మహా రాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ సొంత గ్రామంలోనే ఒక దళిత స్త్రీని బట్టలిప్పి ఊరేగించారు. న్యాయం చెయ్యమని పోలీసు స్టేషన్ కి వెళితే ‘మీ గ్రామంలో ఇవి మామూలే కదా? కేసెందుకు?’ అని పోలీసులు తిప్పి పంపేశారు. ఈ దురన్యాయానికి కారణం మరీ ఘోరంగా ఉంది. ఆమె పాత్ర ఏ మాత్రం లేని ఓ ఘటనకి ఆమెని బాధ్యురాల్ని చేసి ఆమెను శిక్షించారు.
బాధితురాలు నలభై రెండేళ్ళ రేఖా చవాన్. ఆమె కొడుకుతో కలిసి అగ్ర కులస్ధురాలైన యువతి ఒకరు ఊరి నుండి వెళ్ళీపోవడం ఈ ఘటనకి కారణం. అగ్రకులస్ధురాలైన యువతిని ప్రేమించడం తప్పు కాదన్నది స్పష్టమే. ప్రేమించి పెళ్ళి చేసుకోవడం అసలే తప్పు కాదు. తప్పని వాదనకు భావించినా ఆ నేరానికి పాల్పడినవారిని వదిలేసి యువకుడి తల్లిని వివస్త్రని చేసి ఊరేగించడం చూస్తే అగ్రకుల పురుషాధిపత్య దురహంకారం భారత దేశంలో ఎంతగా వేళ్ళూనుకుందో మరోసారి నిరూపణ అయింది.
భారత దేశంలో ఇంకా సజీవంగా ఉన్న భూస్వామ్య ఆధిపత్య భావజాలం వల్ల దళిత కులాల ప్రజల పౌర, మానవ హక్కుల పట్ల తృణీకార భావనతో ఉండడం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. అదొక సంగతి కాగా స్త్రీలపైన కూడా భూస్వామ్య వ్యవస్ధ లో ఉండే ఆధిపత్య స్వభావం కూడా అదే స్దాయిలో కొనసాగడాన్ని కూడా తాజా ఘటన రుజువు చేస్తోంది. భూస్వామ్య ఆధిపత్య వ్యవస్ధలో స్త్రీలు, దళితులు పురుషుల, అగ్ర కులస్ధుల సేవలకు వినియోగించుకునే పనిముట్లు మాత్రమే. వారు తాము మనుషులమేనని గుర్తు చేస్తే వారికి దక్కేది ఇదే.
మహా రాష్ట్ర ముఖ్యమంత్రి సొంతపట్నం కరద్ లోని ముల్గావ్ లో తమ కూతురు ఓ దళిత యువకుడితో ‘లేచిపోవడం’ అగ్రకుల కుటుంబానికి అవమానంగా తోచింది. అమ్మాయి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు తమ కూతుర్ని ‘లేవదీసుకెళ్ళిన’ దళిత యువకుడి తల్లి ‘తమ కోపం, అవమానం’ తీర్చుకోవడానికి తేలికగా కనపడింది. సతారా జిల్లాలోని కరాద్ తాలుకా లోని గ్రామంలో ఉన్న యువకుడి ఇంటికి వెళ్ళి అతని తల్లిని ఇంటినుంది బైటికి లాగి విపరీతంగా కొట్టి, వివస్త్రను చేసి, మళ్ళీ కొడుతూ తిడుతూ గ్రామంలో ప్రదర్శించారు.
“ఆవిడ నన్ను నేలమీదికి తోసేసింది. నా చీర లాగేసారు. చెప్పులతో, కర్రలతో కొట్టడం మొదలుపెట్టారు. నా జుట్టు పట్టుకుని ఈడ్చారు. ఇలా రెండు గంటలపాటు జరిగింది” అని బాధితురాలు వెల్లడించింది. జరిగిన అవమానం నుండి ఎలాగోలా తేరుకుని పోలీసు స్టేషన్ లో రిపోర్టు ఇవ్వడానికి బాధిత స్త్రీ వెళ్ళగా అక్కడ మరో అవమానం ఎదురైంది. “మా కులం పైన అలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయనీ, కనుక ఆవిషయమై తాము చేయగలిగిందేమీ లేదనీ పోలీసులు చెప్పారు” అని బాధిత స్త్రీ టెలివిజన్ న్యూస్ ఛానెళ్ళతో చెప్పింది.
దళిత కార్యకర్తల సాయంతో మంగళవారం సాయంత్రం బాధిత స్త్రీ కరాద్ ఆసుపత్రిలో చేరింది. బుధవారం దళిత స్త్రీ పై దుర్మార్గానికి పాల్పడిన కుటుంబంలో ఐదుగురిని అరెస్టు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రేమించిన యువతి తల్లిదండ్రులు కూడ అరెస్టయినవారిలో ఉన్నారని పటాన్ డి.ఎస్.పి ఎఫ్.ఎం.నయక్వాడి చెప్పాడని ‘ది హిందూ’ తెలిపింది. ఎస్.సి, ఎస్.టి లపై అత్యాచారాల నిరోధక చట్టం క్రింద కేసులు నమోదు చేసామని పోలీసులు తెలిపారు. హోం మంత్రి ఆర్.ఆర్ పాటిల్ కఠిన దర్యాప్తు చెయ్యాలని కోరాడట.
ఇందులో మూడు అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి: కుల వివక్ష రెండు: స్త్ర్రీలపై అణవివేత, మూడు: దళితులు, స్త్రీలపై అత్యాచారాలకు పొలీసుల పరోక్ష ఆమోదం. ముఖ్యమంత్రి స్వగ్రామం అయినందున పొలీసులు కూడా దళిత స్త్రీపై జరిగిన నేరాన్ని అత్యాచారంగా గుర్తించి కేసు నమోదుకు నిరాకరించడాన్ని బట్టి రాజకీయ వ్యవస్ధ కూడా భూస్వామ్య సామాజిక వ్యవస్ధకు ఎలా దన్నుగా నిలుస్తున్నదీ ఇందులో పరోక్షంగా కనిపిస్తున్న నాలుగవ అంశం.
దళితుల్లో దళితులు స్త్రీలు అని ఈ మధ్య వినిపిస్తున్న నానుడి. ఇక ‘బానిసకొక బానిసవోయ్ బానిస’ అని స్త్రీలనుద్దేశించి శ్రీ.శ్రీ గారు ఎన్నడో చేసిన వ్యాఖ్య. ఇవి రెండూ ఈ ఘటనలో ప్రత్యక్షంగా ద్యోతకం అవుతున్నాయి.
ఒక స్త్రీ చేతబడి చేస్తోందనే అనుమానంతో ఆమెని నగ్నంగా ఊరేగించిన ఘటనలు మన రాష్ట్రంలో కూడా చాలా జరిగాయి. ఇలాంటి ఘటనలలో దళిత స్త్రీలే ఎక్కువగా బలి పశువులు (scapegoats) అవుతుంటారు.
థూ…మన బ్రతుకులు చెడా…మనదీ ఒక జన్మేనా……..