అమెరికా అధ్యక్ష భవనం ఆవరణలోకి మంగళవారం ఆకుపై ఉద్యమకారులు పొగబాంబు విసిరి సంచలనం సృష్టించారు. ఈ సంఘటనతో వైట్ హౌస్ ని తాత్కాలికంగా మూసివేశారు. వైట్ హౌస్ చుట్టూ ఉన్న కంచె పై నుండి ఈ పొగబాంబు విసిరినట్లు తెలుస్తోంది. అమెరికా సీక్రెట్ సర్వీస్ పోలీసులను ఉటంకిస్తూ ‘ది హిందూ’ వార్తా పత్రిక ఈ వార్తను ప్రచురించింది.
వెయ్యిమందికి పైగా ఉన్న నిరసనకారులు ప్రదర్శన నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగిందని పత్రికలు, ఛానెళ్ళు తెలిపాయి. వైట్ హౌస్ గేటుకి ఎదురుగా నిరసనకారులు ప్రదర్శన నిర్వహించారనీ, ఘటన అనంతరం వారిని పోలీసులు అక్కడినుండి పంపించివేశారనీ అమెరికా సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి జార్జ్ ఓగ్లివి తెలిపాడు. స్ధానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
వైట్ హౌస్ లోపల ఉన్న వారిని పోలీసులు బైటికి రానీయలేదని ‘ఐ.బి.ఎన్’ తెలిపింది. నిరసనకారులు వెయ్యి నుండి పదిహేను వందల వరకూ ఉంటారని ఓగ్లివి తెలిపాడు. ఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదని కూడ ఓగ్లివి తెలిపాడు. తన నలభై ఎనిమిదవ పుట్టిన రోజు సందర్భంగా బారక్ ఒబామా తన భార్య మిఛెల్లె ను ఓ లగ్జరీ రెస్టారెంటుకి తీసుకెళ్ళారనీ ఆ సమయంలో వారు వైట్ హౌస్ లో లేరనీ పత్రికలు తెలిపాయి.
బారక్ ఒబామాతో కలిసి వైట్ హౌస్ కి తిరిగి వచ్చిన జర్నలిస్టులను కొన్ని గంటల సేపు వైట్ హౌస్ నుండి వెళ్లనీయలేదని తెలుస్తోంది. విసిరిన వస్తువు పొగ బాంబా లేదా అన్న విషయం సీక్రెట్ సర్వీస్ పోలీసులు పూర్తిగా ధృవీకరించలేదు. ‘పొగ బాంబు’ లాంటిది ఏంటో విసిరారని వారు తెలిపారు.