ఉత్తర కొరియా అధ్యక్షుడు, ఆ దేశ అత్యున్నత నాయకుడు కిమ్ జోంగ్-ఇల్ గుండెపోటుతో మరణించినట్లుగా ప్రభుత్వం సోమవారం ప్రకటించినట్లుగా ‘ది హిందూ’ తెలిపింది. అరవై తొమ్మిదేళ్ళ కిమ్ జోంగ్-ఇల్ శనివారమే మరణించినట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. ‘ఫీల్డ్ గైడెన్స్’ ఇస్తుండగా అదనపు శారీరక, మానసిక శ్రమ వలన అలసటకు గురవడంతో కిమ్ మరణించాడని ఉత్తర కొరియా ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తర కొరియా అత్యున్నత నాయకుడు మరణించడంతో పశ్చిమ దేశాలు అప్రమత్తమయ్యాయి. అణ్వస్త్ర పరిజ్ఞానం ఉన్న ఉత్తర కొరియా కు తదుపరి నాయకుడు ఎవరు కాగలరన్న ఉత్కంఠతో పశ్చిమ దేశాలు ఎదురు చూస్తున్నాయి.
మూడేళ్ళ క్రితం కిమ్ గుండె నొప్పితో బాధపడినప్పటికీ తర్వాత కోలుకున్నాడు. కిమ్ తన మూడవ కుమారుడు కిమ్ జోంగ్-ఉన్ ను వారసుడుగా ముందుకు తెస్తున్న సూచనలు గత సంవత్సర కాలంగా కనిపించాయి. తన కుమారుడిన మిలట్రీలోనూ, ప్రభుత్వంలోనూ ఉన్నత స్ధానాలకు ప్రమోట్ చేయడం ద్వారా అతనిని తన వారసుడుగా చేయనున్నాడన్న వార్తలు వచ్చాయి. ఉత్తర కొరియా అణు పరిజ్ఞానంతో గుర్రుగా ఉన్న అమెరికా ఇటువంటి సంధికాలంలో చేతులు ముడుచుకుని కోర్చోవడం జరగదు. వారసుడి ఎంపికలో తన ప్రయత్నాలు తాను చేయక మానదు. వీలయితే ‘అధికార కుట్ర’ లకు పాల్పడడానికి కూడా వెనుదీయదు. అయితే ఉత్తర కొరియా మిలట్రీ, అధికార వర్గాల్లో అమెరికా గూఢచార వర్గాలు ఎంతవరకు చొచ్చుకుపోయారన్న దానిపైన అది ఆధారపడి ఉంటుంది.
పొరుగున గల దక్షిణ కొరియా తన మిలట్రీని ఎమర్జన్సీ అప్రమత్తతలో ఉంచింది. గత సంవత్సరం ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య యుద్ధం జరగనున్నదా అన్నంత ఉద్రిక్తతలు తలెత్తాయి. చైనా జోక్యంతో ఉత్తర కొరియా వెనక్కి తగ్గినట్లు కనిపించింది. దక్షిణ కొరియాకి చెందిన ద్వీపంపై తమ సైన్యం మిలట్రీ డ్రిల్లు చేస్తున్న సమయంలో ఉత్తర కొరియా వారిపైకి కాల్పులు సాగించింది. ఇద్దరు సివిలియన్లు మరణించిన ఈ ఘటన తర్వాత ఇరు కొరియాల మధ్య తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. అమెరికా తన విమానవాహక యుద్ధ నౌకను కొరియాలకు సమీపంలొకి తెచ్చి నిలిపింది. చివరకు చైనా జోక్యం చేసుకుని ఉత్తర కొరియాను శాంతింప జేయడంతో ఉద్రిక్తతలు చల్లారాయి.
కిమ్ కుమారుడు కిమ్ జోంగ్-ఇల్ కు మిలట్రీలోనూ, అధికారులలోను ఎంతవరకూ విశ్వసనీయత ఉన్నదీ తెలియడం లేదు. కనుక నాయకత్వం చేజిక్కించుకోవడంలో అతను ఎంతవరకు సఫలీకృతుడయ్యేదీ వేచి చూడవలసిన విషయం. కిమ్ జోంగ్-ఉన్ ఇంకా ఇరవైలలోనే ఉండడం గమనార్హం. కిమ్ చెల్లెలు ఆమె భర్తలను కూడా ఇటీవల కాలంలో ఉన్నత స్ధానాలకు ప్రమోట్ చేసినట్లు తెలుస్తోంది. వీరు కుమారుడు జోంగ్-ఉన్ కు సహాయకులుగా ఉంటారా లేక తామే అధికార పీఠం చేజిక్కించుకుంటారా అన్నది తెలియవలసి ఉంది. జోంగ్-ఉన్ కు నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నట్లుగా రాయిటర్స్ తెలిపింది.
కిమ్ జోంగ్-ఉన్ సైతం అధికారాన్ని తన తండ్రి నుండే సంపాదించాడు. ఉత్తర కొరియా ఏర్పడినప్పటినుండీ అధికారంలో ఉన్న కిమ్ జోంగ్-ఇల్ తండ్రి 1994 లో మరణించాక ఆయన కుమారుడిగా అధికారంలోకి వచ్చాడు. ఇపుడు మళ్ళీ ఆయన తన కుమారుడిని పదవికి పూర్తిగా సిద్ధం చేసేలోపే చనిపోవడంతో పశ్చిమ దేశాలు ఒకింత మునికాళ్ళపై ఎదురు చూసే పరిస్ధితి తలెత్తింది. ఉత్తర కొరియా వద్ద ఉన్న అణ్వస్త్రాలే పశ్చిమ దేశాల అప్రమత్తతకు కారణం. అణ్వస్త్రాల కారణంగా ఉత్తర కొరియాపై అమెరికా, యూరప్ లు అనేక సంవత్సరాలుగా ఆంక్షలు విధించాయి.