‘టీం అన్నా’ ఆందోళనను ను తూర్పారబట్టిన బోంబే హై కోర్టు


టీం అన్నా శుక్రవారం అనూహ్య రీతిలో బోంబే హై కోర్టు నుండి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంది. తమ ఆందోళన ప్రజా ప్రయోజనాల కోసమే అని గట్టిగా నమ్ముతున్న టీం అన్నా బృందానికి కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. “మీ ఆందోళన ప్రజా ప్రయోజనాల కోసమేనని కోర్టు నిర్ణయించలేదు. మీరు జరుపుతున్న ఆందోళన మీకు ‘సత్యగ్రహం’ కావచ్చు. ఇతరులకు అది ‘న్యూసెన్సు’ కావచ్చు” అని కోర్టు అన్నా బృందం వాదనలను తిరస్కరించింది. బోంబే హైకోర్టు వ్యాఖ్యలు అన్నా బృందానికి గట్టి దెబ్బ కాగా, కేంద్ర ప్రభుత్వం చేస్తూ వస్తున్న వాదనలకు గట్టి మద్దతు దొరికినట్లయ్యింది. ప్రజా స్వామ్యంలో పార్లమెంటు పని ప్రాధాన్యతను గుర్తించాల్సిందేనని కోర్టు, అన్నా బృందానికి పరోక్షంగా సూచించింది. ఎం.ఎం.ఆర్.డి.ఎ గ్రౌండు ను తమకు ఉచితంగా గానీ, రాయితీ ఫీజుకి గానీ ఇవ్వవలసిందిగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అన్నా బృందం తమ పిటిషన్ లో చేసిన విజ్ఞప్తిని బోంబే హై కోర్టు తిరస్కరించింది.

పార్లమెంటులో చర్చ జరుగుతున్న ‘లోక్ పాల్’ బిల్లుపై ఆందోళన జరపడాన్ని కూడా బోంబే హై కోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. ‘లోక్ పాల్’ బిల్లుపైన చర్చ జరపడానికి పార్లమెంటు మొత్తం కేంద్రీకరించి ఉన్న సమయంలో ‘సమానాంతర ప్రచారాన్ని’ తాము అనుమతించలేమని కోర్టు నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పింది. “బిల్లుపై జరుగుతున్న చర్చతో పార్లమెంటు నిమగ్నమై ఉన్న ఈ సమయంలో సమానాంతర ప్రచారాన్ని మేము అనుమతించలేము. మీరు ఇంటివద్ద కూర్చుని బిల్లు విషయమై ప్రచారం చెయ్యవచ్చు. ఇప్పటివరకు బిల్లు ఆమోదం పొందలేదు. బిల్లు ఏ రూపంలో ఉన్నదీ, అందులో ఏ అంశాలు ఉన్నదీ ఎవరికీ తెలియదు. ఈ దశలో ప్రజా చర్చ అనుమతించదగినదేనా?” అని కోర్టు అన్నా బృందం లాయర్ ను ప్రశ్నించింది.

అన్నా బృందం ఆందోళనను కూడా కోర్టు ఆమోదించలేదు. పార్లమెంటులో లోక్ బిల్లు ప్రవేశపెట్టినపుడే ఆందోళన చేయడం సరికాదని కోర్టు భావించింది. ఆందోళనలో ప్రజా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పడాన్ని ప్రశ్నించింది. “దేశ ప్రయోజనాలు ఇందులో ఎలా ఇమిడి ఉన్నాయి? మనది ప్రజాస్వామిక వ్యవస్ద. మనం ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము. పార్లమెంటు పనిలో మీ ఆందోళన జోక్యం కలుగుజేసుకోవడం లేదా?” అని బెంచి సభ్యుడు జస్టిస్ మజుందార్ ప్రశ్నించాడు. “బిల్లు విషయం పార్లమెంటు చర్చ జరుపుతుంది. పార్లమెంటులో ఎన్నికైన ప్రతినిధులు మనం చెప్పదలుచుకున్న వాదనను ప్రవేశపెడతారు” అని కోర్టు తెలిపింది.

రాజ్యాంగాన్నీ, చట్టాన్నీ సమున్నతంగా నిలుపుతామని, జడ్జిలుగా తాము ప్రమాణం చేశామని బోంబే హై కోర్టు తెలిపింది. “ఏ చట్టం ప్రకారం మీరు (పిటిషనర్) రాయితీ కోరుతున్నారు? మీ దృష్టిలో మీరు చేస్తున్నది ‘సత్యాగ్రహం’ కావచ్చు. కాని మరికొంతమంది ఇతరులకు అది ‘న్యూసెన్స్’ కావచ్చు” అని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. అన్నా బృందం తలపెట్టిన ఆందోళన ప్రజల ప్రయోజనాల కోసం తలపెట్టిందా లేక రాజకీయ ప్రయోజనాల కోసం తలపెట్టిందా అన్న విషయమై తాము ఒక అవగాహనకు రాలేకపోతున్నామని కోర్టు తెలిపింది. ఎం.ఏం.ఆర్.డి.ఎ మైదానాన్ని తక్కువ ఫీజుకి ఇప్పించాలని అన్నా బృందం కోరడమే కాక అజాద్ మైదాన్ లో మూసి ఉన్న ప్రాంతానికి సంబంధించిన గేట్లను పూర్తిగా తెరిపించాలని కూడా అన్నా బృందం పిటిషన్ లో కోరింది. ఈ విధంగా అజాద్ మైదాన్ గేట్లను తెరవాల్సిందిగా తాము ఆదేశించలేమని కోర్టు పేర్కొంది.

అజాద్ మైదాన్ ఆందోళన జరగడానికి అవకాశమున్న మరొక వేదిక గా తెలుస్తోంది. పార్లమెంటులో ప్రవేశపెట్టబడిన లోక్ పాల్ బిల్లుకి వ్యతిరేకంగా అన్నా బృందం మూడు రోజుల పాటు నిరాహార దీక్ష తలపెట్టిన విషయం విదితమే. డిసెంబరు 27 నుండి ఈ దీక్ష ప్రారంభం కానున్నది. మైదానంలో హాజరయ్యే జనానికి మరింత గ్రౌండ్ అందుబాటులోకి తేవడానికి ‘ఆజాద్ మైదాన్’ తెరిపించాలని అన్నా బృందం కోరింది. “అటువంటి అంశాలని కోర్టు నిర్ణయించలేదని చెప్పదలిచాము. ఈ ఆందోళన ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించిందా లేక రాజకీయ ప్రయోజనాల కోసం తలపెట్టిందా అన్న విషయంలో ఒక అవగాహనకి ఈ కోర్టు రాలేకపోతున్నది” అని జస్టిస్ పి.బి.మజుందార్, జస్టిస్ మృదులా భట్కర్ ల తో కూడిన డివిజన్ బెంచి తెలిపింది. జాగృత్ నాగరిక్ మంచ్ సంస్ద దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విచారిస్తోంది. ఈ సంస్ధ అన్నా హజారే నేతృత్వంలోని ‘ఇండియా అగైనెస్ట్ కరప్షన్’ సంస్ధకు అనుబంధితంగా తెలుస్తోంది.

ఎం.ఎం.ఆర్.డి.ఎ గ్రౌండ్ ను తక్కువ ఫీజుకి కేటాయించాలని ఆదేశించడానికి, పిటిషనర్లు జాతీయ కార్యక్రమం తలపెట్టారని చెప్పడానికి వీలు లేదని జస్టిస్ మజుందార్ తెలిపాడు. పిటిషనర్ రిజిష్టర్ అయిన సామాజిక సంస్ధ కానందున ఈ విధమైన రాయితీకి ఆదేశించలేమని కూడా కోర్టు తెలిపింది. ఎం.ఎం.అర్.డి.ఎ తన మైదానన్ని రిజిష్టర్ అయిన సామాజిక సంస్ధలకు మాత్రమే రాయితీకి ఇస్తుందని కోర్టు గుర్తు చేసింది. రిజిష్టర్ అయిన మరొక సంస్ధ పేరుతో తాము మళ్లీ దరఖాస్తు చేసుకుంటామని పిటిషనర్ లాయర్ మహేంద్ర ఘెలాని కోర్టుకి చెప్పాడు. దానికి కోర్టు అంగీకరిస్తూనే ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎం.ఎం.డి.ఆర్.ఎ తన విచక్షణాధికారాలను ఉపయోగించి, మెరిట్ ప్రాతిపదికన గ్రౌండు కేటాయిస్తుందని పిటిషనర్ న్యాయవాదికి తెలిపింది. ఆజాద్ మైదాన్ లో ఇరవై రెండు క్రికెట్ పిచ్ లు ఉన్నాయనీ, అది తెరిస్తే అవన్నీ పాడైపోతాయనీ అందువలన గేట్లు తెరవడం కుదరదనీ ‘క్రీడలు, యువజన సర్వీసుల విభాగం’ కోర్టుకి అంతకు ముందు తెలిపింది.

బోంబే హై కోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు తమకు ఎదురే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్న అన్నా బృందానికి గట్టి షాక్ లాంటిది. గత కొన్ని నెలలుగా అన్నా బృందం తాము తలపెట్టినవన్నీ సరైనవేనని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. తమకు వచ్చిన ఆలోచనలు, భావాలు తిరుగులేనివని భావిస్తున్నట్లుగా వారి ధోరణి తెలుపుతోంది. తమ వాదనలన్నీ కరెక్టేననీ, అవేవీ సవరణలు చేయదగ్గవి కావనీ, అందరూ ఆమోదించవలసిందేననీ భావిస్తున్న ధోరణిలో అన్నా బృందం ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రజా మద్దతు మరింత ప్రజాస్వామిక చర్చలకు దోహద పడాలే తప్ప ఎవరినీ ఆదేశాలు ఇచ్చే స్ధాయికి చేర్చరాదన్న అవగాహన అన్నా బృందానికి లోపించినట్లు కనిపిస్తోంది. ఆందోళన ప్రారంభకాలంలో అన్నా బృందం వ్యక్తం చేసిన ప్రజాస్వామిక భావాలు రాను రానూ కనుమరుగై, వారి వాదనలు ఏదో ఒక స్ధాయిలో అహంభావం నింపుకున్నట్లు కనిపిస్తున్నాయి.

లోక్ సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిని వ్యతిరేకిస్తూ ప్రచారం చేయడం అన్నా బృందానికి తగని పని. ఒక రాజకీయ పార్టీని ఎన్నికల్లో ప్రత్యక్షంగా వ్యతిరేకించడం ద్వారా ఆ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసున్న పార్టీలకు మద్దతు ఇస్తున్నట్లే నన్న వాదనను అన్నా బృందం అసలు స్వీకరించలేదు. తాము కాంగ్రెస్ కి వ్యతిరేకంగా మాత్రమే ప్రచారం చేస్తున్నామనీ, దాని వల్ల మరో పార్టీ లబ్ది పొందితే తాము బాధ్యులం కామనీ అహంభావపూరితంగా అన్నా బృందం ప్రకటించింది. ఇది ఆమోదనీయం కాజాలదు. ఒక విధానాన్ని రాజకీయ రంగంలో అనుసరిస్తున్నప్పుడు దాని వల్ల ఏర్పడే ప్రభావాలకు ఆ విధానాన్ని అనుసరిస్తున్నవారు బాధ్యత తీసుకోవలసి ఉంటుంది. అది ప్రజాస్వామిక సూత్రం. ప్రజా ప్రయోజనాల కోసం అంటూ ఆందోళన ప్రారంభించిన అన్నా బృందం చివరకి తమ ఒంటెత్తు ధోరణితో ఆ ప్రజా ప్రయోజనాలకే హాని జరిగే విధంగా ప్రవర్తించడం సరైంది కాదు.

ఒక రాజకీయ పార్టీని వ్యతిరేకించడం అంటే, ఆ పార్టీ కింద సమకూడిన ప్రజలను తమ ఉద్యమానికి దూరం చేసినట్లేనని అన్నా బృందం గ్రహించడం లేదు. తద్వారా ఒక సెక్షన్ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారన్న అభిప్రయాలు తలెత్తుతాయని అన్నా బృందం విస్మరించింది. అన్నా బృందం ఇప్పటికైనా తమ ఒంటెత్తువాద ధోరణులను పక్కనబెట్టి మరింత ప్రజాస్వామిక ధోరణులను అహ్వానించవలసి ఉంది.

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s