శ్రీకాంత్ గారూ, మీకు సమాధానం త్వరలో ఇస్తాను, ఆలోగా ఇది చూడండి


నేను (విశేఖర్) ఇతర బ్లాగుల్లోకి వెళ్ళడం తక్కువ.

ఇపుడే నా డాష్ బోర్డ్ లో లేటేస్ట్ పోస్టులు చూస్తుండగా ‘స్వదేశీ కమ్యూనిస్టుల దేశ భక్తి…’ అంటూ మీ పోస్టు లింక్ చూసి దాన్ని పట్టుకుని మీ బ్లాగ్ కి వచ్చాను. అందులో సైడ్ కాలంలో ‘నన్ను ఉద్దేశిస్తూ ఓ పోస్టు’ ఉన్నట్లు గమనించి అదీ చూశాను.

మీరు జనవరి ఎనిమిది న ఆ పోస్టు రాసినట్లు చూశాను. ఈ రోజు పన్నెండు. ఆలస్యంగా చూశాను.

కాని మరో పది రోజులవరకూ నేను వేరే పనుల్లో ఉంటాను. బ్లాగ్ పోస్టులు రాసిన్నప్పటికీ మీకు సమాధానం కొంచెం వివరంగా రాయాలనుకుంటున్నందున టైం తీసుకుని రాస్తాను.

ఈ లోగా చెప్పవలసింది ఒకటుంది. చర్చలకు ఇరు పక్షాలు కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది.

చర్చ చర్చ కోసం జరగకూడదు. చర్చ ద్వారా ఇరు పక్షాలూ తమ తమ వాదనల్లోని తప్పులనూ, ఒప్పులనూ పరస్పరం తెలియజెసుకునేలా చర్చ జరగాలి.

చర్చ ఆధిపత్యాల నిర్ణయాల కోసం జరగకూడదు. ఆదిపత్యం కోసం జరిగే చర్చ ఏదో విధంగా అవతలి పక్షంపై గెలవడానికే జరుగుతుంది తప్ప మెరుగైన అంశాన్ని బైటికి తీయడానికి జరగదు.

మీకు ఇంతకుందే ఓ చోట చెప్పాను. ఒక సిరియస్ అంశంపై చర్చించుకుంటున్నపుడు చర్చాంశంపైన వ్యంగ్యం చేయవచ్చుగానీ, చర్చ చేస్తున్నవారి పట్ల వ్యంగ్యం ఉండకూడదు. చర్చిస్తున్న వ్యక్తులపై వ్యంగ్యం దొర్లితే చర్చకు అవరోధంగా మారుతుంది. చర్చ పక్కకు మళ్ళుతుంది. చివరికి చర్చ లక్ష్యం నెరవేరకుండా పోతుంది. ఇక చర్చ ప్రారంభించి ఏం ప్రయోజనం?

రెండు విరుద్ధ వాదనల మధ్య తప్పు ఒప్పులను చర్చించుకుంటున్నపుడు మొదట చర్చిస్తున్న వ్యక్తుల మధ్య ఒకరి పట్ల మరొకరి గౌరవ భావం ఉండాలి. పిమ్మట ఎదుటివారు వినిపిస్తున్న వాదనల పట్ల గౌరవ భావన ఉండాలి. ఎదుటి వారి వాదనల పట్ల గౌరవం ఉండడం అంటే వారి వాదన అంగీకరిస్తున్నట్లు కాదు. ఆ వాదనలోని అంశాలను జాగ్రత్తగా పరిశీలించి అందులో తప్పు ఒప్పులను నిష్పాక్షికంగా పరిశీలించి తప్పుని తప్పుగా సవరించడానికీ, ఒప్పుని ఒప్పుగా గుర్తించడానికీ ఈ గౌరవ భావన పునాదిగా పని చేస్తుంది.

అలాకాక ముందే ఎదుటివారి వాదనపై ఒక వ్యంగ్య, వ్యతిరేక భావన ఏర్పరుచుకుని ఉన్నట్లయితే నిష్పాక్షిక పరిశీలన పక్కకుపోతుంది. ఎంతసేపటికీ తమ వాదనని ఎలా సమర్ధించుకోవాలో, ఎలా అవతలివారిపైన పైచేయి సాధించాలా అన్న ధోరణి పెరిగి స్వంత వాదనలో తప్పులను గుర్తించి సవరించుకోవడానికీ, ఎదుటివారి వాదనలో ఒప్పులను గుర్తించి అంగీకరించడానికీ అహం అడ్డువస్తుంది. అహం అడ్డువచ్చి అది తప్పులను ఒప్పులను ఎంచుకునే క్రమానికే అడ్డువస్తే ఇక చర్చకు దిగి ఏం ప్రయోజనం?

నేను మతాలను నమ్మను. కాని మతాలను నమ్మేవారిని అవి నమ్ముతున్నారన్న కారణంతో వారిని ఎగతాళి చెయ్యడం చేయను. నా మిత్రుల్లో అనేకులు వివిధ రకాల స్ధాయిల్లోని భక్తులు ఉన్నారు. ఇరు మతాలవారు నాకు మిత్రులుగా ఉన్నారు. నేను దేవుడ్ల బొమ్మల్నీ, విగ్రహాలనీ నాకోసం కొనకపోయినా భక్తులైన నా మిత్రుల కొసం నాకు తెలిసిన పెద్దల కొసం కొని వారికి బహుమతులుగా ఇస్తాను. నేను వారి వ్యక్తిగత నమ్మకాలను గౌరవిస్తాను గనక నేనీ గౌరవం పాటిస్తాను. నేనిలా దేవుడ్ల బొమ్మలు, మత గ్రంధాలు బహుమతిగా ఇస్తున్నానంటే నేనవి నమ్ముతున్నానని కాదు.

ఎదుటివారి నమ్మకాలు కానియ్యండి, భావాలు కానివ్వండి, ఇవన్నీ ఆయా వ్యక్తుల వ్యక్తిత్వం (పర్సనాలిటీ) లో భాగంగా ఉంటాయి. ఆ భావాలే ఆ వ్యక్తిత్వానికి అలంకారాలుగా భాసిల్లుతుంటాయి. వారి వారి భావాలు నమ్మకాలు నిత్యజీవితంలొ ఒక భావంగా ఉంటూ వారి వ్యక్తిత్వాలని నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వారి వ్యక్తిత్వాన్ని నిర్మించిన వారి భావాలను ఎవరైనా అవమానానికి గురిచేస్తే వారు తట్టుకోగలరా? తట్టుకోలేరు. హృదయాన్ని కష్టపెట్టుకుంటారు. సదరు భావాలను ఎగతాళి చేయడం అన్నది చివరికి వారి వ్యక్తిత్వానికి అవమానంగా కనిపిస్తుంది.

ఇది దేవుళ్ళను నమ్మే భక్తులకే కాదు. ఒక సిద్ధాంతాన్ని నమ్మె అనుచరులకు కూడా వర్తిస్తుంది. ఆయా వ్యక్తులు వారి వారి జీవితాల అనుభవాల ప్రాతిపదికన, వారి సామాజిక నేపధ్యాల ప్రాతిపదికన కొన్ని సిద్ధాంతాలను గాఢంగా నమ్మడం ప్రారంభిస్తారు. అటువంటి సిద్ధాంతాలను నేరుగా ప్రశ్నిస్తూ గ్రంధ రచన గానీ, వ్యాస రచన గానీ చేసినపుడు అందులో ఎవరూ గాయపడరు. ఆ సిద్ధాంతాలను నమ్ముతున్న వ్యక్తులతో చర్చకు సిద్ధపడినపుడు ఆ వ్యక్తుల వ్యక్తిత్వాలు, వ్యక్తి గౌరవాలు రంగంలోకి వస్తాయి.

ఆ సమయాల్లో చర్చ పేరుతో వ్యక్తిగత అవమానాలకి దిగినపుడు, వ్యక్తిగత వ్యంగ్యానికి దిగినపుడు తమ వ్యక్తిత్వాలనే అగౌరవపరుస్తున్నచోట చర్చ వ్యర్దం అని సహజంగానే ఎవరైనా భావిస్తారు. చర్చ పేరుతో వ్యక్తిగత బలహీనలతలను లాగినా అవమానానికి గురవుతారు.

“మీరు ఫలానా సందర్భంలో ఇలా అన్నారు. మరోచోట ఇలా అన్నారు. పరస్పరం విరుద్ధంగా ఈ రెండూ ఉన్నాయి. ఎందుకిలా ఉన్నాయి?” అని ప్రశ్నించవచ్చు. అది చర్చ.

“సో, మీరూ,ప్రవీనూ ప్రపంచాన్ని ఉద్దరించడానికి, ఒక మహోన్నత భావజాలాన్ని ఆచరిస్తున్న వ్యక్తులన్న మాట.. ప్రవీను మీతో కలిసి ఈగొప్ప ఘనకార్యములో పాలు పంచుకుంటున్నాడు కాబట్టి, అతను ఇతరులను బూతులు తిట్టినా అర్థం చేసుకోవాలన్న మాట. బావుంది, బావుంది..!!” అని మీ టపాలోని ఓ పేరా.

ఇది చర్చను ఆహ్వానిస్తుందా? ఒక భావాజాలాన్ని మహోన్నతంగా నేను నమ్ముతున్నపుడు “ఓహో మీరు ప్రపంచాన్ని ఉద్ధరించడానికి దాన్ని ఆచరిస్తున్న వ్యక్తులన్నమాట” అని మీరు ఎగతాళిగా ప్రశ్నిస్తే అది చర్చను ఆహ్వానిస్తుందా? చర్చకు ఏమన్నా ప్రాతిపదిక ను ఏర్పరుస్తుందా? ఒక భావజాలం ఎలా తప్పో నిర్ధారించి అది తప్పు అని చెప్పడం బాగుంటుంది. అది తప్పా కాదా అన్న చర్చ ప్రారంభం కాకముందే ‘ఓహొ.. ఉద్ధరించడానికి… అన్నమాట. బావుంది” అని ఎగతాళి చేసేస్తే మీరు గౌరవంగా ‘చర్చించడానికి’ ‘ఆహ్వానిస్తున్నారు’ అని భావించి చర్చకు వస్తారని ఎలా ఊహిస్తున్నారు?

ఇంకా మీరేం రాశారరో చూడండి.

“పాపం పద్మ గారు, శంకర్ గారూ, ఈలాంటి ప్రపంచాన్ని కాపాడే ప్రాజెక్టులో మీ ఇద్దరూ భాగస్వాములని తెలీక ఎంత కష్ట పడ్డారో.”

“మీరు ఎంతో మర్యాదగా .. ధర్మ పన్నాలు వల్లిస్తూ… క్లాసులు పీకే మీరు… “

వ్యక్తులతో పాటు వారి భావజాలాన్నీ ఎగతాళీ చేస్తూ, దూషిస్తూ మనం చర్చించుకుందాం అంటే అది చర్చకు ఆహ్వానం అవుతుందా? చర్చకు పిలిచేవారు ఇలానే పిలుస్తారా?

మీ ఉద్దేశ్యం చర్చకు నన్ను ఆహ్వానించాలనా? ఆహ్వానం పేరుతో మీకు నచ్చిన లాజిక్కులతో మళ్ళీ ఒసారి ఎగతాళి చేయాలనా?

—-               ——                —–

మార్కిజాన్ని విమర్శించేవారు చాలామంది ఉన్నారు. అందులో అంశాలని ఎత్తి చూపి అది మానవ సమాజానికి తగవు అని వాదించినవారు ఉన్నారు. వాటికి సమాధానాలు చెప్పినవారూ ఉన్నారు.

మార్కిజం ఏమి చెప్పిందో ఉదహరిస్తూ దాని ఆధారంగా విమర్శిస్తే చర్చించవచ్చు అని నేనంటే ‘అదేం బ్రహ్మ పదార్ధం కాదు కదా. నేను అర్ధం చేసుకున్నాను. నేను అర్ధం చేసుకున్నదాన్ని ఉదహరిస్తూ ఆర్టికల్స్ రాస్తాను’ అని మీరన్నారు. నేను అందుకోసం చూస్తున్నాను.

మీరు “ఇదిగొ మార్క్సిజం ఇలా చెబుతుంది. వాస్తవం విరుద్ధంగా ఉంది. అందువల్ల అది సరికాదు” అని చెబుతారని చూస్తున్నా. ఇంతవరకూ అలా ఏ పొస్టూ నేను చూడలేదు. నేనేమన్నా మిస్సయ్యానా?

—              —                 —

నేను మిమ్మల్ని ఇంతవరకూ వ్యక్తిగతంగా ఎగతాళి చేస్తూ ఈ పోస్టులో మీరు రాసినట్లు నేను రాయలేదు. ఐనా మీరీ వ్యంగ్యానికి ఎందుకు పూనుకున్నారు శ్రీకాంత్ గారూ?

అప్ డేట్

ఒక విషయం చెప్పాలని మరిచాను.

స్ట్రాస్ కాన్ రేప్ వ్యవహారానికి పెట్టుబడిదారీ సంస్కృతికీ సంబంధం ఏమిటని ఆ వ్యవహారంపై నేను రాసిన పోస్టు తర్వాత అడిగారు. నాకు గుర్తుంది. దానికి సమాధానం ఇవ్వడం వాయిదా వేసుకుంటూ వచ్చాను. నేను ఆ విషయంలో మీకు బాకీ ఉన్నా. అది కూడా త్వరలో తీరుస్తాను.

14 thoughts on “శ్రీకాంత్ గారూ, మీకు సమాధానం త్వరలో ఇస్తాను, ఆలోగా ఇది చూడండి

 1. నేను శ్రీకాంత్ గారి బ్లాగ్ చదివిన సందర్భాలు తక్కువ. మూడేళ్ళ క్రితం నేను అతని బ్లాగ్ చదివినప్పుడు భార్య బాధితుల సంఘం, అరిటాకు-ముల్లు సామెత లాంటి వ్రాతలు కనిపించి చాలా కాలం వరకు అతని బ్లాగ్ చదవడం మానేశాను. మార్క్సిస్ట్‌లు దళితవాదులకి ‌& స్త్రీవాదులకి సంఘీభావంగా ఉంటారు కానీ భార్యా బాధితుల సంఘం పేరు చెప్పి పురుషులకి సంఘీ భావం తెలపండి అంటూ జెండర్ సమస్యని పక్కదారి పట్టించేవాళ్ళకి సంఘీభావం తెలపడం సాధ్యం కాదు. ఒకరో, ఇద్దరో పురుషులు భార్యల చేతిలో వేధింపులకి గురైనంతమాత్రాన భార్యాబాధితుల సంఘం అనేది పెట్టి స్త్రీవాదులకి వ్యతిరేకంగా ప్రచారం చెయ్యడం అర్థరహితమైనది.

  చాలా కాలం తరువాత అతని బ్లాగ్ తిరిగి ఓపెన్ చేసి చదివాను. మళ్ళీ అక్కడ ఒకదానికొకటి పొంతన లేనివి కనిపించాయి. ఒక వైపు మతం ఊహాజనితం అని ఒప్పుకుంటూనే మార్క్సిస్ట్‌లు తమ మతం మీద పడి ఏడుస్తున్నారు అని అంటూ మార్క్సిస్ట్‌ల మీద ఆరోపణలు చెయ్యడం కనిపించింది. కేవలం మతాన్ని మాత్రమె మార్క్సిస్ట్‌లు విమర్శించరు. ఏ మతమైనా అది ఊహాజనితమే కానీ మతం అనేది వాస్తవిక విశ్వాసంగా ఎన్నడూ లేదు. అందుకే మతాన్ని నమ్మేవాళ్ళ మాటలకీ, ప్రవర్తనకీ మధ్య తేడా కనిపిస్తుంది.

  పైగా ఆయన మార్క్సిజం కూడా మతం లాగే ఊహాజనితం అనీ, అందుకే అది రష్యా, చైనాలలో విఫలమైనదనీ అంటాడు. మార్క్సిజానికీ, మతానికీ మధ్య పోలిక అనవసరం. ఎందుకంటే ఊహాజనితమైన స్వర్గనరకాలకి భయపడి మనిషి నీతిగా బతకడం జరగదు. మనిషి యొక్క ప్రవర్తనపై సామాజిక పరిస్థితుల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి నీతిగా బతికేవాళ్ళని సత్తెకాలపు సత్తెయ్యలు అని వెక్కిరించేవాళ్ళు ఉన్న సమాజంలో మన పిల్లలు పెరిగితే మన పిల్లలు కూడా అదే తరహా కుళ్ళు నీతిని నేర్చుకుంటారు.

  రష్యా, చైనాలలో మార్క్సిజం ఎందుకు విఫలమైనదో చెప్పినా అదే అడుగుతుంటారు. సమాధానం చెప్పినా మళ్ళీ అవే ప్రశ్నలు అడుగుతారు.

  రష్యాలో స్టాలిన్ బతికి ఉన్న కాలంలో మాత్రమే మార్క్సిజం అమలు జరిగింది. అతను చనిపోయిన తరువాత నాయకులు ప్రైవేట్ ఆస్తి కోసం మార్కెట్‌ని పునరుద్ధరించారు. ప్రైవేట్ ఆస్తి అనేది పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క కాన్సెప్ట్ అయినప్పుడు ప్రైవేట్ ఆస్తి కోసం జరిగిన మార్కెట్ పునరుద్ధరణ పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క తప్పు అనుకోవాలి కానీ మార్క్సిజం యొక్క తప్పు అని ఎలా అనుకోగలం? 1953లో స్టాలిన్ చనిపోయాడు. 1956లో రష్యాలో కృష్చేవ్ ప్రైవేట్ ఆస్తి కోసం మార్కెట్‌ని పాక్షికంగా పునరుద్ధరించాడు. 1987లో గోర్బచేవ్ మార్కెట్‌ని పూర్తిగా పునరుద్ధరించాడు. 1956 తరువాత రష్యాలో ఎన్నడూ మార్క్సిజం అమలు కాలేదు. అసలు అమలే జరగనప్పుడు విఫలం అనేది ఎలా జరుగుతుంది?

  చార్లెస్ బెతెల్‌హీమ్ అనే మార్క్సిస్ట్ రచయిత పరిశోధన ప్రకారం 1953 వరకు రష్యాలో ఉన్నది విప్లవానంతర ప్రభుత్వం (post-revolutionary government) మాత్రమే కానీ సామ్యవాద ప్రభుత్వం (socialist government) కాదు. 1933లో స్టాలిన్ రష్యాలో ప్రైవేట్ ఆస్తిని పూర్తిగా రద్దు చేశాడు. ఫాక్టరీలపైనా, వ్యవసాయ భూములపైనా, చివరికి పశువుల పెంపకం పైన కూడా ప్రైవేట్ ఆస్తి హక్కుని రద్దు చేశాడు. రష్యాని వేగవంతంగా పారిశ్రామీకరించి 1940 నాటికల్లా అందరికీ ఉద్యోగాలు కల్పించాడు.

  అప్పట్లో అమెరికాలో 20 నుంచి 30 శాతం వరకు నిరుద్యోగం ఉంటే రష్యాలో ఒక్క నిరుద్యోగి కూడా లేడు. రష్యాలో అంత అభివృద్ధి జరిగింది కానీ శ్రమ విభజనలో పెద్ద మార్పులు రాలేదు. ఫాక్టరీలు, వ్యవసాయ క్షేత్రాలలో కార్మికుల కంటే మేనేజర్లకే జీతాలు చాలా ఎక్కువగా వచ్చేవి. జీతాల మధ్య ఉన్న ఆ తేడాలు తగ్గించడానికి స్టాలిన్ ప్రయత్నించలేదు. అందుకే స్టాలిన్ చనిపోయిన తరువాత నాయకులు తిరిగి ప్రైవేట్ ఆస్తి వైపు ఆసక్తిని మరలించడం జరిగింది.

  రష్యాలో మార్పు అనేది పూర్తిగా జరగలేదు. అది ఒక దశలో ఆగిపోయింది.

  1953లో స్టాలిన్ చనిపోవడం వల్ల ప్రైవేట్ ఆస్తిని కోరుకుంటున్న నాయకులకి మార్పుని ఆపెయ్యడం సులభమయ్యింది. పార్టీలో స్వపక్షంలో కూడా అంతర్గత శతృవులు ఉంటారనే నిజాన్ని స్టాలిన్ ఎన్నడూ అంగీకరించలేదు. స్టాలిన్ చనిపోయిన తరువాత అతని స్వపక్షంలోని అంతర్గత శతృవులు ప్రైవేట్ ఆస్తిని పునరుద్ధరించారు.

  ఈ చరిత్ర అంతా చార్లెస్ బెత్ల్‌హీమ్ లాంటి మార్క్సిస్ట్ రచయితలు తమ పరిశోధనలలో వ్రాసారు. మార్క్సిజాన్ని విమర్శించడానికి మార్క్సిస్ట్ సాహిత్యం చదవాల్సిన అవసరం లేదని శ్రీకాంత్ వాదించడంతో అతనికి విషయాలు అర్థం కావు అని భావించి నేను ఈ విషయాలు శ్రీకాంత్ బ్లాగ్‌లో వ్రాయలేదు. మనం సమాధానం చెప్పినా అర్థం కాలేదంటారు. సమాధానం చెప్పకపోతే మన దగ్గర సమాధానాలు లేవంటారు. వాళ్ళు ఇలాగే విషయాలు పక్క దారి పట్టిస్తారు. తిరిగి మనమే సంబంధం లేని విషయాలు చెపుతున్నామని వాదిస్తారు.

 2. చర్చల గురించీ, వాటి అనుసరణీయాల గురించీ మీరు రాసిన అభిప్రాయాలు అర్థవంతంగా ఉన్నాయి.

  >> ఒక సీరియస్ అంశంపై చర్చించుకుంటున్నపుడు చర్చాంశంపైన వ్యంగ్యం చేయవచ్చుగానీ, చర్చ చేస్తున్నవారి పట్ల వ్యంగ్యం ఉండకూడదు. చర్చిస్తున్న వ్యక్తులపై వ్యంగ్యం దొర్లితే చర్చకు అవరోధంగా మారుతుంది. చర్చ పక్కకు మళ్ళుతుంది. చివరికి చర్చ లక్ష్యం నెరవేరకుండా పోతుంది. >>

  బాగా చెప్పారు!

  ఆరోగ్యకరమైన చర్చలకు అనుకూలమైన వాతావరణం రానురానూ బ్లాగుల్లో కరువైపోతోంది. అభిప్రాయ ప్రకటనకు అద్భుతమైన వేదికలవ్వాల్సిన బ్లాగులు- చివరికు హేళనలకూ, దూషణలకూ చోటునిస్తుండటమే విచారకరం!

  ఒక భావజాలాన్ని నమ్మే వాళ్ళుంటారు, వ్యతిరేకించేవారుంటారు. ఎవరికి నచ్చింది వారు రాసుకుంటారు. వ్యతిరేకించే విషయాలను రాయటంలో కూడా హుందాతనం కోల్పోవల్సిన అవసరం లేదు. భావాలను ప్రకటించిన వ్యక్తులను దూషించాల్సిన అవసరం లేదు. అలా చేయటమంటే అంతిమంగా వారి భావ ప్రకటననే తుంచివేయాలని ప్రయత్నించటమవుతుంది.

  శతాబ్దాల క్రితమే వోల్టేర్ చెప్పిన “I disagree with what you say, but I will defend to the death your right to say it” ఎవరికైనా శిరోధార్యం!

 3. విశేఖర్ గారూ, సోషలిస్టు ప్రభుత్వాలను రాక్షసీకరించడానికి ప్రారంభం నుండీ అనేక ప్రయత్నాలు జరిగాయి. అనేక అభూత కల్పనలని ప్రచారంలోకి తెచ్చారు. ఆ వివరాలకి సంబంధించి నేనొక అనువాదం ప్రారంభించాను.

  కొత్తగా అనువాదం మొదలుపెట్టిన వ్యాసం యొక్క లింక్ ఇది: http://stalin-mao.net.in/93824969

  సోవియట్ యూనియన్‌లో విప్లవానంతర ప్రభుత్వాన్ని పడదోయడానికి విదేశీ శక్తులు ఎలా ప్రయత్నించాయో, దానికి స్వదేశీ శక్తులు ఎలా సహకరించారో నా వద్ద సమాచారం ఉంది. అది వివరంగా తరువాత రాయాలనుకుంటున్నాను.

 4. వేణు గారూ, వోల్టెయిర్ సిద్ధాంతాలని కూడా అంగీకరించనివాళ్ళు ఉన్నారు. మహారాష్ట్రలో ఒకతను మావో, భగత్ సింగ్, చే గెవారా వ్రాసిన పుస్తకాలు అమ్ముతున్నాడని పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి చిత్ర హింసలు పెట్టారు. ఆ పుస్తకాలపై ఇండియాలో నిషేధం లేకపోయినా గ్లోబలైజేషన్ కాలంలో జనం ఆ పుస్తకాలు చదివితే గ్లోబలైజేషన్ ప్రక్రియకి సమస్యలు వస్తాయనుకుని పాలక వర్గంవాళ్ళు అతని పుస్తకాల షాప్ పై రెయిడింగ్ చెయ్యించారు.

  భువనేశ్వర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న మార్కెట్‌లో హిట్లర్ వ్రాసిన మీన్ కాంఫ్ పుస్తకం యొక్క ఒడియా అనువాదాలు కుప్పలు తెప్పలుగా దొరుకుతాయి. స్టాలిన్ గురించిన చరిత్ర వ్రాయబడిన పుస్తకం ఆ రైల్వే స్టేషన్ ఏరియాలో ఒక్కటే దొరికింది నాకు. కొందరికి ఎరుపంటే భయం అని ఒకప్పటి నక్సలైట్ నాయకుడు‌ & విప్లవ కవి సుబ్బారావు పాణిగ్రాహి ఎందుకు అన్నాడో దీన్ని బట్టి అర్థమవుతోంది.

 5. ప్రవీణ్, సందర్భోచిత వివరాలు చక్కగా ప్రజెంట్ చేశారు. మీ ఈ శక్తికి ఇంకా పదును పెట్టండి.

  పనిలో పనిగా ఇతర వ్యాఖ్యాతలకు విజ్ఞప్తి. ఇక్కడ ప్రవీణ్ లేవనెత్తిన అంశాలవరకే చర్చ జరపాలని నా విన్నపం. అతను విషయం వరకే పరిమితమైన విషయాన్ని గుర్తించాలని కోరుతున్నా.

 6. ఆ వర్గం వారు మార్క్సిజం గురించి ఏమీ తెలియకుండానే మార్క్సిజాన్ని ఎందుకు వ్యతిరేకిస్తారో తెలియాలంటే ఈ ఉదాహరణ చదవాలి.

  పల్లెటూర్లలో చాలా మందికి కమ్యూనిజం అంటే ఏమిటో తెలియదు, కేపిటలిజం అంటే ఏమిటో తెలియదు, గ్లోబలైజేషన్ అంటే ఏమిటో తెలియదు, సెమి-కొలోనియలిజం అంటే ఏమిటో తెలియదు, కంప్రేడర్‌షిప్ అంటే ఏమిటో తెలియదు. గ్రామంలో వడ్డీ వ్యాపారం చేసే సాహుకారుకి కూడా ఈ విషయాలు ఏమీ తెలియకపోవచ్చు. కానీ దేశంలో సోషలిస్ట్ విప్లవం వచ్చిన తరువాత తాను వడ్డీ వ్యాపారం చెయ్యడానికి అవ్వదు అని తెలిస్తే అతను విప్లవాన్ని వ్యతిరేకిస్తాడు.

  వడ్డీ వ్యాపారం వల్లే ఆ సాహుకారు ఏ రకమైన శ్రమ లేకుండా బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు, వడ్డీ వ్యాపారం మానేస్తే అతను కూడా బతకడానికి శ్రమ చెయ్యాల్సి ఉంటుంది అని భావించి విప్లవాన్ని వ్యతిరేకిస్తాడు. గ్రామం చుట్టు పక్కల మావోయిస్ట్‌ల సంచారం ఉందని తెలిస్తే అతను ఇన్ఫార్మర్‌గా మారి మావోయిస్ట్‌లని పోలీసులకి పట్టిస్తాడు.

  గ్రామంలో వడ్డీ వ్యాపారం చేసే సాహుకారుకే విప్లవం పై ఇంత వ్యతిరేకత ఉంటే బహుళజాతి కంపెనీలలో పార్ట్నర్‌లైన గురుచరణ్ దాస్ లాంటి వాళ్ళకి విప్లవం పై ఎంత వ్యతిరేకత ఉంటుందో ఊహించడం కష్టం కాదు.

  తెలంగాణాలోని గ్రామీణ ప్రాంతాలలో పోలీస్ స్టేషన్‌లకి వెళ్ళి గ్రామాలలో ఎవరెవరి మీద కేసులు వ్రాయాలో పోలీసులకి చెప్పే భూస్వాములకి మార్క్సిజం గురించి ఏమీ తెలియదు. అలాగే గ్లోబలైజేషన్ వల్ల తాము లాభం పొందామని భావించి బ్లాగుల్లో మార్క్సిస్ట్‌లపై విరుచుకుపడే MNC ఉద్యోగులకి కూడా మార్క్సిజం గురించి తెలుసని అనుకోలేము.

  ఇక్కడ వ్యక్తిగత ప్రయోజనం గురించి ఆలోచించి మార్క్సిజాన్ని వ్యతిరేకించేవాళ్ళు ఎక్కువ కానీ తత్వశాస్త్రం నిజంగా చదివి విమర్శించేవాళ్ళు తక్కువ. అందుకే బ్లాగుల్లో మార్క్సిజం గురించి ఏమీ తెలియకుండానే మార్క్సిస్ట్‌లపై విమర్శలు చేసేవాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటారు.

 7. ప్రవీణ్, పేరా విభజన చేసినట్లయితే మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా అర్ధం అవుతోంది. ఇదే పద్ధతి కొనసాగించండి. ఒక్క వ్యాఖ్యలలోనే కాకుండా టపా రాసినప్పుడు కూడా ఇదే పద్ధతి అనుసరించండి.

 8. పేరాగ్రాఫ్‌లు విడగొట్టడం కష్టమేమీ కాదు. నేను వ్రాసినది పూర్తిగా చదవకుండా అర్థం కాలేదని వ్యక్తిగత విమర్శలు చేసి టాపిక్‌ని పక్కదారి పట్టించేవాళ్ళలోనే లోపం ఉంది.

 9. నేను చిన్నప్పుడు ఒక సినిమా చూశాను. ఆ సినిమాలోని ఒక భాగం యొక్క సినోప్సిస్ మాత్రమే ఇక్కడ వ్రాస్తున్నాను. ఆ సినోప్సిస్ చదివినా విషయం అర్థమవుతుంది.

  కేరళలో 1940 నాటి సామాజిక-రాజకీయ పరిస్థితుల నేపథ్యం ఆధారంగా నిర్మించిన సినిమా అది. ఆ సినిమాలో హీరో ఎవరో గుర్తు లేదు కానీ రఘువరన్ విలన్. రఘువరన్ ఒక జమీందార్ (బ్రిటిష్ ప్రభుత్వం కింద ఒక సంస్థానాన్ని పరిపాలించడానికి నియమించబడ్డ పాలెగాడు). కమ్యూనిస్ట్‌లు రఘువరన్ యొక్క ఎస్టేట్ (సంస్థానం)లోని రైతులనీ, కార్మికులనీ మోటివేట్ చేసి వాళ్ళ చేత జమీందారీ వ్యతిరేక పోరాటం చెయ్యిస్తారు.

  ఆ సినిమాలో రఘువరన్ ఎస్టేట్ పై తనకి ఉన్న అధికారాన్ని వదులుకోవడం ఇష్టం లేక తాను కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పుకుంటాడు కానీ తనకి కమ్యూనిజం గురించి తెలుసనో, తత్వశాస్త్రంతో విబేధించి కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తున్నాననో చెప్పుకోడు. ఎందుకంటే అతనికి నిజంగా కమ్యూనిజం గురించి ఏమీ తెలియదు.

  మన రాష్ట్రంలో విప్లవకారులని క్రూరంగా అణచివెయ్యించిన పూర్వ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుకి కూడా మావో జెడాంగ్ థియరీ అంటే ఏమిటో తెలుసని అనుకోలేము. వెంగళరావు ఒక భూస్వామి, అతని కొడుకులు పారిశ్రామికవేత్తలు. అతను తన & తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసమే విప్లవకారులని క్రూరంగా అణచివెయ్యించాడు.

  ఆ సినిమాలో కేరళ జమీందార్ తన ఎస్టేట్‌ని ఎంత పదిలంగా కాపాడుకోవాలనుకున్నాడో, మన రాష్ట్రంలో జలగం వెంగళరావు తన & తన కుటుంబ సభ్యుల ప్రయోజనాలు అలాగే కాపాడుకోవాలనుకున్నాడు. కేవలం వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం అనుకునేవాళ్ళకి తత్వశాస్త్రంతో పని లేదు. వాళ్ళు తత్వశాస్త్రాన్ని విమర్శించినా ఆ శాస్త్రాన్ని చదవకుండానే విమర్శిస్తారు.

 10. ప్రవీణ్ తమ భౌతిక ప్రయోజనాల కోసం తమను భౌతికంగానే ఎదుర్కొంటున్న కమ్యూనిస్టులపైన, తాము కూడా భౌతికంగా అణచివేసిన విషయాన్ని మీరు వివరించారు. వీళ్ళొక తరగతి.

  తాము నమ్మిన భావాలను కమ్యూనిజం వ్యతిరేకిస్తుంది గనక, అలా ఎందుకు వ్యతిరేకిస్తున్నదీ తెలుసుకోకుండానే గుడ్డిగా కమ్యూనిజాన్ని వ్యతిరేకించేవారు మరొక తరగతి. వీరికి తాము నమ్మిన భావాల్లో ఉన్న లోపాలను అంగీకరించడానికి సిద్ధంగా లేక కమ్యూనిజాన్ని సైద్ధాంతికంగా వ్యతిరేకిస్తున్నట్లు ఒక్కోసారి ఫోజు పెట్టవచ్చు. కాని నిలదీసి చూస్తే అది సైద్ధాంతిక వ్యతిరేకత కాదనీ, గుడ్డి వ్యతిరేకత అనీ తెలిసిపోతుంది. అందుకే చర్చకు సిద్దం కారు. కాని వారెందుకు సిద్ధం కావడం లేదో లేక సిద్ధంగా లేరనో ఎలా తెలుస్తుంది? ఆ విషయం వారైనా చెప్పాలి లేదా వారి వాదనల ద్వారానైనా స్పష్టం కావాలి. అందుకే చర్చ. ఆ చర్చ చేయడానికి ఎవరైనా ఎల్లప్పుడూ సిద్ధం కావలసిందే.

  కమ్యూనిస్టు సిద్ధాంతాలు ఒకరికి తెలియదు అని చర్చ జరగకుండా నిర్ధారించెయ్యడం సరికాదు. ఘర్షణలన్నవి అన్ని రంగాల్లో జరుగుతుంటాయి. సమాజంలో జరుగుతున్నట్లే విజ్ఞాన రంగంలో కూడా ఘర్షణలు జరుగుతాయి. ఘర్షణలు జరగకుండా ముందే ఫలితాన్ని నిర్ధారించలేము. అంటే వారికెలాగూ తెలియదు కదా, ఇక చర్చ వ్యర్ధం అని తేల్చేయడం సరికాదు. తమకది తెలుసని చెబుతున్నపుడు దానిని గౌరవించి చర్చకు దిగాల్సిందే. అది బాధ్యత.

 11. కమ్యూనిజాన్ని సైద్ధాంతికంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పుకునేవాళ్ళ వాదనలు కొన్ని చూశాను. వాళ్ళు సమాజం కంటే వ్యక్తి అధికుడనీ, సామాజిక ప్రయోజనాల కంటే వ్యక్తి ప్రయోజనాలే ముఖ్యమనీ నమ్ముతారు. వీళ్ళ గురించి మొట్టమొదటసారి ఏటుకూరి బలరామమూర్తి గారు వ్రాసిన “భారతీయ తత్వశాస్త్రం” పుస్తకంలో చదివాను. మార్టిన్ హీడెగ్గర్ లాంటి జెర్మన్ తత్వవేత్తలు వ్యక్తివాదం పేరు చెప్పి కమ్యూనిజాన్ని వ్యతిరేకించినవాళ్ళే.

 12. వాళ్ళు ఇంటెన్షనల్‌గా టాపిక్‌ని పక్కదారి పట్టించినప్పుడు అందులో మన తప్పు ఉందని అనుకోలేము.

  వాళ్ళ వాదన ఎలా ఉంటుందంటే “ఇందిరా గాంధీ కూడా కమ్యూనిస్ట్. ఎందుకంటే ఆమె కూడా డెంగ్ సియావోపింగ్‌లాగ బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చెయ్యింది” అన్నట్టు ఉంటాయి.

  అలాంటి వాళ్ళకి మనం ఎంత స్పష్టంగా సమాధానం చెప్పినా టాపిక్‌ని పక్కదారి పట్టిస్తారు.

 13. మార్క్సిజం కొత్తగా చదివే రోజుల్లో మార్క్సిజాన్ని వ్యతిరేకించే రావిపూడి వెంకటాద్రి అనే నాస్తికుడు వ్రాసిన ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకం టైటిల్ కర్మవాదం-నియతివాదం-స్వేచ్ఛావాదం (Fatalism, Determinism and Free Will). ఈ పుస్తకంలో ఒకదానికొకటి పొంతనలేని విషయాలు అనేకం ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం దాని గురించి ఉదహరిస్తున్నాను. మిగితా విషయాలు తరువాత వ్రాస్తాను.

  ఆయన కవిరాజు త్రిపురనేని రామస్వామి పేరుతో ప్రకాశం జిల్లా నాగండ్ల గ్రామంలో కవిరాజాశ్రమం పెట్టి అతను మార్క్సిజానికి వ్యతిరేకంగా పుస్తకాలు ప్రచురించేవాడు. ఆ పుస్తకాలలో కొన్ని చదివాను. ఆ పుస్తకాలలోని దోషాలు బయటపెడుతున్నానని మిగితా పుస్తకాలు వెంకటాద్రి గారు నాకు పంపించలేదు. అందుకే అతని పుస్తకాలని పూర్తిగా పరిశీలించే అవకాశం నాకు రాలేదు. ఆయన వ్రాసిన పుస్తకాలలో ఒకటైన కర్మవాదం-నియతివాదం-స్వేచ్ఛావాదం పుస్తకంలోని కొన్ని విషయాలు చూస్తే అతని వాదన ఎంత లోపభూయిష్టంగా ఉందో తెలిసిపోతుంది.

  ఒక ఉదాహరణ: ఆయన వాదన ఏమిటంటే నియతివాదంలో కూడా రెండు రకాలు ఉన్నాయని. ఒకటి నియతివాదం (determinism), ఇంకొకటి పుర:నియతివాదం (pre-determinism). మార్క్సిస్ట్‌లది పుర:నియతివాదం అని ఆయన విమర్శ. “బానిస వ్యవస్థ పోయి భూస్వామ్య వ్యవస్థ వచ్చింది, భూస్వామ్య వ్యవస్థ కూడా పోయి పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చింది, పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా పోయి సోషలిజం వస్తుంది” అనే చారిత్రక భౌతికవాద సూత్రాన్ని కూడా ఆయన పుర:నియతివాదం అనే విమర్శిస్తాడు. నియతి (determination) పై చుట్టు ఉన్న పరిస్థితుల ప్రభావం గురించి ఆయన ఏమీ వ్రాయలేదు.

  వెంకటాద్రి గారి వాదనలలోని ఇంకో ప్రధాన లోపం ఏమిటంటే ఆయన చేసే తరువాతి వాదనలు(sequent arguments)కి ఆయన మొదట చేసిన వాదనలతో పొంతన కనిపించదు. ఒకసారి ఏదో జరిగింది కాబట్టి ప్రతిసారి అలాగే జరుగుతుందనడం కూడా కర్మవాదం (fatalism)కి దారి తీస్తుందని అంటాడు. కానీ అతను కూడా కర్మవాదిలా ప్రవచిస్తాడు. రష్యాలో సోషలిస్ట్ ప్రభుత్వం రద్దు చెయ్యబడినది కాబట్టి ఏ దేశంలో సోషలిస్ట్ విప్లవం వచ్చినా అక్కడి సోషలిస్ట్ ప్రభుత్వం కూలిపోతుందని వాదిస్తాడు. ఎక్కడ సోషలిస్ట్ విప్లవం వస్తుందో, అక్కడే సోషలిజానికి మృత్యు ఘంటికలు మ్రోగుతాయని వాదిస్తాడు. సోషలిజం గురించి అలాంటి తీర్మానాలు చెయ్యడం కూడా కర్మవాదమే అవుతుందనే నిజాన్ని ఆయన అంగీకరించడు.

  ఈ పుస్తకంలోని అతని ప్రవచనాలలోకి లోపాలు బయట పెడుతూ నేను ఆయనకి ఉత్తరం వ్రాసాను. తరువాత ఆయన వ్రాసిన మిగితా పుస్తకాలు నాకు పంపించలేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s