యూరప్ రుణ సంక్షోభం పుణ్యమాని యూరప్ ఐక్యత కు ప్రమాదం ముంచుకొచ్చింది. గత రెండేళ్ళనుండీ యూరో జోన్ దేశాలు అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ‘యూరప్ రుణ సంక్షోభం’ నిత్య యవ్వనంతో శోభిల్లుతోంది. యూరోపియన్ యూనియన్ ఏర్పాటుకి బాటలు వేసిన లిస్బన్ ఒప్పందం లో మార్పులు చేయడానికి గత శుక్రవారం జరిగిన ఇ.యు శిఖరాగ్ర సమావేశం నిర్ణయించగా బ్రిటన్ ఆ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇరవే ఏడు దేశాల్లో బ్రిటన్ ప్రస్తుతం ఏకాకిగా ఉన్నా భవిష్యత్తులో దానికి మద్దతు దొరకదన్న గ్యారంటీ లేదు. ప్రస్తుతానికి జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్, ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కోజీ ఐక్యత ప్రదర్శిస్తున్నా వారి మద్య కూడా పొరపొచ్చాలకు కొదవలేదు. అనేక చర్యలు ప్రకటించినప్పటికీ రుణ సంక్షోభం పరిష్కారం అయిందని మార్కెట్లు నమ్మడం లేదు. వెరసి యూరో పతనాన్ని అడ్డుకోవడానికి జర్మనీ, ఫ్రాన్సు లు చేస్తున్న ప్రయత్నాలు విఫలబాటలో ఉన్నాయి.
కార్టూన్: ఫస్ట్ పోస్టు
–
మీరు రోజు అమేరికా, యురప్ రెండూ దివాలా తీయబోతున్నట్లో లేక ఆర్ధికం గా వాటి పరిస్థితి దిగజారు తున్నట్లు రాస్తూంటారు. అదే నిజమైతే మరి దేశం లో క్రైస్తవ మత సంస్థలకు పశ్చిమదేశాలు ఎలా డబ్బులు పంప గలుగుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? అక్కడ పేదవారు గడ్డు పరిస్థితిలో ఉంటే ఇక్కడ ప్రజలకి వారు ఎలా డబ్బులు పంపగలుగుతారు? తెలిస్తే చెప్పేది.
రాం గారూ, అమెరికా, యూరప్ లు ఆర్ధిక సంక్షోభంలో ఉన్నాయని నేను మాత్రమే రాయడం లేదు. అమెరికా అధ్యక్షుడే తమ దేశం ఆర్ధిక సంక్షోభంలో ఉందని చాలాసార్లు చెప్పుకున్నాడు. సర్కోజి, మెర్కెల్ లాంటి యూరప్ దేశాల అధిపతులు కూడా తమ దేశాలు సంక్షోభం లో ఉన్నాయనీ, ప్రజలు త్యాగాలు చెయ్యాలనీ, ప్రభుత్వాల కఠిన నిర్ణయాలను ఆమోదించాలని కోరుతున్నారు. కనుక అమెరికా, యూరప్ ల సంక్షోభం నేను కనిపెట్టింది కాదు.
క్రైస్తవ మత సంస్ధలకు డబ్బులు పంపడం అంత పెద్ద అంశంగా మీరెందుకు చూస్తున్నారో అర్ధం కాలేదు. మత సంస్ధలకు డబ్బు పంపడం అనేది ఆ దేశాల విధానాలలో భాగం. తద్వారా సహాయం పొందే దేశాల్లో తమ ప్రభావితులను తయారు చేసుకుంటాయి. సరిగ్గా చూస్తే అలా చేసే సహాయం అవి పెట్టుబడిగా చూస్తాయి తప్ప సహాయంగా కాదు. ఆ సహాయం ద్వారా అవి ఇతర ప్రయోజనాలు పోందుతాయి.
మన దేశం పేద దేశమని మీరు అంగీకరిస్తే, మన దేశం కూడా ఆఫ్ఘనిస్ధాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలకు సహాయం చేస్తోంది. సహాయం చేస్తోంది కనక మన దేశం ధనిక దేశం కాదు గదా. వివిధ దేశాలతో సంబంధాలు, ఆ దేశాలలో తమకు గల ప్రయోజనాలు వీటన్నింటి దృష్ట్యా సహాయం పేరుతో డిప్లొమేటిక్ పెట్టుబడులు పెడతాయి. వాటికీ, ఆర్ధిక వ్యవస్ధల గమనానికి సంబంధం ఉండవలసిన అవసరం లేదు.
అమెరికా సంక్షొభంలో ఉంటూనే రెండు యుద్ధాలు చేస్తోంది కదా. యుద్ధాల వల్లే అమెరికా ప్రధానంగా ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొంటోంది. అయినా అది యుద్ధాలు ఆపుతుందా? లేదు. పైగా సిరియా, ఇరాన్ ల పైన దాడికి పధకాలు వేస్తోంది.
ఒక్క క్రైస్తవ మతానికే కాదు, ఇంకా అనేక రకాలుగా అమెరికా, యూరప్ లు ఇండియాలో డబ్బులు ఖర్చు చేస్తున్నాయి. ముఖ్యంగా ఎన్.జి.ఓ లకి బాగా డబ్బు పంపిస్తాయి.