రెండేళ్ళ పాపని కొట్టి, గోడకి బాది…


ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.

ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ ట్రౌమా సెంటర్ లో రెండేళ్ళ పాప ‘ఫాలక్’ కధ విన్న ఎవరికైనా హృదయం చలించక మానదు. రెండు చేతుల్లోనూ ఎముకలు చిట్లి, నేరుగా మెదడుకే గాయాలై, కపాలం ఫ్రాక్చరై, వొంటినిండా కొరికిన గాట్లతో ఉన్న ‘ఫాలక్’ని పది రోజుల క్రితం మరో పదిహేనేళ్ల పాప ‘మహి గుప్త’, జనవరి 18న ‘తానే తల్లి’ నంటూ ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ లో చేర్చింది. మంచం పైనుండి కింద పడిందనీ, ఆ తర్వాత బాత్రూమ్ లో జారి పడిందనీ విభిన్న కధనాలు వినిపించడంతో ‘మహి గుప్త’ ను డాక్టర్లు పోలీసులకి అప్పజెప్పారు. ‘మహి గుప్త’ కూడా స్వయంగా బాధితురాలని పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చారు.

పాపకి రెండు చేతులూ ఫ్రాక్చర్ అయ్యాయి, ఒక్క చోట కాదు, అనేక చోట్ల. ఒంటి నిండా కొరికిన గాట్లు ఉన్నాయి. మొత్తం నోట్లో ఉన్న అన్ని పళ్ళనూ వినియోగించి కొరికిన ఆ గాయాల్ని చూస్తే పాషాణుడైనా ద్రవించక మానడు. కపాలం చిట్లిపోయింది. మెదడుకి గాయాలయ్యాయి. గోడ కేసి బాదడం వల్లనో, బరువైన వస్తువుతో కొట్టడం వల్లనో కపాలం చిట్లి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. కుడి వైపు మెదడులో కొన్ని చోట్ల రక్తం గడ్డ కట్టి ఉంది. కుడి చేయి బాగా వాచి ఉంది. ముఖంపైనా, నుదుటి పైనా, కాలిపైనా, తీవ్రంగా కొరికిన గుర్తులు లోతుగా ఉన్నాయి. ఇది చేసినవాడు మనిషై ఉండడు. జంతువులకి అది చేయడం సాధ్యం కాదు. ‘మానవ మృగం’ అనవచ్చునేమో.

పాప బ్రతికే అవకాశాలు చాలా తక్కువ అని డాక్టర్లు చెబుతున్నారు. తలకి ఇంత బలమైన గాయం తగిలినవారు బతికి ఉండే అవకాశాలు ముప్ఫై శాతమేననీ, ఒక వేళ బతికినా సాధారణ స్ధాయికి రాగల అవకాశాలు యాభై శాతమేననీ వారు తెలిపారు. ఫాలక్ బతికి బట్టకడితే జీవితాంతం మరొకరిపై ఆధారపడి బతకవలసిందేననీ వారు తెలిపారు. ఈ పది రోజుల్లో పాపకి రెండు సార్లు గుండె నొప్పి వచ్చిందనీ, ఇప్పటికి పరిస్ధితి స్ధిరంగా ఉన్నప్పటికీ, క్లిష్టంగానే ఉందని తెలిపారు. వెంటిలేటర్ సౌకర్యం తొలగించే స్ధాయికి పరిస్ధితి మెరుగుపడిందని వారు తెలిపారు.

పాపను అడ్మిట్ చేస్తూ ‘మహి గుప్త’ తాను తన భర్త ‘రాజ్ కుమార్ గుప్త’ తో కలిసి మహీపాల్ పురి (దక్షిణ ఢిల్లీ) లోని వేరొకరి ఇంటిలో పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నట్లు తెలిపింది. ఢిల్లీ డిప్యుటి కమిషనర్ ఛాయా శర్మ ప్రకారం దక్షిణ ఢిల్లీలోని స్వంత ఇంటినుండి మహి గత సంవత్సరం తప్పిపోయినట్లుగా ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఐతే, మహి ఒక వ్యక్తితో కలిసి వెళ్లిపోయినట్లుగా పోలీసులు తమ ఎంక్వైరీలో తెలుసుకున్నారు. గత ఇరవై రోజులుగా పాప తన వద్దనే ఉంటోందని మహి చెప్పింది. పోలీసులు ఈ విషయం ఇంకా ధృవపరచలేదని జీ న్యూస్ తెలిపింది.

న్యూఢిల్లీ టెలివిజన్ ఈ వార్తకి సంబంధించి మరిన్ని వివరాలు ఇచ్చింది. మహి ని పోలీసులు విచారించాక పాపను కొట్టింది తానేనని ఒప్పుకుంది. కాని కొరికింది తాను కాదని చెప్పింది. తాను కలిసి ఉంటున్న రాజ్ కుమార్ గుప్త నెల రోజుల క్రితం పాపను తనవద్దకు తెచ్చినట్లు తెలిపింది. ఇంటి నుండి పారిపోయి వచ్చి రాజ్ కుమార్ తో కలిసి ఉంటున్నానని అంగీకరించింది. మహిని పోలీసులు ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. రాజ్ కుమార్ గుప్త ఆచూకి ఇంతవరకు దొరకలేదు. మహి ఇంటినుండి తప్పిపోయిందని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినందున ఆమె కూడా బాధితురాలే అయి ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వారు పోలీసులు చెబుతున్నారు.

పాపకి తల్లిదండ్రుల నుండి దూరం కావలసిన పరిస్ధితి రావడానికి మొదటి కారణం తను ఆడపిల్ల కావడమేనని తెలుస్తూనే ఉంది. ఇంత దారుణానికి గురి కావడానికి గల అదనపు కారణాలు ఇంకా తెలియవలసి ఉంది. పాపను తానే కొట్టానని మహి చెబుతున్నప్పటికీ ఎముకలు విరిగేంతగా, కపాలం చిట్లేంతగా కొట్టవలసిన అవసరం ఎందుకొస్తుందన్న అనుమానం తలెత్తుతోంది. పాప శరీరంపై అనేక చోట్ల కొరికిన వ్యక్తే ఇతర గాయాలకూ కారకులని బలంగా తోస్తోంది.

చిత్తశుద్ధితో విచారిస్తే పోలీసులకి నిందితులని పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. నిందితులు పట్టుబడి అసలు నిజాలు వెల్లడయ్యేవరకూ ఇదమిద్ధంగా ఏదీ ఊహించలేని పరిస్ధితి. ఊహకు అందనంత క్రౌర్యం పాప ఎదుర్కొన్నందునే ఈ ‘ఊహించలేని పరిస్ధితి’. మెదడుకి గాయమైనందున తనకి ఏం జరిగిందో పాప కొంచెమైనా చెప్పలేకపోవచ్చు. ప్రస్తుతం భారమంతా పోలీసులపైనే ఉంది.

2 thoughts on “రెండేళ్ళ పాపని కొట్టి, గోడకి బాది…

  1. మహి గుప్తా కూడా బాధితురాలే అని నిర్ణయించడం చూస్తే అప్పుడప్పుడూ పోలిసులు కాస్త విచక్షణతో ఆలోచిస్తారని అనిపిస్తోంది.

    ఏదేమైనా,నేరస్థులను మహిగుప్తా సాయంతో పట్టుకు తీవ్రంగా ….వీలైతే అతి కిరాతకంగా శిక్షించాలని, అంతకు ముందుగా ఆ పాప మరణిస్తే బాగుండని కోరుకుంటున్నా! కపాలం ఫ్రాక్చరై,మెదడు చితికి, చేతులు విరిగి, ఈ మధ్యలో రెండు సార్లు గుండె నొప్పి వచ్చి….అబ్బ! ఎవరేమిటో తెలీని ఆ పసి మొగ్గకు నేరమేమీ చేయకుండా ఇప్పటి వరకూ పడిన శిక్ష చాలు! బతికి బయట పడినా సరైన ఆరోగ్యం లేని స్థితిలో ఎవరి పాల బడుతుందో, ఏ హోమ్ లో ఎటువంటి బతుకు దొరుకుతుందో…! దీనికంటే స్పృహ లేని ఈ స్థితిలోనే దాటిపోతే అదే నయం

  2. అవునండీ సుజాతగారు. తాను ‘లైంగికంగా’ వేధింపులకి గురయ్యానని మహి చెప్పిందట. తనని బాయ్ ఫ్రెండ్ చేరదీయక ముందే దగ్గరి బంధువుల చేతిలో లైంగిక హింసకు మహి గురయిందని పోలీసులు గుర్తించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఆమె తల్లి మహి చిన్నపుడే చనిపోయిందిట. ఆ ఒంటరి పరిస్ధితుల్లోనే లైంగిక హింసకి (సెక్సువల్ అబ్యూస్) గురయిందని ఆమెని అప్పజెప్పిన హోమ్ వాళ్లు చెప్పారని ఎన్.డి.టి.వి చెబుతోంది.

    అదీ కాక మహి బాయ్ ఫ్రెండ్ అని చెబుతున్న వ్యక్తిది బోంబే అట. పెళ్లయి భార్యా పిల్లలు ఉన్నారట. ఢిల్లీలొ ఇళ్లల్లో పాచి పని చేసుకునే ఒక స్త్రీ కుమార్తే ఫాలక్ అనీ (ఫాలక్ డాక్టర్లు పెట్టిన పేరు), ఆమె పాపని ఒక స్త్రీ వద్ద ఉంచితే ఆ స్త్రీ మరొక స్త్రీకి అప్పజెప్పిందనీ, ఆ ‘మరొక స్త్రీ’ కీ మహి బాయ్ ఫ్రెండ్ కీ పరిచయం అనీ ఆ పరిచయం తో మహి బాయ్ ఫ్రెండ్ వద్దకి పాప వచ్చి చేరిందనీ ఎన్.డి.టి.వి చెప్పింది. తన బాయ్ ఫ్రెండ్ బాంబే వెళ్ళిపోవడంతో మహి ఒంటరిదై డిప్రెషన్ కి లోనయిందనీ ఆ డిప్రెషన్ లో ఫాలక్ కి ఆ గతి పట్టించిందనీ పోలీసులు అనుమానిస్తున్నారట. ఐతే కొరికింది తాను కాదని మహి చెబుతోంది కనక ఈ పోలీసుల కధనం ఇంకా అసంపూర్ణమే. ఇవే కాక మరిన్ని వివరాలు ఉండొచ్చని నాకనిపిస్తోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s