మాయావతి పక్కనుంటే అవినీతి పరుడు, బి.జె.పి లోకి దూకితే ఒ.బి.సి నాయకుడు


భారతీయ జనతా పార్టీ అవినీతి వ్యతిరేకత మట్టి గొట్టుకుపోయింది. ఒ.బి.సిలకు నాయకుడని, ఓట్లు తెస్తాడనీ తాను నమ్మినందున, ఆయన బి.జె.పి తలుపు తట్టినందున అప్పటివరకూ అవినీతి మంత్రిగా ఉన్న వ్యక్తి కాస్తా వెనుకబడిన తరగతులకు నాయకుడుగా మారిపోయాడు. భారత దేశంలోని రాజకీయ పార్టీల అవినీతి వ్యతిరేకతలో నిజాయితీ నేతి బీరలో నెయ్యి చందమేనని రుజువు కావడం ఇది ఎన్నోసారో! లోక్ పాల్ చట్టం కోసం అన్నా హజారే చేసిన అవినీతి వ్యతిరేక పోరాటానికి భావోద్వేగాలతో మద్దతు పలికిన బి.జె.పి, తన నీతి మాలిన తనానికి హద్దులు లేవని చాటు కుంది. తన సొంత నేతల అభ్యంతరాలను పక్కన బెట్టి ఓ అవినీతి రాజాను అక్కున చేర్చుకుంది.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకుడు బాబూ సింగ్ కుష్వహా తాజా దుమారానికి కేంద్ర బిందువు. మాయావతి ప్రభుత్వంలో నిన్నటివరకూ మంత్రిగా ఉన్న ఈయన ఇంటిపైన సి.బి.ఐ దాడులు జరిపింది. ‘నేషనల్ రూరల్ హెల్త్ మిషన్’ స్కీమ్ కి సంబంధించిన నిధులను పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగిన కుంభకోణంలో ఈయన నిందితుడు. నూట ముప్ఫై నాలుగు ఆసుపత్రులను అప్ గ్రేడ్ చేయడంలొనూ, మందులు, కంప్యూటర్లు, అంబులెన్సులు కొనుగోలు చేయడం లోనూ అవకతవలు చోటు చేసుకున్న కుంభకోణంలో సి.బి.ఐ దర్యాప్తు చేస్తోంది. ఐదుగురిని ఇప్పటిదాకా అరెస్టు చేసింది. కుష్వహా ను కూడా త్వరలో అరెస్టు చేస్తారని తెలుస్తోంది.

బాబూ సింగ్ కుష్వహా వేగంగా డబ్బులు సంపాదించడానికి చట్టాలు, నియమాలను తుంగలో తొక్కాడని సి.బి.ఐ ఆరోపించింది. ఈయన అండతో సూరబ్ జైన్ అనే మందుల వ్యాపారి కోట్లకు పడగలెత్తాడని తెలిపింది. హై కోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేస్తున్న సి.బి.ఐ శనివారం ఇరవైఆరు చోట్ల దాడులు జరిపింది. ఇవన్నీ కుష్వహా, అతని అనుచరుల కు చెందిన నివాస, వ్యాపార స్ధలాలే. గత ఏప్రిల్ నెలలో కుష్వహాను మాయావతి ప్రభుత్వం మంత్రిగా తొలగించింది. నవంబరు నెలలో బి.ఎస్.పి పార్టీ ఆయనను బహిష్కరించింది. అటువంటి వ్యక్తిని బి.జె.పి అక్కున చేర్చుకుంది.

పార్టీలోని రాష్ట్ర అగ్రనాయకులు కీర్తి అజాద్, మనేకా గాంధీ లాంటి వారు తీవ్ర అభ్యంతరాలు చెబుతున్నా ఆయన చేరికను బి.జె.పి అధ్యక్షుడు నితిన్ గడ్కారీ గట్టిగా సమర్ధించుకున్నాడు. ఆయన బిసిల నాయకుడనీ, బి.సిలను చిన్న చూపు చూస్తున్నారని, అందుకే తాము పెద్ద చూపు చూస్తున్నామనీ నితిన్ తమ చర్యను నిస్సిగ్గుగా సమర్ధించుకున్నాడు. బి.సిల ఓట్లు తెస్తున్నందున అవినీతికి పాల్పడినా బి.జె.పికి ఏమీ ఫరవాలేదు. ఆయన పార్టీలోకి వచ్చినా ఆయన అవినీతి ని సమర్ధించేది లేదనీ, కోర్టులు దర్యాప్తు చేసుకోవచ్చనీ నితిన్ గడ్కారీ ప్రకటించడం మామూలు నీతి సూత్రాలకు అందని విషయం.

ఇంతకీ కుశ్వహా యు.పి లో బి.సి నాయకుడేమీ కాదని ‘ది హిందూ’ తెలిపింది. ఈయన వాస్తవానికి బి.ఎస్.పి అగ్ర నాయకుడు కాన్షీరాం కార్యాలయానికి కార్యదర్శిగా పని చేసే వాడు. ఆ తర్వాత ఎం.ఎల్.సి గా పని చేశాడు. మాయావతి మంత్రివర్గంలో కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా ఉంటూ ప్రభావ శీల మంత్రిగా ఎదిగాడు. ఈ కాలమంతటా ఈయన ఎన్నడూ బి.సి.అ నాయకుడుగా ఎవరూ చూడలేదని ‘ది హిందూ’ తెలిపింది. నిజానికి ఈయన ఓ.బి.సి కులం కుష్వహా కు చెందినవాడనీ, ఐనా బిసిల నాయకుడుగా ఎవరూ చూడలేదనీ ఆ పత్రిక తెలిపింది. ఈ వర్గ వారు రాష్ట్రంలో నాలుగు శాతం ఉన్నారని తెలుస్తోంది.

సి.బి.ఐ దర్యాప్తు జరపాలని త్వర త్వరగా నిర్ణయించడంతో బి.సిల గొంతు అణచివేయబడిందని బి.జె.పి ఆరోపిస్తోంది. ఈయన బి.జె.పి లో చేరకుండా మరో పార్టీలో చేరి ఉంటే, సి.బి.ఐ దర్యాప్తు లేటయితే బి.జె.పి మాటలు అప్పుడు ఇలా ఉండబోవన్నది స్పష్టమే. కుష్వహా ముందు తమ పార్టీ లో చేరతానని వచ్చాడనీ, కాని అవినీతి పరుడు గా జైల్లో ఉండాలని చెప్పి పంపామనీ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ చెబుతున్నాడు. కాంగ్రెస్ లో చేరికకు అనుమతి దొరికితే కుష్వహా విషయంలో బి.జె.పి, కాంగ్రెస్ ల మాటలు సరిగ్గా ఒకరివి మరొకరు మార్చుకుని ఉండేవారనడంలో సందేహం లేదు.

కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారానికి అన్నా హజారే బృందం దిగి ఉన్నట్లయితే అది కాస్తా ఇలాంటి అవినీతి పరులకు మద్దతుగా పరిణమించి ఉండేది. కుష్వహా చేరిక ద్వారా బి.జె.పికి కుష్వహులు, మౌర్యలు, కొయిరీలు తదితర బి.సి లు దగ్గరవుతారనీ, తద్వారా కనీసం వంద సీట్లకు తగ్గకుండా బి.జె.పి గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటు లో కీలక పాత్ర పొషించవచ్చని భావిస్తున్నట్లుగా పత్రికలు రాస్తున్నాయి.

One thought on “మాయావతి పక్కనుంటే అవినీతి పరుడు, బి.జె.పి లోకి దూకితే ఒ.బి.సి నాయకుడు

  1. కులానికి ప్రాతినిధ్యం ఇవ్వాలనుకుంటే ఏ మధ్య తరగతి కుటుంబం నుంచో వచ్చిన కుల సంఘం నాయకునికి ప్రాతినిధ్యం ఎందుకు ఇవ్వకూడదు? కులం పేరుతో ఏమి చేసినా చెల్లుతుంది అనే భావాన్నే కలిగిస్తాయి కుల రాజకీయాలు. తాము దళితులు కాబట్టే తమని అవినీతి కేసుల్లో ఇరికించారని రాజా, బంగారు లక్ష్మణ్ లాంటి వాళ్ళు చెప్పి తమని తాము జస్టిఫై చేసుకోగలిగింది అందుకే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s