అన్నా హజారే దృష్టిలో ‘గొడ్రాలు’ చులకన!


రాజకీయ నాయకులు, బ్యూరోక్రట్ అధికారుల అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నా హజారే, పిల్లలు కలగని స్త్రీలపైన తన అవగాహనా రాహిత్యాన్నీ, చిన్నచూపును చాటుకున్నాడు. తన జీవితంలో అత్యధిక భాగం గ్రామంలో నివసించే అన్నా, గ్రామీణ భారతంలో ఉన్న వెనకబాటు భావనలకు తాను అతీతుడిని కానని మంగళవారం దీక్షలో ప్రసంగిస్తున్న సందర్భంగా వెల్లడించుకున్నాడు.

ప్రసంగం సందర్భంగా అన్నా హజారే “బంఝ్ క్యా జానె ప్రసూతి వేదనా (గొడ్రాలికేం తెలుసు ప్రసవ వేదన)?” అని వ్యాఖ్యానించినట్లుగా హిందూస్ధాన్ టైమ్స్ వెల్లడించింది. భారత దేశంలో పిల్లలు కలగని స్త్రీలను చిన్న చూపు చూడడం కద్దు. పిల్లలు పుట్టకపోవడానికి పూర్తిగా స్త్రీలపైనే బాధ్యత మోపుతుంది భారత సమాజం. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాలలో సైతం ఇటువంటి చిన్నచూపు చూస్తున్నారని వారిపై జరుగుతున్న దాడుల ద్వారా అర్ధం అవుతుంది. ఆడ పిల్ల పుట్టిందనో, మగ పిల్లవాడిని కనలేదనో ఆరోపిస్తూ భర్తలకు రెండోసారి పెళ్ళి చేయడానికి సిద్ధపడడం, కోపంతో పుట్టింట్లో వదిలి పెట్టడం తదితర ఘటనలు పట్నాలలో సైతం జరుగుతున్న సంగతి పత్రికల్లోనూ, వార్తల్లోనూ వస్తూనే ఉంటాయి.

గతంలో అనేక సార్లు మహా రాష్ట్రలోని అవినీతి రాజకీయ నాయకులు, అధికారులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన చరిత్ర అన్నా హజారే కి ఉంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నవారికి సహజంగానే సామాజిక, రాజకీయ, ఆర్ధిక అంశాలపైన అవగాహన ఉంటుంది. ఆర్ధిక అంశాలను పక్కనబెట్టినా సామాజిక, రాజకీయ అంశాలలో ఏది తప్పు ఏది ఒప్పు అన్న విషయమై ఒక సమగ్ర అవగాహన ఉంటుంది. ఆ అవగాహన కూడా పురోగామి స్వభావంతో ఉంటుందని సహజంగానే ఆశిస్తాము. సమాజంలో సగభాగంగా ఉండే స్త్రీలపైన జరుగుతున్న అన్యాయాలకు సంబంధించిన అవగాహన అన్నా హజారేకి ఉండదు అనుకోలేము.

పిల్లలు పుట్టని స్త్రీలకు కొన్ని ఫంక్షన్లలో, ముఖ్యంగా బారసాల లాంటి ఫంక్షన్లలో గానీ, పేరు పెట్టే సందర్భాలలోగానీ ప్రవేశం ఉండదు. పిల్లలు కలగని స్త్రీలను పిల్లల అదృష్టాలకు హానికరంగా చూసే ఆచారం చాలా చోట్ల నెలకొని ఉంది. ఇటువంటి స్త్రీలను చిన్నచూపు చూడడం, విడాకుల ఇవ్వడం, నిత్యం సూటి పోటి మాటలతో వేధించడం లాంటివి సర్వ సాధారణంగా జరుగుతుంటాయి. ఇటువంటి సామాజిక దురన్యాయాల పట్ల ప్రజా జీవితంలో ఉన్నవారికి తప్పని సరిగా ఒక అవగాహన ఉండాల్సి ఉంటుంది. అయితే అన్నా హాజారే అటువంటి విజ్ఞత చూపించకపోవడం విచారించవలసిన విషయం.

పిల్లలు కలగడానికీ, కలగకపోవడానికీ స్త్రీలతో పాటు పురుషులు కూడా బాధ్యత వహించవలసి ఉంటుందన్నది అన్నా లాంటి ప్రజా జీవితంలో ఉన్నవారికి అవగాహన లేకుండా ఉండదు. పురుషులు కారణం అయిన చోట కూడా స్త్రీలనే బాధ్యులను చేస్తూ వారిని నిందించే అలవాటు భారత సమాజానికి ఉందని కూడా అన్నా హజారేకి తెలియదని భావించలేము. అయినప్పటికీ స్త్రీలను కించపరిచే విధంగా ఉన్న సామెతను అన్నా హజారే నిరభ్యంతరంగా వాడడం ఖండించవలసిన విషయం. ఈ అంశం గమనించి ఆయనకి ఎవరైనా తెలియజేశారో లేదో తెలియదు గానీ, అన్నా హజారే తన భావజాలాన్ని సంస్కరించుకోవలసిన అవసరం ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇదొక్క విషయమే కాదు. ప్రజాస్వామ్యం గురించీ, ప్రజల ప్రాధమిక హక్కుల గురించీ మాట్లాడే అన్నా మద్యం అలవాటు ఉన్నవారిని బహిరంగంగా కొరడాలతో కొట్టాలని కూడా వ్యాఖ్యానించాడు. కాంగ్రెస్ పార్టీ దీనిని అవకాశంగా తీసుకుని అన్నా, తాలిబాన్ తరహా శిక్షలను ప్రతిపాదిస్తున్నాడని ఆరోపించింది కూడా. తమ స్వగ్రామం రాలెగావ్ సిద్ధి లో తాగుడు మానిపించడానికి ఈ పద్ధతే అనుసరించామని కూడా ఆయన చెప్పడం పలువురిని నివ్వెరపరిచింది. అనేకసార్లు హెచ్చరించినప్పటికీ తాగుడు మానకపోతే గుడి ముందు స్తంభానికి కట్టి కొట్టేవారమనీ, తద్వారా భయపెట్టి తాగుడు మానిపించామనీ ఆయన ఒక సందర్భంలో వివరించాడు.

ఇది నిజంగా జరిగిందని ఇండియా టుడే పత్రిక తెలిపింది. తాను ఆర్మీలో ఉండగా వాడిన బెల్టును కొట్టడానికి వినియోగించినట్లు ఆ పత్రిక వెల్లడించింది. తాగి గ్రామంలోకి వచ్చిన ముగ్గురు వ్యక్తులను అలాగే స్తంభానికి కట్టి బెల్టుతో కొట్టించాడని ఆ పత్రిక తెలిపింది. బెల్టుతో కొట్టడానికి ఒక ప్రత్యేక బృందాన్ని కూడా అన్నా నియమించాడట. ఈ లెక్కన కేరళలో సగం మందిని, ఎ.పి లో నాలుగింట మూడొంతుల మందినీ, పంజాబ్ లో ఐదింట నాలుగువంతుల మందినీ కొరడాలతో కొట్టవలసి ఉంటుందని కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారి ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ తెలిపాడు.

అవినీతిపరులకు మరణ శిక్ష విధించాలని అన్నా కోరడం కూడా ఈ కోవలోనిదిగానే చూడవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో నేరస్ధులను శిక్షించేందుకు కొన్ని చట్టాలు ఉంటాయి. చట్టాలను అమలు చేయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులకు భిన్నంగా ఎవరినీ శిక్షించడం కూడదన్నది ప్రజాస్వామిక సూత్రం. కాని ఈ సూత్రాలను విస్మరిస్తూ అన్నా హజారే చాలా సార్లు చాలా తేలికగా అవినీతి పరులను ఉరితీయలనో, వారికి మరణ శిక్షే సరైనదనో వ్యాఖ్యానించడం సరైంది కాదు. ఫ్యూడల వ్యవస్ధ అవశేషాలు అన్నా హజారే వదులుకుని ఆధునిక ప్రజాస్వామిక భావాలను అన్నా హజారే ప్రజలకు నేర్పవలసి ఉంది. అనేకమంది ప్రజలు “ఐ అయామ్ అన్నా” అనో, “మై అన్నా హూ” అనో టోపిలు, చొక్కాలు ధరిస్తున్న ఈ సమయంలో ఆయన ప్రభోధనలు మరింత ప్రజాస్వామికంగా ఉండాలని కోరడంలో తప్పు లేదు.

23 thoughts on “అన్నా హజారే దృష్టిలో ‘గొడ్రాలు’ చులకన!

 1. ఒక రకంగా నాకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు గుర్తుకు వస్తున్నారు. ఆయన కూడా మంచి వాడే యీయనలాగే. కాని రామారావుగారు ఆలోచనాపరుడో కాదో గాని బాగా ఆవేశపరుడు. (అది ఆయనకు రానురాను కీడే హెచ్చుగా చేసిందనుకోండి), అన్నా హజారే గారూ ఎక్కువగా ఆవేశంతోటే మాట్లాడే వాడిలా కనిపిస్తున్నాడు. మీరన్నట్లు, మాటమీద సరియైన నియంత్రణ లేని నాయకులు తమకూ, యితరులకూ కూడా అనవసరమైన తలనొప్పులు తెస్తారేగాని సాధించేది తక్కువగానే ఉంటుంది చివరకి.

 2. “మాటమీద సరియైన నియంత్రణ లేని నాయకులు తమకూ, యితరులకూ కూడా అనవసరమైన తలనొప్పులు తెస్తారేగాని సాధించేది తక్కువగానే ఉంటుంది చివరకి.”

  శ్యామలరావుగారూ, అన్నా గారి లోక్ పాల్ పోరాటం కూడా చివరికి అంతే ముగియడం చాలా విచారంగా ఉంది. నలభై యేళ్ల నుండి వాయిదాపడుతున్న చట్టం అయితే వచ్చింది గానీ అది కోరలు లేని చట్టం అని అన్నాతో పాటు దాదాపు మర్యాద ఉన్న పత్రికలన్నీ తేల్చేశాయి. కానీ అన్నా ఆందోళన ప్రారంభమయిన తీరు, సందర్భం, ముగిసిన తీరు ఇవన్నీ జాగ్రత్తగా సింహావలోకనం చేయవలసిన అవసరం కనిపిస్తోంది. రాగద్వేషాలు లేకుండా, అభిమానం గౌరవాలని పక్కనబెట్టి, పార్టీ పక్షపాతాలు లేకుండా అటువంటి సమీక్ష చేయవలసిన అవసరం కనిపిస్తొంది.

 3. ఆయన మిగిలిన విషయాలలో ఎలాండివాడైతే మనకెందుకండీ….

  అవినీతి నిర్మూలనలో ఆయనొక ఆయుధం. అంతే…! ఆరకంగానే చూద్దాం అందరం. ఇలా అసలు విషయం వదలి లొసుగులు వెతుకుతూ ఉంటే చైతన్యం ఎప్పటికి వచ్చేది?

  అవినీతి నిర్మూలన కోసం వచ్చిన అవకాశాన్ని మీరు వినియోగైంచుకోదలిచారా లెదా… అదే ముఖ్యం.

 4. మహిగారు, అంతమాట అన్నారేమండీ?

  అవినీతి అన్నది కేవలం డబ్బుకి సంబంధించినదేనంటారా? అవినీతి ఉద్యమమే తీసుకుందాం. ఇందులో అనేకమంది పాల్గొంటున్నారు. నాయకత్వ పాత్రలో అన్నా ఒక్కరే కనిపిస్తున్నా అయనతో పాటు కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్ ఇంకా ఇతర పెద్దలు కూడా ఉన్నారు. ఇతరుల్లో ఎవరైనా అందరూ శ్రమిస్తుంటె అన్నా ఒక్కరే పేరు సంపాదించడం ఏంటని ఈర్ష్య పడి ఆయనకి వ్యతిరేకంగా పుకార్లు వ్యాపింపజేశాడనుకోండి. అది అవినీతి కాదంటారా? నైతికంగా అవినీతికి పాల్పడడం కాదా ఇది?

  ప్రధాని మన్మోహన్ సఛ్ఛీలుడని చాలామంది నమ్ముతున్నారు. అది నిజమనే అనుకుందాం. కాని ఆయన, రాజా అవినీతికి పాల్పడుతున్నాడని తెలిసినా అభ్యంతరం చెప్పకుండా ఊరుకున్నాడు. ఆ విధంగా తన మౌనంతో రాజా అవినీతిని ప్రోత్సహించాడు. మరో మంత్రి దయానిధి మారన్ కూడా కమ్యూనికెషన్ల మంత్రిగా ఉండగా నేరుగా మన్మోహన్ కి తెలిసే అవినీతికి పాల్పడినా మన్మోహన్ నోరు మెదపలేదు. మన్మోహన్ కి అవినీతిలో భాగం లేదంటారా? వీళ్ళందరినీ కాపాడుతున్న సోనియా, రాహుల్ లకు, కాపాడుతున్నందుకు, అవినీతిలో భాగం లేదంటారా? (అవినీతి డబ్బు ముట్టిందని సాక్ష్యాలు ఇంకా వెల్లడి కాలేదు గనక ఆ కోణంలో సోనియా, రాహుల్ అవినీతిని కాసేపు పక్కన బెడదాం)

  దేశంలో అవినీతి పోవాలని కోరుతూ, పోరాడుతూ, స్త్రీలపట్ల జరుగుతున్న ఒక అన్యాయానికి మద్దతు ఇస్తున్నట్లుగా వ్యాఖ్యానిస్తే ఆ పోరాటానికి సంపూర్ణత వస్తుందా? జనాభాలో సగ భాగంగా ఉన్న స్త్రీలు అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగం పంచుకోవద్దా? ఇటువంటి వ్యాఖ్యలు చేసే నాయకుడి కింద పని చెయడానికి పిల్లలు లేని స్త్రీలు ఇష్టపడతారా?

  అదొక అంశం కాగా, అసలు పిల్లలు లేని స్త్రీలకు ప్రసవ వేదన తెలియదనడం ఎంత ఘోరం అండి? పిల్లలు లేనంత మాత్రాన ఒక స్త్రీ పడే ప్రసవ వేదన మరొక స్త్రీకి తెలియదని ఎత్తి చూపడం ఎంత గాయపరుస్తుందో మీకు తెలియదా? అది సామెతగా కూడా పనికిరాని సామెత. కాదంటారా?

 5. కోడిగుడ్డు మీద ఈకలు పీకడం అంటే ఇదే. ఆయనేమన్నా అటువంటి ఆడవారిని కించపరుస్తూ మాట్లాడారా ఏమిటి, సామెత చెప్పినందుకే ఇంత పెద్ద పోస్టా !!

  ఇంకా నయం ’గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన’ అనలేదా పెద్దమనిషి. అనుంటే పల్లెటూర్లలో బడుగు జనాలకు సేవ చేసే జివాలపట్ల జీవకారుణ్యం లేని కర్కోటకుడు అన్నా అని హెడ్‌లైన్స్ చదవాల్సొచ్చేది

 6. శేఖర్, మరి పురుషులకు జరిగే అన్యాయం సంగతేమిటి? దానీ గురించి ఎప్పుడూ మీరు రాసినట్లుగా చూడలేదు.

 7. మంచి చెప్పేవాడు, మంచి కోసం పోరాడేవాడు మంచివాడే అయిఉండక్కర్లేదన్నది నాఉద్దేశ్యం. తల్లితండ్రులు తప్పులు చేస్తున్నవారైనా తమ పిల్లలు సక్రమంగా ఉండాలని కోరుకుంటారుకదా! అలానే ఆయన ఎటువంటివాడైనా ఆయనిచ్చిన పిలుపు మనకి మంచి చేస్తుందనుకుంటే, ఆయనలో లోపాలను వెతకటం మాని అవినీతి రహిత భారతాన్ని సాధించుకునేందుకు కృషి చేద్దాం

 8. భావోద్వేగం లో అన్న మాటలను సాగదీయడం ప్రధానం కాదు. ఎపుడు ఎలా అన్నా ? అన్నా అన్నా తప్పు తప్పే ? అయితే గొడ్రాలికి ప్రసవ వేదన తెలియదా ? మరి అన్నాకు తెలుస్తుందా ప్రసవ వేదన ? ఏ వేదన అయినా స్వయంగా అనుభవిస్తేనే తె్లియాల్సిన అవసరం లేదు . స్పందించే హృదయముంటే ఏ బాధ అయినా మన బాధే అవుతుంది. ప్రపంచం బాధ శ్రీ శ్రీ బాధ అయినట్లు. అన్నా వుద్యమంతో మాత్రమే అవినీతి అంతం కాదు. అవినీతి అంటే ఆర్ధికపరమైన విషయంగా చూస్తే దానికి సంపూర్ణత రాదు.

 9. సామాజిక కార్యకర్తకి సామాజిక దురాచారాల గురించి తెలియదంటే నమ్మాలా? అతని అనుచరగణంలో స్త్రీల సంఖ్య తక్కువగా ఉంది కదా, స్త్రీలని కించపరిచే సామెతలు ఉపయోగిస్తే తమ అనుచర గణంలోని స్త్రీలు ఏమీ అనలేరులే అని అనుకుని అలా మాట్లాడి ఉంటాడు. అన్నా హజారే బృందంలోని ఒక మహిళా నాయకురాలిని ఈ విషయం అడిగితే ఆమె ఏమీ మాట్లాడలేదు. అలా మాట్లాడలేరు అని ముందే తెలిసి అన్నా హజారే ఆ సామెత మాట్లాడి ఉంటాడు.

 10. ఇప్పటి రాజకీయ నాయకులు తమ పిల్లలను తమ రంగానికే పరిచయం చేస్తున్నారు కదా మహీ గారు. తల్లిదండ్రుల స్వభావమే వారి పిల్లలకు ఏమి నేర్పేది నిర్ణయిస్తుందనుకుంటాను. అది వేరే విషయం అనుకోండి. అన్నా పిలుపు నిస్సందేహంగా మంచి చేసేదే. ఆ పిలుపు తో స్ఫూర్తి పొంది ప్రజలు అవినీతి అంతానికి ఉద్యమిస్తే తప్పనిసరిగా మంచే జరుగుతుది.

  కాని శ్యామలరావు గారన్నట్లు, ఈ నాలుగైదు నెలల్లో అన్నా, ఆయన బృందం పలుకుబడి ఏదో మేరకు క్షీణించిన విషయం మీరు గమనించారా? అన్నా బృందం పైన కాంగ్రెస్ పార్టీ చేసిన బురద ప్రచారం వారి విశ్వసనీయత క్షీణించడానికి ఒక కారణంగా పని చేసింది. కాని అన్నా విశ్వసనీయత మాత్రం ఆయన స్వయంగా ఇచ్చిన అనేక వివాదాస్పద ప్రకటనల వల్లనే కొంతమేరకు క్షీణించిన సంగతి మీరు గమనించాలి. స్త్రీలకు సంబంధించిన వ్యాఖ్య మీకు అంత పెద్ద విషయంగా కనిపించలేదు గాని ఆ అంశాలను కూడా పరిగణించవలసి ఉంటుంది. ఒక వ్యక్తి ఆలోచన విధానం తీరు తెన్నుల ఆయన మాట్లాడే అన్ని అంశాలపైన ఉంటుంది. ఒకటి అవినీతి విషయం అయితే మరొకటి స్త్రీల సంగతి, ఇంకొకటి తాగుబోతులకు విధించే శిక్ష సంగతి, ఇంకా అవినీతిపరులను ఉరితీసే సంగతి. ఇలా అన్ని అంశాలపైనా అన్నా వ్యక్తం చేసే అభిప్రాయాలన్నింటికి ఒకటే మూలం: అన్నా ఆలోచనా విధానం. అందువల్లనే ఇతర అంశాలపైన ఆయన అభిప్రాయాలు కూడా అనివార్యంగా పరిగణనలోకి వస్తాయి.

  అలా పరిగణనలోకి వచ్చినపుడు అనివార్యంగా అన్నా విశ్వసనియతకు, ఎంత చిన్నదైనా, గండి పడుతుంది. అది మళ్ళీ అన్నా నాయకత్వం వహిస్తున్న అవినీతి వ్యతిరేక ఉద్యమంపైన పడుతుంది. అంటే అన్నా వెనుక ఫాలోయింగ్ కి కూడా గండి పడుతుంది. కనుక అన్నా వ్యాఖ్యల ప్రభావం మళ్లీ వచ్చి అవినీతి వ్యతిరేక ఉద్యమంపైన కూడా పడుతుంది. ఉద్యమం బలహీనపడే వైపుగా ఆ ప్రభావం ఉంటోంది. అందువల్లనే ఆయన చేసి ఇతర వ్యాఖ్యలు కూడా చర్చకు వస్తాయి. వేరే అవసరాల కోసమో, ఆయనని చిన్నబుచ్చడానికో కాదు, అవినీతి ఉద్యమం బలహీన పడుతుందెమోనన్న ఆదుర్దా అందులో ఉందని గమనించాలి.

 11. నాగార్జున గారూ, సామెతలు మన సంస్కృతిలో భాగం. ఒక విధంగా మన సంస్కృతికి సామెతలు అద్దం పడతాయి. సంస్కృతిలో పాత అభివృద్ధి నిరోధక భావాలను తోలగించుకుంటూ కొత్త అభివృద్ధి కర భావాలను సమాజం పేర్చుకుంటూ పోతుంది. పాత భావాలు పాత జీవన విధానానికి ప్రతిబింబం కనుక అవి కొత్త అభివృద్ధి చెందిన జీవన విధానానికి ప్రతిబంధకంగా మారతాయి. అందువలన పాత భావాలను తద్వారా పాత అలవాట్లు, నమ్మకాలు, ఆచారాలు వదులుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది.

  ఈ దృక్పధం నేపధ్యంలొ మరొక్కసారి అన్నా వ్యాఖ్యలను పరిశీలించండి నాగార్జునగారూ. ఇంకో విషయం. మీ వెటకారపు ధోరణి విడిచిపెడితే చర్చ బాగా జరుగుతుంది. “తమలపాకుతో తానొకటంటే, తలుపు చెక్కతో నేనొకటి” అన్నట్టు వెటకారాలకేముందీ, సవాలక్షా పద్ధతులున్నాయి. కాదంటారా?

 12. వెటకారం పోస్టు మీద అంతే. అన్నా హజారే అన్నారు కనక ఒప్పు అని అనడంలేదు. మరెవరు చెప్పినా ఇలాగే అనేవాడిని. సదరు వ్యక్తి మాటిమాటికి అదే అంటువుంటే లేకపోతే వాళ్ళను ఉద్దేశించి డైరెక్ట్‌గా చెప్తే ఈ పత్రికల వాళ్ళు విమర్శించినా అర్దంవుంది. అదేం లేదే. అలా అనుకుంటే రాజకీయ నాయకులను ఉద్దేశించి ఎన్ని పత్రికలు గొడ్లతో పోల్చడంలేదు. మరి అవి తమను తాము ఎన్నడైనా విమర్శించుకున్నాయా ? ’ఓ వ్యక్తిగా అన్నా పార్లమెంట్‌ కన్నా గొప్పవాడు’ అని అంటే కొన్ని పత్రికలు తమకు నచ్చిన భాష్యం చెప్పుకున్నాయట. అంతకన్నా వెరేగా ఏం లేదు ఇదికూడా.

 13. శ్రీని గారూ, ఆశ్చర్యంగా మీ వ్యాఖ్య స్పాం లోకి వెళ్ళింది. బూతులు రాస్తున్న వారి ఐ.పిలను నేను స్పాం కింద ముద్ర వేస్తాను. అలా గతంలో స్పాం కింద ముద్రవేసినవి తర్వాత నేరుగా స్పాం లోకి వెళ్ళిపోతాయి. మీ ఐ.పి పొరబాటున స్పాం లోకి వెళ్ళి ఉంటుందని అనిపిస్తోంది. ఒక్కోసారి రాజశేఖర రాజుగారి వ్యాఖ్యలు కూడా స్పాం లోకి వెళ్తుంటాయి. అదేం రోగమో ఈ స్పాం ఫిల్టర్ కి.

  పోతే పురుషుల అన్యాయం గురించి కదా మీరడిగింది. అది స్త్రీలనుండి జరుగుతున్న అన్యాయం గురించా మీరు అడుగుతున్నది?

  స్త్రీలకు జరుగుతున్న అన్యాయం నేరుగా పురుషులనుండి జరుగుతుందని భావిస్తే ఈ అనుమానం రావడం సహజం. కాని వాస్తవం ఏమిటంటే, పురుషులకు, స్త్రీలపైన ఆధిపత్యం సమాజం ఇచ్చింది. అంటే సమాజం స్వభావాన్ని బట్టే స్త్రీలపైన పురుషుల ద్వారా అన్యాయాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. సమాజం ప్రత్యక్ష, పరోక్ష ఆమోదం లేకుండా స్త్రీలపైన ఇన్ని అన్యాయాలు జరగవు. అందువల్లనే ఇది పురుషాధిక్య సమాజం అని అంటున్నాం.

  సమాజం స్త్రీలపైన పురుషుడికి ఆధిపత్యం ఇచ్చించి అనడానికి అనేక ఉదాహరణలు చూపించవచ్చు. ఆడపిల్లను పెంచే పద్ధతి, మగపిల్లవాడిని పెంచే పద్ధతిలో చాలా తేడాలు సమాజంలో ఉన్నాయి. ‘వాడికేం మగాడు?’ అని చాలా సార్లు స్త్రీకి సమాజం నేర్పిస్తుంది. తల్లిదండ్రుల దగ్గర్నుండి, బడి, పాఠాలు, విద్య, సంస్కృతి అన్నీ ఇలా నేర్పే సమాజంలో భాగాలే.

  భార్యని కొడుతున్నపుడు అడ్డుపోతే, ‘వాడి పెళ్ళాం, వాడు కొట్టుకుంటాడు. నీకేంరా?’ అని పది మందీ అడ్డొచ్చినవాడికి అడ్డొస్తారు. ప్రాధమిక తరగతుల పాఠాల్లో నాన్న ఉద్యోగం చేసి సంపాదించేవాడిగా, అమ్మ వంట చేసి పెట్టేదిగా చూపుతున్నారు. అప్పటివరకూ పని మనిషిని పెట్టుకున్న బ్రహ్మచారి, లేదా కుటుంబం, భార్యో, కోడలో వస్తే పని మనిషిని తీసేస్తారు. భార్య స్ధానం అది మరి. మా కొలీగ్ ఈ మధ్య పనిమనిషిని తీసేశాడు. (ఆమెని నేనే మాట్లాడాన్లెండి). ఏం రా అంటే, వాడి భార్య పుట్టింటినుండి వచ్చేసిందంట. (పుట్టింటికి వెళ్ళిన కారణం వాడి వ్యక్తిగతం). ఇక పనిమనిషి ఎందుకు అని ఎదురు ప్రశ్నవేశాడు.

  పోలీసులు కూడా ఇంతే. విద్యార్ధిగా ఉండగా నాకు మహిళా సంఘంతో కలిసి పని చేసిన అనుభవం ఉంది. ఎస్.ఐ లకి, వారి వద్దకు వచ్చే కేసుల విషయంలో భార్యని కొట్టడం అభ్యంతర పెట్టగల విషయంగా కనిపించదు. అదేంటండి అతని భార్యే గదా? అనడిగేవాళ్ళు, మరి చట్టాలు భార్యని కూడా కొట్టగూడదని నిర్దేశిస్తాయి కదండీ అంటె ఆ చట్టాల్దేముందండీ అనేవారు తప్ప అది తప్పుగా అంగీకరించేవారు కాదు. అంటే భార్యలని కొట్టగల హక్కు సమాజమే పురుషుడికి దఖలు పరిచిందని అర్ధం అవుతోంది గదండీ. ఎంతగానంటే, చట్టాలను కూడా తీసిపారేసేంతగా నన్నమాట. మామూలు వ్యక్తులేకాక పోలీసు అధికారి కూడా స్త్రీల చట్టాలని తీసిపారేసేంతగా పురుషుడికి అధికారాన్ని స్త్రీలపైన సమాజం ఇచ్చేసింది.

  చిత్రం ఏమిటంటే ఈ పురుషాధిక్య భావాజాలనికి ఎవరూ అతీతులూ కాదు. వాళ్ళు ప్రొఫెసర్లు కానియ్యండి. ఐ.టి నిపుణులు కానివ్వండి, ఇంజనీర్లు, లాయర్లు, డాక్టర్లు ఇలా ఒకరేమిటి… వీళ్లంతా ఆ సమాజం అనే తాను లోని ముక్కలు కావడమే అందులోని రహస్యం. వీళ్ళు ఎదిగే క్రమంలో పాత పురుషాధిక్య భావాలను వదులుకుని, స్త్రీ పురుషులంతా సమానులే అనే ఆధునిక ప్రజాస్వామిక భావాలను అలవర్చుకున్నట్లయితే తమ అలవాట్లను కూడా క్రమంగా మార్చుకుంటారు. లేదా అలాగే పాత భావాలను వ్యక్తం చేస్తూ వాటినుండి లబ్ది పొందుతుంటారు. పురుషుల్లో చాలామంది ఆదర్శాలు ఎన్ని చెప్పినా ఆచరణలోకి వచ్చేసరికి పురుషాధిక్య సమాజం ద్వారా వచ్చి పడిన సౌకర్యాలను వదులుకోలేక అలానే భార్యలను, చెల్లెళ్లను, కొండొకచో తల్లులను రాచి రంపాన పెడుతుంటారు.

  “కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా, విరిసీ విరియని ఓ చిరునవ్వా, కన్నుల మంటలు నీరై కారగ, కట్నపు జ్వాలలో సమిదై పోయవా?” అని ఒక అద్భుతమైన పాట ఉంది. ఆ పాటలో ఒక్కో చరణం ఒక్కో ఆణిముత్యం అన్నమాట. ఆ పాట పాడుతుంటే ఎక్కడివారక్కడ నిలబడిపోయి ఆలకించేవారు. అంత అద్భుతమైన పాటని రాసిన కవి భార్య అతని శాడిస్టు అనుమానపు చర్యలకి తట్టుకోలేక విడాకులు తీసుకుందని తెలిస్తే ఎవరైనా షాక్ తినక మానరు. నాకైతే గుండె ఆగినంత పనయ్యింది. ఆమె ఓ మహిళా సంఘం కార్యకర్త. ఓ పెద్ద కవి గారి కూతురు కూడా. అయినా ఆమె పురుషాధిక్యతను అనుభవించక తప్పలేదు. అది కూడా ఒక అభ్యుదయవాది అయిన కవి ద్వారా. సమాజంలో పురుషాధిక్యత ఎంతగా పాతుకుపోయిందీ చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్పాను.

  పురుషాధిక్య సమాజంలో కూడా భర్తలపైన గయ్యాళితనం ప్రదర్శిస్తున్న పురుషులు లేరా అన్నది మీ ప్రశ్న కావచ్చు. ఉన్నారు. కాని వారి అధికారం, భర్తపై చేసె గయ్యాళితనం సమాజం స్క్రూటినీకి లొంగి ఉంటుంది. సినిమాలలో చూపిస్తారు. సినిమా అంతా భార్య నోటికి దడిసి ఉన్న భర్త చివర్లో నాలుగు డైలాగులు చెప్పి భార్యపై చేయి చేసుకోగానే హాలంతా చప్పట్లు మార్మోగుతాయి. గయ్యాళి భార్య పట్ల ప్రేక్షకులకి ఉండే వ్యతిరేకత అది. కాని ఇక్కడే మీరొక ముఖ్య విషయం గమనించాలి. భర్తపై ఆధిపత్యం చెలాయిస్తే భార్య ‘గయ్యాళి’ అయ్యింది. కాని భార్యపై ఆధిపత్యం చెలాయించేసరికి అది ఆమోదయోగ్యంగా మారిపోయింది. భార్య గయ్యాళితనం నోటికే పరిమితం అయితే, భర్త ఆధిపత్య చేతలదాక వెళ్తుంది. ఒక్క చేతలేం ఖర్మ, ప్రాణాలమీదికి కూడా తేస్తోంది. “ఆమ్నియో సెంటసిస్” ద్వారా పిండం వదిలించుకునే దగ్గర్నుండి, పుట్టినవారిని చంపేదగ్గర్నుండి, పెరుగుతున్నంతకాలం వేధించే దగ్గర్నుండి, కట్నం కోసం, మగపిల్లల కోసం చంపేవరకూ ఇలా స్త్రీల ప్రాణాల మీదికి వస్తోంది.

  భార్య గయ్యాళితనానికి ఈ సమాజంలో పరిష్కారం ఉంది. అదేంటంటె పురుషుడు తిరగబడి తన భార్యమీద న్యాయంగా ఉన్న ఆధిక్యతను తిరిగి పొందడం. కాని స్త్రీలపై పురుషుడి ఆధిపత్య సమస్యకు ఈ సమాజం పరిష్కారం చూపదు. సమాజం దృష్టిలో అదొక సమస్యే కాదు కనక ఇక పరిష్కారం అవసరం ఏముంది? ఎవరైనా పరిష్కారంగా స్త్రీలు కూడా తిరగబడాలి అంటే సమాజం ఊరుకుంటుందా? అంగీకరిస్తుందా? ఛస్తే ఊరుకోదు. మా ఆఫిసులో ఒక వ్యక్తి తన భార్యని దాదాపు రోజూ బండిపై తీసుకెళ్లి కూరగాయల్లాంటి నిత్యావసర సరుకులని కొంటుంటాడు. అతని పైనా మా ఇతర కొలీగ్స్ ఛీప్ గా కామెంట్ చెయ్యడం నేను విన్నాను. ఎప్పుడూ పెళ్లాం కొంగు పట్టుకుని తిరుగుతాడనీ, అన్ని పనులూ చేయాల్సిందే అనీ ఇలా. అతను తన సొంత ఇంటి పనులే చేస్తున్నా అతనికి ఆ బిరుదు తప్పలేదు. వీళ్ళంతా డిగ్రీలు, పి.జిలు చదివినవాళ్ళే. ఇంగ్లీషు సినిమాలు ఎగబడి చూసేవాళ్ళే. ఆ సినిమాల్లో హీరోయిన్లు కూడా ఫైటింగ్ లు అవీ చేస్తుంటె వీరు ఇష్టపడతారు కూడా. అదే భావన నిజ జీవితంలొ వారు ఆహ్వానించలేకపోతున్నారు.

  కనిక తేలేదేమంటె పురుషులపైన స్త్రీల అత్యాచారాలన్నవి సామాజిక వాస్తవం కాదు. అవి జరగడం కోటికో, వెయ్యి కోట్లకో. అధవా జరిగినా అవి సమాజం ఆమోదం పొందుతున్నవి కావు. సమాజంలో వాటికి తక్షణ పరిష్కారం ఉంది. కాని స్త్రీలపైన పురుషుల ద్వారా జరుగుతున్న అన్యాయాలకీ, అత్యాచారాలకీ ఈ సమాజం పరిష్కారం చూపదు. పైన చెప్పినట్లు అది సమస్యే కాదు కనక పరిష్కారం చూపే అవసరమే లేదు.

  మీరు అక్కడ ఇలా జరిగింది. ఇక్కడ మరొకలా జరిగింది. అది అన్యాయం కాదా? అది స్త్రీల అన్యాయం కాదా అని మీకు తెలిసిన కొన్ని ఉదాహరణలు చూపి ప్రశ్నించవచ్చు. వాటికి కూడా నేను చెప్పే సమాధానం ఏమిటంటె, స్త్రీ అధిక్యత గానీ, స్త్రీల అన్యాయాలు గానీ ఈ సమాజపు లక్షణం కాదు. ఈ సమాజానికి స్త్రీల ఆధిక్యత అవలక్షణమే తప్ప లక్షణం కాదు. అవలక్షణంగా భావిస్తున్న స్త్రీ ఆధిక్యత (గయ్యాళి తనం) సమస్యకు పరిష్కారం పురుషులకి చక్కగా అందుబాటులో ఉంది. పురుషులపై స్త్రీల ఆధిక్యతను ఒక సమస్యగా చూపడం పురుషాధిక్య సమాజంలో సరికాదు.

 14. పల్లెటూర్లలో గాడిదల చేత బరువులు మొయ్యించేవాళ్ళు గాడిదలకి స్నానం చెయ్యించరు. గాడిదని unclean animalగా భావించి కొన్ని మతాలవాళ్ళు గాడిద పాలు తాగరు, గాడిద మాంసం ముట్టుకోరు. అందుకే గాడిదకి ఏమి తెలుసు గంధపు చెక్కల సువాసన అనే సామెత వచ్చింది. కానీ ఆడవాళ్ళ విషయం అది కాదు కదా. పిల్లలు పుట్టని స్త్రీని ముసలి వయసులో ఆమె బంధువుల పిల్లలు చూసుకోవచ్చు. పిల్లలు పుట్టకపోవడం ఏమీ అవమానకరం కానప్పుడు గొడ్రాలు లాంటి పదాలు ఉపయోగించడం అవసరమా?

 15. అవినీతిపరులను ఉరి తియ్యాలి అని అన్నా చాలా సార్లు అన్నాడు నాగార్జున గారు. కాని అది సహజ న్యాయ సూత్రానికి విరుద్ధం. ఇక్కడ అన్నాని నేను అన్యాయంగా విమర్శిస్తున్నట్లుగా మన చర్చలో భావం వస్తోంది.

  నిజానికి అవినీతి వ్యతిరేక ఉద్యమం కోసమే అన్నా వ్యాఖ్యలను సవరించుకోవాల్సిందిగా కోరవలసి ఉంది. ఆయన ప్రజా జీవితంలో ఉన్నందున ఇతర అంశాలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేసినప్పుడు వాటిని కూడా అంతా పరీక్షిస్తారు. ఇంకా చెప్పాలంటె ఆయనను ప్రశ్నించి మరీ పత్రికలు ఇతర అంశాలపై వ్యాఖ్యానాలను రాబడతారు. అది పత్రికల పనిగానే చూడాలి. అన్నా మాత్రం తన స్ధానాన్ని దృష్టిలో ఉంచుకుని ఆచితూచి మాట్లాడాల్సిందే. ప్రజలు ఆయనని విశ్వసించడం ద్వారా ఆయనపై ఉంచిన బాధ్యత ఆయనకి అలా పరిమితులు విధిస్తుంది. ప్రజా జీవితంలో ఉన్నవారికి ఇది బాగా అర్ధం అవుతుంది. వ్యక్తులుగా మనకు ఉండే స్వేచ్ఛ నాయకులుగా వారికి ఉండదు. కాని నాయకులుగా వారికి ఉన్న విశ్వసనీయత, గౌరవం, ప్రతిష్ట వ్యక్తులుగా మనకు ఉండదు. నాయకత్వం, ప్రతిష్ట వారికి సౌకర్యం కాదు. ఒక బరువైన బాధ్యత. ఆ బాధ్యతలో ఇతర అన్ని అంశాల పట్ల గూడా పురోగామి భావాలు ఉండడం ఒక భాగం.

 16. ఈ చర్చ అంతా చదివాను. శేఖర్ గారి ఆవేదనా నా ఆవేదన కూడా ఒకటే. మా యింట్లో పుష్కలంగా ఆడపిల్లలు – 9మంది చెల్లెళ్ళకు అన్నను నేను. మంచి చెప్పేవాడు, మంచి కోసం పోరాడేవాడు మంచివాడే అయిఉండక్కర్లేదన్నది సరైన దృక్పధం కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. శీలం యొక్క సామాజిక వ్యక్తిగత ముఖాలమధ్య సారూప్యత లేకపోవటం మనం తరచూ గమనిస్తూనే ఉంటాం. ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో అద్భుతంగా నైతిక పాఠాలు బోధిస్తూ ఉంటే సంతోషం. కాని అతడు తన విద్యార్ధినులతో అసభ్యంగా ప్రవర్తిస్తే ? మనం తప్పు పడుతున్నాం కదా? మంచి ఉపాధ్యాయుడే కదా అని మన్నిస్తున్నామా? నిజానికి ఇలా ఉపాధ్యాయుడిని ఉదాహరణగా ఇవ్వటం నాకూ ఇష్టం కాదు – ఎందుకంటే మా నాన్నగారూ ఆదర్శ ఉపాధ్యాయులే. సరే, విషయం అర్ధం అయిందనుకుంటాను.

  ఈ వేదికలోనే లోగడ వ్రాసాననుకుంటాను. స్త్రీలపై పురుషులు ఆధిక్యభావనకు తల్లుల పెంపకమే కారణమౌతున్నదని తీవ్ర స్త్రీవాది అయిన నా స్నేహితురాలొకవిడ వాపోయిందని. స్త్రీలలో విద్యాధికుల సంఖ్య తగినంత అభివృధ్ధి చెందిన పిదప పరిస్థితి తప్పకుండా మారుతుందని ఆశిద్దాం.

  అందరూ, ముఖ్యంగా -ప్రజల మధ్య తన మాటకు కొంత విలువ ఉందని గ్రహింపు ఉన్న వాళ్ళు – తమ భావోద్వేగాలను ప్రకటించే భాష, హావభావాల విషయంలో చాలా జాగరూకులై ఉండాలి. అటువంటి జాగ్రత తీసుకోలేని వాళ్ళు తమతో పాటు తమ అనుయాయుల్ని కూడా ముంచుతారు. ప్రజలకూ హాని కలుగుతుంది వాళ్ళమీద పెట్టుకున్న భరోసా కారణంగా.

  ఒక పాత సంస్కృత శ్లోకం
  విద్వానేవ విజానాతి విద్వజ్జన వివేచనం
  నహి వంధ్యా విజానాతి గుర్వీం ప్రసవ వేదనాం.

  అయితే, పురాణమిత్యేవ నసాధుసర్వం. (పాతది అయినంత మాత్రాన మంచిదే కానక్కరలేదు అని భావం). అందు చేత వర్తమానకాలానికి అనుగుణంగా, మాట్లాడేటప్పుడు ఇటువంటివి ప్రస్తావించటం అనవసరం. సబబు కాదు కూడా.

 17. అన్నా అయినా మరెవరైనా పార్లమెంటుకన్నా గొప్పవాడేమీ కాదు ! వ్యక్తివాదం ఆదర్శం కాకపోగా అత్యంత ప్రమాదకరమైనది. ఎంత గొప్ప వారైనా తప్పు చేస్తారు . ఒక వేళ అన్నా హజారే పొరపాటుననే ఈ మాట అన్నా దీనిని వెటకారం పోస్టు అని ఎందుకనుకోవాలి. అన్నా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు కోరితే తప్పేంటి ? ఈయనేమయినా గాంధీకన్నా గొ్ప్పవాడు కాదుగా ? అయినా గొప్పవాళ్ళు లేదా వారిని అనుసరించేవారు విమర్శలను స్పోర్టివ్ గా తీసుకుంటారు . ఇలా నిజాన్ని నోరు నొక్కే ప్రయత్నం చేయరు.

 18. పురుషులనుండి స్త్రీలకు , స్త్రీలనుండి పురుషులకు ద్రోహం జరుగుతున్నట్టు భావించడం మంచిది కాదు. ఆ సామాజిక లక్షణాలను బట్టి మనుషుల ప్రవర్తనలుంటాయి. కనుక మొత్తం సమాజం మార్పు గురించి ఆలోచించాలి.

 19. మహర్షి గారూ, శ్రీ పేరుతో ఓ వ్యాఖ్య, మహర్షి పేరుతో మరో వ్యాఖ్య ఒకే బ్లాగ్ లో రాయవలసిన అవసరం మీకు ఇందుకే వచ్చిందా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s