ఇక భారత షేర్ మార్కెట్లతో విదేశీ వ్యక్తిగత ఇన్వెస్టర్లూ ఆడుకోవచ్చు


భారత దేశ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ వ్యక్తిగత మదుపుదారులే నేరుగా పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని భారత ప్రభుత్వం కల్పించబోతోంది. జనవరి 15 నుండి విదేశీ మదుపరులను షేర్ మార్కెట్లలోకి అనుమతించనున్నట్లు ఆదివారం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత దేశ ఆర్ధిక వ్యవస్ధను సరళీకరణకు గురిచేసే పధకంలో ఇది మరొక అడుగు. 2011 సంవత్సరంలో షేర్ మార్కెట్లనుండి విదేశీ సంస్ధాగత నిధులు పెద్ద ఎత్తున తరలివెళ్ళిన నేపధ్యంలో ఈక్విటీ మార్కెట్ నిబంధనలను మరింత సరళీకృతం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

ఇప్పటివరకూ విదేశీ సంస్ధాగత పెట్టుబడులను (ఫారెన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్ – ఎఫ్.ఐ.ఐ) మాత్రమే భారత ఈక్విటీ మార్కెట్లలోకి అనుమతించారు. అంటే ఎవరైనా విదేశీయులు భారత షేర్ మార్కెట్లలో మదుపు చేయదలుచుకుంటే వారు నేరుగా ఇక్కడి ఈక్విటీలను కొనుగోలు చేసే అవకాశాలు లేవు. మ్యూచువల్ ఫండ్లు, హెడ్జ్ ఫండ్లు లాంటి సంస్ధాగత పెట్టుబడుల ద్వారా మాత్రమే ఇక్కడి ఈక్విటీలలో పెట్టుబదులు పెట్టగల అవకాశం ఉండేది. ఈ పరిస్ధితిని మార్చడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతవరకూ విదేశీ వ్యక్తిగత మదుపుదార్లను లేదా విదేశీ ధనికులను భారత ఈక్విటీ మార్కెట్లలోకి అనుమతించకుండా ఎందుకు అడ్డుకున్నారన్నది ఈ సందర్భంగానైనా తెలుసుకోవడం అవసరం.

విదేశీ వ్యక్తిగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఎఫ్.ఐ.ఐల పెట్టుబడుల కన్నా అస్ధిరంగా ఉంటాయి. ఎఫ్.ఐ.ఐ పెట్టుబడులే అస్ధిరం కాగా, వాటి కంటె అస్ధిరమైనవి వ్యక్తిగత పెట్టుబడులు. దేశ ఆర్ధిక పరిస్ధితులలో ఏ మాత్రం మార్పు వచ్చినా, లేదా వస్తుందని భావించినా వీరు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటారు. ఇక్కడ పరిస్ధితి బాగానే ఉన్నా, ఇతర దేశాలలో ఇక్కడి కంటె పరిస్ధితి మెరుగ్గా కనిపించినా, ఎక్కువ లాభాలు వస్తున్నట్లు కనిపించినా పెట్టుబడులతో ఎగిరిపోతారు. తద్వారా షేర్ మార్కెట్లలో అస్ధిర పరిస్ధితులను ప్రేరేపిస్తారు. ఉన్న అస్ధిర పరిస్ధితులను తీవ్రం చేస్తారు. ఇలాంటి అస్ధిర పెట్టుబడుల ద్వారా షేర్ మార్కెట్లలో మదుపరులను ఆహ్వానించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

అర్హత పొందిన విదేశీ ఇన్వెస్టర్లను నేరుగా భారత ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇన్వెస్టర్ల తరగతులను మరింత విస్తృతీకరించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరిన్ని విదేశీ నిధులను ఆకర్షించడానికి, మార్కెట్లో అస్ధిరతను తగ్గించడానికీ ఈ నిర్ణయం దోహదపడుతుంది” అని ప్రభుత్వ ప్రకటన పేర్కొన్నట్లుగా రాయిటర్స్ తెలిపింది. అస్ధిరత తగ్గించడానికి ఎల్లప్పుడూ అస్ధిరంగా ఉండే పెట్టుబడులను ప్రభుత్వం ఆహ్వానిస్తోందిట. అస్ధిరతకి అస్ధిరత తోడైతే అది మరింత పెరుగుతుందిగాని తగ్గడం ఎలా సాధ్యమో అహ్లూవాలియా, మన్మోహన్ సార్లే వివరించాలి.

ఐతే భారత ప్రభుత్వం కోరుకున్నట్లుగా ఇండియా అనుమతి ఇవ్వగానే విదేశీ మదుపుదారులు ఇక్కడికి వచ్చెయ్యడానికి సిద్ధంగా లేరని విశ్లేషకులు భావిస్తున్నారు. విదేశీ సంస్ధలు ఓ పక్క ఇండియా ఈక్విటీల నుండి పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్న దశలో విదేశీ వ్యక్తులు వచ్చి పెట్టుబడులు పెడతారని భావించడం సరికాదని వీరు కుండబద్దలు కొడుతున్నారు. స్టాక్ మార్కెట్ పరిస్ధితులు మెరుగు పడితేనే వ్యక్తిగత మదుపులు వచ్చే అవకాశం ఉందని వీరు చెబుతున్నది వాస్తవం. అయితే స్టాక్ మార్కెట్ ఎలా మెరుగుపడుతుంది? స్టాక్ మార్కెట్ మెరుగుపడాలన్న ఆశతోనే నియంత్రణలను మరింత సరళీకృతం చేస్తుండగా, మెరుగుపడితే గానీ సరళీకృత విధానాలు ఫలితం ఇవ్వవని అసలు విషయాన్ని విశ్లేషకులు చెబుతున్నారు. ‘లేస్తే మనిషిని కాను’ అన్నట్లుందిది. సరళీకృత ఆర్ధిక విధానాల వల్ల ఆర్ధిక పరిస్ధితులు మెరుగుపడతాయన్న వాదనలోని డొల్లతనం ఇదేమరి!

వాస్తవం ఏమిటంటే, గత ఇరవై సంవత్సరాలుగా భారత ప్రభుత్వాలు ఆర్ధిక వ్యవస్ధను సరళీకృతం చేస్తూ వస్తున్నాయి. విదేశీ నిధులకి క్రమంగా గేట్లు తెరుస్తూ వచ్చాయి. సగటున ఏడాదికి ఎనిమిది శాతం పెరుగుతూ వచ్చిన జిడిపి ఇప్పుడు ఒక్కసారిగా క్షీణించింది. అదీ ముందస్తు సూచనలు లేకుందా క్షీణించింది. ఈ ఆర్ధిక సంవత్సరం ప్రారంభంలో ఆర్ధిక వ్యవస్ధ తొమ్మిది శాతం వృద్ధి చెందుతుందని ఆర్ధిక మంత్రి, ఆర్.బి.ఐ, ప్రధాని ఆర్ధిక సలహా బృందం అంచనా వేశారు. ఇప్పుడేమో అది సవరించుకుని ఏడున్నర లోపే అంటున్నారు. అలా అంటూనే వచ్చే మూడు నెలల్లో పరిస్ధితి మెరుగుపడితే తొమ్మిది శాతం కూదా సాధ్యమేనని ఆశ కూడా పడుతున్నారు. ఆర్ధిక పరిస్ధితులపైన వీరి పట్టు అలా ఉంది. ఆర్ధిక వ్యవస్ధను తీసుకెళ్ళి విదేశీ సంస్ధలకు, వ్యక్తులకు అప్పజెప్పాక దానిపై మనకి పట్టు ఎలా ఉంటుంది?

2008 సంవత్సరం తర్వాత మొదటిసారిగా బి.ఎస్.ఇ సెన్సెక్స్ సూచి ఈ సంవత్సరంలోనే పాతిక శాతం నష్టపోయింది. గత దశాబ్దకాలంలో ఇలా వార్షిక నష్టం చవిచూడడం ఇది రెండోసారి. అమెరికా ఆర్ధిక వృద్ధి మందగమనం, యూరప్ రుణ సంక్షోభం లు ప్రపంచాన్ని వణికిస్తున్న నేపధ్యంలో కొత్త సంవత్సరంలోనైనా మార్కెట్లు కోలుకుంటాయని ఎవరూ నమ్మడం లేదు. మన ఆర్ధిక పండితులే అద్భుతాలపైన ఆశలు పెట్టుకున్నారు. అస్ధిరతను ఆహ్వానించి అస్ధిరతను తగ్గించాలని చూస్తున్న మన వారు నమ్మవలసింది ఇక అద్భుతాలనే.

One thought on “ఇక భారత షేర్ మార్కెట్లతో విదేశీ వ్యక్తిగత ఇన్వెస్టర్లూ ఆడుకోవచ్చు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s