గడ్డాఫీ అనుకూలురు పశ్చిమ లిబియాలోని ముఖ్య పట్టణం ‘బాని వాలిద్’ ను సోమవారం సాయంత్రం తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. గడ్డాఫీని హత్య చేసిన తిరుగుబాటు ప్రభుత్వం ఎన్.టి.సి కి చెందిన స్ధానిక కమాండర్ ఒకరు ఈ విషయం తెలిపినట్లుగా వార్తా పత్రికలు తెలిపాయి. మూడు నెలల క్రితం లిబియా మాజీ అధ్యక్షుడు గడ్డాఫీ, ఆయన ప్రభుత్వంలోని అనేకమందిని చంపిన అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ బలగాలు లిబియాని తమకు అనుకూలురైన ఎన్.టి.సి (నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్) ని అధికారంలో కూర్చుండబెట్టిన సంగతి విదితమే.
గడ్డాఫీ అనంతరం అధికారం చేపట్టిన ఎన్.టి.సి కి వ్యతిరేకంగా లిబియా ప్రజలు, గిరిజన తెగలు తమ పోరాటాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్.టి.సి ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా వాయిదా వేస్తుండడాన్ని తిరుగుబాటులో పాల్గొన్న తెగలవారికి మింగుడు పడడం లేదు. ఇటీవలి వారాల్లో ప్రజల నిరసనలు తీవ్రమయ్యాయి. పారదర్శకత అనుసరిస్తామని వాగ్దానం చేసిన మధ్యంతర ప్రభుత్వ నాయకులు దాన్ని పూర్తిగా తుంగలో తొక్కారని వివిధ వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడ్డాఫీకి వ్యతిరేకంగా పని చేస్తూ మరణించినవారి కుటుంబాలకూ, గాయపడ్డవారికీ నష్ట పరిహారం ఇస్తామని చెప్పినా ఇంతవరకూ అది నెరవేరలేదని ఆగ్రహంతో ఉన్నారని ‘సిబిఎస్ న్యూస్’ తెలిపింది.
ఈ నేపధ్యంలో గడ్డాఫీకి చివరివరకూ మద్దతుగా నిలిచిన బాని వాలిద్ పట్టణంలో సమీకృతులైన గడ్డాఫీ అనుకూల బలగాలు సోమవారం సాయంత్రం పట్టణంలో ఉన్న ఎన్.టి.సి బలగాలను పారద్రోలి పట్టణాన్ని తమ వశంలోకి తెచ్చుకున్నారు. కొన్ని వందలమంది బలగాలు ఈ యుద్ధంలో పాల్గొన్నారని సి.బి.ఎస్ తెలిపింది. పట్టణం వశం చేసుకున్న అనంతరం గడ్డాఫీ ప్రభుత్వ పతాకాన్ని ప్రభుత్వ భవనాలపై ఎగరవేసారని ఎన్.టి.సి అనుకూల కమాండర్ ‘ముబారక్ ఆల్-ఫటామి’ తెలిపాడు. ముబారక్, తాను సమీపాన ఉన్న మిస్రాటా నగరానికి పారిపోయినట్లుగా తెలిపాడు. నలుగురు ఎన్.టి.సి సైనికులు చనిపోయారనీ మరో పాతికమంది గాయపడ్డారనీ ఆయన తెలిపాడు.
ఎన్.టి.సి అనుకూల ‘బాని వాలిద్’ పట్టణ మిలట్రీ కౌన్సిల్ అధిపతి అబ్దుల్లా ఆల్-ఖాజ్మి ఈ వార్తను ధృవీకరించాడు. గడ్డాఫీ అనుకూలురు తమను ఓడించాయని ఆయన తెలిపాడు. బెంఘాజీ నుండి ఎన్.టి.సి అనుకూల బలగాలు బాని వాలిద్ పట్టణ శివార్లకు చేరుకుంటున్నాయని కూడా ఆయాన తెలిపాడు. పట్టణంలో మిగిలిన ఉన్న ఎన్.టి.సి బలగాలతొ తమకు సంబంధాలు తెగిపోయాయని ఆయన తెలిపాడు. బాని వాలిద్ పట్టణంలోని గడ్దాఫీ బలగాలే గడ్డాఫీకి వ్యతిరేకంగా జరిగిన అనేక కుట్రలను అణచివేసాయని తెలుస్తోంది.
బాని వాలిద్ పట్టణంలో ఉన్న గిరిజన తెగలు ఎన్.టి.సి ప్రభుత్వంతో విభేదిస్తున్నాయని బ్రిటన్ విదేశాంగ కార్యాలయం ప్రకటించింది. ఈ ఘర్షణ ఎన్.టి.సి కి స్ధానిక గిరిజన తెగలకు ఉన్న వైరమే తప్ప ఎన్.టి.సి కి గడ్డాఫీ అనుకూలురుకూ మధ్య కాదని అది ప్రకటించింది. ఇప్పుడు కొనసాగుతున్న రాజకీయ ప్రక్రియ అందరినీ కలుపుకోవలసిన అవసరాన్ని తాజా ఘర్షణ ఎత్తి చూపుతున్నదని ఆ ప్రకటన తెలిపింది. గడ్డాఫీ అనుకూలురకు తాజా ఘర్షణ కి సంబంధించిన క్రెడిట్ ఇవ్వడానికి ఆ ప్రకటన తిరస్కరించింది.