అన్నా హజారే పై విమర్శలు, అవినీతి వ్యతిరేక ఉద్యమ విశ్లేషణ -1


అన్నా హజారే భారత దేశంలో రాజకీయ నాయకులు, బ్యూరోక్రసీ అధికారుల అవినీతికి వ్యతిరేకంగా గత సంవత్సర కాలంలో పోరాడుతున్నాడు. నిజానికి అన్నా హజారే పోరాడుతున్నాడు అనడం సమంజసం కాదు. అన్నా హజారే గానీ, ఆయన లాంటివారు గానీ వ్యక్తిగా తలపడి అవినీతి లాంటి సామాజిక, రాజకీయ, ఆర్ధిక చెడుగు పై పోరాడడం సాధ్యమయ్యే పని కాదు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నా క్రెడిట్ అంతా ఆయన ప్రజలను కూడగట్టగలగడం లోనే ఉంది. అంటే అన్నా చరిత్ర, నిబద్ధత, భావజాలం, ఆచరణ ఇవన్నీ ప్రజలను కూడగట్టడంలో పాత్ర వహిస్తాయి. ఈ అంశాలు ప్రజలపైన ప్రభావం చూపి ప్రజలను ముందుకు కదిలిస్తాయి. ప్రజలను ఆయన వెంట నడిపిస్తాయి.

అన్నా వ్యక్తిగత నేపధ్యం

అన్నా హజారేకి ఒక చరిత్ర ఉంది. మామాలు చరిత్ర అందరికీ ఉంటుంది. కాని ఆయనకి ఉన్నది ఉద్యమ చరిత్ర. ఆ ఉద్యమ చరిత్ర ప్రజలను ఆకర్షించిన గుణాలలో ప్రముఖమైనది. రాజకీయ నాయకులు, అధికారుల అవినీతితో ఆయన అనేకసార్లు ఢీ కొట్టాడు. ఆయన జరిపిన పోరాటాలలో ఎంతవరకు సఫలం అయిందీ లోకానికి పెద్దగా తెలియదు గానీ పోరాడాడన్న కీర్తి ఆయనకి మిగిలింది. ముఖ్యంగా మహా రాష్ట్రలో ఆయన అవినీతికి వ్యతిరేకంగా పోరాడి అనేక సార్లు పత్రికల పతాక శీర్షికలను ఆక్రమించాడు.

అన్నా హాజారే కీర్తి కిరీటంలో ఉన్న మరో కలికితురాయి ఆర్మీ నేపధ్యం. ఆర్మీ అనగానే దేశానికి రక్షణ అందించే సంస్ధగా ప్రజల్లో ఒక గౌరవ భావన ఉంటుంది. సరిహద్దుల్లో ఎడారుల్లో, చలిలో ఎండుతూ, తడుస్తూ దేశానికి కాపలా కాస్తుంటారనే భావన మధ్య తరగతి ప్రజల్లో అధికం. బ్లాగుల్లో కూడా ఈ భావాలు వ్యక్తం అవుతుంటాయి. ఇందువల్ల కూడా అన్నా హాజారే పట్ల గౌరవం మధ్యతరగతి ప్రజల్లో నెలకొని ఉంది. అయితే సైనికులతో సామాన్యుల అనుభవాలు వేరు. నిత్యం ప్రయాణికులు వెళ్లే రైళ్ళలో సైనిక కంపార్ట్‌మెంట్లలో ప్రజలకు సైనికులతో చాలా చేదు అనుభవాలు ఉంటాయి. వీరికి కేటాయించేవి జనరల్ కంపార్ట్ మెంట్లే కనుక, జనరల్ కంపార్ట్‌మెంట్లే అనుకుని సామాన్య జనం ఆ కంపార్ట్‌మెంట్లు ఎక్కేస్తుంటారు. కాని సైనికులు ప్రజలను తమ కంపార్ట్‌మెంట్లలోకి సామాన్య పౌరులను అనుమతించరు. చాలా మూర్ఖంగా బైటికి నెట్టేస్తారు. మామూలు ప్రయాణీకులు తెలుగులో జోక్ లు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటే అవి తమనే అని భావిస్తూ కొట్టిన ఉదాహరణలు, కొట్టొచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. రైళ్లలో సైనికులకి, రైల్వే పోలీసులకి ఘర్షణ జరిగి పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రచారం పొందిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇది రాయడం ఎందుకంటె సైనికులపై ఉన్న అభిప్రాయాలలో ఆదర్శవంతమైన ఆలోచనలతో గౌరవభావం కలిగి ఉన్నవారి అభిప్రాయాలతో వాస్తవ అనుభవాలు కలిగి ఉన్నవారి అభిప్రాయాలకు పొంతన కుదరదని చెప్పడానికే. అయితే అన్నాకీ ఈ సైనికులతో సామాన్యుల అనుభవానికీ ఈ సందర్భంగా సంబంధం లేదని ఇక్కడ పాఠకులు గమనించాలి.

(ఈ భ్లాగర్ కి కూడా చేదు అనుభవం వారితో ఉంది. ఓ సారి వైజాగ్ వెళ్తుండగా కదిలే కంపార్ట్ మెంటు నుండి తోసివేసే ప్రయత్నం చేయడంతో మెట్లపైన నిలబడవలసి వచ్చింది. నేను మెట్లపైన నిలబడి ఉండగానే వారు తలుపు వేసేసి గడి పెట్టేశారు. నేను మళ్ళీ లోపలికి రాకుండా వారాపని చేశారు. నాతోటి వచ్చిన మరొక వ్యక్తి వీళ్ల దృష్టిలో పడకపోవడంతో లోపలే ఉండిపోయాడు. అతను చాలాసేపు వాళ్ళని బ్రతిమిలాడాడు. నేను కూడా బైటి నుండి పెద్ద పెద్దగా అరుస్తూ వచ్చీ రాని హిందీలో తరువాతి స్టేషన్ లో దిగుతానని చెబితే, చాలసేపటికి లోనికి రానిచ్చారు. ఇరవై ఐదు నిమిషాలసేపు స్పీడ్ గా వెళ్తున్న ట్రైన్ మెట్లపైనే ఉండవలసి రావడం నేను అప్పట్లో అనుభవించిన ఒక భయానక అనుభవం. వారాపని చాలా తేలికగా చేశారు).

అన్నా హాజారే ఒక ఆదర్శ గ్రామాన్ని నిర్మించాడన్న విషయం కూడా అన్నా పై గౌరవానికి ఒక కారణం. రాలేగావ్ సిద్ధి అనే తన గ్రామంలో ఆయన ఆదర్శవంతమైన సూత్రాలను అమలు జరుపుతున్నాడని జనరల్ గా ఉన్న వినికిడి. అది నిర్ధిష్టంగా ఆయన నిజంగా గ్రామంలో ఏమేమి ఆదర్శ సూత్రాలు ఏ పద్ధతుల్లో అమలు జరిపిందీ పెద్దగా తెలియని విషయం. అది ఆ రాష్ట్రంలో ప్రచారంలో ఉండవచ్చు గాని ఇతర రాష్ట్రాలలో ఆయన గ్రామం ఆదర్శం అని మాత్రమే ప్రచారం లో ఉంటుంది. ఇవన్నీ కాక గాంధీ సిద్ధాంతాల అనుయాయి అన్న పేరు ఉండనే ఉంది. జాతిపిత గాంధీజీ సిద్ధాంతాలను రాజకీయ నాయకులంతా విసర్జించిన, మర్చిపోయిన పరిస్ధితుల్లో, ఆయన సిద్ధాంతాలను అనుసరిస్తున్నాడని భావిస్తున్న ఒకే ఒక్క వ్యక్తికి ఉండే గౌరవం వేరే. పెద్దగా పేరు లేకుండా గాంధీ సూత్రాలను అనుసరిస్తున్నవారు ఇంకా ఉన్నా వారికి పేరు లేదు, సందర్భమూ కాదు గనక వదిలేద్దాం.

ఈ చరిత్ర లేకుండా ప్రస్తుతం అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నా హజారేకి స్ధానం లభించేది కాదు. ఆయన లేకుంటే ఉద్యమమే ఉండేది కాదు అని కొందరు వెంటనే అనే అవకాశం ఉంది. అది కరెక్టు కాదు. వ్యక్తులపైన ఉద్యమాలు ఆధారపడి ఉండవు. సమాజంలో లేదా దేశంలో నెలకొని ఉన్న పరిస్ధితులపైనే ఉద్యమాలు ఆధారపడి ఉంటాయి.

అవినీతి వ్యతిరేక ఉద్యమం, అన్నా నాయకత్వం

అవినీతి వ్యతిరేక ఉద్యమం తీసుకున్నట్లయితే రాజకీయ నాయకులు, అధికారులు, రౌడీలు తదితర వర్గాలన్నీ పాల్పడుతున్న అవినీతి పచ్చిగా కళ్ళెదుట కనిపిస్తున్న పరిస్ధితి దేశంలో నెలకొని ఉంది. ముఖ్యంగా యు.పి.ఎ రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చాక వరుసగా వెలువడ్డ కుంభకోణాలు ప్రజల్లో రాజకీయ నాయకుల అవినీతి పట్ల తీవ్రమైన ఆగ్రహాన్నీ, వ్యతిరేకతనూ రగిల్చాయి. వాటిలో 2జి స్పెక్ట్రం కుంభకోణం అవినీతి కుంభకోణాల్లో రారాజుగా ప్రసిద్ధి కెక్కింది. మాజీ టెలికం మంత్రి ఎ.రాజా దర్జాగా పాల్పడిన ఈ ‘రారాజు’ కుంభకోణం దేశ ప్రజలను నివ్వెరపరిచింది. మెజారిటీ ప్రజానీకం అయిన కార్మికులు, రైతులు, కూలీలు వీటికి దూరంగా ఉన్నా, చిన్న పట్టణాలనుండి మెట్రోపాలిటన్ నగరాల వరకూ విస్తరించి ఉన్న మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి, ధనిక వర్గాలు, చిన్న పెట్టుబడిదారులు, వ్యాపారులు వీరంతా ఈ అవినీతి కుంభకోణాల పట్ల తీవ్ర వ్యతిరేకత పెంచుకున్నారు. తమకు అవకాశం వస్తే అవినీతి రాజాలను ఒక చూపు చూడాలి అన్న ఆవేశం ఈ కుంభకోణాలు వీరిలో రగిల్చాయి. ఈ నేపధ్యం లేకుండా, దేశంలో ఈ పరిస్ధితి లేకుండా అన్నా వెంట, ఆయన నేపధ్యం, పేరు, ప్రతిష్టలు ఏమైనప్పటికీ, జనంలో స్పందన వచ్చి ఉండేది కాదు.

ఉద్యమాలకు సారవంతమైన భూమి(క) సమాజంలో లేనట్లయితే ఎంతమంది మహామహులు గోచి బిగించినా పూచిక పుల్లను కూడా కదిలించలేరు. స్వాతంత్ర పొరాటానికి గాంధీ వెంట ప్రజలు కోట్లమంది కదిలారు గానీ, అవినీతి వ్యతిరేక ఉద్యమం ‘మరో స్వాతంత్ర్య పోరాటం’ అని అన్నా హజారే ఎన్ని సార్లు నినదించినా దాన్ని పట్టించుకున్నవారు, ఆలకించినవారు లేదని గమనించాల్సిన విషయం. అన్నా అవినీతి వ్యతిరేక ఉద్యమానికి స్పందన వచ్చింది తప్ప ఆయన చెప్పిన ‘మరో స్వాతంత్ర్య పోరాటానికి’ స్పందన రాలేదని గమనించాలి. దానికి కారణం అవినీతి వ్యతిరేక ఉద్యమానికి సమీప భూమిక ప్రస్తుతం దేశంలో ఉంది తప్ప ‘మరొ స్వాతంత్ర పోరాటం’ అని ఆయన చెప్పినదానికి తగిన భూమిక ‘ప్రజల్లో’ లేకపోవడమే. అవినీతి వ్యతిరేక ఉద్యమానికి ఉపయోగపడిన అన్నా హజారే ఉద్యమ చరిత్ర, పేరు ప్రతిష్టలు, ‘మరో స్వాతంత్ర్య పోరాటా’నికి ఎందుకు ఉపయోగపడలేదు? అదే పేరు, అవే ప్రతిష్ట ఒక పిలుపుకి ఉపయోగపడి, మరొక పిలుపుకి పనికిరాకుండా పోవడం వెనక ఏ విషయాన్ని గమనించాలి? పిలుపుకి స్పందన, ఉద్యమానికి వ్యాప్తి అన్నవి వాటికి గల సామాజిక భూమికపైనే ఆధారపడి ఉన్నాయనీ, ఉద్యమ నాయకుల వ్యక్తిగత
పేరు ప్రతిష్టలలో లేదన్న విషయాన్ని గ్రహించాలి. ఉద్యమాలకు సామాజిక  భూమిక తప్పనిసరి అవసరం. ఈ వాస్తవానికి వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో, అంగీకార అనంగీకారాలతో సంబధం లేదు.

మరొక విషయం కూడా ఇక్కడ గమనించాలి. పిలుపు, నినదాలకి అంత ప్రాముఖ్యం ఇవ్వవచ్చా అని అనుమానం రావచ్చు. ఖచ్చితంగా ఇవ్వాలని మిత్రులు, పాఠకులు గమనించాలి. ఒక ఉద్యమం ఇచ్చే ప్రధాన పిలుపుపైన ప్రజా స్పందన ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. ఆ ప్రధాన పిలుపు అప్పటి సామాజిక, (రాజకీయ, ఆర్ధిక) పరిస్ధితులకు అనుగుణంగా, సమీపంగా ఉన్నట్లయితేనే అది ప్రజాదరణ పొంది దాని చుట్టూ ప్రజలు సమీకృతులవుతారు. 2008 లో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం రానట్లయితే, అందులో వాల్ స్ట్రీట్ లోని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు, ఇన్సూరెన్సు సంస్ధల అవినీతి, పేరాశ, దోపిడీ బైటపడకపోతే, ‘ఆకుపై వాల్ స్ట్రీట్!’, ‘వుయ్ ఆర్ 99%!’ నినాదాలకు ఇనాడు ప్రపంచవ్యాపితంగా వస్తున్న మద్దతు వచ్చి ఉండేది కాదని ఈ సందర్భంగా ప్రస్తావించుకోవచ్చు. అన్నా అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ‘అవినీతికి వ్యతిరేకంగా పటిష్టమైన లోక్ పాల్ కై ఉద్యమిద్దాం!’ అన్న నినాదానికి సమీపంగా నేటి సామాజిక పరిస్ధితి ఉంది. అందుకే ఆ నినాదానికి స్పందన వచ్చింది. స్వాతంత్ర పోరాటం అనగానే అది ఎవరీపైన అన్న ప్రశ్న వెంటనే ఉదయిస్తుంది. దానికి సమాధానం లేకపోవడంతో ప్రజల్లో స్పందన కరువైంది.

ఇటీవలి కుంభకోణాలు

ప్రపుల్ పటేల్ – యు.టి.ఐ కుంభకోణం,  మహారాష్ట్రలో ఆదర్శ సొసైటీ అపార్టుమెంటుల కుంభకోణం, కామన్ వెల్త్ కుంభకోణం, మాయావతి తాజ్ కారిడార్ మరియు విగ్రహాల కుంభకోణాలు, ఓటుకి నోటు కుంభకోణం, పార్లమెంటు ప్రశ్నలకు డబ్బుల కుంభకోణం, యు.పిలో అనేక మంది సిటింగ్, రిటైర్డ్ జడ్జిలు పాల్పడిన పి.ఎఫ్ కుంభకోణం, సత్యం కంప్యూటర్స్ ఆడిటింగ్ కుంభకోణం లాంటి కార్పొరేట్ కంభకోణాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీల ‘నాఫెడ్’ కుంభకోణం, దేవుడి డాక్టర్ అశోక్ జడేజా పాల్పడిన ‘ఆధ్యాత్మిక’ కుంభకోణం, ఛత్తీస్ ఘడ్ ‘దొంగ ధాన్యం’ కుంభకోణం, కర్ణాటకకు చెందిన ఇనుము తుక్కు (ఉక్కు కాదు) కుంభకోణం,ఆస్త్రా కోక్ బోగస్ ట్రాన్సాక్షన్ల (కార్పొరేట్) కుంభకోణం, తమిళనాడు గోల్డ్ క్వెస్ట్ (కార్పొరేట్) కుంభకోణం, ఎల్.ఐ.సి (రైల్వేస్) కుంభకోణం, గుజరాత్ కాండ్లా పోర్ట్ ట్రస్టు భూ కుంభకోణం, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా క్యాపిటేషన్ ఫీజు (సీట్ ఫర్ సేల్) కుంభకోణం, లలిత్ మోడి ఐ.పి.ఎల్ కుంభకోణం (ఇందులో శరద్ పవార్ పేరు బైటికి రాకుండా చేశారన్నది ఒక అభియోగం), కేరళ పామాయిల్ కుంభకోణం, జార్ఖండ్ మధు కోడా అక్రమాస్తుల కుంభకోణం, జగన్ అక్రమాస్తుల కుంభకోణం, ఎమార్ విల్లాల కుంభకోణం…….. ఇవన్నీ భారత దేశ వ్యాపితంగా జరిగిన కుంభకోణాలు, వీటిలో కొన్ని దేశ వ్యాపితంగా ప్రాచుర్యం పొందగా, చాలా వరకు ఆయా రాష్ట్రాల ప్రజల వరకే ప్రచారం పొందాయి.

(ఇంకా ఉంది)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s