పాక్ జెండా ఎగరేసింది హిందూత్వ ముఠాయే


మంగళవారం మరొక ‘హిందూత్వ’ కార్యకర్త అరెస్టుతో పాకిస్ధాన్ జెండా ఎగరేయడం వెనుక జరిగిన కుట్రను పొలీసులు వెల్లడించగలిగారు. కర్ణాటక రాష్ట్రంలో సిందగీ గ్రామ తహసీల్దారు కార్యాలయం ముందు జనవరి ఒకటిన పాకిస్ధాన్ జెండా ఎగరేయడంతో అలజడి చెలరేగింది. మత కల్లోలాను రెచ్చగొట్టడానికే ఈ విధంగా పాకిస్ధాన్ జెండా ‘హిందూత్వ’ కార్యకర్తలు ఎగరేశారని పోలీసులు ధృవీకరించారు. ఈ కేసులో ఇప్పటివరకూ అరెస్టయిన వారి సంఖ్య ఏడు కి చేరుకుంది.

అరెస్టయిన వారు ‘శ్రీరాం సేన’ సభ్యులని పొలిసులు తెలిపారు. ఇది హిందూ మతోన్మాద సంస్ధ అని పొలీసులు తెలిపారు. పాకిస్ధాన్ జెండా ఎగరేశాక స్ధానికంగా ఉన్న ముస్లిం మతస్ధులే ఆ పని చేసినట్లుగా ‘శ్రీరాం సేన’ కార్యకర్తలు ప్రచారం చేశారని వారు తెలిపారు. ఆదివారం నిందితులను బీజాపూర్ జైలు నుండి బళ్ళారి జిల్లా జైలుకి తరలించారని తెలుస్తోంది. బీజాపూర్ జిల్లా జైలులోని ఖైదీలు శ్రీరాం సేన కార్యకర్తలపైన ‘జాతీయ వ్యతిరేక కార్యకలాపాలకు’ పాల్పడ్డారని ఆరోపిస్తూ దాడి చేయడంతో ఇలా వేరే జైలుకి మార్చారని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ముఠా నాయకుడు ‘రాకేష్ మఠ్’ తీవ్రంగా గాయపడ్డాడు.

నేరం మాది కాదు, ఆర్.ఎస్.ఎస్ దే.

శ్రీరాం సేన జిల్లా శాఖ మాత్రం జెండా ఎగరేయడానికి బాధ్యులం తాము కాదని ప్రకటించింది. నిందితులు తమ సంఘానికి చెందినవారు కాదని ఆ సంస్ధ జిల్లా నాయకులు తెలిపారు. పోలీసులకు పట్టుబడినవారు ఆర్.ఎస్.ఎస్ సంస్ధ సభ్యులని ‘శ్రీరాం సేన’ నాయకులు తెలిపారు. తమ వాదనకు మద్దతుగా శ్రీరాం సేన నాయకులు అనేక ఫొటోలను పత్రికల సమావేశంలో విడుదల చేశారు. ఈ అంశంలో ఆర్.ఎస్.ఎస్ పాత్ర బైటికి రాకుండా ఉండాలని పోలీసులపై ఒత్తిడి రావడంతో తమ పేరు తెస్తున్నారని శ్రీరాం సేన తెలిపింది. ఫొటోలను చూపి వారంతా అర్.ఎస్.ఎస్ కార్యకర్తలని శ్రీరాం సేన రుజువు చేయడానికి ప్రయత్నిస్తోంది.

పోలీసు వర్గాలు మరిన్ని వివరాలను వెల్లడించినట్లుగా ‘ది హిందూ’ పత్రిక తెలిపింది. బి.జె.పి కి చెందిన ఓ ప్రజా ప్రతినిధి ఆదేశాల మేరకే పాకిస్ధాన్ జెండాను ఎగరేసారని పొలీసు వర్గాలను ఉటంకిస్తూ ఆపత్రిక తెలిపింది. బి.జె.పి కి చెందిన ఈ ప్రజా ప్రతినిధి (!) రాజకీయ ఎజెండా కోసం మత కల్లోలాలను రెచ్చగొట్టే లక్ష్యాన్ని పెట్టుకున్నాడని పొలీసులు తెలిపారు. పాక్ జెండా ఎగరేసిన ఘటనలో తన పాత్రని నిరూపించే సాక్ష్యాలన్నింటినీ నాశనం చేయాలని ఆయన ఆదేశించినట్లుగా పోలీసులు తెలిపారు. నిరసనకారుల ఫొటోలు, సంస్ధకు చెందిన బ్యానర్లు అన్నింటినీ నాశనం చేయాలని ఆయన ఆదేశాలిచ్చాడని పోలీసులు చెప్పారు.

జనవరి ఒకటి తెల్లవారు ఝామునే సిందగీ తహశీల్దారు కార్యాలయం వద్ద పాకిస్ధాన్ జెండాని ఎగరేశారు. ఆ తర్వాత రాకేష్ మఠ్ నాయకత్వంలోని నిందితులు తహశీల్దారు ఆఫీసు ముందు గుమికూడి పాకిస్ధాన్ జెండాని ఎగరేయడానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలు పెట్టారు. స్ధానికంగా ఉన్న ముస్లింలు పాకిస్ధాన్ జెండా ఎగరేశారని వారు ఆరోపిస్తూ ప్రదర్శన నిర్వహించారు. “పాక్ జెండా ఎగరేస్తారా?” అంటూ ఆవేశపడిపోతూ రోడ్డుపై వాహనాలను అడ్డుకుని రాళ్ళు విసరడం వారు ప్రారంభించారు. బస్సులపై రాళ్ళు విసిరారు. ఈ లోపు పోలీసులు వచ్చి అల్లర్లు కొనసాగకుండా అదుపు చేసారు. పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి ఈ కేసు దర్యాప్తు చేసే రెండో వారంలోనే అసలు కుట్రని వెల్లడి చేయగలిగారు.

నిరసనలను ఆర్గనైజ్ చేసిన శ్రీరాం సేన కార్యకర్తలే పాక్ జెండా ఎగరేశారని పోలీసుల దర్యాప్తు లో తేలింది. జనవరి మూడో తారీఖునే పోలీసులు ఆరుగురు రింగ్ లీడర్లను అరెస్టు చేశామని ప్రకటించారు. సెడిషన్, మత కల్లోలాలు రెచ్చగొట్టిన నేరాలని వారిపై మోపారు. ముందస్తు చర్యగా జిల్లా అధికారులు, సంఘటనకు సంబంధించిన ఊరేగింపులనూ, నిరసన ప్రదర్శనలనూ నిషేధించారు.

శ్రీరాం సేన గతంలో కూడా ఇలాంటి అకృత్యాలు నిర్వహించింది. అయితే వారు చెప్పిన దాని ప్రకారం వీరి వెనుక ఆర్.ఎస్.ఎస్ ప్రోత్సాహం ఉందని స్పష్టం అవుతోంది. నిరసనల్లో పాల్గొన్న వారి ఫొటోలను కూడా శ్రీరాం సేన పత్రికలకు విడుదల చేస్తూ, వారంతా ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలేనని చెప్పినందున ఆర్.ఎస్.ఎస్ పాత్ర రుజువవుతోంది. ఆర్.ఎస్.ఎస్, శ్రీరాం సేన ల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడం వల్ల ఈ నిజం బైటికి వచ్చింది తప్ప లేకుంటే వచ్చేది కాదు. ఆర్.ఎస్.ఎస్ సంస్ధ ఈ సంఘటనకు పధక రచన చేసి తీరా బైటపడాల్సి వచ్చేసరికి మొత్తాన్ని శ్రీరాం సేన పైకి నెట్టేసిందన్నది స్పష్టం అవుతోంది.

మాలెగావ్ పేలుళ్ళు ఈ సందర్భంగా ప్రస్తావించకుండా ఉండలేం. స్వామీ అసీమానంద, స్వామిని ప్రజ్ఞా సింగ్ లు ఆర్.ఎస్.ఎస్ పనుపుతో కుట్రలు చేసి టెర్రరిస్టు చర్యలకు పాల్పడ్డారు. సెప్టెంబరు 29, 2008 తేదీన మహారాష్ట్ర రాష్ట్రంలోని మాలెగావ్ లో వరుస పేలుళ్ళు సంభవించాయి. అదో రోజు గుజరాత్ లోని మొదాసా లొనూ పేలుళ్ళు జరిగాయి. రెండు చోట్లా మొత్తం 8 మంది చనిపోయారు.  పూర్వాశ్రమంలో ఎ.బి.వి.పి లో పని చేసిన స్వామిని ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఈ పేలుళ్లలో కీలక పాత్ర పొషించిందని పోలీసులు వెల్లడించారు. మాలెగావ్ నిందితులకు శ్రీరాం సేన న్యాయ సహాయం అందించడం గమనార్హం. ఎం.ఎఫ్. హూస్సేన్ పెయింటింగ్ ప్రదర్శనలపై దాడి చేసి నాశనం చేసిన చరిత్ర కూడా శ్రీరాం సేన కు ఉంది. కర్టాటకలో చర్చిలపై దాడులు నిర్వహించింది. ఎ.బి.వి.పి కి దగ్గరి సంబంధాలు ఉన్న హిందూ జాగరణ్ మంచ్ మాలెగావ్ పేలుళ్లకు బాధ్యురాలని తేలినా విచారణ ఇంకా పూర్తి కాలేదు. ఇస్లామిక్ విధ్యార్ధి సంస్ధ సిమి పైన ఈ నేరాన్ని హిందూ సంస్ధలు మోపినా పరిశోధనలో అసలు నిజం బైటికి రాక తప్పలేదు. మాలెగావ్ పెలుళ్ళపై దర్యాప్తు చేసున్న ఎన్.ఐ.ఎ మూడు రోజుల క్రితం ప్రజ్ఞాసింగ్ టాకూర్ కి బెయిల్ ఇవ్వడానికి వ్యతిరేకీంచింది.

ముంబై పేలుళ్ల నేపధ్యంలొ ముస్లింలను రాక్షసీకరించడానికి మాలెగావ్ పేలుళ్లు జరిగాయని అనేకమంది విశ్లెషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్టాటకలో జరిగిన తాజా ఘటన కూడా అందుకు విరుద్ధం గాదు. పాకిస్ధాన్ జెండా ఎగరేశే పనికి వాస్తవంగా భారత  ముస్లింలు పాల్పడలేదు. పాకిస్ధాన్ క్రికెట్ మాచ్ గెలిస్తే పాత బస్తీలో స్వీట్లు పంచుకున్నారు అన్న వార్త ఎంత వేగంగా ప్రచారం పొందుతుందో, అదే విధంగా కర్ణాటకలోను ఫలితం రాబట్టి తద్వారా బి.జె.పి నాయకుడు కుట్ర పన్నాడని స్పష్టం అవుతోంది.

హిందూత్వ వాద సంస్ధలు ఇటువంటి కుట్రలతో అభం శుభం తెలియని అమాయకులను బలిపశువులను కావిస్తున్నారు. పాక్ జెండా ఎగరవేయడానికి కుట్రపన్ని రాజకీయ లబ్ది పొందాలని చూసిన బి.జె.పి నాయకుడి పాత్ర ఎన్నటికీ రుజువు కాదు. శ్రీరాం సేన, ఆర్.ఎస్.ఎస్ సంస్ధల విద్వేష పూరిత ప్రచారం నేరుగా ప్రజలను బలిచేయడంతో పాటు ఆ సంస్ధల కార్యకర్తలను కూడా ఈ విధంగా బలిపశువులను చేయడం శోచనీయం.

రధ యాత్ర జరిపి దారి పొడవునా మత కల్లోలాలు రేపి రాజకీయాధికారం సంపాదించిన చరిత్ర బి.జె.పి ది. అది ఇలాంటి కార్యక్రమాలను ఆపబోదన్న గ్యారంటీ లేదు.

One thought on “పాక్ జెండా ఎగరేసింది హిందూత్వ ముఠాయే

  1. మీరు గమనించారో లేదో, హిందువులు & ముస్లింలు ఈ రెండు మతాలవాళ్ళ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోనే మత ఘర్షణలు జరుగుతాయి. ఏదో ఒక మతంవాళ్ళ జనాభా చాలా తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఎంత రెచ్చగొట్టినా మతఘర్షణలు జరగవు.

    (ఉదాహరణకి) మా పట్టణంలో ముస్లింల సంఖ్య చాలా తక్కువ. నేను ఇక్కడ కలెక్టర్ కార్యాలయం మీద పాకిస్తాన్ ఝండా ఎగరేసినా మత ఘర్షణలు జరగవు. అలాగే ఇక్కడి మస్జీద్ మీద హనుమాన్ ద్వజం ఎగరేసినా మత ఘర్షణలు జరగవు. రెండు మతాలవాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మాత్రం మత ఘర్షణలు జరుగుతాయి.

    ఒకవేళ నేను శ్రీకాకుళం కలక్టరేట్ భవనంపై పాకిస్తాన్ ఝండా ఎగరేస్తే నన్ను ట్రెస్ పాసింగ్ కేస్ కింద అరెస్ట్ చేస్తారు లేదా దేశ ద్రోహం కేస్ కింద అరెస్ట్ చేస్తారు కానీ ఇక్కడ మత ఘర్షణలు జరిగే అవకాశం మాత్రం ఉండదు.

    హైదరాబాద్‌లో మత ఘర్షణలు ఎక్కువగా జరిగినప్పటికీ వాటిలో politically motivated మత ఘర్షణలే ఎక్కువ. (మతాల కోసం, నమ్మకాల కోసం జరిగిన మత ఘర్షణలు తక్కువ.)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s