యూరప్ రేటింగ్ – ఇండియాపై ప్రభావం


అమెరికా, యూరప్ ల సామ్రాజ్యవాద ఆర్ధిక వ్యవస్ధలకు భారత దేశ ఆర్ధిక వ్యవస్ధను కట్టిపడేయడం వల్ల అక్కడ ఏం జరిగినా భారత్ పై ప్రభావం తధ్యం. గ్లోబలైజెషన్ ఆర్ధిక విధానాల దుష్ఫలితం ఇది. ‘రష్యా, చైనాల్లో వాన కురిస్తే భారత కమ్యూనిస్టులు ఇక్కడ గొడుగు పడతారు’ అని గతంలో ఎద్దేవా చేసేవారు. ఇపుడు అమెరికా, యూరప్ లకి జలుబు చేస్తే ఇండియా ఆర్ధిక వ్యవస్ధకి ఏకంగా జ్వరమే తగులుకుంటోంది. తీవ్ర సంక్షోభాలు తలెత్తితే జ్వరమే కాక ఏకంగా ప్రాణాల మీదికే వస్తుందని ఈ సంవత్సరం భారత జిడిపి వృద్ధి రేటు క్షీణించడం బట్టి అర్ధం అవుతోంది.

ప్రముఖ క్రెడిట్ రేటింగ్ సంస్ధ స్టాండర్డ్ & పూర్ సంస్ధ యూరో జోన్ లోని తొమ్మిది దేశాల క్రెడిట్ రేటింగ్స్ ని తగ్గించి యూరప్ సంక్షోభం తీవ్రతని మరోసారి ప్రపంచానికి తెలియజేసింది.  వివిధ దేశాల సావరిన్ రుణాల రేటింగ్ లను వివిధ అంశాల ఆధారంగా రేటింగ్ సంస్ధలు నిర్ణయిస్తాయి. స్ధూల ఆర్ధిక వ్యవస్ధ మౌలికాంశాలు (ఫండమెంటల్స్), బడ్జెట్ నిర్వహణ (ఫిస్కల్ డెఫిసిట్ తక్కువ ఉండేలా చూడడం లాంటివి), సంక్షోభ పరిస్ధితుల్లో వేగంగా స్పందించగలగడంలో ప్రభుత్వాల సామర్ధ్యం (కార్మికుల చట్టాలను రద్దు చేయడం, కార్మిక ఉద్యమాలను నిర్దాక్షిణ్యంగా అణచివేయడం, కార్మికుల సంక్షేమ చర్యలను రద్దు చేయడం లేదా కోత పెట్టడం మొ.న చర్యలు చేపట్టడంలో వెనకడుగు వేయకుండా ఉండడం)… మున్నగు అంశాలపైన ఆధారపడి రేటింగ్ సంస్ధలు నిర్ణయిస్తాయి.

ప్రభుత్వాలు పొదుపు ఆర్ధిక విధానాలను అమలు చేయడం ప్రారంభిస్తే ఆ దేశాల ఆర్ధిక వృద్ధి పడిపోతుందని ప్రముఖ అమెరికా ఆర్ధికవేత్త ‘నౌరీల్ రౌబిని’ ని ఉటంకిస్తూ ఎన్.డి.టి.వి తెలిపింది. యూరప్ లో కఠినమైన పొదుపు విధానాలు అమలు చేస్తున్నందున యూరప్ దేశాల్లో జిడిపి వృద్ధి క్షీణించనున్నదని తద్వారా అర్ధం చేసుకోవచ్చు. క్రెడిట్ రేటింగ్ సంస్ధలు రుణ సంక్షోభం పరిష్కారమ్ కోసం పొదుపు విధానాలను అనుసరించక తప్పదు అని శాసిస్తున్నాయి. అంటే ప్రభుత్వాలు ప్రజలపైన పెట్టే ఖర్చులు తగ్గించాలని అర్ధం. దానితో పాటు మరిన్ని పన్నులు విధించి ఆదాయం పెంచుకోవాలని కూడా అవి చెబుతున్నాయి. దానర్ధం వినియోగదారుల జేబుల్లో డబ్బు మిగులు తగ్గిపోతుంది. కనుక ప్రజలు కొనుగోళ్ళు తగ్గిస్తారు. అది ఉత్పత్తి తగ్గడానికి కారణం అవుతుంది. ఫలితంగా జిడిపి వృద్ధి తగ్గిపోతుంది.

ఈ నేపధ్యంలొ యూరప్ దేశాల్లో వ్యాపార అవకాశాల కోసం చూస్తున్న భారత్ వ్యాపారుల కు ఆ అవకాశాలు దూరం అవుతాయి. అంటే భారత్ చేసే ఎగుమతులు తగ్గించుకోవలసి ఉంటుంది. అంటే భారత దేశంలో కూడా ఉత్పత్తి పడిపోతుంది. అంటే జి.డి.పి వృద్ధి తగ్గిపోతుంది. భారత కంపెనీలు తమ వ్యాపారాలను కాపాడుకోవడం కోసం మరిన్ని కష్టాలు పడవలసి ఉంటుంది. ఈ పరిణామాలు మొత్తంగా గ్లోబల్ స్ధాయిలో కమోడిటీల ధరలు పడిపోవడానికి దారితీస్తాయి. జిడిపి వృద్ధి పడిపోతే ఈ కమోడిటీలకు డిమాండ్ పడిపోతుంది. ఆయిల్ ధరలు కూడా తాత్కాలింగా తగ్గిపోయే అవకాశాలు ఉండవచ్చు. ఇది ఇండియాలాంటి ఆయిల్ దిగుమతిదారులకు అనుకూలంగా ఉంటుంది. కాని జిడిపి వృద్ధి తగ్గిన ఫలితంగా ఈ అనుకూలత కంటె అధికంగా ప్రతికూలత ఉండడం వల్ల ఆ అనుకూలత రద్దైపోతుంది.

రేటింగ్ తగ్గింపు వల్ల జరిగే మరో పరిణామం విదేశీ సంస్ధాగత పెట్టుబడుల (ఎఫ్.ఐ.ఐలు) రాక తగ్గిపోవడం. ఎఫ్.ఐ.ఐ ల కోసం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. ఇటీవలే విదేశీ వ్యక్తిగత మదుపుదారులు సైతం భారత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చని ప్రభుత్వం నిర్ణయిం తీసుకున్నది కూడా ఈ ఎఫ్.ఐ.ఐ ల కోసమే. ఎఫ్.ఐ.ఐ లను దేశంలోకి రాకుండా చేయడానికి చైనా ప్రభుత్వం తంటాలు పడుతోంటే అవి వచ్చేలా చూసుకోవడానికి ఇండియా తంటాలు పడుతోంది. ఎఫ్.ఐ.ఐ ల పెట్టుబడులు అస్ధిరమైనవి కనుక అవి వస్తూ వస్తూ అస్ధిరత ను తమ వెంట తెస్తాయి. అందుకే చైనా వాటిని అడ్డుకోవడం. ఇప్పటివరకూ ఎఫ్.ఐ.ఐ లు వివిధ కంపెనీలు, ఫండ్స్ రూపంలో రావడానికే ఇండియా అనుమతి ఇవ్వగా దాన్ని వ్యక్తిగత ఇన్వెస్టర్లకు కూడా విస్తరిస్తూ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నిర్ణయించింది.

భారత షేర్ మార్కెట్లను ఉత్తేజితం చేయడానికి ఇండియా ఎఫ్.ఐ.ఐ ల పైనే ప్రధానంగా ఆధారపడి ఉంది. లిస్టయిన షేర్లలో దాదాపు పది శాతం ఎఫ్.ఐ.ఐ ల పెట్టుబడులేనని ఎన్.డి.టి.వి తెలిపింది. సాధారణంగా అమెరికా, యూరప్ ల షేర్ మార్కెట్లలో బలహీనతలు ఏర్పడినప్పుడు ఇండియా చైనా లాంటి ఎమర్జింగ్ మార్కెట్లలోకి ఎఫ్.ఐ.ఐలు వెల్లువెత్తుతాయి. ఇప్పుడా పరిస్ధితి పెద్దగా లేదు. అమెరికా, యూరప్ లు సంక్షోభ పరిస్ధితులను ఎదుర్కొంటున్నప్పటికీ అక్కడి నుండి ఇండియా కి రావడానికి ఎఫ్.ఐ.ఐ లు జంకుతున్నాయి. భారత ఆర్ధిక వ్యవస్ధ సైతం అమెరికా, యూరప్ ల వల్ల బలహీనపడడమే దానికి కారణం. ఐనప్పటికీ వచ్చినంతమేరకైనా ఎఫ్.ఐ.ఐ లపై యూరోజోన్ దేశాల డౌన్ గ్రేడింగ్, ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. 2011 లో 358 మిలియన్ డాలర్లు నికరంగా భారత దేశ ఈక్విటీ మార్కెట్లను వదిలేసి పొగా 2012 లో ఇప్పటివరకూ 476 మిలియన్ డాలర్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రవాహం తగ్గడానికి అవకాశం ఉంది.

యూరో జోన్ డౌన్ గ్రేడ్ వల్ల భారత దేశ రుణ బాండ్లలోకి ఎఫ్.ఐ.ఐ ల ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. అంటె యూరప్ అనే ఎద్దు పుండు భారత దేశానికి ముద్దు కావచ్చు. గత సంవత్సరం మొత్తం మీద భారత ప్రభుత్వ సావరిన్ డెట్ బాండ్లలో నికరంగా 8.6 బిలియన్ డాలర్ల ఎఫ్.ఐ.ఐ పెట్టుబడులు రాగా కొత్త సంవత్సరంలో ఈ రెండు వారాలలోనే 2.4 బిలియన్ డాలర్ల ఎఫ్.ఐ.ఐ లు భారత దేశానికి అప్పు రూపంలో వచ్చాయి. ఇండియా బడ్జెట్ లోటు లక్ష్యానికి సుదూరంగా ఉన్నప్పటికీ ఇది సాధ్యమయింది. పన్నుల ఆదాయం తగ్గిందనీ, సబ్సిడీల ఖర్చు పెరిగిందనీ (వెరసి బడ్జెట్ లోటు పెరిగిందనీ) ఇండియా ఇప్పటికే ప్రకటించినప్పటికీ ఇది జరిగడం గమనార్హం. తాత్కాలికమే అయినప్పటికీ ఇది భారత దేశానికి అనుకూల పరిణామం.

కాని మొత్తంగా చూసుకున్నట్లయితే యూరోజోన్ దేశాల డౌన్ గ్రేడింగ్ భారత దేశ జిడిపి తగ్గిపోవడానికే దారితీస్తుందని గుర్తించాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s