అమెరికా, తాలిబాన్ ల మధ్య ఒప్పందం కుదిరినట్టే కుదిరి వెనక్కి వెళ్ళిందని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపింది. చివరి నిమిషంలో ఒప్పందంలోని అంశాలకు హమీద కర్జాయ్ తీవ్ర అభ్యంతరం చెప్పడంతో ఒప్పందం సాధ్యం కాలేదని ఆ పత్రిక తెలిపింది. ఈ ఒప్పందం ఫలితంగా గ్వాంటనామో బే జైలు లో నిర్బంధంలో ఉన్న ఐదుగురు తాలిబాన్ నాయకులను అమెరికా విడుదల చేయవలసి ఉంటుంది. అందుకు బదులుగా తాలిబాన్ బహిరంగంగా టెర్రరిజాన్ని వదులుకోవడానికి సిద్ధపడినట్లుగా తెలుస్తోంది. హమీద్ కర్జాయ్ అభ్యంతర పెట్టిన అంశాలు ఏమిటన్నదీ పత్రిక వెల్లడించలేదు.
శుక్రవారం ఈ విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వెల్లడించింది. ఇరు పార్టీల మధ్య మొదటిసారిగా నిజాయితీతో కూడిన ఒప్పందానికి దగ్గరగా వచ్చారని ఆ పత్రిక అభివర్ణించింది. గత సంవత్సర కాలంగా ఈ శాంతి చర్చలు సాగుతున్నాయనీ, ఆఫ్ఘనిస్ధాన్ లో త్వరగా సైన్యాన్ని ఉపసంహరించే దిశగా ఒబామా ఈ చర్చలను ప్రారంభించాడనీ పోస్టు తెలిపింది. అమెరికా చర్చలు జరుపుతున్నది తాలిబాన్ లో ఏ సెక్షన్లతో అయిందీ తెలియడం లేదు.
నిజానికి తాలిబాన్ అనేకసార్లు అమెరికాతో చర్చలను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఆక్రమణ సేనలు ఆఫ్ఘనిస్ధాన్ గడ్డపై తిష్ట వేసి ఉన్నంతవరకూ విదేశీ శక్తులతో తాము చర్చలు జరిపేది లేదని తాలిబాన్ అనేకసార్లు ప్రకటించింది. తాలిబాన్ కి సంబంధించిన నాయకులతో చర్చలు జరుపుతున్నామని ఆఫ్ఘన్ ప్రభుత్వం, అమెరికాలు భావించినప్పటికీ తాము చర్చలు జరుపుతున్నది అసలు తాలిబాన్ కాదని అవి నిర్ఘాంతపోయిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. కొద్ది వారాల క్రితం ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ చర్చలతో విసుగుచెందినట్లు ప్రకటించాడు. చర్చలు జరిపేది ఏమన్నా ఉంటె పాకిస్ధాన్ తోనే జరపాలనీ, వారిని వదిలి తాలిబాన్ తో చర్చలు జరపడం వ్యర్ధమనీ ఆయన ఆగ్రహంతో ప్రకటన చేయడం జరిగింది. అయినప్పటికీ ఇంకా తాలిబాన్ తో చర్చలు జరుపుతున్నామనీ, అవి ముందంజలో ఉన్నాయని అమెరికా చెప్పడం ఎంతవరకు నిజమో భవిష్యత్తే చెప్పాలి.
గత నెలలో కుదిరిన ఒప్పందం ప్రకారం తాలిబాన్ ఖైదీలను కతార్ కి తరలించి అక్కడ గృహ నిర్బంధంలో ఉంచవలసి ఉంది. కతార్ లో తాలిబాన్ కార్యాలయం తెరవడానికి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇరు పక్షాలు ఇంకా ఇతర చర్యలు ఒప్పందం కింద తీసుకోవలసి ఉందని అమెరికా, యూరప్ లకు చెందిన గుర్తు తెలియని వర్గాలను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. ప్రస్తుతానికి చర్చలన్నీ ఆగిపోయాయనీ వచ్చే సంవత్స్రం మళ్ళీ మొదలవుతాయనీ ఆ వర్గాలు చెప్పాయి. పాకిస్ధాన్ తో ఒకవైపు ఘర్షణలు సాగుతుండగానే ఆ దేశంతో సంబంధం లేకుండానే చర్చలు పురోగతి సాధిస్తున్నాయని చెప్పడం అనుమానం కలిగిస్తోంది.
ఆఫ్ఘన్, పాకిస్ధాన్ దేశాలకు చెందిన తాలిబాన్ గ్రూపులలో పాక్ సైన్యం, ఐ.ఎస్.ఐ లకు సంబంధాలున్నాయన్నది బహిరంగ రహస్యం. ఈ తాలిబాన్ గ్రూపుల సహకారం లేకుండా అమెరికా ఎన్ని చర్చల నాటకాలు జరిపినా అవి పూర్తిగా వ్యర్దంగా మిగులుతాయి. ఆఘ్గనిస్ధాన్ నుండి గణనీయ మొత్తంలో తన సైన్యాన్ని తగ్గించడానికి చూస్తున్న అమెరికాకి ఏదో ఒక సాకు ఇప్పుడు అవసరం. తడిసి మోపెడు అవుతున్న యుద్ధ ఖర్చులు తగ్గించుకోవడానికీ, త్వరలో జరగనున్న ఎన్నికలలో ప్రచారానికీ, ఆఫ్ఘనిస్ధాన్ లో సైన్యాన్ని బాగా తగ్గించుకోవలసి ఉంది. కాని ఆఫ్ఘనిస్ధాన్ లో ఇంకా విజయం అమెరికా దరిదాపులకి కూడా రాలేదు. ఏమీ సాధించకుండా ఆఫ్ఘనిస్ధాన్ ఎందుకు పోయినట్లని అమెరికా ప్రజలు ప్రశ్నిస్తే అమెరికా ప్రభుత్వం వద్ద ఇప్పుడు సమాధానం సిద్దంగా లేదు. ఉపసంహరణ నాటికైనా ఏదో ఒక కారణాన్ని సృష్టించుకోవాలి. దానిలో భాగంగానే తాలిబాన్ తో చర్చలు పురోగతిలో ఉంటున్నాయి తప్ప వాస్తవంలో తాలిబాన్ అమెరికాతో చర్చలు ఇప్పుడు సిద్ధంగా లేదు. ఇప్పటికే చర్చలలో పాల్గొంటున్నవారి వల్ల యుద్ధంలో మార్పులు సంభవిస్తాయని నమ్మలేము.