బ్రిటన్ లో సోమవారం తెల్లవారు ఝామున ఇరవై మూడేళ్ళ అనుజ్ బిద్వే హత్యకు గురైన కేసులో పదిహేడేళ్ళ బ్రిటిష్ టీనేజర్ ను అరెస్టు చేసినట్లుగా వార్తా పత్రికలు తెలిపాయి. ఏ కారణం గానీ, ఎటువంటి ముందస్తు కారణం గానీ లేకుండా జరిగినదిగా పోలీసులు చెబుతున్న ఈ హత్య ఇంగ్లండులోని భారతీయులలో ఆగ్రహావేశాలను కలిగించింది. ఫేస్ బుక్ లో ఇంగ్లండులోని భారతీయులతో పాటు ఇండియాలోని భారతీయులు కూడా ఈ హత్య పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సందేశాలను ప్రచురించారని ఎన్.డి.టి.వి తెలిపింది. బ్రిటిషర్లు కూడా ఈ హత్య పట్ల దిగ్భాంతిని వ్యక్తం చేసారని ఆ ఛానెల్ తెలిపింది.
మంగళవారం ఉదయాన్నే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారని తెలుస్తోంది. అతని పేరును పోలీసులు వెల్లడించలేదు. సాల్ఫోర్డ్ లో ఎనిమిది మిత్రులతో బస చేసిన హోటల్ నుండి మాంఛెస్టర్ సిటీ సెంటర్ కి నడిచి వస్తుండగా అనుజ్ బిద్వే ను ఇద్దరు తెల్ల వ్యక్తులు సమీపించి కాల్చి చంపిన సంగతి విదితమే. ఒక తినుబండారాల దుకాణం ముందు తొమ్మిది మంది మిత్రులు ఉండగా ఇద్దరు తెల్ల వ్యక్తులు సమీపించి అనూజ్ తో చాలా కొద్ది సేపు మాట్లాడారని, అనంతరం వారిలో సన్నటి వ్యక్తి తుపాకి తీసి పాయింట్ బ్లాంక్ రేంజి లో అనూజ్ తలపై కాల్చాడనీ పోలీసులు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పటికీ కొద్ది నిమిషాల్లోనే చనిపోయినట్లుగా డాక్టర్లు ప్రకటించారు.
దొంగతనం కోసం జరిగిన హత్య కాదని అనూజ్ మిత్రులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే హత్యకు జాతి విద్వేషం కూడా కారణం కాదని వారు చెప్పినట్లు తెలుస్తోంది. పోలీసులు జాతి విద్వేషాన్ని కారణంగా కొట్టిపడవేయలేదు. అన్ని కారణాలనూ పరిశీలిస్తున్నామని వారు తెలిపారు. అనుజ్ పార్ధివ శరీరాన్ని ఇండియా తీసుకురావడానికి అందరూ సహకరించాలని అతని తండ్రి సుభాష్ బిద్వే ఫేస్ బుక్ లో విజ్ఞప్తి చేశాడు. బ్రిటన్ లోనూ, ఇండియాలోనూ ఉన్న అతని మిత్రులంతా అందుకు సహాయపడాలని ఆయన విజ్ఞప్తి చేశాడు. అనుజ్ మృతదేహాన్ని ఇండియా రప్పించడానికి సహాయ పడాలని అనూజ్ బావ రాకేష్ బ్రిటన్, ఇండియాల ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేశాడు.
అనూజ్ బిద్వే లాంకాస్టర్ యూనివర్సిటీలో ‘మైక్రో ఎలాక్ట్రానిక్స్’ సబ్జెక్ట్ లో పి.జి చదువుతున్నాడు. అతని ఎనిమిది మంది మిత్రులంతా అదే యూనివర్సిటీలో చదువుతున్నారని తెలుస్తోంది. అతని మిత్రులు ఎనిమిది మంది కూడా భారతీయులే. ప్రస్తుతం వీరిని బ్రిటన్ పోలీసులు సంరక్షిస్తున్నారు. హత్య జరిగిన ఒక రోజు లోనే హంతకుడిని పోలీసులు అరెస్టు చేయడం ప్రశంసనీయం. హత్యకు గల కారణాలను కూడా పోలీసులు నిస్పాక్షికంగా విచారించవలసి ఉంది. పిన్న వయసులో మంచి భవిష్యత్తును ముందుంచుకుని హఠాత్తుగా ప్రాణాలు కోల్పోవలసి రావడం పట్ల దాదాపు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
యూరప్ దేశాలన్నింటా పొదుపు ఆర్ధిక విధానాలు అమలవుతున్న నేపధ్యంలోనూ, మల్టి కల్చరలిజం విఫలం అయిందని జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్ నుండి బ్రిటన్ ప్రధాని కామెరూన్ నుండి ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కోజీ వరకూ ప్రకటిస్తున్న నేపధ్యంలోనూ, పొదుపు ఆర్ధిక విధానాల అమలు వల్ల నిరుద్యోగం పెరిగిపోయి తగ్గిపోతున్న అవకాశాలకు తక్షణ కారణంగా విదేశీయులు కనపడుతున్న నేపధ్యంలోనూ, పశ్చిమ దేశాలలోని భారతీయులు తమ భద్రత పట్ల అప్రమత్తంగా ఉండవలసిన పరిస్ధితులు నెలకొని ఉన్నాయి.