కొత్త సంవత్సరంలో యూరప్ సంక్షోభం ప్రపంచం అంతా వ్యాపిస్తుంది -యూరప్ సెంట్రల్ బ్యాంక్


యూరప్ రుణ సంక్షోభం కొత్త సంవత్సరంలో తన విశ్వరూప చూపిస్తుందనీ, అది ప్రపంచం అంతా వ్యాపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనీ యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఇ.సి.బి) సీనియర్ అధికారులు పేర్కొన్నారు. ప్రపంచం అంతటికీ వ్యాపించడమే కాక సంక్షోభం మరింత తీవ్రం కానున్నదని వారు తెలిపారు. యూరప్ లో సంక్షోభంలో ఉన్న దేశాలకు సహాయ పడే నిమిత్తం ఐ.ఎం.ఎఫ్ కు నిధులు ఇవ్వడానికి బ్రిటన్ నిరాకరించడంతో ఈ పరిస్ధితి తలెత్తుతుందని అధికారులు తెలిపారు. ఐ.ఎం.ఎఫ్ కు బ్రిటన్ ఇరవై ఐదు బిలియన్ యూరోలు ఇవ్వాలని యూరోపియన్ దేశాల సమావేశాలు నిర్ణయించగా బ్రిటన్ అందుకు నిరాకరించింది.

యూరోపియన్ యూనియన్ దేశాలు మరింత కఠినమైన ఫిస్కల్ విధానాలు అవలంబించాలనీ, బడ్జెట్ లపై నిర్ణయాధికారాన్ని కొంతవరకూ వదులుకోవాలనీ, తద్వారా యూరప్ దేశాలకు ఒకే కోశాగార విధానాలు, కోశాగార క్రమశిక్షణ అమలు చేయాలనీ కొద్ది రోజుల క్రితం జరిగిన శిఖరాగ్ర సమావేశంలో నిర్ణయించాయి. ఈ ప్రతిపాదన ఆమోదం పొందాలంటే యూరోపియన్ యూనియన్ ఏర్పాటుకి దారి తీసిన లిస్బన్ ట్రీటీ లో మార్పులు చేయవలసి ఉంటుంది. బడ్జెట్ పై నిర్ణయాధికారాలనూ, ఇతర కోశాగార విధానాలపైన స్వతంత్రతనూ వదులుకోవడానికి ఇష్టపడని బ్రిటన్, లిస్బన్ ట్రీటీ సమీక్షకు గట్టిగా నిరాకరించింది. దానితో ఇ.యు లో బ్రిటన్ ఏకాకిగా మిగిలింది. లిస్బన్ ట్రీటీ సమీక్ష నిర్ణయాన్ని ఇంగ్లండు వీటో చేయడంతో సమావేసాలు పెద్దగా ప్రగతి లేకుండానే ముగిశాయి.

ఈ విధంగా బ్రిటన్ ఇవ్వవలసిన పాతిక బిలియన్ 25 బిలియన్ యూరోల సహాయం ఇవ్వనందున ఆ ప్రభావం సంక్షుభిత దేశాలపై తీవ్రంగా పడనుందనీ, సంక్షుభిత దేశాలకు సకాలంలో సహాయం అందనట్లయితే సంక్షోభం యూరప్ అంతా వ్యాపించి, ఆ తర్వాత ప్రపంచాన్ని చుట్టివేయడం ఖాయమని ఇ.సి.బి అధికారులు చెబుతున్నారు. ఆర్ధిక ఉద్రిక్తతలు ఇప్పుడు ‘వ్యవస్ధాగత సంక్షోభం స్ధాయి నిష్పత్తులకు’ చేరుకుందనీ, ఇది 2008లో లేమాన్ బ్రదర్స్ కుప్పకూలిపోయినప్పటి పరిస్ధతులను సరిపోలుతున్నాయనీ ఇ.సి.బి అధికారులు హెచ్చరించారు. రాజకీయ నాయకులు సకాలంలో స్పందించడంలో విఫలం అవుతుండడంతో ఈ పరిస్ధితి ఏర్పడుతున్నదని వారు హెచ్చరించారు.

లండన్ ను పక్కన బెట్టే రహస్య పధకం ఏదీ యూరోప్ వద్ద లేదని చెప్పడానికి, తద్వారా ఇంగ్లండుకు నచ్చజెప్పడానికి జర్మనీ ప్రభుత్వం తన విదేశాంగ మంత్రి గిడో వెస్టర్ వెల్లె ను పంపినప్పటికీ ఆ ప్రయత్నం పెద్దగా సఫలం కాలేదు. జర్మనీ విదేశాంగ మంత్రి లండన్ తో మాట్లాడుతుండగానే యూరప్ దేశాలు కాన్ఫరెన్స్ కు పిలుపివ్వగా అందులో కూడా ఐ.ఎం.ఎఫ్ వనరులను జి20 దేశాల వ్యాపితంగా విస్తరింపజేయాలన్న ఆలోచనను వ్యతిరేకిస్తామని బ్రిటన్ స్పష్టం చేసింది. బ్రిటన్ మహా ఇస్తే పది బిలియన్ పొండ్లు ఇవ్వగలదేమో గానీ పాతిక బిలియన్ పౌండ్లు ఇవ్వడం కష్టమేనని ‘ది గార్డియన్’ పత్రిక అభిప్రాయపడింది. కాన్ఫరెన్స్ కాల్ అనంతరం 200 బిలియన్ యూరోలకు బదులు కేవలం 150 బిలియన్ యూరోలే సమకూరాయని ఇ.యు రాజధాని బ్రసెల్స్ నుండి వార్తలు వెలువడ్డాయి.

చైనా పర్యటనలో ఉన్న ఐ.ఎం.ఎఫ్ మాజీ ఎం.డి డొమినిక్ స్ట్రాస్ కాన్, యూరప్ నేతల బలహీన నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. పరిష్కార మార్గాలను వెతకడానికి యూరో జోన్ కి కేవలం కొన్ని వారాలు మాత్రమే ఉన్నాయని ఆయన హెచ్చరించాడు. సంక్షోభం పై జనవరి ఆఖరులో మరొక సమావేశం ఏర్పాటు చేయాలని ఇ.యు దేశాలు ఇప్పటికే నిర్ణయించాయి. 2012 సంవత్సరం లోని మొదటి మూడు నెలల్లోనే 230 బిలియన్ యూరోల బ్యాంకు బాండ్లు, 300 బిలియన్ యూరోల సావరిన్ బాండ్లు, 200 బిలియన్ యూరోల సి.డి.ఓ (కోలేట్రలైజ్డ్ డెట్ ఆబ్లిగేషన్స్) లు పరిపక్వానికి వచ్చి చెల్లింపులకు రానున్నాయని ఇ.సి.బి అధ్యక్షుడు ద్రాఘి వెల్లడించాడు. ‘యూరో’ బలం పైనా, దాని శాశ్వతత్వంపైనా, దానిని వెనక్కి మళ్ళించలేమన్నదానిపైనా తనకు ఎట్టి అనుమానాలు లేవని చెబుతూనే ఆయన ఇ.సి.బికి దీర్ఘ కాలిక ప్రాతిపదికన మరియు ఇంకా అధికం చేశే ప్రాతిపదికన సావరిన్ బాండ్లను కొనవలసిన బాధ్యత లేదని పునరుద్ఘాటించాడు.

“మేము క్రెడిట్ క్రంచ్  రాకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాము. బ్యాంకులకు నిధులు అందక పోవడం నుండే ఈ క్రెడిట్ క్రంచ్ ఏర్పడుతుంది” అని ద్రాఘి తెలిపాడు. ఇసిబి ఆర్ధిక, ద్రవ్య స్ధిరత్వం పట్ల జాగ్రత్త వహించ గలదనీ కాని అది ఇతర యూరోపియన్ సంస్ధల అధికారాలకు భంగం కలగకుండా నిర్వర్తించవలసి ఉంటుందనీ తెలిపాడు. లండన్ నగర ద్రవ్య కార్యకలాపాలకు ఒక విధమైన రక్షణ ఏర్పాట్లు కల్పించడం ద్వారా చర్చలను తిరిగి ప్రారంభించాలని జర్మనీ ప్రయత్నాలు చేస్తోంది. పది రోజుల క్రితం అర్ధంతరంగా ముగిసిన ఇ.యు సమావేశాల వల్ల కల్గిన నష్టాన్ని పూడ్చడానికి తీవ్రంగా శ్రమించవలసి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇంగ్లండు లిస్బన్ ఒప్పందానికి సవరణలు చేయడానికి అంగీకరించనప్పటికీ ఇ.యు ముందు కెళ్లడంలో ఎటువంటి ఆటంకం కలగదని ఇంగ్లండు చెబుతోంది. ఇతర ఇ.యు దేశాలు కూడా ఇంగ్లండు వల్ల వచ్చిన సమస్యలు సమసి పోతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇ.యు దేశాల మాటలు కాదనీ, తమకు కావలసింది చేతలేననీ మార్కెట్ వర్గాలు కోరుతున్నాయి. యూరప్ నాయకులు చివరి నిమిషం వరకూ కదలని తత్వంతో మార్కెట్లు విసిగి పోయాయని మదుపుదార్లు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే ఈ యూరోపియన్ యూనియన్ దేశాలు నిండా మునిగి ఉన్న లిస్బన్ ఒప్పందం సమీక్ష వ్యవహారం గానీ, కొత్తగా చేసుకోదలుచుకున్న ఒప్పందంగానీ వేటితోనూ యూరప్ ప్రజానీకానికి సంబంధం లేకపోవడమే ఇక్కడ అసలు విషయం. ఇరవై ఏడు దేశాలు కలిసి తమ తమ దేశాల వ్యాపార, వాణిజ్య, ధనిక వర్గాల కార్యకలాపాల గురించే చర్చించుకుంటున్నాయే గానీ విశాల ప్రజానీకపు భవిష్యత్తును మెరుగుపరిచే చర్చలేవీ వారు చేయడం లేదు. పైగా కొత్త కొత్త ఒప్పందాల వలన ప్రజల జీవితాలు మరింతగా దుర్భరం కానున్నాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s