(90 మంది రోగులను చంపిన) కోల్ కతా ఆసుపత్రి డైరెక్టర్లను వెంటనె విడుదల చేయాలి -ఫిక్కి


డిసెంబరు 9 తేదీన కోల్ కతా లోని ‘ఎ.ఎం.ఆర్.ఐ ధాకూరియా’ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో తొంభై మందికి పైగా రోగులు, ఉద్యోగులు చనిపోయిన సంగతి విదితమే. ముఖ్యమంత్రి మమత ప్రమాదానికి వెంటనే స్పందించి ఆసుపత్రి డైరెక్టర్లు పది మందిలో ఏడుగురిని వెంటనే అరెస్టు చేయించింది. వారికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించడంతో కోల్ కతా జైలులోనే ఉన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని భారత పెట్టుబడిదారుల సంఘం “ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ ఇండస్ట్రీస్” (ఎఫ్.ఐ.సి.సి.ఐ – ఫిక్కి) మంగళవారం డిమాండ్ చేసింది.

అరెస్టు అయినవారు నిర్దోషులనో, నేరంతో సంబంధం లేనివారనో చెబుతూ విడుదల చేయమని కోరడం అర్ధం చేసుకోవచ్చు. కాని ఆసుపత్రి యజమానులను విడుదల చేయడానికి ఫిక్కి చూపిన కారణం అత్యంత దారుణంగా ఉంది. “ఇది (విడుదల చేయడం) న్యాయ సమ్మతం. దేశీయ కార్పొరేట్ రంగంలో నెగిటివ్ సెంటిమెంట్లు వ్యాప్తి కాకుండా వారి విడుదల దోహదపడుతుంది” అని ఫిక్కి ఘనంగా ప్రకటించింది. అరెస్టయినవారిలో ఆసుపత్రి రోజువారీ కార్యక్రమాలతో సంబంధం లేనివారిని విడుదల చేయాలని ఫిక్కి ఓ సన్నాయి నొక్కు నొక్కింది గానీ అలా సంబంధం లేనివారెవరో చెప్పకుండా దాటేసింది.

ఫలానావారు కేవలం ఆసుపత్రి డైరెక్టర్లు మాత్రమేననీ, వారికీ ఆసుపత్రి రోజువారీ కార్యకలాపాలతొ సంబంధం లేదనీ ఫిక్కీ పెద్దలు చెప్పినట్లయితే వారిపైన దృష్టి సారించే అవకాశం ప్రభుత్వానికి ఉండవచ్చు. కానీ వీరికి అవకాశం ఇవ్వాలే గానీ అరెస్టయిన డైరెక్టర్లంతా, ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ తో సహా, రోజువారి కార్యకలాపాలతో సంబంధం లేదని ఎన్ని కుండలైనా బద్దలు కొట్టీ మరీ చెప్పగలరు. గనుల శాఖ కార్యదర్శిగా ఉంటూ కూడా జి.ఓ విడుదల తన సంతకం లేకుండా విడుదల అయింది కనుక గాలి గారి ఒ.ఎం.సి గనుల అక్రమ తవ్వకాల కేసులో తనకేమీ పాత్రలేదని ‘ఐ.ఎ.ఎస్ మేధావి’ శ్రీలక్ష్మి వాదిస్తున్న విషయం మననం చేసుకుంటే ఆ విష(య)మ్ బోధపడుతుంది.

కోర్టు విచారణ అనంతరం దోషులుగా తేలినవారిని ఎటువంటి పక్షపాతం లేకుండా శిక్షించవచ్చని ఫిక్కి ప్రకటన పేర్కొంది. అంటే విచారణ ముగిసేదాకా డైరెక్టర్లను, మేనేజింగ్ డైరెక్టర్ నూ విడుదల చేసి కేసులో లేకుండా చేసుకోవడానికి తగిన అవకాశం ఇవ్వాలన్నది ఫిక్కీ అభిప్రాయంలా కనిపిస్తోంది. టు.జి స్పెక్ట్రం అవినీతి కుంభకోణం కేసులో మాజీ మంత్రి ఎ.రాజా పైన విచారణ ముగియలేదు. అయినా ఆయన సాక్షులను ప్రలోభ పెట్టవచ్చన్న అనుమానంతో జైలులోనే కొనసాగిస్తున్నాయి కోర్టులు. శ్రీలక్ష్మి పై కూడా కోర్టు విచారణ ముగియలేదు. ఆవిడ దోషిగానూ తేలలేదు. అయినప్పటికీ ఆమె బెయిల్ ను హై కోర్టు రద్దు చేసింది. కారణం సాక్షులను బెదిరించి, సాక్ష్యాలను తారుమారు చేస్తుందనే. కార్యదర్శిగా ఆమె నేరపూరిత నిర్లక్ష్యానికి పాల్పడిందని కూడా హై కోర్టు తేల్చింది పూర్తి విచారణ ముగియకుండానే. ఫిక్కీ పెద్దలు ఇటువంటి న్యాయవ్యవస్ధ పాటించే విచారణ ప్రక్రియలనే అపహాస్యం చెయ్యబూనుకున్నారు. దోషులుగా తేలేదాకా వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.

అరెస్టు అయిన ఏడుగురు డైరెక్టర్లూ వ్యాపారులే. పేరుమోసిన కార్పొరేట్ ఘనాపాఠీలే. అందులో గోయెంకా కుటుంబ సభ్యులు ముగ్గురు కాగా, తోడి కుటుంబ సభ్యులు ఇద్దరు, అగర్వాల్ కుటుంబీకులు ఇద్దరు. మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.ఎస్.అగర్వాల్ అనేకమైన గుండె జబ్బులను కారణంగా చూపుతూ ఎస్.ఎస్.కె.ఎం ఆసుపత్రిలో, జ్యుడిషియల్ కష్టడీలొ ఉంటూనే, విశ్రాంతి తీసుకుంటున్నాడు. తప్పించుకుని తిరుగుతున్న ముగ్గురు డైరెక్టర్లలో ఇద్దరు ఈయనగారి పుత్ర రత్నాలే కావడం గమనార్హం. అగర్వాల్ లు బైట ఉండగా గోయెంకా, తోడి లు లోపల ఎందుకుండాలన్నది ఫిక్కి పెద్దల భావన కాబోలు!

మరో విలువైన సలహా ఫిక్కి, ప్రభుత్వానికి (బహుశా కోర్టులకు కూడానేమో తెలియదు) ఇచ్చింది. “పరిశోధన సందర్భంగా, ఉద్దేశ్యపూర్వకంగా జరగని పొరపాట్లకూ, ఉద్దేశ్యపూర్వకంగా చేసిన చర్యలకూ మధ్య తేడా చూడాలి” అన్నది వీరి అమూల్య సలహా. సాధారణంగా ఇలా తొంభైమంది చనిపోయిన కేసులో అరెస్టయినవారు పెద్దవారయినా కోర్టుల్నీ, ప్రభుత్వాల్నీ బతిమాలుకుంటారు. విచారణకి అందుబాటులో ఉంటామని బాసలు చేస్తారు. పాస్ పోర్టులు ఇచ్చేస్తామంటారు. ఎవరినీ భయపెట్టం వదిలిపెట్టంది ప్లీజ్ అని వేడుకుంటారు. గాలి, కనిమొళి, శ్రీలక్ష్మి తదితరులను చూస్తే అది తెలుస్తోంది. (వారు అరెస్టు కాకపోతే అది తెలిసుండకపోను) కాని ఫిక్కీ పెద్దలు మాత్రం ప్రభుత్వాన్ని, కోర్టులను డిమాండ్ చేస్తున్నారు. “వెంటనే” విడుదల చెయ్యాలన్నది వారి ప్రధాన డిమాండ్.

భారత దేశంలో, ఆ మాటకొస్తే మరే దేశంలోనైనా, కార్పొరేట్ బిజినెస్ క్లాస్ వారికి మాత్రమే ఈ లగ్జరీ అందుబాటులో ఉంటుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s