ఫ్రాన్స్ సహా 9 యూరో దేశాల రేటింగ్ కట్


యూరప్ రుణ సంక్షోభం కొనసాగుతోంది. యూరో జోన్ దేశాలు రుణ సంక్షోభం నుండి బైటికి వచ్చే సూచనలు సమీప భవిష్యత్తులో లేవని తొమ్మిది యూరో జోన్ దేశాల అప్పు రేటింగ్ ను తగ్గించడం ద్వారా ప్రముఖ రేటింగ్ సంస్ధ స్టాండర్ట్ & పూర్ (ఎస్ & పి) క్రెడిట్ రేటింగ్ సంస్ధ స్పష్టం చేసింది. యూరో జోన్ ఉనికి ప్రధానంగా ఆధారపడి ఉన్న దేశాల్లో ఒకటైన ఫ్రాన్సు రేటింగ్ సైతం ఎస్ & పి తగ్గించి సంక్షోభం ఎంత తీవ్రంగా ఉన్నదీ తెలియజేసింది. యూరో జోన్ అప్పు కష్టాలు తీరలేదని చెప్పడానికి ఎస్ & పి చర్య శక్తివంతమైన సూచన.

ఎస్ & పి చర్య యూరో జోన్ దేశాల్లో తాజాగా రాజకీయ సంక్షోభాలను తీవ్రం చేయనుంది. ఫ్రాన్సులో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నందున అధ్యక్షుడు నికొలస్ సర్కోజి విజయావకాశాలపై ప్రభావం పడనుంది. గ్రీసు రుణాలకు సంబంధించి కొత్త ప్రభుత్వానికీ రుణ దాతలకూ (బ్యాంకులు, ఇతర ప్రవేటు మదుపుదారులు) మధ్య చర్చలలో ప్రతిష్టంభన ఏర్పడిందని తెలియడంతో యూరప్ తో పాటు ప్రపంచ వ్యాపితంగా ఉన్న మార్కెట్లు అప్రమత్తమయ్యాయి. గ్రీసు రుణాల భారన్ని ప్రవేటు మదుపుదారులు కూడా భరించాలని కుదిరిన ఒప్పందం వివరాలను రూపొందించడానికి జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడినట్లు తెలుస్తోంది.

గ్రీసు అప్పు చెల్లించలేక దివాళా తీసినట్లయితే అది మొదలే అప్పులు ఎగవేయొచ్చనీ, అలా కాక గ్రీసుకు అప్పులిచ్చిన బ్యాంకులు, ఇతర ప్రవేటు ఇన్వెస్టర్లు కూడా నష్టాన్ని పంచుకోవడానికి సిద్ధపడితే తక్కువ నష్టంతోనో లేదా స్వల్ప లాభాలతోనో రుణ దాతలు బైటపడవచ్చన్న అవగాహనతొ ఈ చర్చలకు ఒప్పంద గత సంవత్సరం కుదిరింది. విశాల ప్రాతిపదికన కుదిరిన ఈ ఒప్పందం లో వివిధ నియమ నిబంధనల రూపకల్పనకై రుణ దాతలు, గ్రీసు ప్రభుత్వం మధ్య చర్చలు జరుగుతున్నాయి.

యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు కొత్తగా రుణాలు పంపిణీ చేసే పధకం రూపిందించినందున సంక్షోభం నెమ్మదిస్తున్న సూచనలు కనిపించాయి. ఎస్ & పి డౌన్ గ్రేడింగ్ వల్ల పరిస్ధితి మళ్ళీ యధా తధ స్ధితికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కనుచూపుమేరలో కనిపించడం లేదు. “గత కొద్దివారాలలో యూరోపియన్ విధానాల రూపకర్తలు తీసుకున్న విధాన చర్యలు సరిపోయినంతగా లేవన్న అంచనాతో తాజాగా రేటింగ్ లను తగ్గించవలసి వచ్చిందని ఎస్ & పి తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యవస్ధాగత ఒత్తిడిలను అధిగమించడానికి ఈ విధాన చర్యలు సరిపోకపోవచ్చని ఎస్ & పి తెలిపింది.

ప్రస్తుత డౌన్ గ్రేడింగ్ వల్ల జరగకూడని పరిణామాలు జరుగుతాయని భావించనవసరం లేదు. కాని డౌన్ గ్రేడింగ్ ఎదుర్కొన్న దేశాల రుణ సేకరణ సామర్ధ్యంపై తప్పనిసరిగా తక్షణ ప్రభావం అది చూపుతుంది. డౌన్ గ్రేడింగ్ ఎదుర్కొన్న దేశాలు అప్పు చెల్లింపు సామర్ధ్యంపై అనుమానలు తలెత్తి ఇన్వెస్టర్లు ఆ దేశాల రుణ బాండ్ల కొనుగొలుకు వెనకడుగు వేయవచ్చు. లేదా అధిక వడ్డీలను డిమాండ్ చేయవచ్చు. పన్నెండుకు పైగా ఇ.యు దేశాల క్రెడిట్ రేటింగ్ లను సమీక్షించనున్నట్లు ఎస్ & పి గత డిసెంబర్ లోనే ప్రకటించింది. ఆ జాబితాలో ఉన్న జర్మనీ, నెదర్లాండ్స్ (హాలండ్) దేశాలు మాత్రమే డౌన్ గ్రేడింగ్ నుంచి తప్పించుకోగలిగాయి.

ఎస్ & పి చర్యను ఇ.యు దేశాల రాజకీయ నాయకులు సహజంగానే ఖండించారు. వారి హయాంలోని ప్రభుత్వాల రేటింగ్ తగ్గించడం వారి ప్రజాదరణను దెబ్బతీయడమే దానికి కారణం. డౌన్ గ్రేడింగ్ ద్వారా కొత్త సమాచారాన్ని ఏమీ ఇన్వెస్టర్లకు ఎస్ & పి ఇవ్వలేదనీ, కాకపోతే ఏదో సంక్షోభంలో ఉన్నామన్న ఆందోళనలను రేకెత్తించడానికే ఇది దోహదం చేస్తుందనీ వారు ఆరోపిస్తున్నారు. మూడున్నరేళ్ల క్రితం సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షొభం తర్వాత రేటింగ్ సంస్ధలు పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నాయి. శక్తివంతం కాని అనేక  ద్రవ్య ఉపకరణాలు (సి.డి.ఒ రేటింగ్, క్రెడిట్ రేటింగ్, ట్రెజరీ బాండ్లు మొ.వి) బలహీనంగా ఉన్నప్పటికీ వాటికి ట్రిపుల్ ఏ రేటింగ్ ఇవ్వడం ద్వారా అనేకమంది ఇన్వెస్టర్లు నష్టపోవడానికి దోహదం చేశాయని అవి విమర్శలు ఎదుర్కొన్నాయి. వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రకటించినా వాటికి ఉన్న పలుకుబడి వల్ల అది సాధ్యం కాలేదు. ఈ నేపధ్యంలో రేటింగ్ సంస్ధలు ఏ చిన్న పరిణామం జరిగినా అతిగా స్పందిస్తున్నాయని అన్నివైపులనుండీ మరోరకం విమర్శలు అవి ఎదుర్కొంటున్నాయి.

ఎస్ & పి ప్రకటనకు ముందే ఫ్రాన్సు రేటింగ్ ‘ఎ ఎ ఎ’ నుండి ‘ఎ ఎ +’ కు తగ్గిందని ఫ్రాన్సు ఆర్ధికమంత్రి ఫ్రాంకోయిస్ బారోయిన్ ప్రకటించుకున్నాడు. ఐనప్పటికీ ఫ్రాన్సు సరైన దిశలోనే వెళ్తోందని అయన బింకం ప్రదర్శించాడు. ఏ రేటింగ్ సంస్ధ కూడా ఫ్రాన్సు విధానాలను నిర్దేశించలేదని పనిలో పనిగా ఓ ప్రకటన కూడా చేశాడు. గ్రీసు, ఐర్లండు, పొర్చుగల్ లాంటి దేశాల రేటింగ్ లను వరుసగా తగ్గిస్తూ పోతున్నపుడు ఆ రేటింగ్ ల ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఆ మూడు దేశాలపై ఒత్తిడి తెచ్చిన దేశాల్లో ఫ్రాన్సు, జర్మనీ దేశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడవి తమ రేటింగ్ ప్రమాదంలో పడేసరికి తమను రేటింగ్ సంస్ధలు నిర్దేశించలేవని హుంకరిస్తున్నాయి. తమ దేశ కంపెనీల ప్రయోజనాల కోసం ఎన్ని ద్వంద్వ ప్రమాణాలను పాటించడానికైనా ఈ పెట్టుబడిదారీ ఆర్ధిక, రాజకీయవేత్తలు సిద్ధమే. దేశాల సరిహద్దులు చెరిపేయాలని చెప్పే వీరు తమ దేశాల సరిహద్దుల్ని మాత్రం మూసి ఉంచడానికే ప్రయత్నిస్తుంటారు.

ఇటలీ, పోర్చుగల్ దేశాల్తో పాటు స్పెయిన్, సైప్రస్ దేశాల క్రెడిట్ రేటింగ్ లను ఎస్ & పి రెండు అడుగులు తగ్గించడం విశేషం. ఫ్రాన్సు, ఆస్ట్రియా, మాల్టా, స్లోవేనియా, స్లొవేకియా దేశాల క్రెడిట్ రేటింగ్ లను ఒక అడుగు మేరకు ఎస్ & పి తగ్గించింది. సమీక్ష జాబితాలో ఉన్న బెల్జియం, ఎస్తోనియా, ఫిన్లాండ్, ఐర్లండ్, లక్సెంబర్గ్ దేశాల రేటింగ్ లను అది మార్చలేదు. మార్చనప్పటికీ సమీక్ష జాబితాలో ఉండడమే ఒక విధమైన ప్రతీకూలాంశంగా పరిగణిస్తారు.

సంక్షోభ పరిష్కారానికి కఠిన మైన చర్యలు (పొదుపు ఆర్ధిక విధానాలు) మాత్రమే సరిపోదని జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్ మొదటిసారిగా అంగీకరించింది. యూరప్ రుణ సంక్షొభ పరిష్కార చర్యల్లో ఇదొక ముఖ్య మలుపుగా విశ్లేషకులు భావిస్తున్నారు. యూరో జోన్ దేశాలన్నీ ఖచ్చితమైన ఫిస్కల్ ఆర్ధిక విధానాలను కఠినంగా అమలు చేయాలని, తద్వారా మాత్రమే యూరోజోన్ సంక్షోభం సమసిపోతుందనీ ఆమె గత మూడేళ్లుగా వాదిస్తూ వస్తోంది. ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కొజీ తొ కలిసి కఠిన మైన పొదుపు ఆర్ధిక విధానాలను యూరో దేశాలపై వారు బలవంతంగా అమలు చేయడమే కాక తమ దేశాల ప్రజలపైన కూడా అమలు చేస్తున్నారు. కార్మికులు, ఉద్యోగులు ఇతర వృత్తులలో ఉన్న అనేక తరగతుల ఆదాయ మార్గాలన్నింటిపైన దాడి చేయడమే వారు ఎంచుకున్నమార్గం.

వేతనాల కోత, సంక్షేమ సదుపాయాల రద్దు, ఉద్యోగాల కోత, పన్నుల పెంపు, ఆరోగ్య భీమా సహాయం తగ్గింపు లాంటి చర్యలతో ప్రజలను వారు వేధిస్తున్నరు. మరోవైపు బ్యాంకులు, ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు బడా ద్రవ్య కంపెనీలకు మాత్రం మరిన్ని పన్ను రాయితీలను కల్పిస్తూ, ఉన్న పన్నులను రద్దు చేస్తున్నారు. ఈ చర్యల ద్వారా ప్రజల జేబులనుండి కంపెనీల జేబులకు మరిన్ని లాభాల రూపంలొ ఆదాయాలను వారు తరలిస్తున్నారు. గ్రీసు, పోర్చుగల్, ఐర్లండు దేశాల రుణ సంక్షోభాలను చూపి అక్కడ కఠినమైన పొదుపు ఆర్ధిక విధానాలు అమలు చేయించడమే కాక, ఆదేశాలను చూపి తమ దేశాల్లో కూడా ప్రజావ్యతిరేక విధానాలను అవి అమలు చేస్తున్నాయి. వీటన్నింటినీ ఆర్ధిక పండితులు, ఆర్ధిక విశ్లేషకులు, పత్రికా సంస్ధలు ‘బెల్ట్ టైటెనింగ్’ గా ప్రస్తావిస్తున్నాయి. అంటే ప్రజల కడుపుల్లోకి ఎక్కువ ఆహారం పోకుండా వారి బెల్ట్ లను టైట్ చేయడం అన్నామాట. తద్వారా వారి పొట్టలకు తగిన ఆహారాన్ని సమకూర్చడానికి బదులు కడుపులనే టైట్ చేసే కుటిల ఎత్తుగడ అన్నమాట! తద్వారా ప్రభుత్వ బడ్జెట్లలో మరింత భాగాన్ని ప్రజాపద్దుల నుండి తరలించి కంపెనీలకు ఇచ్చే రాయితీలకు ఖర్చుపెట్టడం వారి విధానం. వీటినే “బెల్టు టైటెనింగ్” విధానాలని పత్రికలు ప్రస్తావిస్తున్నాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s