రాజ్యసభలో లోక్ పాల్ బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. యు.పి.ఎ భాగస్వామి త్రిణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ప్రతిపాదించిన సవరణలకు ప్రతిపక్ష పార్టీలలో కూడా మద్దతు దొరకడంతో ప్రస్తుత సమావేశాలలో లోక్ పాల్ బిల్లు ఆమోదం కష్టంగా కనిపిస్తోంది. బిల్లుకు తలపెట్టిన సవరణలతో సహా, లోక్ పాల్ బిల్లు, మరొకసారి స్ధాయీ సంఘం పరిశీలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని ఎన్.డి.టి.వి విశ్లేషించింది. చూడగా, ఎన్.డి.టి.వి విశ్లేషణ అంతిమంగా నిజమయ్యేలా పరిస్ధితి కనిపిస్తోంది.
రాష్ట్రాలు ఆటోమేటిక్ గా లోకాయుక్త లను ఏర్పాటు చేయాలన్న విషయంలో మమత బెనర్జీ తీవ్రంగా విభేదిస్తోంది. లోక్ సభలో ఆమోదం పొందిన లోక్ పాల్ బిల్లు ప్రకారం రాష్ట్రాలు తప్పని సరిగా లోక్ పాల్ తరహాలోనే లోకాయుక్త లను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. రాజ్యాంగం నిర్దేశించిన ఫెడరల్ వ్యవస్ధ సూత్రాలకు ఈ అంశం వ్యతిరేకమనీ, రాష్ట్రాల హక్కులను హరించివేసేదిగా ఉందనీ మమత గట్టిగా వాదిస్తోంది. ఈ విషయమై ప్రణబ్ ముఖర్జీ గురువారం ఉదయం నుండీ మమత తో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ ఆమే రాజీపడడానికి ససేమరా అంటోంది. దానితో రాజ్యసభలో బిల్లు ఉన్నది ఉన్నట్లుగా ఆమోదం పొందడం దాదాపు అసాధ్యంగా మారింది.
మమత ప్రధానంగా రెండు సవరణలను లోక్ పాల్ బిల్లుకి ప్రతిపాదిస్తోంది. అవి రెండూ లోకాయుక్త ఏర్పాటుకి సంబంధించినవే. వీటిపైన ఓటింగ్ కి పట్టుబట్టాలని ఆమె తన సభ్యులకు ఆదేశాలిచ్చింది. ఓటింగ్ కి వస్తే గనక ఆమె సవరణలు ఆమోదం పొందడం ఖాయంగా మారింది. మమత సవరణలు ఆమోదం పొందినట్లయితే లోక్ పాల్ బిల్లుకి రెండు ముసాయిదాలు తయారవుతాయి. ఆ రెండింటినీ మళ్ళీ లోక్ సభలో చర్చకు పెట్టవలసి ఉంటుంది. లోక్ సభలో ఆమోదం పొందిన ముసాయిదాను మళ్ళీ రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందవలసి ఉంటుంది. లోక్ సభ ఇప్పటికే గురువారం సమావేశంతో నిరవధికంగా వాయిదా పడింది. అంటే లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందాలంటే మళ్లీ బడ్జెట్ సమావేశాల వరకూ ఆగవలసిందే. ఈ సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందకపోవడానికి ఇదొక కారణం కాగా, మమత సవరణల ప్రాతిపదికపైనే కాంగ్రెస్ పార్టీ కూడా లోక్ పాల్ బిల్లు ఈ సమావేశాల్లో ఆమోదం పొందకపోతేనే మేలు అన్నట్లుగా భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
మమత ప్రతిపాదిస్తున్న రెండు సవరణలు రాష్ట్రాల హక్కుని కాపాడడానికి ఉద్దేశించినవని త్రిణమూల్ చెబుతున్నది. మొదటి సవరణ బిల్లు పేరును మార్చాలని కోరుతున్నది. “లోక్ పాల్ మరియు లోకాయుక్త” అన్న పేరును మార్చి కేవలం లోక్ పాల్ వరకే పేరు పరిమితం కావాలని ఆ సవరణ కోరుతోంది. రెండవ సవరణ, లోక్ పాల్ బిల్లులో ‘లోకాయుక్త’ కు సంబంధించిన ప్రస్తావనను మొత్తంగా తొలగించాలని కోరుతోంది. ఈ సవరణలకు బి.జె.పి అంగీకరిస్తోంది. ఫెడరలిజం, రిజర్వేషన్ లకు సంబంధించిన రాజ్యాంగ సూత్రాలకు భంగం కలిగించే బిల్లుకు తాను మద్దతు ఇవ్వబోనని బి.జె.పి ప్రకటించింది. ఎ.ఐ.డి.ఎం.కె, జనతాదళ్ (యు) పార్టీలనుండి కూడా మమత కు మద్దతు అందుతోంది. ఓటింగ్ కి మమత పట్టుబట్టినట్లయితే లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ ల పార్టీలు కూడా వాకౌట్ చేయడానికి బదులు సవరణలకు అనుకూల ఓటు వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా ఛానెళ్లు తెలుపుతున్నాయి. వాకౌట్ చేసినట్లయితే హాజరు తగ్గి మెజారిటీ పొందడానికి కావలసిన సభ్యుల సంఖ్య కూడా తగ్గి బిల్లు ఆమోదం సులభం అవుతుంది. కాని మమత దీనికి అడ్డుగా మారింది.
ఇదిలా ఉండగా లోక్ పాల్ బిల్లు అంతిమంగా ఆమోదం పొందకపోతే అది మళ్లీ కాంగ్రెస్ కే లాభకరంగా మారుతుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లుగా విశ్లేషకులు ఎత్తి చూపుతున్నారు. మమత బెనర్జీ సైతం అందుకే ఓటింగ్ కి పట్టుబట్టి లోక్ పాల్ బిల్లు ఈ సమావేశాల్లో ఆమోదం పొందకుండా చేసి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో లబ్ది చేకూర్చడానికి సహకరిస్తున్నదా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. ఎన్నికల దృష్టితో చూస్తున్న కాంగ్రెస్, మమత కోరుతున్నట్లుగానే బిల్లుని ఓటింగ్ కి పెట్టడానికే సిద్ధమైందని తెలుస్తోంది. లోక్ పాల్ బిల్లు వాయిదా పడినట్లయితే, కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీలపై నెపం నెడుతూ ప్రచారం చేసుకోవడానికి అవకాశం వస్తుంది. తాము కఠినమైన లోక్ పాల్ చట్టం తేవాలని తలపెట్టినప్పటికీ బి.జె.పి కుంటిసాకులు చూపి లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకుందని కాంగ్రెస్ ప్రచారం చేసుకోగల అవకాశం లభిస్తుంది.
ఓవైపు కొత్త లోక్ పాల్ కావాలంటూనే ప్రభావవంతమైన లోక్ పాల్ చట్టం రాకుండా బి.జె.పి లాంటి పార్టీలు అడ్డుకున్నాయని చెప్పడానికి కాంగ్రెస్ కి అవకాశం వస్తుంది. లోక్ పాల్ చట్టం విషయంలో ప్రతిపక్ష పార్టీల హిపోక్రసీ ని ఎండగట్టే అవకాశం ఆ పార్టీకి లభిస్తుంది. పోనీ ఓటింగ్ కి పెట్టడానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిర్ణయిస్తే, అపుడు బిల్లుని అది పార్లమెంటు సెలక్ట్ కమిటీకి పంపించడానికి నిర్ణయించవచ్చు. బిల్లుని సవరించి, సమీక్షించి, మరింత మెరుగుపరచడానికి ఉద్దేశిస్తూ సెలక్ట్ కమిటీకి నివేదించవచ్చు. బిల్లుకి ఇప్పటికే అందిన సవరనలను కమిటీ సభ్యులు ప్రవేశపెట్టవచ్చు. క్లాజుల వారీగా బిల్లుని సమగ్రంగా చర్చించి సవరణలు చేయడంతో పాటు మళ్ళీ ప్రజలను సంప్రదించే పేరుతో వివిధ సామాజిక సంస్ధలనూ, ప్రవేటు నిపుణులనూ సలహాలు కోరవచ్చు. అవన్నీ అయ్యాక సెలక్ట్ కమిటీ పార్లమెంటుకి తన నివేదికని సమర్పిస్తుంది. అప్పుడు మళ్ళీ లోక్ సభ, రాజ్య సభలు బిల్లుని చర్చించి ఆమోదిస్తాయి.
అయితే రాజ్యాంగ హోదా లేకుండా లోక్ పాల్ చట్టాన్ని మరో ప్రభుత్వం ఒక్క కలం పోటుతో రద్దు చేయడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయని సొలి సొరాబ్జీ లాంటివారు వ్యాఖ్యానించడం లోక్ పాల్ కధకి కొసమెరుపు.
‘బలవంతుడి ప్రయోజనం న్యాయం’ అనే పాత వాదన ఒక టుంది. ప్లేటో ‘ఆదర్శరాజ్యం’ గ్రంధంలో (నేను బాల్యంలో ఈ పేరుతో ఉన్న తెలుగు అనువాదాన్నే చదివాను. అనువాదకుల పేరు కృష్ణారావు అని గుర్తు.). అయితే, యీ వాదాన్ని తన తర్కంతో సోక్రటీస్ తిప్పికొడతాడు. ఇదంతా అతి పెద్ద చర్చ అన్నమాటి. ఆదర్శవంతమైన సిధ్ధాంతాలు, వాటి ఆదర్శవంతమైన ఆచరణా కూడా ఒక ఆదర్శవంతమైన రాజ్యంలోనే సంభవం కాబట్టి, సోక్రటీస్ చేసిన వాదం కూడా ఆదర్శవంతమైన ఇటువంటి వాతావరణం లేని చోట చెల్లదని అనూచానంగా ఋజువౌతూ వస్తోంది.
చెప్పవచ్చే దేమిటంటే, చట్టాలెప్పుడూ, చట్టాలు చేసే వారి ప్రయోజనాన్ని ఉద్దేశించి పనిచేసేటట్లు తయారు చేస్తారే కాని, ప్రజలు భ్రమపడుతున్నట్లుగా, ప్రజా ప్రయోజనాన్ని ఆశించి కాదు. అయితే అలా కనిపించేట్లు చేయటం పాలకుల లౌక్యం. నమ్మటం ప్రజల అచంచల అమాయకత్వం.
ఎవరూ రద్దుచేయడానికి వీలులేనంత బలంగా ప్రజలకోసం యే ప్రభుత్వమూ చట్టాలు చేయదు.
చట్టాల ప్రయోజనం అంతిమంగా ప్రభుత్వాలకి సహాయపడటం – ప్రజలకు సహాయపడటం అనుకోవటం మన అమాయకత్వం లేదా విధి.
“చెప్పవచ్చే దేమిటంటే, చట్టాలెప్పుడూ, చట్టాలు చేసే వారి ప్రయోజనాన్ని ఉద్దేశించి పనిచేసేటట్లు తయారు చేస్తారే కాని, ప్రజలు భ్రమపడుతున్నట్లుగా, ప్రజా ప్రయోజనాన్ని ఆశించి కాదు. అయితే అలా కనిపించేట్లు చేయటం పాలకుల లౌక్యం. నమ్మటం ప్రజల అచంచల అమాయకత్వం.”
శ్యామలరావు గారూ, చాలా బాగా చెప్పారు. అందుకే అన్నా గారి ఆందోళన, సందర్భం, ప్రారంభం, ముగింపు ఇత్యాదులను జాగ్రత్తగా సింహావలోకనం చెయ్యవలసి ఉంది అని అన్నాను.