ఐదువేలు చెల్లించలేదని దళితుడి సజీవ దహనం


ఇది మరో ఘటన. దళితులపై కొనసాగుతున్న దుర్మార్గాలకి మరొక సాక్షీభూతం. తీసుకున్న అప్పు ఐదు వేలు చెల్లించలేదని అందరి ముందూ కిరోసిన్ పోసి తగలబెట్టిన ఈ దుర్మార్గం రెండు కుటుంబాలకు ‘మగ దిక్కు’ ని దూరం చేసింది. సజీవ దహనానికి ఐదు వేల అప్పు చెల్లించకపోవడం కారణం కాదనీ, అప్పు తీర్చమని వచ్చి పదే పదే కొడుతూ అవమానించినందుకు పోలీసులకు రిపోర్టు ఇవ్వడమేననీ బాధితుడి కుటుంబీకులు చెబుతున్న నిజం. ‘దిక్కు’ ని కోల్పోయిన ఈ కుటుంబీకుల దైన్యం వారి ముఖాల్లో ప్రతిఫలిస్తున్న తీరు ఎవరినైనా కదిలించక మానదు.

బీడ్స్ గెరాయ్ తాలుకా, సింద్‌ఫనా గ్రామానికి చెందిన ముప్ఫై రెండేళ్ల సహదేవ్ తాయద్ చెరుకు తోటల్లో కూలి. వశిష్ట ధాకే అతనికి ఐదు వేల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఆదివారం సహదేవ్ ఇంటికి వెళ్ళిన వశిష్ట గ్రామస్ధులు చూస్తుండగానే కిరోసిన్ పోసి సజీవ దహనం చేశాడు. అందరి ముందే తగలబెడుతున్నప్పటికీ ఏ ఒక్కరూ వారించలేదని సహదేవ్ తండ్రి వాపోయాడు. తానే అడ్డుకుని ఒంటిపై దుప్పటి కప్పడంతో కొద్దిసేపైనా బతికాడని ఆ తండ్రి దుఃఖపడుతున్నాడు.

డబ్బు ఇవ్వలేదని అంతకుముందు రెండు సార్లు అమానుషంగా కొట్టించాడనీ, దానిపై పోలీసులకు చెప్పినందుకే తన కొడుకుని చంపాడనీ, పొలీసుల వద్దకు వెళ్ళకుండా ఉంటే తన కొడుకు ప్రాణాలయినా దక్కేవనీ అతని తండ్రి ఇపుడు దుఃఖిస్తున్నాడు. రక్షణ దొరుకుతుందని పోలీసుల వద్దకు వెళ్తే అదే తన కొడుకు ప్రాణాలమీదికి తెచ్చిందని సహదేవ్ తండ్రి చెబుతున్నాడు. తొంభై మూడు శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన సహదేవ్ పోలీసులకు తనపైన వశిష్ట కిరోసిన పోసి దహనం చేశాడని చెప్పి ప్రాణాలు విడిచాడు.

సహదేవ్ కి భార్య నలుగురు పిల్లలు. పిల్లలంతా ఒకటి, ఏడు సంవత్సరాల వయసు వారు. తల్లిదండ్రులు కూడా అతని పోషణలోనే ఉన్నారు. భర్త చనిపోయి అతని సోదరి కూడ ముగ్గురు పిల్లలతో అతని వద్దనే రక్షణ పొందుతోంది. తల్లి దండ్రులిద్దరూ పెద్దవారు కావడం వల్ల వారు సంపాదించే పరిస్ధితిలో లేరు. ఇక మిగిలింది భార్య, సోదరిలే. భారత దేశ సామాజీక వ్యవస్ధలో ‘మగ దిక్కు’ కి ఉన్న ప్రాముఖ్యత తెలిసిందే. అది లేకుండానే ఇప్పుడు సహదేవ్ భార్య, సోదరి, ఏడుగురు పిల్లలు ఇద్దరు ముసలివారు గడపాల్సి ఉంది.

గ్రామ జనాభా ఐదొందలుకి మించదు. కొద్ది మంది మరాఠా భూస్వాములదే ఈ గ్రామంలో ఆధిపత్యం.  దళిత కుటుంబాలు కూలీలుగా జీవనం గడుపుతుంటారు. గ్రామ భూములన్నీ కొద్దిమంది భూస్వాముల చేతుల్లో ఉండడం వల్ల పెక్కుమందికి భూమి లేదు. భూములపై వచ్చే ఆదాయం అంతా భూస్వాములకు వెళ్లిపోగా ఇతరులకు కూలీ డబ్బులు మాత్రమే దిక్కు. వశిష్ట ధాకే మరాఠా భూస్వామ్య కులానికి చెందినవాడు. భూములన్నీ చేతుల్లో ఉంచుకుని ఆదాయం సొంతం చేసుకోవడం కాకుండా ఆ డబ్బుని భూ ఆదాయాలు లేని దళితులకి అప్పులిచ్చి వడ్డీ కోసం పీడించడం వీరి అదనపు ఆదాయ మార్గం.

“అంతా నిలబడి తమాషా చూసారు తప్ప ఎవ్వరూ ఆపడానికి ప్రయత్నించలేదు” సహదేవ్ తండ్రి మాషా తెలిపాడు. “ధాకే నా కొడుకుపై కిరోసిన్ పొయ్యడం చూశాను. పరుగెత్తికెళ్ళి నా కొడుకు పైన దుప్పటి కప్పి మంటల్ని ఆపడానికి ప్రయత్నించాను. మాకెవరూ శత్రువులు లేరు. ఇప్పటి కి కూడా శత్రువులు లేరు. కాని మేము ఇప్పుడు భరిస్తున్న కష్టం వశిష్ట కూడా భరించాలి” అని మాషా శాపం పెట్టాడు. పల్లెల్లో కొనసాగుతున్న అగ్రకుల భూస్వామ్య ఆధిపత్యానికి భయపడి వారి అకృత్యాలకు నోరు మెదపలేకపోవడం జరుగుతున్నదే. అరవై ఏళ్ల స్వతంత్రం భూస్వాముల ఆధిపత్యానికి అంతం పలకకపోగా దళిత కూలీలకు రక్షణ కూడా ఇవ్వలేకపోయింది. రాజకీయ నాయకులు ఈ అగ్రకుల ఆధిపత్యం నుండి వచ్చినవారే కావడంతో వారి ఆధిపత్యం కాపాడబడుతూ వచ్చింది.

ఆదివారం సజీవ దహనం జరగ్గా నిందితుడిని పోలిసులు సోమవారం రాత్రి పట్టుకున్నారు. మరణ వాంగ్మూలంలో వశిష్ట పేరు చెప్పడంతో అతని కొసం వెతికి పొలీసులు లాతూర్ లో పట్టుకున్నారు. “ధాకే ప్రధాన నిందితుడు. అతని పైన హత్యా నేరం మోపాము. విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తాం” అని పోలీసులు తెలిపారు. సహదేవ్ ని చంపడానికి ముందు అతన్ని చంపుతానని వశిష్ట రెండు సార్లు బెదిరించాడని తండ్రి మాసా తెలిపాడు. “అలాగయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని నేను వశిష్టకి చెప్పాను. నన్ను కూడా చంపుతానని బెదిరించాడు” అని మాసా చెప్పాడు. పోలీసుల దగ్గరికి వెళ్ళడమే తన తప్పు అని మాసా విలపించాడు.

ఈ ప్రాంతంలో అనేక మంది కూలీల్లో సహదేవ్ ఒకరు. భూమిలేని నిరక్ష్యరాస్యులు. సహదేవ్ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూలీ పని చేస్తారు. సంఘటన జరిగినపుడు సహదేవ్ భార్య వందన వేరే ఊరిలో చెరకు తోటల్లో కూలిపనుల్లో ఉంది. ఆమె కూడా యాభై వేల అప్పు తీసుకుంది. ఆరు నెలలపాటు చాకిరీ చేస్తానన్న ఒప్పందంతో ఆమెకి ఆ అప్పు దొరికింది. అది వెట్టి చాకిరితో సమానం. వెట్టిచాకిరీయే. ‘మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం’ కింద ఈ కుటుంబానికి ఇంతవరకూ ఒక్క రోజు కూడ పని దొరకలేదు.  ఆరునెలలు చెరకుతోటలు, మరో ఆరు నెలలు బీడ్ లో వ్యవసాయ కూలీలుగా పని చేస్తామని సహదే కుటుంబీకులు చెప్పారు. రోజుకి డెబ్భై రూపాయల కూలీ అనీ, సంవత్సరం మొత్తం కష్టపడినా ఆహారం ఇతర అవసరాల కోసం మహా అయితే పదివేలు మిగుల్తాయని వారు చెప్పడం బట్టి సంవత్సరం అంతా కష్టపడ్డా వారు దరిద్రంతోనే గడుపుతారని అర్ధం అవుతోంది.

“ఈ పిల్లలతోనే నా భయం అంతా. నలుగురు పిల్లల్ని నేనెలా సాకాలి?” అని వందన ప్రశ్నిస్తోంది.  వాస్తవంతో ఆమె ఇంకా ఒక అంగీకారానికి రాలేకపోతోంది. ఆమె కూతురి పేరు కాళింది. పిల్లల్లో పెద్దది. ‘తమ తండ్రి పట్నం విడిచి వెళ్ళాడనీ తొందర్లోనే ఇంటికొస్తాడనీ’ ఆ పాప తన తమ్ముడికి నచ్చజెప్పడం చూపరులను కలిచివేసిందని ‘ది హిందూ’ విలేఖరి తెలిపారు. ఇంతకీ ఈ కుటుంబం దారిద్ర్య రేఖకి దిగువన జీవిస్తున్న కుటుంబం కాదు. పని చేయగల ముగ్గురు రోజుకి డెబ్భై రూపాయలు కూలి సంపాదిస్తున్నారు మరి.

రోజుకి నగరాల్లో ఐతే రు.32,  గ్రామాల్లో ఐతే రు.26 కంటే ఎక్కువ సంపాదిస్తే దరిద్రులు కాదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా సుప్రీం కోర్టుకి అఫిడవిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రోజుకి ముప్ఫై రెండు రూపాయల్తో కొద్ది రోజులు బతకాలని ‘నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్’ సభ్యురాలు అరుణా రాయ్ అహ్లూవాలియాకి సవాలు విసిరింది. దేశవ్యాపితంగా విమర్శలు వచ్చినా అహ్లూవాలియా తన ‘దరిద్ర’ పరిమితి ని పెంచేదే లేదని తేల్చాడు. ఈ పనికిమాలిన అమెరికా, మార్కెట్ల సేవకులు సంవత్సరం అంతా కష్టపడినా ఆహారం, వైద్యం కోసం రు.పదివేలు తప్ప మిగుల్చుకోలేని సహదేవ్ లాంటి కూలీలు దరిద్రులు కాదని బల్లగుద్ది, సుప్రీం కోర్టు కి చెబుతుంటే, వారే ప్రణాళికలను రచిస్తుంటే ఈ దేశ దరిద్రం ఎపుడు వదులుతుంది.

మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, మన్మోహన్ సింగ్ లాంటి బహుళజాతి కంపెనీల ప్రేమికులు భారత దేశ వనరుల్ని ఆ కంపెనీలకు కట్టబెట్టడానికే కంకణం కట్టుకున్నారు. కటిక దరిద్రులు కూడా వీరి దృష్టిలో దరిద్రులు కానపుడు ఇంకెవరు దరిద్రులు? బీడ్ జిల్లా అదనపు జిల్లా కలెక్టర్ శివానంద్ తక్సాలే కి ఇదే అనుమానం వచ్చింది. ‘సహదేవ్ కుటుంబం దారిద్ర్య రేఖకు దిగువన లేకపోతే ఇంకెవరు ఉన్నట్లు?” అని ఆయన సహదేవ్ ఇంటిముందు నిలబడి విలేఖరులను అడిగారు. అత్యాచార బాధిత కుటుంబంగా ఒక ఇంటి సహాయానికి సహదేవ్ కుటుంబానికి అర్హత ఉందని ఆయన తెలిపాడు. ఇతరత్రా ఒకటిన్నర లక్షల వరకూ సహాయం ప్రభుత్వం నుండి చెయ్యగల అవకాశం ఉందని ఆయన చెప్పాడు. ఆ సహాయం అందుతుందాలేదా అన్నదే అనుమానం.

ఇంతా చేసి సహదేవ్ హత్య విషయంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నివారణా చట్టం కింద కేసు నమోదు కాలేదు. ఇంకా చెయ్యలేదు, చేస్తాం అని పోలీసులు చెబుతున్నారు. ఆ సెక్షన్ నమోదైతేనె బాధిత కుటుంబానికి నష్టపరిహారం మొత్తం అందే వీలుంది.

10 thoughts on “ఐదువేలు చెల్లించలేదని దళితుడి సజీవ దహనం

 1. మాటలు రావటం లేదు. తిరుగుబాటు. విప్లవం వర్దిల్లాలి అంటూ పెద్ద మాటలు మాట్లాడను కాని .. ఆ కుటుంబం పరిసర ప్రాంతాల్లో రైతుకూలీ సంఘం కాని నక్సలైట్ల ఉనికి కాని ఉండి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని మాత్రం చెప్పగలను.

  వేయితలలతో హింస దేశంలో రాజ్యమేలుతోంటే.. అహింస గొప్పతనం గురించి పాఠాలు వల్లించటం కన్నా మించిన అభాస మన సమాజంలో ఇంకొకటి ఉండదు. భారతీయ గ్రామీణ సమాజంలో వెనుకబడిన వారిని, రైతాంగాన్ని కూడా వడ్డీయే చంపుతోంది. ఆ వడ్డీ వ్యాపారం గ్రామీణ భూస్వాముల చేతుల్లోనే ఉంది. అందుకే ఈ దేశ యువతరంలో ఓ భాగం తిరగబడుతోంది. వేరు గతి లేక తిరగబడుతోంది.

  ఘటన జరిగిపోయిన తర్వాత వచ్చే ఎంత మంది కలెక్టర్లు ఈ దేశంలోని పీడితుల్లో పీడితులకు ఆశ్రయం కల్పించగలరు. బతుకు పట్ల నమ్మకం కలిగించగలరు.

  శేఖర్ గారు చాలా బాధగా ఉంది.

  ఆ పోటో చూడండి.. ఆ స్త్రీమూర్తి ముఖం చూడండి.

  భారత్ వెలిగిపోతోందట…

  థూ…

 2. [వడ్డీ వ్యాపారస్ధులు లాభపడినంతగా వారి వద్ద అప్పులు తీసుకునేవారు లాభపడుతున్నట్లు/బాగుపడుతున్నట్లు కనిపించదు]

  [ఉదాహరణకి] మా అమ్మమ్మ గారి ఊరిలో సాహుకారు కుటుంబ సభ్యులు పూర్వం వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు. వడ్డీ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించిన తరువాత సాహుకారు భాగహారులు (అన్నదమ్ములు) గ్రామం వదిలి పట్టణానికి వెళ్ళిపోయి ఎరువులు & సిమెంట్ వ్యాపారం, లారీలు అద్దెకి ఇచ్చే వ్యాపారం పెట్టుకున్నారు.

  అప్పు తీసుకునేవాళ్ళు ఎవరూ బాగుపడరు కానీ వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు మాత్రం బాగా బాగుపడతారు.

 3. రాజశేఖర్ గారు, బ్యాంక్‌లు రైతులకి అప్పులు ఇవ్వకపోవడం వల్ల కూడా గ్రామాలలో వడ్డీ వ్యాపారులు రైతులకి అప్పులు ఇచ్చి డబ్బులు బాగా లాగుతున్నారు. బ్యాంక్‌లు రైతులకి అప్పులు ఇచ్చినా అవి తీర్చే ఆర్థిక పరిస్థితి రైతులకి లేదు.

  మా అమ్మగారు పని చేసేది ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్‌లో. వాళ్ళ బ్యాంక్‌లో అప్పులు ఎగ్గొట్టేవాళ్ళలో ఎక్కువ మంది రైతులే. రైతులలో చాలా మంది దగ్గర ఫోన్‌లు ఉండవు. బ్యాంక్ అధికారులు రైతుల ఇళ్ళకి వెళ్ళి బాకీలు కట్టమని అడగాల్సి వస్తుంది. బ్యాంక్‌లు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులలాగ గూండాయిజం చెయ్యవు కానీ బ్యాంక్ నుంచి అప్పు రావడం అంత సులభం కాదు కదా.

  అందుకే గ్రామాలలో ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తీసుకుని వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకోవడం లేదా వడ్డీ వ్యాపారుల చేతిలో హత్యకి గురవ్వడం జరుగుతుం(తోం)ది.

 4. ప్రవీణ్, రైతులపైన మీ అభిప్రాయం ఒక వేపునుండి చూడడం వల్ల వచ్చినట్లుంది.

  అప్పులు తీసుకున్న రైతులు పంటలు పండాక, పండక ముందు మోసపూరితమైన పరిస్ధితుల్ని ఎదుర్కొంటున్నాడు. ఇన్ పుట్ ధరలకు తగ్గట్టుగా గిట్టుబాటు ధరలు లేకపోవడం ఒకటి కాగా, పంట వేసేటప్పుడు, సాగు చేసేటప్పుడు ఉంటున్నధరలు పంట చేతికి వచ్చాక ఉండవు. రైతుల వద్ద నిల్వ సౌకర్యాలు లేక, ప్రవేటు గిడ్డంగుల ఖర్చులు పెట్టుకోలేక అప్పటికి ఉన్న ధరలకే అమ్ముకుని నష్టపోతున్నాడు. రైతుల దగ్గర పంట కొని నిల్వ చేసుకున్న దళారీ ధరలు పెరిగాక అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.

  అంటే వ్యవసాయం వల్ల వస్తున్న ఆదాయం అంతా దళారీల చేతుల్లోకి పోతోంది. వ్యవసాయం వల్ల రైతులు నష్టపోతున్నారు గానీ దళారీలు లబ్ది పొందుతున్నారంటే అర్ధం ఏమిటి? వ్యవసాయంలో లాభాలు వస్తున్నాయనే అర్ధం. కాని ఆ లాభాలు పంట పండిస్తున్న రైతు చేతికి కాకుండా దళారీ చేతికి వెళ్తున్నాయి. ప్రభుత్వాలు ఈ పరిస్ధితిని రద్దు చేయాల్సిన బాధ్యతని ప్రభుత్వాలు వదిలి పెట్టాయి. కారణం ప్రభుత్వంలో ఉన్న నాయకులంతా ఆ దళారీ గుంపు కావడమే. పల్లెల దగ్గర్నుండి, మెట్రోపాలిటన్ల దాకా అన్ని చోట్లా, అన్ని రంగాల్లో ఈ దళారిలదే రాజ్యం. వీరిదే భోజ్యం.

  ఇందువల్లే రైతులు అప్పులు ఎగ్గొడ్తున పరిస్ధితి కనిపిస్తుంది. నిజానికి ఎగ్గొట్టడం కాదది. చెల్లించడానికి తగిన ఆదాయం లేక మాత్రమే ఆ పరిస్ధితి తప్ప వారికి ఎగ్గొట్టాలన్న కుట్ర ఉండదు. అలా కుట్ర చేసేది, చేస్తున్నది దళారీలు, భూస్వాములు, కంపెనీలే. వారి అప్పులు సరిగ్గా వసూలు చేస్తే రైతులకి ఇపుడిస్తున్న అప్పులకంటే అనేక రెట్లు బ్యాంకులు ఇవ్వగలవు. ఎన్.పి.ఎ లన్నీ కార్పొరేట్లు ఎగ్గొట్టిన అప్పులే. ఆ అప్పుల సొంతదారుల పేర్లు చెప్పమంటే కాంగ్రెస్, బి.జె.పి ప్రభుత్వాలు రెండూ పార్లమెంటులోనే నిరాకరించాయి.

  ఈ వాస్తవాలు చూడకపోతే రైతులు అప్పులు ఎగ్గొట్టేవారిగా కనిపిస్తారు. నిజానికి రైతులు, కూలీలు కష్టం చెయ్యకుండా పంటలు రావు. పంటలు రాకుండా సంపద సృష్టి జరగదు. రైతులు తీసే ఉత్పత్తి పైనే సేవారంగం, పారిశ్రామిక రంగం ఆధారపడి ఉంది. షేర్ మార్కెట్లలో విశ్లేషకుల నుండి సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీల దాకా ‘సాధారణ రుతుపవనాల’ కొసం ఎదురు చూసేది అందుకే. రుతుపవనాల రాకపైన ఆధారపడి అనేక ఆర్ధిక, పారిశ్రామిక, ద్రవ్య అంచనాలు ఆధారపడి ఉంటాయి. రుతుపవనాలు సరిగ్గా వస్తేనే చాలా ఆర్ధిక కార్యకలాపాలకు ప్రాణం వచ్చి ఊపందుకుంటాయి. వ్యవసాయం దండగ అయితే ఇదంతా ఉండదు. వ్యవసాయం దండగ కాదు వాస్తవానికి. వ్యవసాయంలో ఉన్న రైతులకి అటువంటి దండగ పరిస్ధితులని తెచ్చిపెడుతున్నందువల్ల రైతులు నష్టపోతున్నరు. నిజానికి వ్యవసాయం వల్ల అనేకమంది లాభపడుతున్నారు, ఒక్క రైతు తప్ప.

  రైతులు అప్పులు చెల్లించలేని పరిస్ధితి చూపి అప్పులు ఇవ్వని బ్యాంకులు ఎగ్గొట్టిన కార్పొరెట్లకి ప్రతి సంవత్సరం లక్షల కోట్లు అప్పుగా ఇస్తున్నాయి. రైతులకిస్తున్న కొద్ది అప్పులు కేవలం ఎన్నికల కోసమే తప్ప వారి బతుకుల బాగు కోసం కాదు.

 5. కార్పొరేట్‌వాళ్ళైనా ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ చూపించకపోతే లోన్‌లు ఇవ్వవు. రైతుల దగ్గర పట్టాదార్ పాస్ పుస్తకాలు తీసుకుని లోన్‌లు ఇస్తాయి కానీ మన దేశంలో వ్యవసాయం ఎలాగూ జూదం లాంటిది. అప్పులు తీసుకోకుండా వ్యవసాయం చేసినా నష్టపోతారు.

 6. ప్రవీణ్, నేను రాస్తున్నది ఓపిగ్గా చదవండి

  కార్పొరేట్ కంపెనీలకి ఇన్‌కం టాక్స్ రిటర్న్స్ పుట్టించడం పెద్ద కష్టం కాదు. ఆ లెక్కలు చేసి పెట్టడానికే ఆడిటింగ్ కంపెనీలు. ప్రస్తుతం వ్యవస్ధ భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్ధ ఎని ఎందుకంటున్నాం? భూస్వాములూ, పెట్టుబడిదారుల చేతుల్లోనే వ్యవస్ధలోని అంగాలన్నీ ఉన్నాయి కనుక. రాజ్యాధికార వ్యవస్ధలో బ్యూరోక్రట్ వ్యవస్ధ ఒక భాగం. అటువంటి బ్యూరోక్రట్ వ్యవస్ధలోని అనేక విభాగాల్లో ఇంకమ్ టాక్స్ విభాగం ఒకటి. ఈ ఇన్ కం టాక్స్ విభాగానికి లోబడి మొత్తం రాజ్యాధికారాన్ని చేతుల్లో పెట్టుకున్న వర్గాలకి అప్పులు ఇవ్వాలా అని మీమాంస పెట్టుకోవు.

  కాకపోతే ఏ పద్ధతుల్లో ఇవ్వలన్నదే వారికి సమస్య. నిజానికి అది కూడా సమస్య కాదు. చట్టాల్లో అనేక లొసుగులు, ఏర్పాట్లు అవి ముందే చేసి పెట్టుకుంటాయి.

  ఉదాహరణకి నూతన ఆర్ధిక విధానాల్లో భాగంగా సెజ్ లు అనుమతించడం విధానపరమైన నిర్ణయం. సెజ్ లు వర్ధిల్లడానికి ప్రభుత్వ అంగాలన్నీ పూర్తిగా సహకరించాలన్న ఒక బ్రాడ్ అవగాహన ఉన్నత పాలన, నియంత్రణ వ్యవస్ధల్లో ఏర్పడిపోతుంది. అలా సహకరించడానికి వీలుగా చట్టాల ఉల్లంఘనలు, లైసెన్సుల జారీలు, అన్నీ సజావుగా జరగాలన్న ఆదేశాలు ఉంటాయి. లేదంటే సెజ్ లు రావు (పెట్టుబడులు రావు) అనే వాతావరణం వివిధ పద్ధతుల్లో (మీడియా ఇందులో ప్రముఖ పాత్ర పోషిస్తుంది) విస్తృతంగా ప్రచారంలో పెడతారు. అప్పుడేమవుతుందంటే భారత దేశంలో ప్రజల రక్షణ కోసం ఉన్న చట్టాలు ఉల్లంఘించయినా సెజ్ ల కోసం అన్ని అనుమతులు ఇవ్వాలి అన్న సంస్కృతి వచ్చి చేరుతుంది.

  హోండా ఫ్యాక్టరీలో కార్మికులు సంఘం పెట్టుకుంటామంటె యాజమాన్యం అనుమతించదు. కార్మికులు సంఘం హక్కు కోసం పోరాడతారు. పోలీసులు, పారామిలట్రీ, పారిశ్రామిక బధ్రతా బలగాలు ఇవన్నీ యాజమాన్యానికి సహకారం వస్తాయి. కార్మికుడికి సంఘం పెట్టుకునే హక్కు ఉంది అన్న విషయం ప్రచారానికి నోచుకోదు. నిర్బంధం అమలవుతుంది. ఎవరైనా కార్మికులను అణవివేస్తూన్నారని అంటే ఫిక్కి లాంటివి వచ్చి ‘ఇలాగైతే పెట్టుబడులు రావు’ అని ప్రకటిస్తాయి. చట్టాలు పెట్టుబడులకు అనుకూలంగ ఉండాలి లేదంటే జిడిపి వృద్ధి రెండంకెలకు ఎలా చేరుతుంది? అభివృద్ధి ఎలా సాధ్యం? అని మన్మోహన్, మాంటెక్ సింగ్ లాంటివాళ్లు అమాయక ఫోజుతో ప్రశ్నిస్తారు. కార్మిక చట్టాల్ని, నిబంధనల్నీ ఉల్లంఘించయినా, రైతుల భూముల్ని లాక్కునయినా సెజ్ పెట్టుబడులు అనుమతించాల్సిందే అని ప్రభుత్వంలోని అత్యున్నత వ్యక్తులు సూచనలు చేశాక నియంత్రణ వ్యవస్ధలన్నీ వారిని అనుసరిస్తాయి.

  ఇక ఏం చేసయినా, ఇన్ కం టాక్స్ చట్టాలు లాంటి చిన్న చిన్న నిబంధనలు పక్కకు పెట్టయినా పెట్టుబడులు తెచ్చుకోవాలి. అలా అయితెనే పది శాతం జిడిపి వృద్ధి అన్న ప్రచారం సెటిలవుతుంది. అదే అభివృద్ధి అంటే అని స్ధిరపడిపోతుంది. అది జరిగాక దానికి అనుగుణంగా అన్ని చట్టాలు ఆచరణలో బలహీనపడతాయి. వీటన్నింటి మధ్య కార్మికుల చట్టబద్ధ హక్కులు చాలా చిన్నవిగా మారిపోతాయి. కార్మిక సంఘాలు గొడవ చేస్తూ ప్రభుత్వాలు సమాధానం చెప్పలేని పరిస్ధితులొస్తే అమెరికా రాయబారి ప్రకటన వస్తుంది. “ఇలా పెట్టుబడుల వ్యతిరేక వాతావరణం దేశాభివృద్ధికి హాని చేస్తుంది. అనుకూలంగా ఉన్న చోటికి పెట్టుబడులు తరలిపోతాయి. భారత్ అమెరికా ల మధ్య సహకారం దెబ్బతింటుంది. చేసుకున్న ఒప్పందాలన్ని సమీక్షించుకోవాల్సి వస్తుంది” అని బెదరగొడతాడు. ఇంకేం, ఓట్ల కొసం గొడవ చేస్తున్న రాజకీయ పార్టీలు కూడా దారిలోకొస్తాయి. దారిలోకి రావడానికి తగిన సంభావనలు అందరికీ ముడతాయి. అంతటితో సరి.

  ఈ నేపధ్యంలొ ఇన్ కం టాక్స్ నిబంధనలు, చట్టాలు ఒక లెక్కలోనివి కావు. భారత దేశంలో చట్టాలు, నిబంధనలు అమలయితే రు.కోటి కోట్ల నల్లధనం బైటికి ఎలా వెళ్తుంది?

 7. ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ సంగతి సరే, మా అమ్మగారు పని చేసే బ్యాంక్ ఇంకో విధంగా నష్టపోయింది. గ్లోబలైజేషన్ విధానాలు అమలు జరుగుతున్న కాలంలో తమకి లాభాలు వస్తాయనుకుని రియల్ ఎస్టేట్స్ వ్యాపారులకి లోన్‌లు ఇచ్చారు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లకి క్రెడిట్ కార్డ్‌లు ఇచ్చారు. కానీ ఆర్థిక సంక్షోభం వచ్చిన తరువాత బ్యాంక్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల దగ్గర క్రెడిట్ కార్డ్ బకాయీలు రాబట్టుకునే పనిలో పడింది. కార్పొరేట్‌లు బ్యాంక్‌లని ఎలా మోసం చేస్తారు అనే విషయం నాకు పెద్ద సమాచారం లేదు.

  ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలను. బ్యాంకింగ్ వ్యాపారమే ఒక రిస్కీ వ్యాపారం. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు గూండాయిజం చేసైనా డబ్బులు సంపాదించగలరు కానీ బ్యాంక్‌లు అలా చేస్తే రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకోదు. మా అమ్మగారు పని చేసే బ్యాంక్‌లో కాకుండా వేరే బ్యాంక్‌లలో నాకు అకౌంట్లు ఉన్నాయి. వాటిలో ఒకటైన యూకో బ్యాంక్ అనే ప్రభుత్వ రంగ బ్యాంక్ మేనేజర్ రోజూ బకాయీదార్లకి ఫోన్‌లు చేసి చక్రవడ్డీ పడిపోతుంది కనుక మీరు బాకీ తొందరగా కట్టండి అని చెపుతుంటాడు. బకాయీదార్లకి ఫోన్‌లు చెయ్యడం ఒక తలనొప్పి వ్యవహారం అని ఆ మేనేజరే నాకు చెప్పడం జరిగింది. రైతుల దగ్గర అయితే వాళ్ళలో చాలా మందికి ఫోన్‌లు ఉండవు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అడగాల్సి ఉంటుంది. బ్యాంక్‌లు రైతులకి ఋణాలు ఇవ్వకపోయినా రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర ఋణాలు తెచ్చుకుంటారు.

  కానీ బ్యాంక్ ఋణం కంటే ప్రైవేట్ ఋణం పెద్ద ఉరితాడు వంటిది. ఒక ఆటో డ్రైవర్ తనకి బ్యాంక్ ఋణం రాలేదని ప్రైవేట్ ఫైనాన్సియర్ దగ్గర ఋణం తీసుకుని ఆటో కొన్నాడు. ఇప్పుడు ఒక నెల వడ్డీ కట్టకపోయినా ఫైనాన్సియర్ ఆటోని లాక్కుంటాడని ఆ ఆటో డ్రైవర్ వాపోతున్నాడు.

  ఇదంతా పట్టణాలలో జరుగుతోన్న వ్యవహారం. పల్లెటూర్లలో చదువురానివాళ్ళు ఎక్కువ. వాళ్ళు అప్పులు తీసుకుంటే చక్రవడ్డీలు ఎందుకు పడుతున్నాయో వాళ్ళకి అర్థం కాదు. ఆ చ్రక్రవడ్డీలు కట్టలేక వెట్టిచాకిరి కూడా చేస్తారు.

 8. ఇంకో విషయం. NPAలని సృష్టించగలిగే పొటెన్సీ ధనవంతులకే ఉంటుంది. వాళ్ళు బ్యాంక్ అధికారులకి లంచాలు ఇచ్చి ఆస్తి యొక్క అసలు విలువ కంటే నాలుగైదు రెట్లు ఎక్కువ విలువ ఎస్టిమేషన్ సృష్టిస్తారు. అంటే పది కోట్ల రూపాయలు విలువైన ఆస్తికి యాభై కోట్లు ఎస్టిమేషన్ వెయ్యిస్తారు. ఆ కంపెనీ బకాయీలు కట్టలేక ఆస్తిని బ్యాంక్ స్వాధీనం చేసుకోవడం జరిగి ఆ ఆస్తిని వేలం వేసేటప్పుడు ఆ ఆస్తి యొక్క విలువ అంత ఉండదని తెలుస్తుంది. గతంలో చార్మినార్ బ్యాంక్ అనే ఒక ప్రైవేట్ బ్యాంక్ ఇలాగే నష్టపోయింది. ఆ బ్యాంక్ యొక్క లైసెన్స్‌ని రిజర్వ్ బ్యాంక్ రద్దు చెయ్యడం కూడా జరిగింది.

 9. మన్మోహన్ సింగ్ ప్రస్తావన వచ్చింది గనక ఇది రాస్తున్నాను. మన్మోహన్ సింగ్ గతంలో పివి నరసింహారావు దగ్గర ఆర్థిక మంత్రిగా పని చేశాడు. పివి నరసింహారావులాగే అతను కూడా సామ్రాజ్యవాదులకి అనుకూలమైన ఆర్థిక విధానాలు అమలు చేస్తాడని భావించి అతనికి ప్రధాన మంత్రి పదవి ఇచ్చారు.

  మన దేశంలో ఉన్న కార్పొరేట్ మీడియాలన్నీ మన్మోహన్ సింగ్ నిజాయితీపరుడనీ, అతని దగ్గర పని చేసే మంత్రులు మాత్రమే అవినీతిపరులనీ ప్రచారం చేస్తాయి. ఆ మీడియాలు మంత్రుల వల్లే మన్మోహన్ సింగ్‌కి చెడ్డ పేరు వస్తోందని చెపుతాయి కానీ మన్మోహన్ సింగ్ కూడా స్వయంగా అవినీతిపరుడేననే నిజం ఒప్పుకోవు. గ్లోబలైజేషన్ అనుకూల మీడియా యొక్క మోడస్ ఓపరాండీయే ఇది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s