‘మతం ప్రజల పాలిట మత్తు మందు’ అని మాత్రమే “కారల్ మార్క్స్” అన్నాడా?


“మతం ప్రజల పాలిట మత్తు మందు” అని కారల్ మార్క్స్ అన్నాడని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ ఒక్కటి మాత్రమే మార్క్సు అని ఊరుకున్నాడా? లేదు. ఆయన మతానికి మత పెద్దలు కూడా ఇవ్వలేని విస్తృతమైన నిర్వచనాన్ని ఇచ్చాడు. ప్రజల దృక్పధంలోనుండి మతాన్ని కారల్ మార్క్స్ నిర్వచించాడు. ప్రజల దృక్పధంలోనుండి మతాన్ని ఎలా నిర్వచించవచ్చో, నిజానికి, మత సూత్రాలలో ఉద్దండ పండితులెవ్వరికైనా తెలిసి ఉంటుందని భావించలేము. వారంతా మతాన్ని దేవుడి దృక్పధంలో నుండి, మత పండితుల ఆత్యాధ్మిక తర్క జ్ఞానం నుండి నిర్వచించారే తప్ప అది మనిషి నుండి ఎలా ఉధ్భవించిందీ, మనిషి నుండి ఉద్భవించిన మతం, ఆ మనిషికి ఎలా ఊరటగా నిలిచిందీ, ఎలా మత్తుమందుగా మారిందీ నిర్వచించాడు. కారల్ మార్క్స్ మాటల్లోనే మతం అంటే ఏమిటో తెలుసుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది.

మతరాహిత్య విమర్శకు పునాది ఏమిటంటే: మనిషే మతాన్ని తయారు చేశాడు, మతం మనిషిని తయారు చేయలేదు. మతమన్నది, నిజానికి, ఇంకా తనను తాను జయించలేని లేదా తనను తాను మరొకసారి కోల్పోయిన మనిషి యొక్క ఆత్మ-చేతన (self-consciousness) మరియు ఆత్మ-గౌరవం (self-esteem). కాని, మనిషి, ప్రపంచానికి వెలుపల బాసింపట్లు వేసుకుని కూర్చున్న అమార్త జీవి కాదు. మనిషి, మనిషి యొక్క ప్రపంచం – రాజ్యం, సమాజం. ఈ రాజ్యం, ఈ సమాజం మతాన్ని సృష్టించింది. మతం, ప్రపంచం యొక్క తలకిందులుగా ఉన్న చైతన్యం. ఎందుకంటే వారు (రాజ్యం, సమాజం -అనువాదకుడు) తలకిందులుగా ఉన్న ప్రపంచం కనుక. మతం, ఈ ప్రపంచం యొక్క సాధారణ సిద్ధాంతం. మతం, ప్రపంచ విజ్ఞాన సర్వస్వం యొక్క సారం. మతం, ప్రపంచపు ప్రజాదరణ పొందిన రూపంలోని తర్కం. మతం, ప్రపంచపు అత్యాధ్మిక గౌరవాన్ని సమున్నతపరిచే అంశం. మతం ప్రపంచం యొక్క ఉత్సుకత, నైతిక నియమం, వైదిక అనుబంధితం (solemn complement), మరియు ప్రపంచపు ఊరటకూ, ఔచిత్యానికీ సార్వజనీన ప్రాతిపదిక. మానవ సారం (human essence) ఏ విధంగానూ నిజమైన వాస్తవికతను సంతరించుకోని పరిస్ధితుల్లో అది మానవ సారం యొక్క అద్భుతమైన సాక్షాత్కారం (fantastic realization). కనుక, మతానికి వ్యతిరేకంగా పోరాటం అంటే, పరోక్షంగా, ఏ ప్రపంచం యొక్క సర్వవ్యాపిత సూక్ష్మ లక్షణంగా (aroma) మతం ఉన్నదో ఆ ప్రపంచానికి వ్యతిరేకంగా పోరాటమనే అర్ధం.
మతపరమైన దుఃఖం అన్నది, ఒకే సమయంలో, వాస్తవ బాధల వ్యక్తీకరణే కాక ఆ వాస్తవ బాధలకి వ్యతిరేకంగా వ్యక్తమయ్యే నిరసన కూడా. మతం, అణచివేతకు గురవుతున్న ఒక జీవి విడిచే నిట్టూర్పు. హృదయం రహిత ప్రపంచానికి హృదయం, అత్మరహిత పరిస్ధితులకు ఆత్మ. అది ప్రజలపాలిట మత్తుమందు.

(వక్కాణింపులు అనువాదకుడివి కావు)

6 thoughts on “‘మతం ప్రజల పాలిట మత్తు మందు’ అని మాత్రమే “కారల్ మార్క్స్” అన్నాడా?

 1. “మతపరమైన దుఃఖం అన్నది, ఒకే సమయంలో, వాస్తవ బాధల వ్యక్తీకరణే కాక ఆ వాస్తవ బాధలకి వ్యతిరేకంగా వ్యక్తమయ్యే నిరసన కూడా. మతం, అణచివేతకు గురవుతున్న ఒక జీవి విడిచే నిట్టూర్పు. హృదయం రహిత ప్రపంచానికి హృదయం, అత్మరహిత పరిస్ధితులకు ఆత్మ. అది ప్రజలపాలిట మత్తుమందు.”
  మతం ప్రజల పాలిట మత్తుమందు అని మార్క్స్ చేసిన సూత్రీకరణ వెనుక విస్తృతార్థాన్ని చక్కగా అనువదించారు. ప్రపంచంలో ఉనికిలోకి వచ్చిన అన్ని భక్తి ఉద్యమాలను అణచివేతకు గురైన జీవి విడిచే నిట్టూర్పుగా అర్థం చేసుకుంటేనే, పోతన కావ్య వేదనను, అన్నమయ్య గీతాల అంతరార్థాన్ని, కబీర్ దాసు రామాయణాన్ని, త్యాగరాజు అజరామర సంగీత ధారను, ‘ఎవడబ్బ సొమ్మాని కులుకుతు తిరిగేవు రామచ్చంద్రా’ అంటూ సాక్షాత్తూ రాముడిపైనే తిరగబడిన రామదాసు సామాజిక నేపధ్యాన్ని మనం ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోగలం. ‘దుర్మధాంధులైన రాజులకు, కర్నాట కిరాత కీచకులకు తన కృతిని అంకితం ఇవ్వడం కంటే, తన పద్యాలను రాజులకు ధారపోయడం కంటే పొలం దున్నుకుని బతకటం గౌరవప్రదం’ అంటూ పోతన వర్ణించిన పద్యం పాలకులకు వ్యతిరేకంగా నాటి భక్తికవులు ఎన్నుకున్న తీవ్రనిరసనకు అద్దం పడుతుంది.

  “మతం, ఈ ప్రపంచం యొక్క సాధారణ సిద్ధాంతం. మతం, ప్రపంచ విజ్ఞాన సర్వస్వం యొక్క సారం.”
  మనిషి తయారు చేసిన మతం ప్రాతిపదిక గురించి ఇంత ఔన్నత్యంతో మరే తత్వవేత్త సూత్రీకరించలేదేమో. మతం మత్తుమందు అంటూ మార్క్స్ ఇచ్చిన గంభీర నిర్వచనంపై, అదేదో మతంపై తిట్టుపదంలాగా నెగటివ్ వ్యాఖ్యానాలు చేసి దాని సారాంశాన్ని తోసిపుచ్చడం పరమ అభ్యంతరకరం.

  “మానవ సారం (human essence) ఏ విధంగానూ నిజమైన వాస్తవికతను సంతరించుకోని పరిస్ధితుల్లో అది -మతం- మానవ సారం యొక్క అద్భుతమైన సాక్షాత్కారం (fantastic realization).”

  ఇది మతంపై మార్క్స్ పరమోన్నత భావన. మత, ధార్మిక సాహిత్యాన్ని, మన పౌరాణిక, ఐతిహాసక కావ్యాలను భక్తి ఉద్యమ కారుల అమోఘ కృషిని ఈ నేపధ్యంలోనే మనం గ్రహించాలి. మధ్యయుగాల పాలకుల పీడనను, జీవన దుర్భరత్వాన్ని ఎదుర్కోవడానికి ఏ సాధనాలూ సమాజానికి లేనప్పుడు, తమ కష్టాలు, కన్నీళ్లు, వ్యధలను భగవంతుడనే అమూర్తభావన ముందు విన్నవించుకుంటూ నీవే దిక్కు అంటూ భక్తి తత్వాన్ని జీవన తత్వంగా మార్చుకున్న వారు, ‘భగవంతుడు మినహా ఇక ఎవరూ తమకు ఆదర్శం కారం’టూ పాలకుల రాజ్యాధికారాన్ని, దురహంకారాన్ని తృణీకరించడం మధ్యయుగాల్లో ప్రజలు చేపట్టిన వ్యవస్థా వ్యతిరేక తీవ్ర నిరసనగానే చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా భక్తి ఉద్యమాలలోని ప్రగతి శీలాంశం ఇక్కడే ఉంది.

  మత పరమైన దుఃఖం అనేది వాస్తవ బాధల వ్యక్తీకరణే కాక ఆ వాస్తవ బాధలకి వ్యతిరేకంగా వ్యక్తమయ్యే నిరసన కూడా.
  ఇది మతం లోని అభ్యుదయాంశం.

  మతం, ప్రపంచం యొక్క తలకిందులుగా ఉన్న చైతన్యం.
  వాస్తవ ప్రపంచాన్ని తృణీకరించే క్రమంలో మానవ చింతనే తల్లకిందులు కావడం. జీవితంలోని దుర్భల పరిస్థితులకు వ్యతిరేకంగా ఎవరిపై, వేటిపై పోరాడాలో వారిపై, వాటిపై పోరాడటం కాకుండా తన చుట్టూ ఉన్న వాస్తవ ప్రపంచాన్ని తృణీకరించడం. భ్రమాన్విత నిరసన మార్గం చేపట్టడం. ఇది మతంలోని ప్రతికూల లక్షణం.

  మతం మత్తుమందు. ఒక నిర్దిష్ట చారిత్రక కాలంలో యావత్ సమాజానికి అవసరమైన మత్తుమందు. వాస్తవ ప్రపంచంనుంచి మనిషిని పక్కకు నెట్టిన మత్తుమందు. పరిష్కార మార్గం లభ్యంకాని అలనాటి సమాజాలకు తప్పనిసరిగా దక్కిన మత్తుమందు.

  మతంపై మార్క్స్ భావనను ఇలాగే నేను అర్థం చేసుకుంటున్నాను.

  మార్క్స్ మతంపై తన ఈ సూత్రీకరణను ఏ నేపథ్యంలో పేర్కొన్నాడో మీరిక్కడ కోట్ చేసి ఉంటే బాగుండేదనకుంటాను.

  ధన్యవాదాలు.

 2. మార్క్సిస్ట్ చారిత్రక భౌతికవాదం గురించి ప్రభాకర్ సాంజ్‌గిరి గారు వ్రాసిన “మనిషి కథ” పుస్తకం చదివారా? సమాజాన్ని భావం కంటే భౌతికతే ఎక్కువ ప్రభావితం చేస్తుంది. గొప్పగొప్ప డాక్టర్లు కూడా భావవాదమైన మతాన్ని నమ్ముతారు కానీ తమ ప్రాక్టికల్ జీవితంలో భౌతికవాదాన్నే ఆచరిస్తారు. ఎందుకంటే ప్రాక్టికల్‌గా భౌతికతని నమ్మకపోతే ఏ పనీ జరగదు కదా. కర్మవాదం (fate theory) & దైవ నిర్ణయం (god’s will) లాంటి వాటిని నమ్మేవాళ్ళకి మతం వల్ల నష్టమే ఉంటుంది కానీ ఊహలలో మతాన్ని నమ్ముతూ ప్రాక్టికల్ జీవితంలో భౌతికతని ఆచరించేవాళ్ళకి మతం వల్ల నష్టం ఉండదు.

 3. మార్టిన్ హీడెగ్గర్ గొప్ప నాస్తికుడే. కానీ పెట్టుబడిదారీ వర్గం వాళ్ళు మార్టిన్ హీడెగ్గర్‌ని ఎందుకు విమర్శించరు? నమ్మనిదాన్ని నమ్ముతున్నట్టు నటించడం ఇష్టం లేనివాళ్ళు పెట్టుబడిదారీ వర్గంలో కూడా ఉంటారు కదా. వీళ్ళ దృష్టిలో నమ్మకం పెద్ద సమస్య కాదు. ఆర్థిక అసమానతలు లేని సమసమాజ స్థాపన అంటే ఒక వర్గంవాళ్ళకి నచ్చదు. దాని గురించి డైరెక్ట్‌గా చెప్పలేక మతం పేరుతో విమర్శిస్తారు. కమ్యూనిజాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన రోనాల్డ్ రీగన్, సద్దాం హుస్సేన్‌లు కూడా తాము ప్రైవేట్ ఆస్తి కోసమే కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పుకున్నారు కానీ మతం కోసం కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పుకోలేదు. కేవలం మతం పేరు చెప్పి కమ్యూనిజాన్ని విమర్శించేవాళ్ళు ఉన్నది ఇండియాలోనే.

 4. అయ్యో రామ జీసస్ అల్లా !!

  ఏమి జరుగుతున్నది ఇచ్చట?

  మతాన్ని మతం గా చూచినా మతం గా ఆచరించినా

  ”తన మత మెమో తనది మన మత మసలే పడదోయ్” అనే పాత పాట లానే ఉంటుంది.

  …….

  మనిషి(జీవుడు) పుట్టాడు, తనతో పాటు తన చుట్టూ ఉన్నదాన్నంత కలిపి ”జగత్తు” అన్నాడు దీన్నంతా ఎవడు సృష్టించాడయ్యా అని ప్రశ్న తానె వేసుకుని ఎవడైతే సృష్టించి ఉంటాడో వాడికి ”దేవుడని” పేరు పెట్టాడు.

  ఎక్కడైతే, ఎవరి ద్వారానైతే ‘హృదయం తాకే’ ”మహిమ” వ్యక్తమౌతుందో అది/వారినల్లా ”దేవుడు” అనటం మొదలు పెట్టాడు.

  మనం చాల సందర్భాలలో వింటూ ఉంటాం ” సమయానికి దేవుడి లా వచ్చాడు రా” అని

  సో, అలా దేవుడు అనే అస్థిత్వానికి సమకాలీన ఉనికితో బలపరుస్తున్నాం !!

  శ్రీకృష్ణుడు కావచ్చు గౌతమ బుద్ధుడు కావచ్చు జీసస్ క్రైస్ట్ కావచ్చు మహమ్మద్ ప్రవక్త కావచ్చు గురునానక్ కావచ్చు షిరిడి సాయినాథుడు కావచ్చు …. ”ఖలేజ సినిమాలో కథానాయకుడు” కావచ్చు

  వీరంతా అనాది కాలం నుంచి చలామణి లో అద్వితీయ అస్థిత్వానికి ప్రతీకలు గా పరిగనించ బడుతున్నారు.

  వీరి కాలం లో వీరి ద్వారా వ్యక్తమైన దేదో అది తరువాతి కాలం వారికి మార్గదర్శకం అవుతుంది

  అయితే అందులో శాస్త్రీయత పాళ్ళల్లో తారతమ్యాలు కనిపించటం చేత

  మనం ఇలా బుర్రలు బాదుకుంటున్నాం అన్నమాట !!

  అందుకే మతాన్ని రిలీజియన్ గా చూడకుండా spiritual దృష్టి తో చూచినప్పుడు అంతా ఒక్కతీరుగా కనిపిస్తుంది.

  సరస భారతి ఉయ్యూరు వారి బ్లాగ్ లో సంవత్సరం క్రితం చదివాను ఒక ముస్లిం సోదరుడు జిహాద్ ని ఇలా నిర్వచించాడు

  జీహాద్ – నీలో సంచిత కాలం నుంఛి పేరుకు పోయిన అరిషడ్ వర్గాలపై యుద్ధం చేసి వాటిని జయిన్చటమే పవిత్ర యుద్ధం అని ….

  మనుష్యుడుఏమి విత్తునో ఆ పంటనే కోయును (గలతి 6:7)” ఇది భగవద్గీత చెప్పే కర్మ సిద్ధాంతానికి సరిగ్గా (కొంచెం ఎక్కువ కాదు కొంచెం తక్కువ కాదు ) సరిపోయింది.

  ఇలా చెప్తూ పోతే ఎన్నెన్నో

  ఇస్లామ్ లోని రుజుమార్గ ”రుజువర్తనం”, క్రైస్తవం లోని ”మారుమనస్సు” నొందటం అలానే హైందవ ధర్మలోని ”కర్మ భక్తి యోగ జ్ఞాన మార్గాలు” అన్నీ కూడాను

  మానవ జన్మను పరిపూర్ణం చేసుకోవటం ఎలానో బోధించేవి ఆచరణ ద్వారా సార్ధకత ను కలిగించేవి.

  ఇవన్నీ కూడా ఇక్కడ ఎవరికీ తెలియనివి కావు, అయితే ఇలాంటి విషయాల్లో పునరుక్తి దోషం లేదు.

  ”వాదన వేదన కొరకే” అంచేత …

  వ్యక్తి ప్రవర్తన, క్రమ శిక్షణ అనేది social factor (సామాజికం) మరియు ethical factor (నైతికం) ముందు ఈ step దాటితే ఆతరువాత religious factor (మతం/ధర్మం) ఆపై spiritual factor(ఆధ్యాత్మికం) సంగతి.

  మానవత్వమే మనందరి మతం కదా !!

  ఇతరులకు మంచి చేయక పోయినా పర్లేదు కీడు చేయకుంటే చాలు అనేది అందరు ఒప్పుకుంటారు కదా!! సో

  విశేఖర్ గారు ఇక ఈ పోస్ట్ కి Full stop పెట్టేయండి.

 5. శేఖర్‌ గారు,
  ఇన్ని రోజులుగా ఈ పొష్టు చూడనే లేదు. మీ పొష్టుతో పాటు రాజశేఖర్‌ రాజు గారి వివరణ చాలా బాగున్నాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s