ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఇల్ మరణం చైనాకు ఒకింత భయాన్ని మిగిల్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కిమ్ జోంగ్-ఇల్ మరణంతో తాము ‘ఆందోళనకూ, అసౌకర్యానికీ’ గురయినట్లుగా చైనా ప్రభుత్వం తెలిపింది. దీనిని నిజానికి ‘షాక్ కి గురయ్యామని’ చైనా చెప్పినట్లుగా భావించవచ్చని రాయిటర్స్ భాష్యం చెప్పింది. కొరియా ప్రాంతంలో చైనా ప్రభావానికి ఉత్తర కొరియా వాహకంగా ఉంటూ వచ్చింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఇల్ ఎంతగా చైనాను విసిగించినప్పటికీ, చైనా ఎంత విసిగినప్పటికీ ఆసియాలో, ఆ మాటకొస్తే ప్రపంచంలోనే ఉత్తర కొరియా, చైనాకు నమ్మకమైన మిత్రుడిగా ఉంటూ వచ్చింది. కిమ్ మరణంతో అతని తర్వాత అధికారం చేపట్టనున్నవారు చైనాతో మిత్రత్వం కొనసాగనిస్తారా లేదా అన్నదే చైనా అందోళనంతా.
ఉత్తర కొరియా అణు కార్యక్రమం ప్రపంచ రాజకీయాల్లోని ఒకానొక అంశంలో చైనా ప్రముఖ పాత్ర నిర్వహించే అవకాశాన్ని కల్పించింది. ఉత్తర కొరియా అణు కార్యక్రమాన్ని అదుపులో ఉంచడానికి అమెరికా తదితర పశ్చిమ దేశాలకు చైనా తోడ్పడుతూ వచ్చింది. ఆ విధంగా పశ్చిమ దేశాల వద్ద చైనాకు కొంతమేరకు పలుకుబడి ఏర్పడి ఉంది. కిం జోంగ్-ఇల్ మరణంతో చైనాకు ఉన్న ఈ పలుకుబడి అవకాశం ప్రమాదంలో పడినట్లయింది. ఉత్తర కొరియాకు కూడా చైనా అండదండలు అవసరం అయినందున చైనా, ఉత్తర కొరియాల మితృత్వం కొనసాగుతూ వచ్చింది. ఉత్తర కొరియాకు చైనా ఏకైక మిత్రుడుగా, పెద్దన్నగా కొనసాగింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తో చైనా విసిగిపోయిందంటూ వికీలీక్స్ వెల్లడించిన డాక్యుమెంట్ల ద్వారా అమెరికా రాయబారి అభిప్రాయపడినట్లుగా వెల్లడయ్యింది. అది వెల్లడయ్యాక కూడా చైనా, ఉత్తర కొరియాల సంబంధాలు భేషుగ్గానే కొనసాగాయి.
కిమ్ మరో రెండు సంవత్సరాలయినా బతికి ఉంటాడని చైనా నాయకులు భావించారని హఠాత్తుగా చనిపోవడంతో రాజకీయ, ఆర్ధిక సంబంధాల సమీక్ష ఎక్కడికక్కడే ఉండిపోయి ఉండవచ్చుననీ, కిమ్ మరణానికి తగిన విధంగా ఇరు దేశాలూ సిద్ధం అయి ఉండకపోవచ్చుననీ విశ్లేషకులు భావిస్తున్నారు. కిమ్ అనంతరం అధికారంలోకి వస్తాడని భావిస్తున్న అతని కుమారుడు కిమ్ జోంగ్-ఉన్ అనుసరించే వైఖరినిబట్టే చైనా దృక్పధం ఆధారపడి ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. గత సంవత్సరంన్నర కాలంలో కిమ్ చైనా నాలుగు సార్లు పర్యటించి తన కుమారుడికి కూడా చైనా మద్దతునిచ్చేలా హామిని పొందిన విషయాన్ని కొందరు విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తుకు తెస్తున్నారు. కిమ్ కుమారుడు ఎంత త్వరగా అధికారం చేజిక్కించుకుంటాడన్న విషయం పైన కూడా ఉత్తర కొరియాకు సంబంధించిన అంతర్జాతీయ రాజకీయాలు ఆధారపడి ఉండవచ్చు.
చైనా, ఉత్తర కొరియాల మధ్య 1415 కి.మీ సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు పొడవునా పరిస్ధితి స్ధిరంగా ఉండేలా చూడవలసిన అవసరం చైనాకు ముంచుకొచ్చింది. సరిహద్దు వెంబడి సైన్యాన్ని చైనా అప్రమత్తం చేసి ఉండవచ్చని విశ్లెషకులు భావిస్తున్నారు. వచ్చే సంవత్సరం చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు హు జింటావో కూడా గద్దె దిగి మరొకరికి నాయకత్వాన్ని అప్పగించవలసి ఉన్న నేపధ్యంలోనూ ఉత్తర కొరియా లో సంభవించిన పరిణామం ఒక విధమైన అసౌకర్యాన్ని చైనాకు మిగిల్చింది. ఉత్తర కొరియా స్ధిరత్వమే చైనా కి గల పెద్ద ఆందోళన అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే కిమ్ జోంగ్-ఇల్ మరణంతో ఉత్తర కొరియాలో ఆర్ధిక సంస్కరణలకు చోటు దొరకవచ్చన్న ఆశలు కూడా వ్యాపార, వాణిజ్య వర్గాలలో వ్యక్తమవుతున్నాయి. యువ రక్తం ఉన్న కిమ్ జోంగ్-ఉన్ కి ఉత్తర కొరియా పరిస్ధితులు బాగానే తెలుసుననీ, గతంలో లాగా ఉత్తర కొరియా అంతర్జాతీయంగా ఏకాకిగా మిగలడానికి ఇష్టం ఉండకపోవచ్చనీ వీరు ఆశిస్తున్నారు. ఏకాకితనం నుండి తమ దేశాన్ని బైటికి లాగడానికి సరికొత్త సంస్కరణలకు జోంగ్-ఉన్ శ్రీకారం చుట్టవచ్చని వారు ఆశిస్తున్నారు. సంస్కరణలు అంటే ఉత్తర కొరియా తన అణు కార్యక్రమాన్ని వదులుకొని, నూతన ఆర్ధిక విధానాలను ఆమోదించి విదేశీ కంపెనీలను దేశంలోకి ఆహ్వానించడం తప్ప మరొకటి కాదు. ఇవి అంతిమంగా ఉత్తర కొరియా ప్రజలు మరింత ఆర్ధిక బానిసత్వంలోకి నెడతాయే తప్ప వారి పరిస్ధితులేవీ మెరుగుపడవు. కాకుంటె ఆ దేశంలో ధనికవర్గం మరింత ధనికులుగా మారే అవకాశాలు దొరకవచ్చు.
ఉత్తర కొరియా తన స్వతంత్రాన్నీ, ప్రాదేశిక సమగ్రతనూ, సౌరవభౌమత్వాన్ని పరిరక్షించే విధానాలను కొనసాగించవలసిన అవసరం ఉంది. తమ దేశ రక్షణ కోసం వారు తమ అణు కార్యక్రమాన్ని వదులుకోవలసిన అవసరం లేదు. దక్షిణ కొరియాతో చర్చలు జరిపి పట్టువిడుపులతో, ఇతర దేశాల జోక్యం లేకుండా అన్ని సమస్యలను పరిష్కరించుకుణి ఐక్యమయితే అది అంతిమంగా ప్రజలకు ఉపయోగపడగలదు. అయితే ఈ ఐక్యమయ్యే క్రమంలో ఇరు దేశాలూ బైటి దేశాల జోక్యాన్ని దూరం పెట్టవలసిన అవసరం ఉంది.