భారత ప్రభుత్వం ఇస్తున్న అప్పుతో పాటు అది విధించిన విషమ షరతులను అమలు చేయలేక బంగ్లాదేశ్ ఏకంగా ఎనిమిది ప్రాజెక్టులను రద్దు చేసుకోవడానికి సిద్ధపడుతోంది. బంగ్లాదేశ్ లో చౌకగా దొరికే ఇసుక, ఇటుకలను కూడా భారత దేశంనుండే దిగుమతి చేసుకోవాలను భారత ప్రభుత్వం షరతులు విధించడంతో దానికంటే ప్రాజెక్టులు రద్దు చేసుకోవడమే మేలని బంగ్లాదేశ్ ప్రభుత్వం తలపోస్తున్నది. ఇదే రకమైన అప్పుల్ని అమెరికా, యూరప్ లనుండి తీసుకుని ఆ అప్పుల భారాన్ని ప్రజలపై మోపిన భారత ప్రభుత్వాలు ఇప్పుడు అదే ఎత్తుగడని పొరుగున ఉన్న బలహీన దేశాలపై అమలు చేయడానికి పూనుకుంటోంది.
భారత ప్రభుత్వం ఒక బిలియన్ డాలర్ల (యాభై బిలియన్ రూపాయలు లేదా ఐదు వేల కోట్ల రూపాయలు) మేరకు బంగ్లాదేశ్ కు అప్పు (సహాయం పేరుతో) ఇవ్వడానికి వాగ్దానం చేసింది. దీనిని ఇరవై ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం పధకాలు రూపొందించుకుంది. అప్పుల విడుదల, ప్రాజెక్టుల నిర్మాణం తదితర అంశాలపైన ఇరుదేశాల మంత్రివర్గ బృందాలు చర్చలు జరుపుతున్నాయి. ఈ సమావేశాల్లో భారత ప్రతినిధుల షరతులతో ఠారెత్తిన బంగ్లా ప్రతినిధులు అందులో ఎనిమిది ప్రాజెక్టులను రద్దు చేసుకునే యోచనలో ఉన్నారని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది.
సోమవారం జరిగిన సమావేశంలో ఇరు దేశాల బృందాలు ఈ ఎనిమిదింటిని రద్దు చేసుకోవడానికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సమాకాల్, ఇంకా ఇతర బంగ్లా పత్రికలను ఉటంకిస్తూ ది హిందూ ఈ వివరాలు తెలిపింది. అప్పుతో పాటు వచ్చి చేరిన షరతులు విషమంగా ఉన్నాయని బంగ్లా ప్రతినిధులు భావిస్తున్నారు. వాటి బదులు తేలికగా అమలు చేయగల ప్రాజెక్టులను రూపొందించుకోవాలని వారు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన సరుకులు సేవలలో 85 శాతం ఇండియా నుండే దిగుమతి చేసుకోవాలని భారత ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ సరుకులు, సేవలు నిజానికి బంగ్లాదేశ్ లోనే అత్యంత తక్కువ ధరలకు దొరుకుతాయని వారు వెల్లడించారు.
“ఇసుక, ఇటుకలతో పాటు కార్మికులను గూడా ఇండియానుండి దిగుమతి చేసుకోవాలని భారత్ డిమాండ్ చేస్తోంది. ఇవన్నీ ఇక్కడ చౌకగా దొరుకుతాయి. దిగుమతి ధరల వల్ల ప్రాజెక్టుల ఖర్చు విపరీతంగా పెరుగుతుంది” అని బంగ్లాదేశ్ ఆర్ధిక శాఖ సీనియర్ అధికారి అన్నాడు. సోమవారం జరిగిన అంతఃమంత్రిత్వ శాఖల సమావేశంలో రుణంతో పాటు అనేక విషమ షరతులు విధించడం చర్చకు వచ్చింది. తదుపరి వారంలో రానున్న భారత్ ప్రతినిధి బృందానికి తమ నిర్ణయం తెలియజేస్తామని ఆర్ధిక సంబంధాల శాఖ అసిస్టేంట్ సెక్రటరీ జీనత్ రెహ్మాన్ అన్నదని సమాకాల్ పత్రిక తెలిపింది.
ఆగష్టు 2010 లో బంగ్లాదేశ్ కి ఒక బిలియన్ డాలర్ల రుణం మంజూరు చేసింది. ఈ రుణం ద్వారా బంగ్లాదేశ్ లోని మౌలిక నిర్మాణాలను ఆధినీకరించడానికి అక్కడి ప్రభుత్వం సిద్ధపడింది. అందుకు ఇరవై ప్రాజెక్టులు రూపొందించుకుంది. బంగ్లాదేశ్ రైల్వేస్, కమ్యూనికేషన్స్ విభాగాలు ఈ రుణాన్ని వినియోగించుకోవాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. పదిహేడు ప్రాజెక్టులు అవి రూపొందించుకున్నాయి. ఐతే ఇంతవరకూ ఇవి భారత్ నుండి రుణం పొందలేకపోయాయి. మెజారిటీ ప్రాజెక్టులకు టెండర్ ప్రక్రియే ఇంకా కొనసాగుతోంది. ఒక ప్రాజెక్టు మాత్రమే సజావుగా నడుస్తోందనీ, అది కూడ బంగ్లా ప్రభుత్వ ఏజన్సీ ‘రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఒకటి మాత్రమేననీ తెలుస్తొంది. రుణ షరతుల సంక్లిష్టతలవల్ల ఇతర ప్రాజెక్టులు కష్టంగా మారాయని బంగ్లా ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ తెలిపాడని ‘ది హిందూ’ తెలిపింది.