ జిల్లాలు, ముస్లిం మెజారిటీ జిల్లాలు పక్క పక్కనే కాక చెదిరిపోయినట్లుగా ఉన్న సంగతిని అంబేద్కర్ గమనించాడు. అంటే హిందు మెజారిటీ జిల్లా పక్కనే మరొక ముస్లిం మెజారిటీ జిల్లా, దాని పక్కన హిందూ మెజారిటీ జిల్లా… ఇలా పాకిస్ధాన్ భూభాగంలోకి సమస్యలు లేకుండా కలిపివేయడానికి వీలుగా లేకుండా ఉన్నాయి. ఈ పరిస్ధితికి అంబేద్కర్ ఒక పరిష్కారాన్ని సూచించాడు.

ఆ పరిష్కారమే ‘జనాభా బదలాయింపు’. జనాభా బదలాయింపు అనగానే చాలామంది నవ్వుతారనీ, అపహాస్యం చేస్తారనీ చెబుతూ ఆ పరిష్కారం ఏయే ప్రాంతాల్లో విజయవంతం అయిందీ అంబేద్కర్ వివవించాడు. అంబేద్కర్ గ్రంధం నుండి నేరుగా ఉటంకించడం ఇక్కడ సముచితంగా ఉంటుంది.

“జనాభాను మార్చడం, బదలాయించడం ఏమిటని కొందరు అపహాస్యం చేస్తారు. అల్ప సంఖ్యాక వర్గాల సమస్య స్పష్టం చేసే సంక్లిష్ట పరిస్ధితులు ఏమిటో, వాళ్ళని కాపాడ్డానికి చేసే అన్ని ప్రయత్నాలూ విఫలం అయితే వచ్చే చిక్కులు ఏమిటో అపహాస్యం చేసేవాళ్ళకు తెలియదు. యుద్ధానంతరం ఏర్పడ్డ రాజ్యాల్లోనూ, యూరప్ లోని పాత రాజ్యాల్లోనూ అల్ప సంఖ్యాక వర్గాల సమస్య వచ్చింది. వాటి రాజ్యాంగాలు ఈ అల్ప సంఖ్యాక వర్గాలకు రాజ్యాంగపరమైన రక్షణ చర్యలు కల్పిస్తే చాలన్న ఊహతో మొదలయ్యాయి. దాంతో ఆ నూతన రాజ్యాల రాజ్యాంగాలు చాలా భాగం అధిక సంఖ్యాక వర్గాలు, అల్ప సంఖ్యాక వర్గాలు ఏ హక్కులతో ఉండాలో పెద్ద ప్రాధమిక హక్కులతో జాబితాలు నిండిపోయాయి. అధిక సంఖ్యాక వర్గాలు వాటిని ఉల్లంఘించకుండా ఉండాలని అనుకున్నారు. కాని అనుభవం తెలియజేసిందేమిటి? రాజ్యాంగ రక్షణలు అల్ప సంఖ్యాకవర్గాలను కాపాడలేవని. అల్పసంఖ్యాకవర్గాల మీద నిర్ధాక్షిణ్యంగా చేసిన యుద్ధం కూడా సమస్యను పరిష్కరించలేదని. అప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి ఉత్తమ మార్గం విదేశీ అల్ప సంఖ్యాక వర్గాలనూ, తమ అల్పసంఖ్యాక వర్గాలనూ బదలాయించుకోవడం అన్న ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఎవళ్ల సరిహద్దుల్లోకి వాళ్ళు వెళితే సజాతీయ రాజ్యాలు ఏర్పడతాయని వారి ఉద్దేశ్యం. టర్కీలో, గ్రీక్ లో, బల్గేరియాలో జరిగింది ఇదే. జనాభా బదలాయింపుని అవహేళన చేసేవాళ్ళు టర్కీలో, గ్రీస్ లో, బల్గేరియాలో ఉత్పన్నమైన అల్ప సంఖ్యాకవర్గాల చరిత్రను అధ్యయనం చెయ్యడం బాగుంటుంది. వాళ్ళు అధ్యయనం చేస్తే జనాభా బదలాయింపే ఈ సమస్యను పరిష్కరించేందుకు ఫలవంతమైన మార్గం అని ఆ దెశాలు తెలుసుకున్నట్లు బోధపడుతుంది. ఈ దేశాలు నిర్వహించదలచిన కర్తవ్యం ఏ మాత్రం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇరవై మిలియన్ల జనాభాను ఒక నివాసం నుండి మరో నివాసానికి బదలాయించడం ఈ పనిలో ఉంది. అయినా ఏ మాత్రం బెదిరిపోకుండా, ఈ మూడు దేశాలు ఈ కర్తవ్య భారాన్ని భుజస్కందాల మీదకు ఎత్తుకున్నాయి. దిగ్విజయంగా పూర్తి చేశాయి. ఏమంటే జాతి సామరస్యం మిగిలిన అన్నింటికంటే ఎక్కువైందని అవి పరిగణించడమే ఇందుకు కారణం.”

పై పేరా తెలుగు అనువాదం లోనిది. ఇంగ్లీషు మూలం కావాలనుకుంటే అది ఇలా ఉంది.

“Some scoff at the idea of the shifting and exchange of population. But those who scoff can hardly be aware of the complications, which a minority problem gives rise to and the failures attendant upon almost all the efforts made to protect them. The constitutions of the post-war states, as well as of the older states in Europe which had a minority problem, proceeded on the assumption that constitutional safeguards for minorities should suffice for their protection and so the constitutions of most of the new states with majorities and minorities were studded with long lists of fundamental rights and safeguards to see that they were not violated by the majorities. What was the experience ? Experience showed that safeguards did not save the minorities. Experience showed that even a ruthless war on the minorities did not solve the problem. The states then agreed that the best way to solve it was for each to exchange its alien minorities within its border, for its own which was without its border, with a view to bring about homogeneous States. This is what happened in Turky, Greece and Bulgaria. Those, who scoff at the idea of transfer of population, will do well to study the history of the minority problem, as it arose between Turky, Greece and Bulgaria. If they do, they will find that these countries found that the only effective way of solving the minorities problem lay in exchange of population. The task undertaken by the three countries was by no means a minor operation. It involved the transfer of some 20 million people from one habitat to another. But undaunted, the three shouldered the task and carried it to a successful end because they felt that the considerations of communal peace must outweigh every other consideration.”

ఈ సున్నిత అంశాలపైన అప్పటి భారత ప్రభుత్వం చేసిన అధ్యయనం ఏమిటో తెలియదు గానీ దేశ విభజనకు అనుసరించవలసిన పద్ధతులను నిర్ధారించడానికి అంబేద్కర్ రాసిన గ్రంధం బాగా ఉపయోగపడిందని నెహ్రూ, జిన్నా, గాంధీ లాంటి పెద్దలు ప్రశంసిన సంగతి చరిత్రలో రికార్డయి ఉంది. ఈ గ్రంధం రచించేనాటికి దేశ విభజన అనంతరం పాకిస్ధాన్ గా విభజింపవలసిన భూభాగాల పట్ల జిన్నాకు కూడా పూర్తి పరిజ్ఞానం లేకుండా పోయింది. ముస్లిం మెజారిటీ ప్రాంతాలను పాకిస్ధాన్ గా ఏర్పాటు చేయాలన్న సాధారణ డిమాండ్ తప్ప నిర్ధిష్టంగా ఏ ప్రాంతాలగుండా సరిహద్దు గీయాలన్నది జిన్నా, నెహ్రూ, గాంధీ లకు ఈ గ్రంధ రచన జరిగేదాకా ఒక అవగాహన ఏర్పడలేదు. పాకిస్ధాన్ ఏర్పాటు జరగాలా వద్దా అన్న అంశంపైన గాంధీ జిన్నాతో ఉత్తర ప్తత్యుత్తరాలు నడిపాడు తప్ప విభజన అనివార్యం అయితే ఏమిటన్న దాన్ని గురించి వారు చర్చించుకోలేదు. దేశ విభజన పాప, పుణ్యాలుగా గాంధీ చూస్తే అంబేద్కర్ వాస్తవాల ప్రాతిపదికగా, మత సామరస్యం ప్రాతిపదికగా, ప్రజలు మత సంఘర్షణలు లేకుండా జీవనం గడపవలసిన అవసరాల ప్రాతిపదికన చూసాడు. గాంధీ వ్యక్తం చేసిన ‘పాప, పుణ్యాల’ వాదనను అంబేద్కర్ తన గ్రంధంలో చీల్చి చెండాడిన అంశం కూడా మనం చూడగలం.

గ్రంధం నేపధ్యం

డా.బి.ఆర్.అంబేద్కర్ పాకిస్ధాన్ విభజన పైన రాసిన గ్రంధ నేపధ్యానికి వస్తే, అప్పటికింకా దేశ విభజన జరగలేదు. 1940 మార్చి 22, 24 తేదీల మధ్య ముస్లింలీగ్లాహోర్ లో సమావేశమై పాకిస్ధాన్ తీర్మానాన్ని ఆమోదించింది. అప్పటి బొంబాయిరాష్ట్రంలో ఇండిపెండెంట్ లేబర్ పార్టీఅన్న పేరుతో ఒక రాజకీయ పార్టీఉండేది. ముస్లిం లీగ్ తీర్మానం చేశాక ఈ పార్టీ కూడా పాకిస్ధాన్ సమస్య పట్లతన వైఖరిని అప్పటికి చెప్పనవసరం లేదని భావిస్తూనే ఆ సమస్యను అధ్యయనంచేయాలని భావించింది. (ఒక విధంగా ఆ పార్టీ పాకిస్ధాన్ భావన పట్లఆకర్షితురాలైంది అని కూడా అంబేద్కర్ తన గ్రంధం ప్రస్తావనలోపేర్కొన్నాడు.) పాకిస్ధాన్ సమస్యను అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలనిఆరుగురితో ఒక కమిటీని ఆ పార్టీ నియమించింది. ఆ కమిటీ సభ్యుల్లో అంబేద్కర్ ఒకరు.నాతో సహా వీరు కమిటీలో సభ్యులుఅని చెబుతూ అంబేద్కర్ ఇతర సభ్యుల పేర్లనుప్రస్తావనలో ఉదహరించాడు. వీరంతా ఆ పార్టీ సభ్యులేనని ఆయన పేర్కొన్నాడు. ఈకమిటీలోని ఇతర సభ్యుల కోరిక మేరకు అంబేద్కర్ ఈ గ్రంధ రచనకు పూనుకున్నారు. నివేదికతయారయ్యాక దాన్ని ఇండిపెండేంట్ లేబర్ పార్టీ చర్చించి, ప్రకటించమని కోరింది.ఆ నివేదికే ఈ గ్రంధం. పాకిస్ధాన్ సమస్యను అధ్యయనం చేసేవారికి సహాయకారిగాఉండాలన్నదే గ్రంధం లక్ష్యం అని అంబేద్కర్ తన ప్రస్తావనలో పేర్కొన్నారు.

గ్రంధ రచన ఏవైపూ మొగ్గు చూపడానికి ఉద్దేశించింది కాదని అంబేద్కర్చెప్పుకున్నారు. నిస్పక్షపాతంగా వాస్తవాలను అధ్యయనకర్తల ముందు ఉంచేప్రయత్నం చేశానని రాశారు. పాకిస్ధాన్ ఏర్పాటుకి ముస్లిం లీగ్ చెబుతున్నకారణాలు, పాకిస్ధాన్ ఏర్పాటుకి వ్యతిరేకిస్తూ హిందూవాదులు చెబుతున్నకారణాలు వారి వారి వాదనలు ప్రస్తావిస్తూ, ఆ వాదనలు రెండింటికీ మద్దతుగాఅంబేద్కర్ అనేక అంశాలను చెప్పాడు. అప్పటికి దేశంలో ఉన్న అనేక రాజకీయ, ఆర్ధిక, సామాజిక పరిస్ధితులను అయన వివరించాడు. భారత దేశ పరిస్ధితుల వివరణఇచ్చేటపుడు అంబేద్కర్ తన దృక్కోణాన్నే అనుసరించాడని వేరే చెప్పనవసరం లేదు.పాకిస్ధాన్ అనుకూల వాదనలు వివరించేటప్పుడు వాటికి మద్దతుగా అనేక అంశాలనుఅంబేద్కర్ వివరించాడు. అదే విధంగా పాకిస్ధాన్ వ్యతిరేక వాదనలకు మద్దతుగాకూడా అనేక వాదనలను ఆయన వివరించాడు.

నిర్ధిష్టవాదనను వివరిస్తున్నపుడూ, ఆ వాదనకు మద్దతుగా అంబేద్కర్ ప్రస్తావించినవివిధ పరిస్ధితులను ఉదహరిస్తున్నపుడూ అంబేద్కర్ ఆ నిర్ధిష్ట వాదనకు మద్దతుఇస్తున్నట్లుగా కనిపిస్తాడు. దానికి వ్యతిరేక వాదనను వివరించేటప్పుడు కూడాఅంబేద్కర్ అదే పరిస్ధితిలో కనిపిస్తాడు. గ్రంధం మొత్తం మీద చూస్తేఅంబేద్కర్ కి పాకిస్ధాన్ ఏర్పాటు పట్ల ఉన్న మొగ్గు స్పష్టంగా కనిపిస్తుంది.తాను ఎటువైపు మొగ్గు చూపుతున్నానో తన గ్రంధంలో చెప్పలేదని తననువిమర్శించారని చెబ్తూ ఓ చోట అంబేద్కర్, వాస్తవానికి తానా పని చేశానని కూడాచెప్పాడు. స్పష్టంగా తన వైఖరి చెప్పలేదని అంగీకరిస్తూనే అక్కడొక చోట, ఇక్కడొక చొట తన వైఖరిని చెప్పానని కూడా ఆయన చెప్పాడు. అలా స్పష్టమైనఅంబేద్కర్ వైఖరి పాకిస్ధాన్ ఏర్పాటుకి అనుకూలంగా ఉందని గ్రంధం చదివినవారికి అర్ధం అవుతుంది. గ్రంధానికి రాసిన ఉపోద్ఘాతంలో అంబేద్కర్ రాసిన ఈ భాగం చూడండి.

“… పాకిస్ధాన్ ఏర్పాటు పధకానికి సంబంధించిన సమస్త విషయాలను తెలియటమే నాలక్ష్యం. అంతేగాని పాకిస్ధాన్ కోసం వాదించడం లేదు. వివరించడం లక్ష్యం గానీమీ మనసుల్ని మార్చడం నా లక్ష్యం కాదు. పాకిస్ధాన్ పై నాకు ఎలాంటిఅభిప్రాయాలూ లేవనడం సబబు కాదు. నాకూ కొన్ని అభిప్రాయాలున్నాయి. కొన్నింటినివెల్లడించాను. మరికొన్నింటిని మీరే గ్రహించాల్సి వుంటుంది. నాఅభిప్రాయాలను గూర్చి రెండు విషయాలను చెప్పవచ్చు. అభిప్రాయాలు వివరించివాటిని హేతుబద్ధంగా చెప్పడం మొదటిది. నేను ఏమి చెప్పినా అవి ప్రజల నిశ్చితదురభిమానాల మీద ఆధారపడకపోవడం రెండవది. ఒక రకంగా అవి నా ఆలోచనలు మాత్రమే.అభిప్రాయాలు కావు. మరో రకంగా చెప్పాలంటే నాది ఏమీలేని శూన్యపు బుర్ర కాదు.నేను కొన్ని అభిప్రాయాలను ఆహ్వానిస్తాను. … … …సమస్యపై గల అన్నివిషయాలను పాఠకుల ముందుంచడానికి (చేసిన) ఈ ప్రయత్నంలో నా అభిప్రాయాలనువేటినీ చేర్చలేదు. ఇరు పక్షాల వాదనలను పాఠకుల ముందుంచా. పాఠకులే వారిఅభిప్రాయాలను ఏర్పరుచుకుంటారు.” (అంబేద్కర్ రచనలు, ఎనిమిదవ భాగం, ‘ఉపోద్ఘాతం’, పేజి XX, XXI).

పాకిస్ధాన్కి మద్దతుగా వివిధ అంశాలను చెప్పినపుడు అంబేద్కర్ పాకిస్ధాన్ వ్యతిరేకులనుచీల్చి చెండాడుతున్నట్లు కనిపిస్తుంది. పాకిస్ధాన్ కి వ్యతిరేకంగా ఉన్నఅంశాలను ప్రస్తావిస్తున్నపుడు అంబేద్కర్ పాకిస్ధాన్ అనుకూలురను చీల్చిచెండాడుతున్నట్లు కనిపిస్తుంది. ఇటువంటి పరిస్ధితి చూసి పాఠకుడు అయోమయానికిగూడా గురవుతాడు. ఈ గ్రంధాన్ని ఇలా రాసినందుకు కూడా తనపైన విమర్శలువచ్చాయని అంబేద్కర్ రాసుకున్నాడు. అయితే, నిస్పక్షపాతంగా వివిధ అంశాలనుపాఠకుల ముందు ఉంచాలని భావించిన కారణాన, గ్రంధం అలా ఉందని కూడా ఆయన సమాధానంఇచ్చాడు. అయినప్పటికీ తన వైఖరిని చెబుతూ వచ్చానని ఆయన చెప్పాడు. ఆ వైఖరిపాకిస్ధాన్ కి అనుకూలంగానే ఉందని పాఠకుడు గ్రహించగలడు.

ఇపుడు అంతర్యానం గారి ఉటంకన విషయానికి వస్తే, ఆయన ఉటంకించిన వాక్యాలు మొత్తం ఒక చోటినుండి సంగ్రహించినవి కావు. అసలు ఆయన ఉటంకించిన వ్యాక్యాలు అంబేద్కర్ గ్రంధంలో యధాతధంగా ఎక్కడా లేవు. అయితే ఆ అర్ధం వచ్చే విధంగా వేరే వాక్యాలు ఏమన్నా ఉన్నాయో లేదో తెలియదు. ఆ సంగతి అంతర్యానం గారే చెబితే బాగుంటుంది. మరో విషయం కూడా స్పష్టం చేయవచ్చు. అదేమంటే భారత దేశంలో మహమ్మదీయులు ఉండలేరు కాబట్టి వారిని పాకిస్ధాన్ పంపాలి అని అంబేద్కర్ ఎక్కడా చెప్పలేదు. భారతదేశంలోని మహమ్మదీయులందరినీ పాకిస్ధాన్ వెళ్లాల్సిందే అని అంబేద్కర్ అసలు చెప్పనేలేదు. పాకిస్ధాన్ ఏర్పడ్డాక, అది మత రాజ్యంగా ఏర్పడితే ఆ భూభాగం పై ఉండే హిందువుల పరిస్ధితి ఏమిటి? అన్న దానిపైనే అంబేద్కర్ పై భాగంలో కేంద్రీకరించాడు. పాకిస్ధాన్ మతరాజ్యంగా అవతరిస్తే అక్కడ మత సామరస్యత నెలకొనగలదా లేదా అన్న అనుమానం లేవనెత్తుతూ, మత సామరస్యత లేని పరిస్ధితుల్లో అక్కడి హిందువుల పరిస్ధితి పట్ల అంబేద్కర్ ఆందోళన చెందాడు. ఆ సమస్యకు పరిష్కారాన్ని వెతుకుతూ పాకిస్ధాన్ భూభాగంపై ఉండడానికి ఇష్టపడని వారు భారత దేశంలోకి తరలి రావడానికి అంగీకరించాలని ప్రతిపాదించాడు. భారత భూభాగాలపై కాకుండా పాకిస్ధాన్ భూభాగంపై ఉండడానికి ఎవరైనా కోరుకుంటె వారికీ అనుమతి ఇవ్వాలనీ అంబేద్కర్ ప్రతిపాదిస్తూ దానికి అవసరమైన విధి, విధానాలను అంబేద్కర్ తన గ్రంధంలో పొందుపరిచాడు. ఆస్తుల తరలింపు, స్దిరాస్తులను తరలించలేం కనుక దాని విలువను చెల్లించడం, పన్నులు… తదితర సమస్యలకు అంబేద్కర్ పరిష్కారం చూపాడు.

ఈ పరిష్కారం ఐఛ్ఛికమే గాని బలవంతం కాదు అని కూడా అంబేద్కర్ చెప్పాడు. “ప్రజల మార్పిడి అనేది తప్పనిసరా? లేక ఐచ్ఛికమా?” (అదే గ్రంధం, పేజి 375 పేరా 2) అని ప్రశ్నిస్తూ అంబేద్కర్, దానికి సమాధానంగా చరిత్రలో రెండూ జరిగాయని సమాధానం ఇచ్చాడు. భారత దేశానికి సంబంధించి ‘ఐచ్ఛికం’ చెయ్యాలని అంబేద్కర్ స్పష్టం గా చెప్పాడు. అంబేద్కర్ గ్రంధం నుండి ఉటంకించబడిన కింది భాగం చూస్తే ఆ విషయం స్పష్టం కాగలదు.

“… వ్యక్తి ఇష్టానికి వ్యతిరేకంగా అతనిని తన పూర్వీకుల ఆవాస ప్రాంతం నుండి వలస పొమ్మని బలవంతం చెయ్యడం మంచిది కాదు. ఒకవేళ అతను నివసిస్తున్న ప్రదేశం శాంతి, సుస్ధిరతలకు భంగం వాటిల్లి దేశం అస్తవ్యవస్త పరిస్ధితులకు లోనయ్యే పరిస్ధితులందు వలసపోవడమనేది అతని శ్రేయస్సు దృష్ట్యా అతనికే అవసరం. ఇపుడు కావలసినదేమంటే కష్టనష్టాలు లేకుండా కోరుకున్న వారందరూ వలసపోవుటకు అనువైన పరిస్ధితులు. కాబట్టి నా అభిప్రాయం ఏమంటే మార్పిడి అనేది బలవంతంగా జరుగకూడదు. వలసపోయే విషయంలో తమ మనోగతాన్ని వెల్లడించేవారికే దీనిని వదిలివేయాలి.” (అదే గ్రంధం, పేజి 375, పేరా 5)

కనుక భారత దేశంలో ఉన్న మహమ్మదీయులందరూ పాకిస్ధాన్ కి పంపేయాలని అంబేద్కర్ చెప్పాడని అంతర్యానం చెప్పినది నిజం కాదు. ‘దేశ విభజతో పాటు మహమ్మదీయులందరినీ పాకిస్ధాన్ పంపాలి’ అని అంబేద్కర్ ఎక్కడా చెప్పలేదు. అంతర్యానం గారు ఉటంకించినది నిజం కాదు. ఈ విధంగా అంబేద్కర్ చెప్పని అంశాలను ఆయనకి ఆపాదించడంలో అంతర్యానం గారి ఉద్దేశ్యం ఏమిటి? రాజ్యాంగ నిర్మాతగా, దళితుల అభ్యున్నతికి కృషి చేసినవాడిగా గౌరవం అందుకుంటున్న అంబేద్కర్ కి, ఆయన చెప్పని మాటలను ఆపాదించడం ఏ మాత్రం క్షంతవ్యం కాదు. టర్కీ, గ్రీసు, బల్గేరియా ల గురించి అంబేద్కర్ ఉదహరించిన సందర్భం పూర్తిగా వేరని పై ఉటంకను చూస్తే అర్ధం కాగలదు. అది తీసుకొచ్చి గురు గోల్వాల్కర్ చేసిన బోధనతో పోల్చడం సరికాదు.

అంతేకాకుండా అంబేద్కర్ చెప్పిన అంశాలకూ, గురు గోల్వాల్కర్ చెప్పిన అంశాలకూ కూడా అసలు పోలిక లేదు. రెండు మతాల ప్రజలు మత సామరస్యంతో జీవనం గడపవలసిన అవసరాన్ని చెబుతూ దానికి పాకిస్ధాన్ విభజన పరిష్కారం కాగలదని అంబేద్కర్ సూచించాడు. అంతే తప్ప భారతదేశంలో మహమ్మదీయులు ఉండలేరు కాబట్టి పాకిస్ధాన్ విభజన జరగాలని ఆయన తన గ్రంధంలో ఎక్కడా చెప్పలేదు. గురు గోల్వాల్కర్ భారతదేశంలో మహమ్మదీయులు ఉండరాదని నిర్ధారిస్తే, కొన్ని ప్రత్యేక పరిస్ధితుల్లో, కొద్దిమంది ముస్లింలు, వారి క్షేమం దృష్యా వలసపోవడం ఉత్తమం అని అంబేద్కర్ చెప్పాడు. అది కూడా పాకిస్ధాన్ లో నివసించడానికి ఇష్టపడని హిందువులతో భారత దేశంలో నివసించడానికి ఇష్టపడని ముస్లింలను పరస్పరం మార్చుకోవాలన్న సూచనలో భాగంగానే ఇటువంటి వలసను అంబేద్కర్ ప్రతిపాదించాడు. అది కూడా బలవంతంగా కాక ఐచ్ఛికంగా జరగాలనే అంబేద్కర్ చెప్పాడు

‘ద్విజాతి సిద్ధాంతం’ ప్రతిపాదించిన జిన్నా దానిని జాతి దృక్పధంతో కాక మతం దృక్పధంతో ప్రతిపాదించాడన్నది స్పష్టమే. ముస్లింలకు సొంత ‘నేషన్’ కావాలనడంలొ, ‘భౌగోళిక దేశం’ అర్ధంలో కోరిన కోరిక తప్ప చారిత్రక మూలాల ప్రాతిపదికన ఏర్పడిన ‘జాతి’ కి స్వంత దేశం కావలన్న కోరిక అందులో లేదు. అందుకు తగిన చారిత్రక ప్రాతిపదిక కూడా లేదు.

(ఈ అంశంఫై అధ్యయనం చేసే అవకాశం నాకు కల్పించినందుకు ‘అంతర్యానం’ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అదే సమయంలో అంబేద్కర్ చెప్పని అంశాలను ఆయనకి ఆపాదించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. -విశేఖర్)

One thought on “పాకిస్ధాన్ విభజనపై అంబేద్కర్, గోల్వాల్కర్ అభిప్రాయాలను పోల్చతగదు

  1. “ప్రజల మార్పిడి అనేది తప్పనిసరా? లేక ఐచ్ఛికమా?” (అదే గ్రంధం, పేజి 375 పేరా 2) అని ప్రశ్నిస్తూ అంబేద్కర్, దానికి సమాధానంగా చరిత్రలో రెండూ జరిగాయని సమాధానం ఇచ్చాడు. భారత దేశానికి సంబంధించి ‘ఐచ్ఛికం’ చెయ్యాలని అంబేద్కర్ స్పష్టం గా చెప్పాడు.”

    విశేఖర్ గారూ, ప్రజల మార్పిడి అంశంపై అంబేద్కర్ గారి ‘ఐచ్చిక’ ప్రతిపాదనకు జాతి లేదా మత ప్రాతిపదిక లేకపోగా ఆనాటికి తన ముందున్న పరిశీలనాంశంపై అత్యంత ప్రజాస్వామిక ఆలోచనలను ఆయన ప్రతిపాదించినట్లు సాక్షరంగా తెలుస్తోంది. అంబేద్కర్ గారి అభిప్రాయం -అంతర్యానం గారు పేర్కొన్న వాక్యం- యధాతథంగా నిజమే అనుకుంటే అంబేద్కర్ గారి వ్యాఖ్య చరిత్రలో నిలబడలేదంటూ నేను వ్యాఖ్యానించినట్లున్నాను. ఆయన సమగ్ర అభిప్రాయం చదివిన తర్వాత నా వాఖ్య పూర్తిగా తేలిపోయినట్లే. కాబట్టి ఊహ ప్రాతిపదికన నేను అప్పట్లో చేసిన వ్యాఖ్యను బేషరతుగా ఉపసంహరించుకోవలిసిందే.

    “ఈ వ్యాఖ్యలు అంబేద్కర్ ఏ నేపథ్యంలో అన్నారో దాని పూర్తి పాఠం విడి టపాగా రాయండి. ఇది అందరికీ చాలా ఉపయుక్తంగా ఉంటుంది.”

    అప్పటి నా వ్యాఖ్యలో విలువైన అంశం ఏదైనా ఉందంటే ఇదే. నా ప్రతిపాదనకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఈ విషయంలో చర్చ సరైన కోణంలో జరగడానికి మీ వ్యాసం మంచి అవకాశం ఇస్తోంది. మనఃపూర్వక అభినందనలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s