అమెరికా రాయబారి రాకను వద్దన్న పాక్


అమెరికా ప్రత్యేక రాయబారి మార్క్ గ్రాస్‌మన్, తాను పాకిస్ధాన్ సందర్శిస్తానని కోరగా, ‘ఇప్పుడు వద్దు’ అని నిరాకరించి, పాకిస్ధాన్ సంచలనం సృష్టించింది. పాకిస్ధాన్ కి చెందిన సీనియర్ అధికారి ఒకరి ఈ సంగతి వెల్లడించినట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. అమెరికా, పాకిస్ధాన్ ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను ఇది సూచిస్తోంది. రాయబారిని రావొద్దని కోరడానికి గల కారణాలను పాక్ అధికారి వివరించలేదు.

“రాయబారి గ్రాస్‌మన్ పాకిస్ధాన్ సందర్శిస్తానని విజ్ఞప్తి చేశాడు. కాని ఈ సమయంలో ఆయన రావద్దని మేము తెలియజేశాం” అని సీనియర్ ప్రభుత్వాధికారిని ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. ఆయన తన పేరు చెప్పడానికి ఇష్టపడలేదని రాయిటర్స్ తెలిపింది. నవంబరు 26 తేదీన ఆఫ్ఘన్ పాక్ సరిహద్దులో కాపలాగా ఉన్న ఇరవై నాలుగు మంది పాక్ సైనికులను అమెరికా హెలికాప్టరలు, జెట్ ఫైటర్లు కాల్చి చంపిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.

గత సంవత్సరం జనవరిలో సి.ఐ.ఎ కాంట్రాక్టర్ ఒకరు పాకిస్దాన్ లోనే పట్టపగలు ఇద్దరు పాకిస్ధాన్ పౌరులను కాల్చి చంపడంతో పాక్, అమెరికాల సంబంధాలు దిగజారడం ప్రారంభం అయింది. ఒసామా బిన్ లాడేన్ ను హత్య చేయడానికి పాక్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తూ పాక్ లోకి అమెరికా హెలికాప్టరలు చొరబడడంతో పాక్ ప్రజల్లో అమెరికా పట్ల ఆగ్రవేశాలు వెల్లువెత్తాయి. దానితో పాక్ పాలకులు అమెరికాతో ఘర్షణ పడక తప్పలేదు. పాక్ ప్రజల ఒత్తిడి లెనట్లయితే పాక్ పాలకులు అమెరికా పట్ల ఇప్పుడు అనుసరిస్తున్న ఘర్షణ వైఖరిని కొనసాగించరనడంలో సందేహం లేదు.

కోల్డ్ వార్ కాలంలో పాకిస్ధాన్ లో సైనిక నియంతృత్వ ప్రభుత్వం ఉన్నప్పటికీ అక్కడి ప్రజలకు ప్రజాస్వామ్య హక్కులు కరవైనప్పటికీ అమెరికా ఆ దేశాన్ని తన మిత్ర దేశంగా చేసుకుంది. రష్యా ప్రాపకంలో ఉన్న భారత పాలకవర్గాల ఎత్తుగడల మూలంగా పాక్ పాలకవర్గాలు అనివార్యంగా అమెరికా పంచన చేరాయి.

మిలట్రీ ఆర్ధిక వ్యవస్ధను మోయలేక రష్యా సామ్రాజ్యవాదం కూలిపోవడంతో భారత దేశ పాలకులకు పెద్ద దిక్కు కరువైంది. తొంభై దశకంలో ప్రవేశ పెట్టబడిన నూతన ఆర్ధిక విధానాల పర్యవసానంగా ఇండియా పాలకులు కూడా అమెరికాకి దగ్గరయ్యారు. ఐతే మధ్య ప్రాచ్యం, దక్షిణాసియా ప్రాంతాలలో తన ప్రభావాన్ని శక్తివంతం చేసుకోవడానికీ, చైనా, ఇండియాల ఎదుగుదలపై ఓ కన్నేసి ఉంచడానికీ అమెరికా పాకిస్ధాన్ ని చేరదీయడం మానలేదు. ఓ వైపు తనకు దగ్గరవుతున్న భారత పాలకులను సవరిస్తూనే పాకిస్ధాన్ పైన పట్టును కొనసాగించింది.

మధ్య ప్రాచ్యంలో ఆయిల్ వనరులపై గుత్తాధిపత్యం సాధించడానికీ, అదే ప్రాంతంలో తన ప్రయోజనాలు కాపాడుతున్న ఇజ్రాయెల్ కి ఇరాన్ భయం లేకుండా చేయడానికీ, మరో పక్క చైనా, ఇండియా లపైన కన్నేసి ఉంచే లక్ష్యంతో అమెరికా, దాని మిత్ర దేశాలైన యూరోప్ లు నాటో రూపంలో ఇరాక్ పైన ఆధిపత్య కుట్రలు ప్రారంభించాయి. కువైట్ పై సద్ధాం హుస్సేన్ జరిపిన దాడి, ఆ దాడి గురించిన ముందస్తు సమాచారం అమెరికాకి అందించి దాని అనుమతిని సద్దాం పొందినప్పటికీ, అమెరికాకి ఆయాచితంగా దొరికింది. అప్పటి నుండి ప్రారంభమైన పశ్చిమ దేశాల మానవ హననం ఇరాక్ పై ఆంక్షలతో ప్రారంభించి, మలిదశలో ఆఫ్ఘనిస్ధాన్ పై దురాక్రమణ తో కొనసాగించి తిరిగి ఇరాక్ దురాక్రమణతో మధ్య యుగాల అనాగరిక దశను మించి పోయింది.

ఆఫ్రికాలో తనకు ఒకప్పడు కొరకరాని కొయ్యగా ఉన్న మౌమ్మర్ గడ్డాఫీ ఇటీవలి సంవత్సరాలలో తమకు సహకరించినప్పటికీ అతనిచ్చిన షరతులతో కూడిన దోపిడీ అనుమతితో సంతృప్తి పడలేకపోయాయి పశ్చిమ దేశాలు. ఫలితంగా, అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ ల ప్రాపకంతో మౌమ్మర్ గడ్దాఫీ లిబియాలో సాయుధ తిరుగుబాటు తలెత్తి గడ్డాఫీ హత్యతో ముగిసింది. అదే ఎత్తులతో సిరియాలోనూ సాయుధ తిరుగుబాటును కృత్రిమంగా సృష్టించడానికి పశ్చిమ దేశాలు శతధా ప్రయత్నిస్తున్నా అది ఇప్పటికైతే సాధ్యం కాలేదు. ఈ చర్యలన్నీ అమెరికా, యూరప్ ల సామ్రాజ్యవాద ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికే తప్ప ఏ ఒక్క దేశాన్ని ఉద్ధరించడానికి కాదు.

ఈ నేపధ్యంలో అమెరికా ప్రయోజనాలని గానీ దాని ఆధిపత్య రాజకీయాలని గానీ పాక్, ఇండియాల పాలకవర్గాలు ఎదిరించి నిలబడుతాయనుకోవడం ఒట్ఠి భ్రమ. ఇరుగు పొరుగు దేశాలైన పాక్, ఇండియాల పాలకులు దక్షిణాసియాలో ఆధిపత్యం కోసం ఘర్షణ పడుతూ అమెరికాకి పెద్దన్న పాత్ర ఇస్తూ తమ గొయ్యిని తామే తవ్వుకుంటున్నారు. భారత ప్రజల ప్రయోజనాలు ఏ మాత్రం పట్టించుకోకుండా ఇరాన్ నుండి నేరుగా ఆయిల్ దిగుమతి చేసుకునే ‘ఆయిల్ పైపు’ ల ప్రాజెక్టును రద్దు చేసుకోవాలని కోరగానే ఇండియా పాలకులు దానిని శిరసావహించారు. తన పొరుగుదేశం ఆఫ్ఘనిస్ధాన్ లో లక్షల మంది పౌరుల మరణానికి కారణంగా నిలిచిన అమెరికా దురాక్రమణకు పాక్ పాలకులు మద్దతు ఇచ్చినా పాక్ లో మానవ హననానికి అమెరికా ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. ఇవన్నీ చూస్తూ కూడా భారత్, పాక్ ల పాలకవర్గాలు అమెరికా అడుగులకు మడుగులొత్తడం మానడం లేదు. కారణం ఆ దేశాల పాలకవర్గాల ప్రయోజనాలు తమ తమ ప్రజల ప్రయోజనాలలో గుర్తించకపోవడమే.

అమెరికా రాయబారిని పాక్ పాలకులు రావద్దన్నా అది తాత్కాలికం మాత్రమే తప్ప అమెరికా పట్ల పాక్ పాలకుల మారిన వైఖరిని అది ఏమాత్రం సూచించదు. అమెరికా, పాక్ ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తడం వల్ల ఆఫ్ఘనిస్ధాన్ లొ శాంతి నెలకొల్పడానికి ఆటంకం అంటూ పాశ్చాత్య పత్రికలు తెగ బాధపడుతున్నాయి. ఆఫ్గనిస్ధాన్ లో శాంతి కోసం పరితపించే ఈ పత్రికలు అసలు ఆఫ్ఘనిస్ధాన్ పై దాడిని ఏ ఉద్దేశ్యంతో సమర్ధించాయో చెప్పవు. అమెరికా, యూరప్ ల సామ్రాజ్యవాద ప్రయోజనాలకు అనుకూలంగా ఎన్ని తప్పుడు కధనాలు ప్రచురించే ఈ పత్రికలు ఆఫ్ఘనిస్ధాన్ లో శాంతికోసం పరితపించడాం ఒట్టి బూటకం. అమెరికా ఎంత గౌరవంగా ఆఫ్ఘన్ నుండి బైటపడదామా అని చేస్తున్న ప్రయత్నాలకు అనుకూల ప్రచారం చెయ్యడమే ఈ పత్రికల ఎత్తులు.

గ్రాస్ మన్ ఈ రోజు కాకపోతే రేపైనా పాకిస్ధాన్ సందర్శిస్తాడు. అందుకు అడ్డు చెప్పే దమ్ము పాక్ పాలకులకు లేనే లేదు. ఇలా తాత్కాలికంగా ‘అలక పాన్పు’ ఎక్కి తమకు రాగల డబ్బు సంచుల పరిమాణం పెంచుకోవడానికి మాత్రమే పాక్ పాలకులు ప్రయత్నిస్తున్నరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s