‘పటిష్టమైన లోక్ పాల్ బిల్లు’ తేవాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అన్నా ఇచ్చిన ఆందోళన పిలుపును ఈసారి ప్రజలు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. గతంతో పోలిస్తే ప్రజలు ఆన్నా ఆందోళనకు అంత తీవ్రంగా పట్టించుకోనట్లు కనిపిస్తోంది. లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందాక తమ ఆందోళన ఎన్నికల సంస్కరణలపై కేంద్రీకరిస్తుందని ప్రకటించిన అన్నా బృందం, అప్పటికి ఎంతమంది ప్రజలను ఆకర్షించగలుగుతారన్నదీ ఇపుడు ప్రశ్నగా మారింది.
ప్రభుత్వం తలపెట్టిన ‘బలహీన’ లోక్ పాల్ బిల్లుకి వ్యతిరేకంగా ఆందోళన జరపాలని అన్నా బృందం పిలుపునిచ్చింది. అన్నా, ముంబైలో మూడు రోజుల నిరాహార దీక్షకు కూర్చున్నప్పటికీ ఢిల్లీలో కూడా ధర్నా నిర్వహించాలని అన్నా బృందం ఇచ్చిన పిలుపుకి అక్కడ సైతం స్పందన బలహీనంగానే ఉంది. ఢిల్లీ రాంలీలా మైదాన్ లో అన్నా మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలి వస్తారని భావించినప్పటికీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. ముంబైలో ఆందోళన చేస్తున్న అన్నా కు జ్వరం సోకడంతొ ఆయన ఆరోగ్యం, అన్నా బృందానికీ, మద్దతుదారులకు సమస్యగా ముందుకొచ్చింది. దానితో అన్నా దీక్ష మానాలని వారే కోరవలసిన పరిస్ధితి తలెత్తింది.
ముప్ఫై వేల మంది సామార్ధ్యం కల రాం లీలా మైదాన్ లో కేవలం రెండు వందల మంది ప్రజలు మాత్రమే హాజరయ్యారు. ఆందోళన కోసం హాజరైన ప్రజల కంటే అక్కడ భద్రత కోసం హాజరైన బలగాల హడావుడే ఎక్కువగా ఉందని ఎన్.డి.టి.వి తెలిపింది. రాం లీలా మైదాన్ లో అన్నా బృందం ప్రముఖ సభ్యులు కూడా గైర్హాజరవడం గమనార్హం. గత ఆగష్టు నెలలో అన్నా పన్నెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేసినపుడు ముప్ఫై నుండి నలభై వేల మంది ప్రజలు హాజరైన పరిస్ధితితో ఇప్పటి పరిస్ధితి అసలు పోల్చడానికి కూడా వీలు లేకుండా ఉంది. జంతర్ మంతర్ వద్ద అన్నా జరిపిన రెండు నిరాహార దీక్షల సందర్భంలో కూడా అధికంగానే ప్రజలు హాజరయ్యారు.
ఢిల్లీలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడం, అన్నా హజారే ముంబైలో ఆందోళన చేస్తుండడం వలన ఢిల్లీలో హాజరు తక్కువగా ఉందని అన్నా బృందం సభ్యుడు ప్రశాంతి భూషణ్ అభిప్రాయపడ్డాడు. ఉదయం పది గంటలకల్లా దీక్ష ప్రారంభం అయినప్పటికీ పదకొండ గంటలకు కూడ రాం లీలా మైదాన్ లో ప్రజల హాజరు అతి తక్కువగా కనిపించింది. హాజరైన వారు జాతీయ జెండాలు ఊపుతూ, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ఇచ్చారు. అన్నా ఆందోళన చేస్తున్న ముంబై లోని ఎం.ఎం.డి.ఆర్.ఎ మైదాన్ లో సైతం ప్రజల హాజరు పెద్దగా లేదు. పదుల వేలమంది హాజరు కాగలరని అన్నా బృందం అంచనా వేయగా కేవలం తక్కువ సంఖ్యలోనే హాజరు ఉందని ఎన్.డి.టి.వి తెలిపింది. మంగళవారం రెండవ రోజు ఆందోళనకు కొని వందలలోనే హాజరు ఉందని తెలుస్తోంది.
డిసెంబరు 29 న దీక్ష ముగిసాక అన్నా బృందం, ఆయన మద్దతుదారులు ఢిల్లీ వెళ్ళి అక్కడ ‘జైల్ భరో’ ఆందోళనలో పాల్గొనవలసి ఉంది. ఢిల్లీలోని రాజకీయ నాయకుల ఇళ్ళముందు ఆందోళన నిర్వహించి అరెస్టు కావడం ద్వారా జైల్ భరో నిర్వహించాలని అన్నా బృందం తలపెట్టింది. కార్యక్రమంలో భాగంగా సోనియా, రాహుల్ ఇళ్ళముందు నిరసన ప్రదర్శనలు చేయాలని అన్నా బృందం నిర్ణయించింది. ఇంటర్నెట్ లో ఈ కార్యక్రమానికి లక్షకు పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ హాజరు అంత లేకపోవడం గమనార్హం. ఆన్ లైన్ కార్యక్రమాలు వాస్తవ రూపం దాల్చే అవకాశాలు ఎంత ఉంటాయన్నదానికి ఇది ఉదాహరణగా నిలుస్తుంది.
అన్నా ఆందోళనకు ప్రజల హాజరు పెంచడానికి అన్నా బృందం ఇతరులపైన ఆధారపడడానికి సిద్ధమయింది. సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్, గజల్ పాటగాడు అనూప్ జలోటా లు బుధవారం అన్నా ఆందోలన స్ధలి వద్ద కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కనుక రెండో రోజు మధ్యాహ్నానికల్లా ప్రజల హాజరు పెరుగుతుందని అన్నా బృందం ఆశిస్తోంది. అన్నా నిరసనకు మొదటి రోజు హాజరైన ప్రజల సంఖ్య పది వేలు ఉంటుందని అన్నా బృందం చెబుతుండగా, పోలీసులు ఏడు వేలని చెబుతున్నారు. వాణిజ్య ప్రాంతంలో వేదిక ఉన్నందున ప్రజలు సమకూరడం కష్టంగా ఉందని కూడా అన్నా బృందం భావిస్తోంది.
అన్నా బృందం ఎన్ని కారణాలు చెప్పినప్పటికీ, వాస్తవ కారణాలు ఏమైనప్పటికీ ప్రజల ఆదరణ అన్నా ఆందోళనకు తగ్గిపోయిందన్నది నిర్వివాదాంశం. అయితే ప్రజల హాజరు శాతం అన్నా ఆందోళనకు ఆదరణను నిర్ణయిస్తుందా అంటె పూర్తిగా కాకపోవచ్చు గాని అది ప్రధాన అంశంగా పరిగణించాల్సిందే. ఎన్ని ఆందోళలను చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోదనీ తాను చేయదలుచుకున్నది చేస్తుందనీ ప్రజలు భావించడం కూడా వారి నిరాసక్తతకు ఒక కారణం కావచ్చు.
సమాజం గురించి ఆలోచించనివాళ్ళు అవినీతి గురించి ఆలోచిస్తారని నేను అనుకోను. “అవినీతి గురించి మనకెందుకొచ్చింది గొడవ, మన ఇల్లు మనం చూసుకుందాం” అని అనుకుంటారు. రిజర్వేషన్లని వ్యతిరేకించే అరవింద్ కెజ్రివాల్ లాంటివాళ్ళు అన్నా హజారే వెనుక ఉండడం, అన్నా హజారే బృందంలోని సభ్యులకి కులతత్వం, మతతత్వం లాంటి వాటికి వ్యతిరేకంగా మాట్లాడే స్వేచ్ఛ లేకపోవడం, అలా మాట్లాడినవాళ్ళపై దాడులు జరిగినా అన్నా హజారే సహాయం చెయ్యకపోవడం, ఇలాంటి కారణాల వల్ల అన్నా హజారేకి మద్దతు తగ్గిపోయి ఉండొచ్చు.
రిజర్వేషన్ అనేది అందరూ ఆమోదించితీరవలసిన సిధ్ధాంతం అని అనుకోనవుసరం లేదు. వీటి వల్ల స్వల్పకాలికప్రయోజనమై కాని దీర్ఘకాలికప్రయోజనం లేదు. ముందు ముందు కాలంలో వీటివల్ల కలిగే అనర్ధాలు మనసమాజం బాగానే అనుభవించవలసి వస్తుంది. అయితే ప్రవీణ్ శర్మగారన్నట్లు అన్నాధోరణిలో ప్రజలకు కొంత నిరంకుశత్వం కనిపించటం కారణం కావచ్చు – క్రమంగా చెప్పుకాదగ్గ సంఖ్యలో మద్దతుదారులు తగ్గుతున్నారు.
రిజర్వేషన్ల వల్ల నేరుగా అనర్ధాలు జరిగే అవకాశాలు లేవు. రిజర్వేషన్ల వల్ల ఉద్యోగావకాశాలు కుచించుకుపోతున్నాయనీ, ప్రతిభ నాశనమవుతున్నదనీ విద్వేష ప్రచారం చేయడం వల్ల అనర్ధాలు జరిగే అవకాశం ఉంది. ఆ ప్రచారాన్ని నమ్మి సరిగా విశ్లేషించుకోకుండా రిజర్వేషన్ పొందుతున్న వర్గాలపైన వ్యతిరేకతను కొంతమంది పెంపొందించుకుంటున్నారు. అది నిస్సందేహంగా అనర్ధమే.
ఇన్నాళ్ళూ ప్రతిభ గల్లవారే దేశంలోని రాజకీయ రంగాన్నీ, వారి తర్వాత ప్రధాన రంగమైన బ్యూరోక్రసీ రంగాన్నీ అక్రమించుకుని ఉన్నారు. ఆ ప్రతిభగల వారి పాలనలోనే దేశం నుండి కోటి కోట్ల నల్ల ధనం విదేశీ బ్యాంకుల్లోకి వెళ్లిపోయింది. వారి నేతృత్వంలోనే అరవై ఐదు సంవత్సరాల స్వాతంత్ర్యం లో కూడా ఆకలి, దరిద్రం, అవినీతి, నిరుద్యోగం, ఇంకా సవాలక్ష వైకల్యాలు దేశంలో కొనసాగుతున్నాయి. వీళ్ల ప్రతిభ వల్లనే ఆరుపదుల తర్వాత కూడా భారత దేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. ప్రతిభావంతుల పాలన ఫలితంగానే ఇప్పటికి రెండు లక్షలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా చేసుకుంటూనే ఉన్నారు. ప్రతిభవల్లే దేశం ముందుపడుతుందని, వెనకబడదనీ వాదించడం సరికాదు. అసలు ప్రతిభ పొందడానికి అవకాశాలే లేని చోట ప్రతిభ గురించి చర్చించడం, దానిపైనే చర్చ కేంద్రీకరించడం తగని పని.
శ్యామలరావుగారూ, ఇది మీకు కౌంటర్ కాదు. మీరొక అంశాన్ని ప్రస్తావించిన సందర్భంగా దానికి పొడిగింపుగా ఇది రాశాను.
రిజర్వేషన్లు ఉన్నంత మాత్రాన పేద దళితులకి ఉద్యోగాలు రావు, నిజమే. కానీ అవి రద్దు చేసినంతమాత్రాన అగ్రకుల పేదవాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని చెప్పలేము. ఎందుకంటే ఈ దేశంలో మెరిట్ అనేది డబ్బున్నవాళ్ళ సొత్తు. కనుక అరవింద్ కెజ్రివాల్ లాంటివాళ్ళు మెరిట్ పేరు చెప్పి కుల ద్వేషాలు రెచ్చగొట్టకూడదు.