వ్యవసాయ సబ్సిడీలు, దళారీ వ్యవస్ధ


(“‘ఎస్&పి’ తాకి ‘ఇ.యు’ ఓడ మునక” పోస్టు కింద సంజయ్ గారు ఓ వ్యాఖ్య రాశారు. వ్యాఖ్యలో ఫస్ట్ పోస్టు వెబ్ సైట్ లో వచ్చిన ఒక ఆర్టికల్ లింక్ ఇస్తూ విశ్లేషించమని కోరారు. సంజయ్ గారి కోరిక మేరకు ఈ ఆర్టికల్ రాసి ప్రచురిస్తున్నాను. -విశేఖర్)

plough

నూతన ఆర్ధిక విధానాలు రైతులు, కార్మికులకు హాని చేస్తున్నాయన్న నిజాన్ని మరుగుపరచడానికి ఇటువంటి అర్ధ సత్యాలతో కూడిన వాదనలు చాలా వ్యాప్తిలోకి తెచ్చారు.

‘ఫస్ట్ పోస్టు’ ఆర్టికల్ లోనే చెప్పినట్లు రైతులకి ఇస్తున్నామని చెబుతున్న సబ్సిడీలు దొడ్డిదారిన ఎరువులు, పురుగుమందుల కంపెనీలే పొందుతున్నాయి తప్ప అవి రైతులవరకూ రావడం లేదు. నేను కొద్ది రోజుల క్రితం ఒక మిత్రుడికి సమాధానం ఇస్తూ రాశాను. వ్యవసాయం దండగ అనీ, రైతులు అందుకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ పత్రికలు రాస్తుంటాయి గానీ నిజానికి వ్యవసాయ రంగం రైతులకి దండగగా మారింది తప్ప అందరికీ కాదని. ‘వ్యవసాయం దండగ’ అన్న ప్రచారం వెనకే పెద్ద కుట్ర ఉంది. కొంచెం సేపు కుట్ర సంగతి పక్కనబెడదాం.

వ్యవసాయం లేకుండా భారత దేశంలో పరిశ్రమల్లేవు, సేవల రంగమూ లేదు. భారత దేశంలో సరైన సమయానికి రుతుపవనాలు వస్తాయా రావా అన్న అంశంపైన ప్రపంచ వ్యాపితంగా ఆర్ధిక విశ్లేషక సంస్ధల అంచనాలు ఆధారపడి ఉంటాయి. భారత దేశంలో రుతుపవనాల రాకకు సంబంధీంచిన అంచనాలపైన పాశ్చాత్య వార్తా పత్రికలతో పాటు అక్కడి వ్యాపార వార్తా పత్రికలు కూడా కేంద్రీకరణ చేస్తాయి. ఐబిఎన్, బిబిసి, సి.ఎన్.ఎన్ లాంటి అంతర్జాతీయ వార్తా పత్రికలకు అనుబంధంగా ఉన్న బిజినెస్ విభాగాలతో పాటు రాయిటర్స్ లాంటి బిజినెస్ వార్తా సంస్ధలు కూడా భారత దేశ రుతుపవనాలపైన అంచనాలను పట్టించుకుంటాయి. ఆ తర్వాత ఆ అంచనాలు నిజం అవుతున్నాయా లేదో కూడా పరిశీలించి వాటిపైన వార్తా కధనాలు ప్రచురిస్తాయి.

ఇవన్నీ ఎందుకని? ఎందుకంటె భారత వ్యవసాయ రంగం రుతుపవనాల రాకపైన ఎంతగా ఆధారపడి ఉన్నాయో వారికి తెలుసు గనక. ఊరికే ఆ విషయం వారికి తెలిసినందువల్లనే కాదు సుమా. రుతుపవనాలు రాకపోతే వ్యవసాయరంగంలో జరిగే ఉత్పత్తి బాగా కుంటుపడుతుంది. వ్యవసాయ ఉత్పత్తులపైన అనేక పరిశ్రమలు ఆధారపడి ఉన్నాయి. టెక్స్ టైల్స్ దగ్గర్నుండి, ప్రాసెసింగ్ పరిశ్రమలు, రవాణా రంగం, కొండొకచో కమ్యూనికేషన్ల రంగం అన్నీ ఆధారపడి ఉన్నాయి.

సేవల రంగం (బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ మొ.వి) అయితే ఇక చెప్పనవసరం లేదు. భారత దేశంలోని జిడిపిలో సర్వీసెస్ సెక్టార్ వాటా యాభై ఐదు శాతం దాకా ఉంటుంది. వర్క్ ఫోర్స్ లో పాతిక శాతం సేవల రంగమే. ( అధమం చూసుకున్నా, వ్యవసాయ రంగం యాభై ఐదు నుండి అరవై శాతం వరకూ వర్క్ ఫోర్స్ కి ఉపాధి కల్పిస్తుంది.) ఈ సేవల రంగానికి పునాది భారత దేశంలో వ్యవసాయ రంగమే అని గుర్తుంచుకోవాలి.

వ్యవసాయ రంగానిది ప్రాధమిక ఉత్పత్తి లెదా ముడి ఉత్పత్తి అయితే దానిపైన జరిగే అనేక పారిశ్రామిక, సేవల రంగ కార్యకలాపాలు నడుస్తుంటాయి. వ్యవసాయం బాగా నడిస్తే ఆ ప్రభావం ఇండియా జిడిపిలోని ఎనభై శాతం పైన పడుతుంది. వ్యవసాయ ఉత్పత్తి జరిగితే పరిశ్రమలకు ముడి సరుకు దొరకడం ఒక సంగతి. వ్యవసాయం ద్వారా రైతులకి, కూలీలకీ వచ్చే ఆదాయం సేవింగ్స్ రూపంలొ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగంలోకి వెళుతుంది. అక్కడి నుండి పరిశ్రమలకి అప్పుల రూపంలో పెట్టుబడులు వెళ్తాయి. బ్యాంకుల్లో సేవింగ్స్ పెరిగితే అది స్వయం ఉపాధిదారులకు కూడా అప్పులు పెరగడానికి దోహదపడుతుంది. ఇన్సూరెన్స్ రంగంపైన కొన్ని పదుల లక్షలమంది ఏజెంట్లు ఆధారపడి ఉంటారు. వీరికి కూడా వ్యవసాయం పండగే. రైతుల వద్ద డబ్బులు కూడితే వీరికి బోలెడంత ఆదాయం.

ఈ కారణాల వల్ల భారత దేశంలో రుతుపవనాలు ప్రపంచ వ్యాపితంగా ఒక ముఖ్య వ్యాపార వార్త. ఆవి సమయానికి వస్తే రైతులు పంటలు బాగా పండిస్తారు. కోట్లమంది కూలిలకి ఆదాయం సమకూరుతుంది. కూలీల ఆదాయం అనేక సరుకులు అమ్ముడుబోయేలా చేస్తుంది. ప్రభుత్వానికి అమ్మకపు పన్నులు ఇతర పన్నులు చేకూరుతాయి. (మద్యం ఆదాయం చెప్పనవసరం లేదు.) పరిశ్రమలకి ముడి సరుకుతో పాటు ఫైనాన్స్ సౌకర్యం కూడా వస్తుంది. వారి పొదుపు సేవల రంగంలోకి విస్తరించిన మరిన్ని లక్షల కుటుంబాలకి ఆదాయ వనరుగా మారుతుంది.

పైన చెప్పీనట్లు వ్యవసాయం ఇతరులందరికీ పండగే కాని రైతు ఒక్కడికే దండగగా మారడానికి కారణం దళారీ వ్యవస్ద. “ఆ మీడియేటర్లే కదా!” అని తేలిగ్గా కొట్టిపారెయ్యడానికి వీలేదు. ఎందుకంటే భారత దేశంలో పారిశ్రామికీ వేత్తలంతా ఈ పాత్రలోనే లక్షల కోట్లు పోగేశారు. బ్రిటిష్ వాడి కాలం నుండి ఇప్పటివరకూ ఈ దళారీ పాత్రలోనే పారిశ్రామిక వేత్తలు అభివృద్ధి చెంది నేటి స్ధాయికి చేరుకున్నారు. పసుపు, మిర్చి, గొర్రెలు తదితర పశువులు, పత్తి, పొగాకు దగ్గర్నుండి ప్రతి రంగంలోనూ విస్తరించి ఉన్న దళారులు ప్రాధమిక ఉత్పత్తిదారునుండి అతి తక్కువ ధరలకు కొనుగోలు చేసి నిలవ చేసి పూర్తి ధరలకు అమ్ముకుని లాభాలు పొందుతున్నారు. ఈ లాభాలన్నీ నిజానికి రైతులవి, కూలీలవి. రైతుల వద్ద నిలవ సౌకర్యాలు ఉంటే, అమ్మకం ఆలస్యం అయినా పర్వాలేదన్న ఆర్ధిక బలిమి వారి సొంతం అయితే వ్యవసాయ రంగంలో వచ్చే లాభాలన్నీ రైతులకీ, కూలీలకీ చెందుతాయి.

దళారీ వ్యవస్ధపైనే నేటి ప్రభుత్వాలు ఆధారపడి ఉన్నాయి. రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, బ్యూరోక్రసీ అంతా దళారీ వ్యవస్ధ నుండి ఎదిగినవారే (ఎదుగుతున్నవారే). పల్లెల్లో భూస్వాములే పట్నాల్లో పెట్టుబడిదారులు. నేరుగా పెట్టుబడిదారులు కాకపోతే వారి బంధువులు, పుత్రులు, మనవళ్ళు ఇలా సంబంధీకులు పెట్టుబడిదారులుగా ఉన్నారు. వీళ్ళంతా దళారీ వ్యవస్ధలో ఆదాయం పొందుతూ ఆ దళారి వ్యవస్ధని నిర్మూలించమంటే నిర్మూలిస్తారా? నిర్మూలించరు. అందుకే దళారీ వ్యవస్ధ అప్రతిహతంగా కొనసాగుతూ రైతుల ఉసురు తీస్తోంది.

రైతుల ఉత్పత్తలకు ధరలు లేకుండా పోలేదు. కాకపొతే ఆ ధరలు రైతులకి అందుబాటులో ఉండవు. అంటే అప్పు చేసి పంట తీసిన రైతు అప్పు తీర్చడానికీ, ఇంట్లో అవసరాలకీ పంటను అమ్మకుండా ఉండలేడు. తక్కువ ధరలకే అమ్మేయాల్సిన పరిస్ధితి అతనికి వస్తోంది. అది కొనేది ప్రభుత్వమో, పరిశ్రమలవారో, సేవలవారో కాదు. దళారీలు. వారు తమ ఆర్ధిక బలిమితోటి (ఆ బలిమి కూడా రైతుల పుణ్యమే) నిలవ చేసుకుని ధరలు వచ్చినపుడు అమ్ముకుని రైతుల లాభాలని తన జేబులో వేసుకుంటున్నాడు. అంటే వ్యవసాయ ఫలం రైతులకి కాకుండా మరొకరికి అందుతోంది. అంతిమంగా వ్యవసాయం దళారీలకి పండగ కాగా రైతులకి దండగ గా మిగులుతోంది. ఈ దళారీ వ్యవస్ధ ప్రమేయం లేకపొతే రైతే ఈ దేశంలో రాజు.

ఆ విధంగా వ్యవసాయం పండగ కావలసినవారికి దండగ గా మారిపోయింది.

ఇదంతా ఫస్ట్ పోస్టు ఆర్టికల్ కి సంబంధం లేదనిపిస్తోంది కదా? కాని సంబంధమ్ ఉంది.

‘ఎరువుల సబ్సిడీ ప్రభుత్వానికి తడిసి మోపెడవుతోంది. ఆ సబ్సిడీ రైతులకి చేరకుండా కంపెనీలకి చేరుతోంది. కనుక ప్రభుత్వం వ్యవసాయ సబ్సిడీలు ఇవ్వడం మానుకోవాలి అన్నది ఆర్టికల్ సారాంశం.’ వేరే రకంగా సబ్సిడీ రైతులకి ఇవ్వాలని ఆర్టికల్ చివర్లో చెప్పినా దాని అసలు ఉద్దేశ్యం సబ్సిడీలు రద్దు చెయ్యాలనే.

సబ్సిడీలు రైతులకి కాకుండ కంపెనీలకి వెళ్తున్నాయి కనుక అవి రద్దు చేయాలని ఆర్టికల్ చెబుతోంది. అయితే కంపెనీలకి ఇస్తున్న ఇతర రాయితీల మాటేమిటి? ఎగుమతి రాయితీలు, దిగుమతి రాయితీలు, దిగుమతి పన్నుల రద్దు లేదా కోత, లక్షల కోట్ల అప్పులు, ఆనక పారిశ్రామిక వేత్తల అప్పుల మాఫీ, బాకీలు ఎగేసిన పారిశ్రామికవేత్తల పేర్లు చెప్పమని పార్లమెంటు కొరినా అది దేశ బధ్రతకు ముప్పు అని చెప్పకపోవడం, నల్లడబ్బుకి కావలసిన మార్గాలన్నీ తెరిచి ఉంచడం, మార్గాల్ని మూసేయడానికి లోక్ పాల్ తెమ్మంటే కోరలేవీ లేని లోక్ పాల్ తేవడం. ….ఇవన్నీ పారిశ్రామికవేత్తలకు, కంపెనీలకు ఇస్తున్న రాయితీలే. కొన్ని ప్రత్యక్ష రాయితీలయితే మరికొన్ని పరోక్ష రాయితీలు. ప్రత్యక్ష రాయితీల కంటె పరోక్ష రాయితీలు అనేక రెట్లు ఎక్కువ. ప్రత్యక్ష రాయితీలను చట్టబద్ధంగా సమర్ధించుకుంటారు. పరోక్ష రాయితీలని చట్టపరిధిలో లేవని తప్పించుకుంటారు. కనుక అవి రెండూ అప్రతిహతంగా కొనసాగుతూ ఉంటాయి. ఆ సమస్యల పరిష్కారం సంవత్సరాల తరబడి వాయిదాపడుతూ ఉంటాయి. నలభై ఏళ్ల నుండి లోక్ పాల్ చట్టం వాయిదా పడుతూ వస్తోందంటే అది ఏ ఉద్దేశాలూ, పధకాలూ, ప్రయోజనాలు లేకుండా జరగదు కదా. ధనికులకి, రాజకీయ నాయకులకీ, బ్యూరోక్రట్లకీ ప్రయోజనంగా ఉన్న ఈ అవినీతి రాయితీల సమస్య పెద్ద సమస్య లేదా తక్షణం పరిష్కరించాల్సిన సమస్య కాదు కాని రైతుల సబ్సిడీల బిల్లు మాత్రం అర్జెంటుగా పరిష్కరించవలసిన సమస్యగా ముందుకు తెస్తారు. ఇదొక కుట్ర.

రైతులకి పండగ కావాల్సిన వ్యవసాయం దండగ గా మారడానికి కారణం దళారీ వ్యవస్ధ. ఈ దళారీలే బ్యూరోక్రట్ అధికారులు. ఈ దళారీలే భూస్వాములు. ఈ దళారీలే పెట్టుబడిదారులు లేదా పారిశ్రామిక వేత్తలు లేదా టెక్నోక్రాట్లు లేదా అనేకం. ఈ దళారి జాతి కూడబెట్టిన సంపదే అన్నిరంగాలకీ పరుగులు పెడుతుంది. ఇప్పుడు షేర్ మార్కెట్లలోకి అదే వెళ్తోంది. కానీ ఈ సంపదకి వాస్తవ హక్కుదారులు రైతులు, కూలీలు, కార్మికులు.

ఈ ప్రాధమిక శ్రామిక జనం తీసిన ఉత్పత్తులని తాము వశం చేసుకుని ఆ వశం చేసుకున్న దానిలో ఏదో కొంచెం బిచ్చాన్ని రైతుల ఎరువుల సబ్సిడీలుగా, రెండు రూపాయల బియ్యంగా, గ్యాస్ సిలిండర్ల సభ్సిడీలుగా, డీజెల్, కిరోసిన్ సబ్సిడీలుగా (పెట్రోల్ డీ కంట్రోక్ చేశారు కదా. అందువల్ల ఇపుడీ లిస్టులో అది లేదు), ఇందిరమ్మ ఇళ్ళుగా (ముప్ఫై ఏళ్ల క్రితం ఇవి బొంగులు, పూరి పాకల పై కప్పుకి వినియోగించే గడ్డి రూపాల్లో ఉండేది), ఎస్సీ, బీసీల స్కాలర్ షిప్పులుగా లేదా ఫీజుల రాయితీలుగా పడేస్తున్నారు.

ఈ సబ్సిడీలన్నీ కలిపితే కొన్ని వేల కోట్ల రూపాయలుగా (మహా ఐతే ఒకటో రెండో లక్షల కోట్లు) ఇప్పుడు కనిపిస్తొంది. కాని దళారీ లు కూడేసి, దాచుకుని, బైటికి తరలిస్తున్న సొమ్ము పదుల లక్షల కోట్లుగా ఉంటోంది. ఈ డబ్బు గురించి ఎవరూ లెక్కలు చెప్పరు. ఎప్పుడో శివరాత్రికో మారు పత్రికలు ప్రత్యేక ఆర్టికల్స్ రాసి భారత దేశంలో ఇంత నల్లడబ్బు ఉంది అని రాసి పాఠకులని కొద్ది కాలం ఆకర్షిస్తాయి. కాని ఆ టాపిక్ అంతంటితో ముగిసిపోతుంది. కాని రైతులు, కూలీలు, కార్మికుల సంపాదన దోచుకోవడం, నల్ల డబ్బు కూడబెట్టడం, స్విస్ బ్యాంకులకి తరలించుకెళ్లడం ప్రతి గంటా, ప్రతి రోజూ, ప్రతి నెలా, ప్రతి సంవత్సరమూ కొనసాగుతూ పోయే నిరంతర ప్రక్రియ. నిరంతరం కొనసాగే ఈ ప్రక్రియను అడ్దుకోవడానికి కావలసిన చట్టం నలభై ఏళ్లనుండి వాయిదా పడుతూ వస్తుంది. జనం గట్టిగా అడిగితే కోరలు లేని చట్టం రెడీ. అంటే ప్రభావవంతమైన లోక్ పాల్ చట్టం వచ్చినా నల్లడబ్బు పోగుపడడం, తరలివెళ్లడం కొనసాగుతూనె ఉండాలన్నమాట!

నల్లడబ్బు అరికట్టే చట్టాలని వాయిదా వేస్తున్నట్టే రైతులు, వినియొగదారులకు ఇస్తున్న సబ్సిడీలు రద్దు చేసే చట్టాలు వాయిదా వేయరు. పొరబాటున వాయిదా వేసినా గుర్తు చేయడానికి ‘ఫస్ట్ పోస్టు’ లు రెడీ.

ఇంతా చేసి రైతులకి ఇస్తున్న సబ్సిడీల్లో రైతులకి అందేవి కొద్ది భాగమే. రైతులకి, కూలీలకి, కార్మికులకి వివిధ రూపాల్లొ ఇచ్చే సబ్సిడీల్ని నొక్కెస్తున్నది కూడా దళారీలే. పౌర సరఫరాల సబ్సిడీల్ని వినియోగదారుడికి చేరే లోగా రేషన్ షాపు యజమాని దగ్గర్నుండి పౌర సరఫరాల శాఖ లో అధికారుల నుండి ఆ శాఖ మంత్రి వరకూ భోంచేయడం లేదా? ఇందిరమ్మ ఇళ్ళు పదులు ఇరవైలు బినామీ పేర్లతో నొక్కేస్తున్న దళారీలు లేరా? సబ్సిడీ ఎరువుల్ని దారి మళ్ళించి మిశ్రమ ఎరువులుగా మారుస్తున్న రాజశేఖర్ రెడ్డి బామ్మర్ది ఉదంతం ఒక్కటే బైటికి వచ్చింది. బైటికి రాని ఉదంతాలు కోకొల్లలు కాదా? సబ్సిడీ గ్యాస్ బండల్ని బినామీ పేర్లతో వాడుకుంటున్న హోటల్ పరిశ్రమలు, ఇతర కంపెనీలు ఎన్నని? ఇవన్నీ సబ్సిడీలే. పేదజనం పేరుతో ఇచ్చేది, బినామీ పేర్లతో నొక్కేది ఎవరు? బ్యూరోక్రట్లు, రాజకీయ నాయకులు తదితర నామాలతో గల దళారీలే.

ఇటువంటి పరిస్ధితుల్లో రైతుల సబ్సిడీలన్న ఒక్క అంశాన్ని పక్కకి లాగి దానిని మాత్రమే విశ్లెషిస్తే లార్జర్ పిక్చర్ మసకబారుతుంది. అది కనపడదు. అలా కనపడకుండా చేయడానికే ‘ఎంతో నిజాయితీ ఉన్నట్లు నటిస్తూ, కడు బాధతో రైతుల సబ్సిడీలు మరొకరు సొమ్ము చేసుకుంటున్నారన్న’ బూటకపు విశ్లేషణలు. రైతుల సబ్సిడీలు వారికి అందడం లేదు గనక రద్దు చెయ్యాలన్న నినాదం ఒట్ఠి బూటకం. కాస్తో కూస్తో రైతులకి ఇతర ప్రాధమిక శ్రామిక వర్గాలకి అందుతున్న కొద్ది పాటి సౌకర్యాలని కూడా పూర్తిగా రద్దు చేసి ఆ వనరుల్ని కూడా కంపెనీలకి తరలించే దుష్ట బుద్ధి ఇందులో ఉంది.

సరే సబ్సిడీలు తీసేద్దామ్! ప్రభుత్వాలు దాని బదులు నిలవ సౌకర్యాలని (శీతల గిడ్డంగులు, గ్రామాలకు పంట పొలాలకు దగ్గరలో వేర్ హౌస్ లు, రైతులకి అందుబాటులో ప్రాసెసింగ్ సౌకర్యాలు లాంటివి) రైతులకి చేరువగా తేగలదా? దాన్ని మళ్ళీ ప్రవేటు రంగానికి అప్పజెప్పకుండా, తానే ఒకటి రెండేళ్ల పాటు (అయిదేళ్ళయినా సరే) బడ్జెట్ నిధులిచ్చి నిర్మించగలదా? ఆ సౌకర్యాల్లో రైతులకి ఓ పదేళ్ళపాటు ఉచితంగా లేదా నామ మాత్రపు ఫీజుతో స్ధానం ఇచ్చి వారికి అండగా నిలవగలదా? పరిశ్రమలకి ఎగుమతి దిగుమతి రాయితీలు, టాక్స్ హాలిడేలు, కష్టాల కంపెనీలకి బెయిలౌట్లు ఇవన్నీ ఇస్తున్నపుడు రైతులకి ఇవి ఇవ్వవచ్చు. రైతుల సంపదల్ని దోచుకుంటున్న దళారీ వ్యవస్ధ రద్దు చేస్తూ అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలతో సహా కేంద్ర ప్రభుత్వం చట్టం చేయగలదా?

భూమిలేని కూలీలకు ఒక్కో కుటుంబానికి ఎంతో కొంత భూమిని ప్రభుత్వాలు ఇవ్వగలవా? మిగులు భూములు, అన్యాక్రాంతం అయిన భూములు, బంజరు భూములు ఇలా అనేక రకాల భూములు అందుకు సిద్ధంగా ఉన్నాయి. అవన్నీ భూమిలేని పేదలకు పంచగలరా? భూగరిష్ట పరిమిత చట్టం మొదలే లోప భూయిష్టం. ఐనా సరే ఆ చట్టాన్నయినా నిజాయితీగా అమలు చేస్తే కోట్ల ఎకరాల భూమి మిగులుగా తేలుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఎమ్మేల్యేల అక్రమ ఆక్రమణలో ఉన్న భూములే కొన్ని లక్షలు బైటికి వచ్చాయి. (అప్పటి సి.ఎం రాజాశేఖర రెడ్డి ప్రకటించిందే మూడు వేల ఎకరాలు) భారత దేశంలో మిగులు భూములు లేవన్న సి.పి.ఏం లాంటి పార్టీలు చేసిన ఆందోళనలోనే లక్షల ఎకరాల మిగులు భూములు అప్పట్లో బైటికి వచ్చాయి. ‘మన ఎం.ఎల్.ఏ లు కూర్చున్నది అసెంబ్లీలో కాదు, లక్షల ఎకరాల భూములపైన’ అని హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ హర గోపాల్ అప్పట్లో వ్యాఖ్యానించారు. సందర్భాన్ని గుర్తుకి తేవడానికి ఇక్కడ ఆయన వ్యాఖ్య.

ఇవన్నీ చేసినట్లయితే రైతులకి సబ్సిడీలు అవసరమే లేదు. కూలీలు రైతులు కాగలరు. కూలీలు అదృశ్యమయ్యే పరిస్ధితి రావడం అంటే పారిశ్రామిక వ్యవసాయానికి బాటలు పడ్డట్లే. వెనకబడ్డ వ్యవసాయం స్ధానంలో పెట్టుబడిదారీ వ్యవసాయం (నిజానికి అంతకంటే మెరుగైన సహకార వ్యవసాయం నిజమైన అర్ధంలో నెలకొల్పబడినా ఆశ్చర్యం లేదు) వచ్చినట్లే.

అమెరికాలో వ్యవసాయం రంగంలో ఇక్కడి కంటే అనేక రేట్లు సబ్సిడీలు ఇస్తున్నది. ప్రపంచ వాణిజ్య సంస్ధలో అమెరికా, యూరప్ లకీ ఇండియా, చైనా, మలేషియా లాంటి దేశాలకీ మధ్య ప్రధానంగా వాదన జరుగుతున్నది ఈ అంశంపైనే. అమెరికా తన వ్యవసాయ రంగంలో సబ్సిడీలు రద్దు చేయాలని కోరినందుకే డబ్ల్యూ.టి.ఓ సమావేశాలు జరగకుండా శాశ్వతంగా వాయిదా పడ్డాయి. అమెరికా సహకారం ఇవ్వనందునే ఈ సమావేశాలు వాయిదా పడ్డాయన్న సంగతి గుర్తుంచుకుంటే వ్యవసాయ రంగం సబ్సిడీలని అమెరికా ఎంత ముఖ్యంగా గుర్తిస్తున్నదీ అర్ధం చేసుకోవచ్చు. అమెరికా ఇస్తున్న సబ్సిడీలతో పోలిస్తే ఇండియా ఇస్తున్న సబ్సిడీలు సోదిలోకి కూడా రావు. ఐనా ఇండియా తన రైతులకి ఇస్తున్న సబ్సిడీలు రద్దు చేయాలని అమెరికా పట్టు పడుతోంది. దానికి భారత ప్రభుత్వం అంగీకరించి ఆ వైపుగా నెమ్మదిగా అడుగులు వేస్తోంది. ఇలా పత్రిల ద్వారా రైతుల సబ్సిడీలకు వ్యతిరేకంగా ప్రచారం చేసే ఎత్తుగడల్ని కూడా భారత పాలకవర్గాలు అనుసరిస్తున్నాయి. ఫస్టు పోస్టు ఆర్టికల్ అందులో భాగమే. అది యధాలాపంగా బాధతో రాసింది కాదు.

18 thoughts on “వ్యవసాయ సబ్సిడీలు, దళారీ వ్యవస్ధ

 1. Thank you for analyzing and publishing your analysis.
  If you look at the title, it says “fertiliser folly how to benefit foreigners and shoot ourselves”!.
  But the content is different!
  Do you think privatization of agriculture is coming soon?

 2. “కూలీలు అదృశ్యమయ్యే పరిస్ధితి రావడం అంటే పారిశ్రామిక వ్యవసాయానికి బాటలు పడ్డట్లే.”
  విశేఖర్ గారూ,
  ఆద్యంతం మీ వ్యాసం చదివాను. ప్రత్యేకించి పైన ఉల్లేఖించిన వాక్యాన్ని మా ఊరు, చుట్టుపక్కల ప్రాంతాలకు వర్తింపజేస్తే ఒక భీతావహ పరిస్థితి కళ్లకు కడుతుంది. ఇంటికి కనీసం ఒక ఎద్దుల జత, పాడి పశువులు ఉంటున్న బంగారు కాలం మా ఊళ్లో దాదాపు మాయమైపోయింది. కూలీలను పశువులను నిర్వహించడం భారమైన స్థితిలో దాదాపు 50 ఏళ్ల తర్వాత మా ఊరు పశువులకు దూరమైంది. కూలీలకు దూరమైంది. కూలీలు ఎందుకు మాయమవుతున్నారు, ఎందుకు పశువులు లేకుండా పోతున్నాయి అనే విషయం రైతులకు బోధపడలేదేమో కాని అనివార్యంగా నారు నాటటం, పంట కోతలు, నూర్పిళ్లు వంటివి యంత్రాలతో జరిపించేసే కాలం మా వేపు వచ్చేసింది. ఒక జత పశువులు రోజంతా ఎకరా పొలం దున్నే పరిస్థితి పోయి రెండు గంటల్లో ఎకరా పొలం లాగించే యంత్రాలు వచ్చేశాయి. నిరుడు సంక్రాంతి సమయంలో ఊరెళితే కనుమ పండుగ రోజు చిట్లా కుప్ప వద్ద పశువులకు బదులు మనుషులు ఎక్కువగా ఉన్న స్థితి చూసి నిర్ఘాంతపోయాను. ఈ తరం మనుషులు, వృద్ధుల కాలం ముగిస్తే ఎన్ని పల్లెలు ఖాళీ అయిపోతాయో చెప్పలేని స్థితి. ఎందుకంటే పశువులు, కూలీలు మాత్రమే కాదు పిల్లలు కూడా ఊళ్ల నుంచి మాయమవుతున్న పరిస్థితి. చదువే సర్వస్వమైపోయిన కాలంలో పల్లెలో వ్యవసాయం కోసం ఇంటికి కనీసం ఒక పిల్లవాడయినా మిగిలే రోజులు కనుమరుగయిపోయాయి. ఇది నా బాల్యంలో కాని ఇటీవలకాలం వరకు కూడా ఎన్నడూ ఊహించని పరిణామం.

  “వెనకబడ్డ వ్యవసాయం స్ధానంలో పెట్టుబడిదారీ వ్యవసాయం (నిజానికి అంతకంటే మెరుగైన సహకార వ్యవసాయం నిజమైన అర్ధంలో నెలకొల్పబడినా ఆశ్చర్యం లేదు) వచ్చినట్లే.”

  ‘వీక్షణం’ పత్రికలో భారతదేశంలో పెట్టుబడిదారీ వ్యవసాయం అనేది ఉందా అనే అంశంపై గత కొద్దివారాలుగా సమీక్షా వ్యాసాలు వస్తున్నాయి. మీరు చూస్తున్నారనుకుంటాను. ఈ నేపధ్యంలో వెనకబడ్డ వ్యవసాయం స్ధానంలో పెట్టుబడిదారీ వ్యవసాయంకి మన దేశంలో ప్రాతిపదిక ఉందా అనేది చర్చనీయాంశం అవుతుందనుకుంటాను. మన దేశ ఆర్థిక, సామాజిక చట్రం ఇలాగే ఉన్నంతవరకు మెరుగైన సహకార వ్యవసాయం నిజమైన అర్తంలో ఇక్కడ ఏర్పడుతుందా? వేచి చూడాల్సిందే…

  ‘మన ఎం.ఎల్.ఏ లు కూర్చున్నది అసెంబ్లీలో కాదు, లక్షల ఎకరాల భూములపైన’
  దార్శనికత నిండిన వాక్యం. గనులు, క్వారీలు, ప్రాజెక్టులు, సెజ్‌లూ అన్నీ భూములపైనే ఉన్నాయి కదా.. వ్యవసాయ రంగం దుస్థితిపై చక్కటి వ్యాసం చదివాను. అభినందనలు.

 3. సంజయ్ గారూ, నా విశ్లేషణ సంపూర్ణం కాదు. ఇంకా ముఖ్యమైన అంశాలను కవర్ చేయలేదు. కొద్ది సమయంలో నాకది అసాధ్యం. పైగా నాకు తెలిసిన అంశాలు చాలా, చాలా తక్కువ.

  ఫస్ట్ పోస్ట్ ఆర్టికల్ కీ టైటిల్ కి సంబంధం లేదని మీరు సూచిస్తున్నారా? సంబంధం ఉందని నాకు అనిపిస్తోంది. అయితే అది నేరుగా చెప్పకుండా టైటిల్ కీ, కంటేంట్ కీ కొంత ఖాళీ ఐతే వదిలారు.

  వ్యవసాయరంగం ప్రవేటీకరణ అంటే మీ ఉద్దేశ్యం? వ్యవసాయ రంగం ప్రవేటీకరణ అన్న పదబంధంలో నాకు అర్ధం తోచడం లేదు. ఆ రంగం రైతులు, కంపెనీల చేతుల్లో ఉంది. వీరిద్దరూ ప్రవేటు వ్యక్తులే కదా.

 4. రాజ శేఖర రాజు గారికి

  నిజానికి ఈ వ్యాసం అసంపూర్ణం. మీరు లేవనెత్తిన అంశాలపైనే ఇంకా వివరణ ఇవ్వాల్సి ఉంది. కాని అరగంటలో ముగించినందునా, సంజయ్ గారు ఎదురు చూస్తుంటారేమో అన్న భావంతో త్వర త్వరగా రాసినందునా ఇంకొన్ని ముఖ్యాంశాలను వదిలేశాను. ఈ మధ్య సమాధానం ఇస్తాను అంటూ రెండు మూడు అంశాలను అర్ధంతరంగా వదిలేశాను. ముస్లింల విషయంలో అంబేద్కర్ అభిప్రాయాలు, స్ట్రాస్ కాన్ నైతికతకీ, పెట్టుబడిదారీ సంస్కృతికీ ఉన్న సంబంధం.. ఇంకో రెండు మూడు. తర్వాత అని వాయిదా వేసి తప్పించుకుంటున్నాడు అని భావిస్తారని ఈ పోస్టు రాసేశాను. అందుకు ఒక విధంగా క్షంతవ్యుడ్ని.

  “కూలీలు అదృశ్యమయ్యే పరిస్ధితి రావడం అంటే పారిశ్రామిక వ్యవసాయానికి బాటలు పడ్డట్లే” అన్న అంశం పై ఇంకా వివరణ అవసరం. అలాగే “వెనకబడ్డ వ్యసాయం – పెట్టుబడిదారీ వ్యవసాయం – నిజమైన సహకార వ్యవసాయం” అంశం చాలా విస్తృతమైనది. దీనిపైన పెద్ద పెద్ద గ్రంధాలే వచ్చాయి. ఈ మూడు పదాలూ నిజానికి మూడు వ్యవస్ధలకు సంబంధించినవి. అందువల్లే అది విస్తృతం. ముందు ముందు ఇవి వివరించడానికి ప్రయత్నిస్తాను. ఎప్పుడో చెప్పలేను. ఈ టాపిక్ ఇప్పుడు వామపక్ష విప్లవకారుల్లో కూడా నలుగుతోంది. భారత దేశంలో పెట్టుబడిదారీ వ్యవసాయం ఎంతవరకు ప్రవేశించిందన్నదే ఆ టాపిక్. కనుక ఈ కొద్ది వ్యాసంలో, అదీ సరైన అధ్యయనం లేకుండా, వివరణ సాధ్యం కాదు. మీరు దృష్టిలో ఉంచుకోవడానికి ఇది రాస్తున్నా.

 5. వ్యవసాయం అనేది మధ్యవర్తులకి లాభదాయకమే కానీ రైతులకి మాత్రమే దండగ వృత్తి అయ్యింది. విజయనగరం జిల్లా తోటపల్లి ప్రాంతంలో మధ్యవర్తులు సంతలలో అరటి గెలలని చాలా తక్కువ ధరకి కొని పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పుర్ మార్కెట్‌లో చాలా ఎక్కువ ధరకి అమ్ముతారు.

  చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతం. అది మన రాష్ట్రంలోని తెలంగాణా కంటే కూడా చాలా వెనుకబడిన ప్రాంతం. చత్తీస్‌గఢ్ నుంచి కూలీలు ఆంధ్రాకి వలస రావాలి కానీ చత్తీస్‌గఢ్‌లో ఆంధ్రా కూలీలని చూశాను. జగ్‌దల్‌పుర్ పట్టణంలోని భవన నిర్మాణ కార్మికులు తెలుగు మాట్లాడుతున్నారేమిటా అని మొదట సందేహించాను. శ్రీకాకుళం జిల్లాలోని ధనిక రైతులు యంత్రాలు కొనడంతో కూలీలకి పనులు దొరక్క పనుల కోసం జగ్‌దల్‌పుర్ వచ్చారని తెలిసింది.

  వ్యవసాయం లాభదాయకమే. ఒకవేళ లాభదాయకం కాకపోతే అమెరికాలోని కేలిఫోర్నియా రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు, ఇండియాలోని రైతులు మాత్రమే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? ఇండియాతో పోలిస్తే అమెరికాలో వ్యవసాయంలో ఎరువులు & పురుగు మందుల వినియోగం చాలా ఎక్కువనే విషయం గుర్తుంచుకోవాలి. పురుగు మందుల కాలుష్యం వల్ల అక్కడి రైతులకి వ్యాధులు వచ్చి చనిపోవడం కూడా జరుగుతుంది. మన ఇండియాలో ఎరువులు, పురుగు మందుల వినియోగం చాలా తక్కువైనా రైతులకి పెట్టిన పెట్టుబడి తిరిగి రావడం లేదు.

  అమెరికాలో వ్యవసాయం కాలుష్య విష కూపమైతే ఇండియాలో వ్యవసాయం ఒక ఉరితాడు.

 6. మీరు రాయవలసినవి వాయిదా వేసి తప్పించుకుంటున్నారు అని అనలేము. ఎందుకంటే ఉద్యోగ జీవితం పోనూ మిగిలిన కాస్త సమయాన్ని మీరు వార్తలకే కేటాయిస్తున్నారు. మీ బ్లాగుకు జాతీయ అంతర్జాతీయ వార్తలు అని మాత్రమే కాక కథనాలు అని కూడా పేరు జోడించి ఉంటే అప్పుడు మీనుంచి కథనాలను మరింతగా డిమాండ్ చేసే అవకాశముండేది. ఒకే రోజు అయిదారు వార్తలు రాయడానికి బదులు -అంటే అవి విలువైనవి కావని అర్థం కాదు- రెండు చక్కని కథనాలు ప్రచురిస్తే అవి మరింత అవసరమైనవిగానూ, చర్చనీయమైనవిగానూ ఉండేవి.

  మీ సమర్థకులూ, విమర్శకులూ కూడా మీ సిద్ధాంతం ఏమిటో వివరించమని ఏకాభిప్రాయానికి వచ్చేశారు కనుక మీరు ఈ కోణంలో పయనించవలసిన అవసరం చాలానే ఉంది. మార్క్సిజంపై మీరు ఆరు నెలల క్రితం రాసిన బృహత్ కథనం వంటిది ఈ మధ్యకాలంలో మీనుంచి చూడలేదు. మనం అటూ ఇటూ కాకుండా పోతున్న ఈ రోజుల్లో కూడా అలాంటి సైద్ధాంతిక కథనాలు రావడం, చదవటం చాలా అవసరం. విఫల సిద్ధాంతాలు, ప్రయోగాలు అంటూ విమర్శకులు అభిప్రాయాలు గుప్పించినా సరే.. వాటి విలువను ఎవరూ తోసిపుచ్చలేరు.

  మార్కిజంపై మీరు రాసిన కథనం, ఇప్పుడు వ్యవసాయ సబ్సిడీలు వంటివాటిని మీ హోమ్ పేజీలో దీర్ఘకాలం కనిపించేలా ఏర్పాటు చేయండి. సిద్ధాంతాన్ని కేవలం పడికట్టు పదజాలంతో గుప్పించడం కాకుండా జీవితానుభవాలు, జీవితోదాహరణలతో సూచిస్తే ఎంత పఠనీయత కలిగి ఉంటుందో మార్కిజంపై మీరు రాసిన కథనం తేల్చి చెప్పింది. తక్కువగా అయినా సరే అలాంటివి ఇప్పుడు అవసరం.

 7. Excellent Sir…..read it till the last word!!! they call me YourGOD!!! and I found you one reasonable person in these telugu blog stuff!!!

  @PraveenSharma—–do not try to compare anything!! everything has its ownness!!!!
  America uses a lot of poision and gets away with it…cuz….they are the rulers of current world!!! u shud just stay calm either with Vietnam, Iran, Afghan….or whatever in future!!! Don’t bring those idiots into this frame!!!!!

  కూలీలు అదృశ్యమయ్యే పరిస్ధితి రావడం అంటే పారిశ్రామిక వ్యవసాయానికి బాటలు పడ్డట్లే” అన్న అంశం పై ఇంకా వివరణ అవసరం. అలాగే “వెనకబడ్డ వ్యసాయం – పెట్టుబడిదారీ వ్యవసాయం – నిజమైన సహకార వ్యవసాయం” అంశం చాలా విస్తృతమైనది
  ans: you have any doubt sir??? It should be!!!!there is no enough labor available in the villages right now!!! it is neither good to ask them to remain as labor forever……best way is use technology in the farming…..make it an industry…..there is no other option sir!!! you are 100% right!!!!! it should become an industry,,,and any graduate should feel no shame in taking the farming his profession!!!! that’s where the problems get solved!!!!!

 8. @YourGod
  కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన NMDC ఆధీనంలో ఉన్న బైలడీలా ఇనుప గనులలో పోర్టర్‌గా పని చేసే కార్మికునికి నెలకి పద్దెనిమిది వేలు జీతం వస్తుంది. కానీ ఒక సాధారణ వ్యక్తి వ్యవసాయం చేస్తే నెలకి పది వేలు కూడా రావు. అటువంటప్పుడు డిగ్రీ చదువుకున్న వ్యక్తి వ్యవసాయం ఎలా చేస్తాడు?

  రైల్వేలో ప్రొబేషనరీ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్‌గా పని చేసినా నెలకి ఏడెనిమిది వేలు జీతం వస్తుంది. అయినా లాటరీలాగ, జూదంలాగా కనిపించే వ్యవసాయం కంటే ప్రొబేషనరీ ASM ఉద్యోగం మేలు అనుకుని రైతు కొడుకు కూడా రైల్వే ఉద్యోగానికి వెళ్ళిపోతాడు.

  మన రాష్ట్రంలో ఒకప్పుడు సబ్సిడీలు ఉండేవి. సబ్సిడీలు ఇస్తే ప్రపంచ బ్యాంక్ ఋణాలు ఇవ్వదని ప్రభుత్వం సబ్సిడీలని రద్దు చేసింది. వ్యవసాయ సబ్సిడీల రద్దుని జస్టిఫై చేసుకోవడానికి వ్యవసాయం దండగ అని ప్రభుత్వం ప్రచారం చేసింది. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయం దండగ అని ప్రచారం చెయ్యకపోయినా గతంలో రద్దు చెయ్యబడిన సబ్సిడీలని పునరుద్ధరించలేదు. భవిష్యత్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యవసాయం దండగ అని ప్రచారం చెయ్యగలదు.

 9. వ్యవసాయం దండగా అని ప్రచారం చేసిన తెలుగు దేశం పార్టీకి అగ్రకుల రైతులలో 40% మంది వోట్లు వేశారు. ఆ 40% మంది అగ్రకుల రైతులు వేరే వృత్తి దొరికితే వ్యవసాయం నుంచి బయటకొచ్చేద్దాం అనే యోచనలో ఉన్నవాళ్ళే కానీ వ్యవసాయాన్ని కొనసాగించే యోచనలో ఉన్నారని నేను అనుకోను.

  దళిత రైతులలో మాత్రం 90% మంది కాంగ్రెస్‌కి వోట్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ ఇరిగేషన్ ప్రోజెక్ట్‌లు కడతామని చెపితే నమ్మేసి వోట్లు వేశారు కానీ రేపు కాంగ్రెస్ కూడా వ్యవసాయం దండగ అని ప్రచారం చెయ్యగలదు అనే విషయం వాళ్ళకి తెలియదు.

 10. రాజు గారికి

  నిజమే. మార్క్సిజం పై కధనాలు అత్యవసరం. ఐతే నెట్ పాఠకులకి సందర్భోచితంగా చెప్పగలిగితేనే వాటివల్ల ఉపయోగం అని గ్రహించాను. అలా కాక మార్క్సిజాన్ని నూరిపోయాలన్న ఉద్దేశ్యంతో చెబితే ఏ విషయాన్నీ చెప్పలేం. అది వ్యర్ధం.

  మీరు చెప్పినట్లు మార్క్సిజం పై వ్యాసాలను ఒక చోట ఉంచాలని ‘materialism.posterous.com’ బ్లాగ్ తెరిచాను. ఈ సలహా ఇంతకు ముందే ఓ మిత్రుడు ఇవ్వడంతో ఆ పని చేశాను గానీ వివరాలు ఎవరికీ చెప్పలేదు. ఇపుడు మీరు గుర్తుచేశాక అది గుర్తొచ్చింది. ఆ లింక్ నా బ్లాగ్ లో పెడతాను.

  పోస్టీరస్ లో పోస్టింగ్ కష్టంగా ఉంటోంది. దాని బదులు బ్లాగర్ గానీ, వర్డ్ ప్రెస్ లో గానీ బ్లాగ్ ప్రారంభించే ఆలోచన కూడా ఉంది. మీ ఇతర సూచనలను పరిగణనలోకి తీసుకుంటాను.

  పోతే, వార్తలు ఆధారంగా చేసుకోకపోతే వేరే ఇతర ఆధారం నాకు లేదు.

 11. విశేఖర్ గారు, నేను పోస్టరస్‌లో బ్లాగ్ పెట్టడానికి ఒక కారణం ఉంది. ఎపిజెన్‌కో విద్యుత్ సౌధలో పని చేసే మా బాబాయి గారి ఆఫీస్‌లో బ్లాగ్‌స్పాట్, వర్డ్‌ప్రెస్ బ్లాగ్‌లు ఓపెన్ అవ్వవు, జిమెయిల్ కూడా ఓపెన్ అవ్వదు. చాలా ఆఫీస్‌లలో బ్లాగింగ్ & ఈమెయిల్ సైట్‌లని ప్రాక్సీ సర్వర్ల ద్వారా బ్లాక్ చేస్తారు. ఆఫీసుల నుంచి బ్లాగ్‌లు ఓపెన్ చేసేవాళ్ళ సౌకర్యం కోసమే నా బ్లాగ్‌ని పోస్టరస్‌లో పెట్టాను.

 12. ప్రవీణ్, అవునా? ఆఫీసుల్లో కూడా బ్లాగ్ అందుబాటులో ఉండాలంటే పోస్టీరస్ బెటర్ అన్నమాట! నాకు తెలియని విషయం చెప్పారు. ధ్యాంక్స్.

 13. నేను పోస్టరస్‌లో బ్లాగ్ పెట్టడానికి ఇంకో కారణం కూడా ఉంది. పోస్టరస్ అడ్రెస్ రికార్డ్‌ల ద్వార క్రియేట్ చేసిన సబ్-డొమెయిన్స్‌ని సపోర్ట్ చేస్తుంది. ఉదహారణకి stalin-mao.net.in అనేది ప్రైమరీ డొమెయిన్ అయితే streevimukti.stalin-mao.net.in అనేది సబ్-డొమెయిన్.

  వర్డ్‌ప్రెస్ సబ్‌డొమెయిన్స్‌ని సపోర్ట్ చెయ్యదు. వర్డ్‌ప్రెస్ బ్లాగ్‌కి సొంత డొమెయిన్ కావాలంటే ప్రైమరీ డొమెయిన్‌కి నేమ్ సర్వర్లు మార్చాలి. కానీ పోస్టరస్‌కి నేమ్ సర్వర్లు మార్చకూడదు. కేవలం IPV4 అడ్రెస్ మాత్రమే మార్చాలి. నేమ్ సర్వర్లు మారిస్తే IPV4 అడ్రెస్ మార్చడానికి అవ్వదు. అయితే IPV4 అడ్రెస్ మార్చే అవకాశం ఉన్నప్పుడు రెండుమూడు సబ్‌డొమెయిన్‌లు కూడా పెట్టుకోవచ్చు కనుక IPV4 ద్వారా డొమెయిన్ అసైన్ చేసుకునే అవకాశం ఉన్న పోస్టరస్‌లోనే బ్లాగ్ పెట్టుకున్నాను.

  ఇవేమీ అర్థం కానంత కష్టమైన విషయాలు కావు. పోస్టరస్ సపోర్ట్ టీమ్‌వాళ్ళని అడిగినా ఈ విషయాలు చెప్పేస్తారు.

 14. అర్ధం కానివి కాకపోయినా, అవి తెలిసేంతవరకూ అర్ధంకాని జాబితాలో ఉంటాయి కదా ప్రవీణ్. ఏమైనా మీరిచ్చిన సమాచారం ఉపయోగమే.

 15. ప్రవీణ్, ఇంతకీ ఈ IPV4, IPV6 లు ఏమిటి? ఈ అంశాలనూ, ఇంకా ఇతర వెబ్ సైట్ బేసిక్స్ వివరిస్తూ ఒక బ్లాగ్ పెట్టొచ్చేమో ఆలోచించండి. నాలాంటి వారికి ఉపయోగపడుతుంది.

 16. IPV6ని చాలా వెబ్‌సర్వర్లు సపోర్ట్ చెయ్యవు కానీ IPV4 అడ్రెస్ 255.255.255.255 లాగ పన్నెండు డిజిట్ల సంఖ్యలో ఉంటుంది. ఈ స్క్రీన్‌షాట్ చూడండి: http://imageshack.us/photo/my-images/191/screenshot1of.png/

  184.106.20.102 అనేది పోస్టరస్‌వారి IPV4 అడ్రెస్.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s