ఉత్తర కొరియా కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా ఇరవై యేడేళ్ల కిమ్ జోంగ్-యూన్ ని నియమిస్తూ ఆ పార్టీ నిర్ణయం కొన్ని రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత మిలట్రీ అత్యున్నత సంస్ధ ఛైర్మన్ గానూ, ప్రభుత్వాధిపతి గానూ ఆయన నియమితుడు కావడం లాంఛనమే నని కొన్ని పత్రికలు చెబుతున్నా, అది అంత త్వరగా జరగకపోవచ్చు. కొత్త నాయకుడు ఇంకా పిల్లవాడేననీ, ఉత్తర కొరియా నిర్మించుకున్న అణ్వాయుధాలు ఆయన చేతిలోనే ఉన్నాయనీ, ఆయన సరదాగా పిల్లచేష్టలతో అణ్వాయుధాల మీట నొక్కేస్తాడేమోననీ ప్రపంచ దేశాల నాయకులు భయపడుతున్నట్లు ఈ కార్టూనిస్టు చెబుతున్నాడు.
ప్రపంచాన్ని అనేకసార్లు భస్మీపటలం చేయగల అణ్వాయుధాలు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్సు లాంటి యుద్ధోన్మాద దేశాల వద్ద ఉండగా వారి ద్వారా లేని భయం ప్రపంచానికి ఉ.కొరియా నుండి వస్తుందన్నది పత్రికల పక్షపాత బుద్ధిని సూచిస్తోంది. ఓ వైపు స్టార్ట్ ఒప్పందం కుదుర్చుకుంటూనే మరొకవైపు మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అభివృద్ధికి బిలియన్ల డాలర్లు ఖర్చు పెడుతున్న అమెరికా, రష్యా, యూరప్ లు ముందు తమ వద్ద ఉన్న అణ్వస్త్రాలను నాశనం చేసి ఆ తర్వాత ఉ.కొరియా, ఇరాన్, భారత్, పాక్ ల గురించి మాట్లాడడం ఉత్తమం.
–