బాబా రాందేవ్ దీక్షా శిబిరంపై పోలీసు దాడికి చిదంబరమే బాధ్యుడు -సుప్రీం అమికస్ క్యూరి


విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కి తెప్పించాలన్న డిమాండ్ తో బాబా రాందేవ్ ప్రారంభించిన నిరాహార దీక్షా శిబిరంపై ఢిల్లీ పోలీసులు అర్ధరాత్రి చేసిన దాడికి కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం బాధ్యుడని సుప్రీం కోర్టు అమికస్ క్యూరీ నిర్ధారించాడు. రాందేవ్ నిరాహార దీక్ష శిబిరంపై పోలీసులు అమానుషంగా దాడి చేశారన్న వార్తలు పత్రికలలో రావడంతో సుప్రీం కోర్టు తనంతట తానే ఈ కేసును చేపట్టింది. అనంతరం కేసు విచారణలో తనకు సాయపడాలని కోరుతూ సుప్రీం కోర్టు, సీనియర్ లాయర్ రాజీవ్ ధావన్ ను ‘అమికస్ క్యూరీ’ గా నియమించుకుంది. చిదంబరం సలహా మేరకే పోలీసులు జోక్యం చేసుకున్నారని రాజీవ్ ధావన్ కోర్టుకి శుక్రవారం తెలిపాడు.

ఢిల్లీలోని రాం లీలా మైదానంలో బాబా రాందేవ్ నిరాహార దీక్ష ప్రారంభించిన కొద్ది గంటల తర్వాత అర్ధ రాత్రి సమయం దాటాక ఢిల్లీ పోలీసులు శిబిరంపై విరుచుకు పడ్డారు. అనేకమంది స్త్రీలు, ఇతరులు గాఢనిద్రలో ఉండగా పోలీసులు జరిపిన దాడిలో అనేకమంది గాయాప పాలయ్యారు. లాఠీలు చేబూని విచక్షణా రహితంగా చావబాదారు. బాబా రాందేవ్ కోసం వెతికినప్పటికీ ఆయన శిబిరంలో కనపడలేదు. ఆ తర్వాత రైల్వే స్టేషన్ వద్ద స్త్రీల దుస్తులు ధరించిన రామ్ దేవ్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆయనని విమానం ఎక్కించి అప్పటికప్పుడు ఢిల్లీ దాటించిగానీ పోలీసులు విశ్రమించలేదు.

పోలీసుల జోక్యానికి చిదంబరం ఆదేశాలు కారణమని అమికస్ క్యూరీ తెలిపాడు. ఆయన కొన్ని రికార్డులు కోర్టు వద్ద ప్రస్తావించాడు. అందులో చిదంబరం ఇంటవ్యూలు ఉన్నాయి. రాందేవ్ శిబిరంపై పోలీసుల దాడికి చాలా ముందుగానే పధకం వేశారని రికార్డుల ద్వారా స్పష్టం అవుతోందని అమికస్ క్యూరీ తెలిపాడు. యోగా శిక్షకుడు బాబా రాందేవ్ సీనియర్ మంత్రులతో చర్చలలో ఉన్నాడు. విదేశాలనుండి నల్లడబ్బుని ఎలా దేశానికి రప్పించాలన్నది ఆ చర్చల సారాంశమట. ప్రభుత్వానికి ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తూ రాందేవ్ నిరాహార దీక్షను ప్రారంభించాడు. కొన్ని వేలమంది మద్దతుదారుల సమక్షంలో దీక్షను ప్రారంభించిన కొన్ని గంటల తర్వాత పోలీసులు శిబిరంపై దాడి చేశారు.

జూన్ 8 న చిదంబరం కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటనతో సహా వివిధ రికార్డులను అమికస్ క్యూరీ ఉటంకించాడు. “బాబా రాందేవ్ ఎటువంటి ప్రదర్శన గానీ, ఏ విధమైన నిరాహార దీక్షను గానీ రాం లీలా మైదాన్ లో చేపట్టడానికి అనుమతించరాదని నిర్ణయం తీసుకున్నారు. తన ప్రయత్నాలను ఆయన కొనసాగించదలుచుకుంటే ఆయనను ఢిల్లీనుండి వెళ్ళిపోవాలని కోరాలి” అని రికార్డులు చెబుతున్నట్లుగా అమికస్ క్యూరీ చెప్పాడు. నిర్ణయం హోం మంత్రి స్ధాయిలో తీసుకున్నారని దీన్ని బట్టి అర్ధం అవుతోందని అమికస్ తెలిపాడు. అయితే చర్చలు జరుగుతున్నందున దీనిని తాత్కాలికంగ సస్పెండ్ చేశారనీ, చర్చలు విఫలం కావడంతో పోలీసు చర్య అమలులోకి వచ్చిందనీ అమికస్ క్యూరీ తెలిపాడు. తదుపరి వాదనలు జనవరి 9 కి వాయిదా పడ్డాయి.

పి.చిదంబరం తాజాగా ఒక హోటల్ యజమానిపై క్రిమిలల్ కేసు ఉపసంహరించుకోవాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరాడనీ, తన అధికారాలను దుర్వినియోగపరిచాడనీ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. హోటల్ యజమాని తరపున చిదంబరం గతంలో లాయర్ గా పనిచేయడంతో చిదంబరం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. చిదంబరం ఎప్పటిలాగా ఆరోపణలను తిరస్కరించాడు. మధ్య భారతంలోని అడవుల్లో బాక్సైట్ ఖనిజాల తవ్వకంలో కూడా చిదంబరం కి ప్రయోజనాలు ఉన్నాయని వాటి కోసమే ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ చేపట్టి అడవుల్లోని గిరిజనులను తరలిస్తూ అందుకు అడ్డుగా ఉన్న మావోయిస్టు పార్టీపై ఊచకోత అమలు చేస్తున్నాడన్న ఆరోపణలు కూడా చిదంబరం పై ఉన్నాయి. మావోయిస్టులపై జరుపుతున్న ఊచకోతను సమర్ధించే ప్రతిపక్ష పార్టీలు హోటల్ యజమాని కోసం అధికారం దుర్వినియోగం చేశాడన్న ఆరోపణపై రాజీనామాకు పట్టుబట్టడం పెద్ద ‘హిపోక్రసీ’

12 thoughts on “బాబా రాందేవ్ దీక్షా శిబిరంపై పోలీసు దాడికి చిదంబరమే బాధ్యుడు -సుప్రీం అమికస్ క్యూరి

 1. మావోయిస్టులపై జరుపుతున్న ఊచకోతను సమర్ధించే ప్రతిపక్ష పార్టీలు హోటల్ యజమాని కోసం అధికారం దుర్వినియోగం చేశాడన్న ఆరోపణపై రాజీనామాకు పట్టుబట్టడం పెద్ద ‘హిపోక్రసీ’

  మావోయిస్టులు శాంతియుతంగా ధర్నాలు చేస్తున్న వారు కాదు. ఒక పిడివాదాన్ని నమ్ముకుని తుపాకులు పట్టిన తీవ్రవాదులు. వారు చేస్తున్న దానికి రాం దేవ్ చేసిన శాంతియుత ధర్నాకి పోలికే లేదు. తుపాకులు పట్టిన తీవ్రవాదులు వాటికే బలవ్వడం సహజమే.

 2. ముందు మీరిక్కడ అర్ధం చేసుకోవాల్సింది ఒకటుంది.
  నేను పోల్చింది రాందేవ్ ధర్నానీ, మావోయిస్టుల వాదాన్నీ కాదు.
  చిదంబరం విధానాలని మావోయిస్టులకి అమలు జరిపినప్పుడు ఒక రియాక్షన్, రాందేవ్ పై అమలు జరిపినపుడు మరొక రియాక్షన్ చూపడాన్ని పోల్చాను.

  చట్టం రాందేవ్ కి ఒకటీ, మావోయిస్టులకి ఒకటీ లేదు. సుప్రీం కోర్టు కూడా ‘సల్వా జుడుం’ పైన తీర్పు చెబుతూ అదే చెప్పింది. వీలుంటే ఆ వార్త ఒకసారి చూడండి.
  నేరం చేసినవారు ఎవరైనా అరెస్టు చేయాలి, అభియోగాల్ని మోపాలి. కోర్టులో వాటిని రుజువు చేయాలి. నేరం రుజువైతే కోర్టులు శిక్షలు వేస్తాయి. దానర్ధం మావోయిస్టుల నేరాలను సమర్ధించడంగా కొంతమంది ముద్ర వేస్తారు. చెప్పేది సరిగ్గా అర్ధం చేసుకోకుండా.

  చట్టబద్ధ కార్యక్రమాన్ని వదిలేసి, భద్రతా బలగాలు చట్టాల్ని తమ చేతుల్లోకి తీసుకుని ఎన్‌కౌంటర్లు చేయడం, మావోయిస్టులకి అన్నం పెడుతున్నారని చట్టానికి చూపకుండా అరెస్టులు చేసి చిత్ర హింసలు పెట్టడం, ఆనక మావోయిస్టు ముద్ర వేసి కాల్చి పారెయ్యడం చేయడాన్ని చట్టాలపైన గౌరవం ఉన్నవారెవరైనా వ్యతిరేకించాలి. ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో సాగుతున్నది ఇదే. అడవుల్లో బాక్సైట్, ఐరన్ తదితర ఖనిజాల్ని తవ్వుకోవడానికి, అబివృద్ధి చేస్తామంటూ గిరిజనుల్ని వారి గ్రామాలనుండి తరలించడం వెనక బి.జె.పి ప్రభుత్వాల కుట్రలతో చిదంబరంకి భాగస్వామ్యం ఉంది. గ్రామాలనుండి తరలించబడ్డ గిరిజనుల్ని తాత్కాలిక శిబిరాల్లో కుక్కి అభివృద్ధి వాగ్దానన్ని మంటగలుపుతున్నా చిదంబరం చట్టాలు ఏమీ చెయ్యవు. బి.జె.పి ప్రభుత్వాల చట్టాలు అసలే మాట్లాడవు.

  కాని ఒక రోజు రాత్రి పోలీసుల దాష్టీకానికి గురైన బాబా రాందేవ్ కి మాత్రం ఎనలేని సానుభూతి పెద్దలందరూ కురిపిస్తారు. రాందేవ్ పై సానుభూతికి వ్యతిరేకం కాదు. అదే ఆందోళన గిరిజనులు, వారి బిడ్డల భవిష్యత్తుపైన కూడా ఉండాల్సిన అవసరం ఉంది.

  ఇంతకీ పిడివాదం అంటే మీ ఉద్దేశ్యం ఏమిటో? ఏ సిద్ధాంతంలోనైనా పిడివాదం అనేది ఒకటుంటుంది. ప్రతి సిద్ధాంతానికి పిడివాదం ఉంటుంది. అంతే తప్ప పిడివాదం అన్నదే ఒక సిద్ధాంతంగా మీరు చెప్పడం నాకు అర్ధం కావడం లేదు. తీవ్రవాదం కూడా అంతే. ప్రతి సిద్ధాంతంలోనూ తీవ్ర వాదం ఉంటుంది. కాశ్మీరు తీవ్రవాదం, కమ్యూనిస్టు తీవ్రవాదం ఒకటి కాదని గుర్తించలేకపోతే తీవ్రవాదం గురించి తెలియకుండా మాట్లాడుతున్నారని అర్ధం.

 3. పోలీసులు చట్టాలు తమ చేతుల్లోకి తీసుకొని మావోయిస్టులను చంపుతున్నారు అని మీరంటున్నారు. కాదు, కాల్పుల్లో చనిపోయారు అని వారంటున్నారు. కాబట్టి, కోర్టుల్లో కేసులు వేసి తేల్చుకోవడమే దీనికి మార్గం. ఎలానూ అడవిలో అన్నలకి, జనారన్యములో తమ్ముల్లలాంటి మానవహక్కుల కార్యకర్తలున్నారు గదా. ఆపని వారికి వదిలేద్దాం. పోలీసులు తప్పు చేశారని తెలిస్తే కోర్టులు శిక్షలు వేయక మానవు. కాకపోతే ఇక్కడొచ్చిన సమస్యేమిటంటే ప్రి-జుడ్జ్‌మెంట్. కోర్టుల్లో తీర్పు రాకమునుపే ప్రజలు ఇచ్చే తీర్పులు.

  పిడివాదమంటే, ఎంతమంది అది ఎన్ని రకాలుగా తప్పో తెలియజేసిన తరువాట, తాము ఆచరిస్తున్న దానికి బెటర్ ఆల్టర్నేటివ్ ఉంది అని తెలిసిన తరువాత కూడా తమ సిద్దాంతాన్ని గురించి సిమ్హావలోకనం చేసుకోకుండా ఉండే దాన్ని పిడివాదం అంటాం. అవి మావోయిస్టులకు పుస్ఖలంగా ఉన్నాయి.

  ఇక తీవ్రవాద మంటారా, కాష్మీరు తీవ్రవాదానికి, మావోయిస్టుల తీవ్రవాదానికి సైద్దాంతిక పరమైన తేడాలున్నాయి కానీ బయటనుంచి చెట్టును నరికే గొడ్డలికి, లోపలే ఉండి కాండము తొలిచి చెట్టును నాషనము చేసే పురుగుకి ఉన్న తేడా అది. రెండు నాషనము చేసేవే.

 4. చిదంబరం విధానాలని మావోయిస్టులకి అమలు జరిపినప్పుడు ఒక రియాక్షన్, రాందేవ్ పై అమలు జరిపినపుడు మరొక రియాక్షన్ చూపడాన్ని పోల్చాను.

  నా మొదటి కామెంటులో అలా ప్రజలు ఆ తేడా చూపడానికి కారణాన్నే నేను రాశాను. శాంతియుతంగా ధర్నా చేసే వారి మీదచిదంబరం విధానాలని ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకించారు. తుపాకులు పట్టి బూర్జువాలనో, వర్గ శత్రువులనో జనాలను చంపుతూ హింసను నమ్ముకున్న వారి విషయములో ఆ సింపతీ ఉండడం లేదు. అది సహజమే కదా.. అందులో హిపోక్రసీ ఏముంది.

 5. కోర్టుల్లో కేసులు వేసుకోవడమే మార్గమా? ఎవరికి చెబుతున్నారు? ప్రభుత్వమే కేసులు పెట్టకుండా కాల్చి చంపుతుంటే కేసులు పెట్టేదెవరు? మావోయిస్టుల ఎన్ కౌంటర్లు బూటకం అని నేను కాదు, కోర్టులు కూడా తమ వద్దకు వచ్చిన కేసుల్లో చెప్పాయి. అజాద్ హత్య విషయంలో పోలీసులపైన కేసు పెట్టాలని సుప్రీం తీర్పు ఇచ్చింది. ఇంతవరకూ పెట్టలేదు. ఎవర్ని అడగాలి? ప్రభుత్వమూ, దాని అంగాలు చట్టాలను గౌరవించడం లేదన్న అంశాన్ని గమనించకుండా కేసులు, కోర్టులు పరిష్కారం చూపుతాయని చెప్పడం సరికాదు.

  వదిలెయ్యడం ఏంటండీ? అర్ధం లేకుండా? మీరు చర్చించదలుచుకుంటె వెటకారాలు లేకుండా చర్చించండి. ‘అడవిలో అన్నలు’, ‘జనారణ్యంలో తమ్ముళ్ళు’… ఏంటివి? మీ పద్ధతి ఇదే అయితే ఆ పద్ధతి అనుసరించేవారితో నేను చర్చించలేను. నేనింతకు ముందు మీకే చెప్పినట్లు గుర్తు. చర్చ జరిపేటప్పుడు ఎదుటివారి వాదనను గ్రహించడంతో పాటు దాన్ని గౌరవంతో చూడాల్సి ఉంటుందనీ, అలా గౌరవించగలిగితేనే చర్చ సజావుగా సాగుతుందనీ. గౌరవం ఉన్నంత మాత్రాని ఒకరి వాదనను ఆమోదించాల్సిన అవసరం లేదు. ఒక అభిప్రాయాన్ని చెప్పి అది ఎలా తప్పో చెప్పండి. అలా కాక మీరు ముందే ఏర్పరుచుకున్న అభిప్రాయాలతో ఒక ముద్ర వేసి ఆ ముద్ర నుండి వెటకారాలు చేస్తే ఇక చర్చ ఎందుకు? మీ వాదన మీ బ్లాగ్ లో రాసుకోవడం, నావి నా బ్లాగ్ లో రాసుకోవడం ఉత్తమం కదా!. అదీ కాక మనకు తెలిసిందే సర్వస్వం అని నమ్మితే ఇక చర్చకు తావుండదు. ఆ నమ్మకం నుండే అదే సరైందని గుడ్డిగా వాదించడమే మిగులుతుంది తప్ప ఆ వాదనలో తప్పులుంటే సవరించుకునే ధోరణి ఉండదు.

  పిడివాదం అంటే మీరు చెప్పింది కరెక్టు కాదని నా అభిప్రాయం. ప్రతి సిద్ధాంతమూ మారుతూ, అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అటువంటి మార్పులు గుర్తించకుండా మొదట చెప్పిన సూత్రాలను పట్టుకు వేళ్ళాడడమే పిడివాదం. ఉదాహరణకి మార్క్సిజం అభివృద్ధి మార్క్సుతోనే ఆగిపోలేదు. మార్క్సు తర్వాత కాలంలో ప్రపంచ ఆర్ధిక రాజకీయ రంగంలో సామ్రాజ్యవాదం అభివృద్ధి చెందింది. అంటే ఫైనాన్స్ పెట్టుబడిని ఎగుమతి చేసి మూడో ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్ధలను గుప్పిట్లో పెట్టుకోవడం. దీనిని మార్క్సిజం వెలుగులో లెనిన్ విశ్లేషిస్తూ మార్క్సిజాన్ని అభివృద్ధి చేశాడు. అలా అభివృద్ధి చెందిన భాగంతో కలిసి మార్క్సిజం-లెనినిజం అయ్యింది. ఆ తర్వాత మార్క్సిజం-లెనినిజం ను వ్యవసాయం ప్రధానంగా గల మూడో ప్రపంచ దేశాలకు ఎలా అన్వయించాలన్నది మావో అభివృద్ధి చేశాడు. అది మావో ధాట్ గా పేరు పెట్టారు. ఇప్పుడు మార్క్సిజం అంటె ‘మార్క్సిజం-లెనినిజం-మావో ధాట్’ అని అర్ధం. దీన్ని గమనించకుండా కొంతమంది కమ్యూనిస్టులుగా చెప్పుకుంటున్నవారు మార్క్స్ చెప్పిన ప్రాధమిక సూత్రాల వరకే సమాజానికి అన్వయిస్తూ సమాజానికి భాష్యం చెప్పాలని ప్రయత్నిస్తారు. అది మార్క్సిజంలో పిడివాదం అవుతుంది. దీనితో పాటు ఒక శాస్త్రీయ సిద్ధాంతాన్ని సృజనాత్మకంగా అన్వయించకుండా యాంత్రికంగా మక్కీకి మక్కీగా సమాజానికి అన్వయించడానికి పూనుకోవడం కూడా పిడివాదం కిందికి వస్తుంది.

  మావోయిస్టులు అనుసరిస్తున్న సిద్ధాంతంలో హత్యలు, పేలుళ్ళు, విధ్వంసం ఇవి మార్క్సిజం పరిధిలోకి రావు. వర్గ శత్రు నిర్మూలనని మార్క్స్ నుండి మావో వరకు ఎవరూ సమర్ధించలేదు. ఐనా వాళ్లు అదే అమలు చేస్తున్నారు. అది తప్ప వారి సిద్ధాంతం అంతా మార్క్సిజమే. సిద్ధాంతం అమలులో వారు పక్కకు వెళ్ళారు. ప్రజలు తిరుగుబాటుకి పూనుకున్నపుడు విధ్వంసం జరిగితే దాన్ని పట్టించుకోవలసిన అవసరం లేదు గానీ, విధ్వంసం కోసమే విధ్వంసం చేయాలని మార్క్సిస్టు సూత్రాలు చెప్పవు.

  “ఎంతమంది అది ఎన్ని రకాలుగా తప్పో తెలియజేసిన తరువాట, తాము ఆచరిస్తున్న దానికి బెటర్ ఆల్టర్నేటివ్ ఉంది అని తెలిసిన తరువాత కూడా తమ సిద్దాంతాన్ని గురించి సిమ్హావలోకనం చేసుకోకుండా”

  ఇందులో సింహవలోకనం చేసుకోవడం లేదు అనడం వరకు కరెక్టే.
  బెటర్ ఆల్టర్నేటివ్ దేనికి ఉందంటారు? మార్క్సిజానికా లేక మావోయిస్టుల హింసా వాదానికా? మార్క్సిజానికి ఆల్టర్నేటివ్ ఉంటే అదేమిటో చెప్పండి. అంతే కాకుండా మార్క్సిజం ఎంతమంది ఎన్ని రకాలుగా తప్పని చెప్పారో కూడా తెలియజేయండి.

  కాశ్మీరు ప్రజలది జాతీయ వాదం. జాతీయ వాదంలో అతివాదాన్ని తీవ్రవాదం అంటున్నారు. మావోయిస్టులది మార్క్సిజంలో అతివాదం. కనుక మార్క్సిజం పరిధిలోని తీవ్రవాదం అది. రెండింటికీ పోలికలేదు. బైటా, లోపలా అన్న విశ్లేషణ పైపై పరిశీలన తప్ప మూలాల్లోకి వెళ్ళి చేసింది కాదు.

 6. 1. “మావోయిస్టులు శాంతియుతంగా ధర్నాలు చేస్తున్న వారు కాదు.”
  శాంతియుతంగా ధర్నాలు చేయడానికి, సభలు పెట్టుకోవడానికి మావోయిస్టులకు అవకాశం ఇచ్చి చూడండి మరి. పార్టీని, ప్రజాసంఘాలను, సాహిత్య, సాంస్కృతిక సంఘాలను కూడా నిషేధించి, కళాకారులు, గాయకులకు కూడా ఉరిశిక్ష విధించి రాజ్యం పరమ అన్యాయంగా వ్యవహరిస్తున్న కాలం వచ్చాకే మావోయిస్టుల శాంతియుత ధర్నాలకు, తమ వాణిని చెప్పుకునే మార్గాలకు వీలులేకుండా పోయింది. మావోయిస్టుల వల్ల మాకు ప్రమాదం లేదని ఈ వ్యవస్థ భావించి తాత్కాలికంగా రెండు నెలలు వారికి లీగల్ అవకాశాలను కల్పించి చూడండి. ఆ ధర్నాలకు ప్రజలు స్పందిస్తారో లేదో తెలుస్తుంది.

  1990 మొదట్లో లీగల్ అవకాశం వచ్చిన కాలంలో వరంగల్‌లో అప్పటి పీపుల్స్ వార్ అనుబంధ సంస్థ అయిన రైతుకూలీ సంఘం సభ పెడితే పదిలక్షలపైగా జనం హాజరయిన విషయం బహుశా అందరూ మర్చిపోయి ఉంటారు. ఒక రాజకీయ పార్టీ అనుబంధ సంస్థ ఇచ్చిన పిలుపుకు స్పందించి పది లక్షల మంది జనం హాజరుకావడం భారత రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని ఘటనగా నాటి ప్రాంతీయ జాతీయ పత్రికలన్నీ సంపాదకీయాల్లో రాసిన విషయం కూడా బహుశా అందరూ మర్చిపోయి ఉండవచ్చు. 2004లో కూడా అదే వరంగల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతించినప్పుడు మావోయిస్టులు సభ పెడితే లక్షలమంది తరలివచ్చిన తాజా ఘటన కూడా మర్చిపోతే ఎలా?

  వీళ్లందరినీ తుపాకులు చూపించి, బెదిరించి మరీ తోలుకుని వచ్చారని కూడా ఎవరైనా ఆరోపించవచ్చు. గతంలోనే ఇలా ఆరోపించారు కూడా. ఇలా తుపాకులు చూపి బెదిరించి జనాన్ని కూడగట్టటం సాధ్యమే అనుకుంటే ఆల్‌ఖైదానే కాదు, ఐఎస్ఐ కూడా ఈ దేశంలోకి తుపాకులను తరలించి ఈ దేశపు జనాన్ని కూడగట్టవచ్చు. జనాన్ని ఇంతగా గొర్రెలుగా భావించినట్లయితే, ఎవరైనా వాళ్లని ఎక్కడికైనా తరలించవచ్చు.

  ఇప్పటికీ కూడా వారికి ధర్నాలు, నిరసనలు, సభలు నిర్వహించుకునే అవకాశం ఇస్తే తెలుస్తుంది. వాళ్లా పని చేయగలరో లేదో చరిత్ర స్పష్టంగానే నిరూపిస్తోంది. ఉగ్రవాదం కంటే మించిన పెనుప్రమాదం మావోయిస్టుల వల్లే పొంచి ఉన్నదని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం పనిగట్టుకుని మరీ ప్రకటించిన తర్వాత మావోయిస్టులకు లీగల్ అవకాశాలు లభిస్తాయని, వారు లీగల్‌గా పనిచేయాలని ఆశించడం, కోరుకోవడం, ఊహించడం కూడా తప్పే.

  1978 నుంచి 85 వరకు పీపుల్స్ వార్ ప్రజాసంఘాలు పనిచేసిన కాలంలో, లీగల్ అవకాశాలు లభించిన కాలంలో ఆ పార్టీ ఎన్ని లక్షలమందిని కూడగట్టిందో, ఎన్ని ప్రాంతాల్లోకి విస్తరించిందో చరిత్రకే తెలుసు. మాట, పాట, ఆట సమస్త కళారూపాలను నిషేధించి, ప్ర.జాయుద్ధ వాణిని పూర్తిగా తొక్కిపడేసిన తర్వాతే ఆ పార్టీ పూర్తిగా అజ్ఞాతంలోకి అంటే ప్రజల్లోకి వెళ్లింది. అజ్ఞాతం అంటే రాజ్యానికి అజ్ఞాతంగా అనే తప్ప ప్రజలకు అజ్ఞాతంగా అని కాదు.

  2. “తుపాకులు పట్టిన తీవ్రవాదులు వాటికే బలవ్వడం సహజమే”
  ఈ భాష ప్రజాస్వామ్యం పేరుతూ దేశవనరులను నగ్నంగా దోచుకుంటున్న పాలకుల పరిభాషనే తలపిస్తోందని చెప్పటానికి సాహసిస్తున్నాను. ఈ పరిభాషకు ప్రాసంగికత ఉంటే తమ తమ కాలాల్లో రాజ్యవ్యవస్థలపై తిరగబడిన ప్రతి ఒక తిరుగుబాటు దారు కూడా తీవ్రవాదే అవుతాడు. రాణా ప్రతాప్ సింహుడు, ఝాన్షీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్, వీరపాండ్య కట్టబొమ్మన ఇలా లెక్కిస్తే గత ఐదు వందల ఏళ్లుగా రాజ్య వ్యవస్థలపై తిరగబడిన ప్రతి ఒక్క తిరుగుబాటు దారు తీవ్రవాదే అవుతారు మరి. -విదేశీ తిరుగుబాటుదార్లు, విప్లవకారుల ప్రస్తావన ఇక్కడ అనవసరం.- ఇది నేను సమర్థనకోసం చెబుతున్న మాట కాదు. ఆయా కాలాల్లో ప్రతి రాజ్యం కూడా తనపై తిరగబడిన వారిని ఇలాగే ముద్రవేస్తూ వచ్చింది. వస్తోంది కూడా. అక్టోబర్ విప్లవం గెలవకపోయి ఉంటే లెనిన్, రష్యా కమ్యూనిస్ట్ పార్టీ ఈనాటికీ రాజద్రోహులుగానే చరిత్రకెక్కి ఉంటారు. ఇక మావో, హోచిమిన్‌ల కథ చెప్పాల్సిన పనే లేదు. వాళ్లకు నాటి పాలక వర్గం పుట్టిన ముద్దు పేరు “ఎర్ర బందిపోట్లు” మరి

  3. “పోలీసులు తప్పు చేశారని తెలిస్తే కోర్టులు శిక్షలు వేయక మానవు.”
  గడచిన 65 సంవత్సరాల “స్వతంత్ర:” భారతదేశంలో ఎంతమంది పోలీసులకు, అదేవిధంగా వందల కుంభకోణాల్లో పాలుపంచుకున్న నేతలకు, వ్యాపారులకు కోర్టులు శిక్ష విధించాయో చెబితే మంచిది. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పాలంటే కోర్టు ఫీజు కూడా చెల్లించుకోలేని సామాన్యులకు మాత్రమే కోర్టులు లక్షల సంఖ్యలో శిక్షలు విధించాయి. వాకపల్లి గిరిజన మహిళలపై సామూహిక అత్యాచారం చేసిన పోలీసులపై చర్య కాదు కదా.. ఆ నిరుపేద మహిళల వాదన వినడానికి కూడా ఏ కోర్టూ ముందుకు రాలేదు. రాజ్యం, న్యాయవ్యవస్థ, పోలీసు బలగాలు ఉమ్మడిగా ఈ దేశ సామాన్య ప్రజానీకానికి వ్యతిరేకంగా ఎంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయో మరొక ఉదాహరణ చెప్పవలసిన పనిలేదు. పైగా ఈ 16మంది మహిళలూ, నక్సలైట్లు ఒత్తిడి ప్రభావంతో, పోలీసులపై అత్యాచార ఆరోపణ చేశారని అడ్డగోలు వాదన కూడా చేశారు. గిరిజన మహిళలను ఇంత నీచంగా అవమానించవచ్చా? చదువుకున్న వాళ్లంగా మనం దీన్ని నమ్ముదామా?

  4. “ఇక తీవ్రవాద మంటారా, కాష్మీరు తీవ్రవాదానికి, మావోయిస్టుల తీవ్రవాదానికి సైద్దాంతిక పరమైన తేడాలున్నాయి కానీ బయటనుంచి చెట్టును నరికే గొడ్డలికి, లోపలే ఉండి కాండము తొలిచి చెట్టును నాషనము చేసే పురుగుకి ఉన్న తేడా అది.”
  బ్రిటిష్ వారికంటే ఘోరంగా గత ఆరున్నర దశాబ్దాలుగా ఈ దేశ ప్రజల జీవితాలను తొలుస్తున్న గండ్రగొడ్డళ్లు, విషపురుగులు ఎవరో ప్రజానీకానికి బాగానే తెలుసనుకుంటాను. అందుకే మైదానాల్లో, అడవుల్లో, మహానగరాల్లో కూడా ప్రజలు ఇంతగా ఆ విషపురుగులను అసహ్యించుకుంటున్నారు. తమ పొట్ట గొడుతున్న వారిని మైదానాల్లో కూడా ప్రజలు తరిమి కొడుతున్న రోజులు వచ్చేశాయి. సామాన్య ప్రజల్లో పెరుగుతున్న ఈ తిరుగుబాటు తత్వం ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు గాక తగ్గదు.

  5. “వర్గ శత్రు నిర్మూలనని మార్క్స్ నుండి మావో వరకు ఎవరూ సమర్ధించలేదు. ఐనా వాళ్లు అదే అమలు చేస్తున్నారు. అది తప్ప వారి సిద్ధాంతం అంతా మార్క్సిజమే. సిద్ధాంతం అమలులో వారు పక్కకు వెళ్ళారు. ప్రజలు తిరుగుబాటుకి పూనుకున్నపుడు విధ్వంసం జరిగితే దాన్ని పట్టించుకోవలసిన అవసరం లేదు గానీ, విధ్వంసం కోసమే విధ్వంసం చేయాలని మార్క్సిస్టు సూత్రాలు చెప్పవు.”

  విధ్వంసం కోసమే విధ్వంసం చేయాలని మావోయిస్టులు తమ డాక్యుమెంట్లలో ఎక్కడా ఇంతవరకూ రాయలేదనుకుంటాను. ఉద్యమానికి, ప్రజల ప్రయోజనానికి అడ్డుగా నిలిచిన వారి సమస్యను సామదానభేద దండోపాయాలతో పరిష్కరించుకోవడం మావోయిస్టు రాజనీతి మాత్రమే కాదనుకుంటాను. చరిత్రలో ప్రతి రాజనీతీ ఈ పద్ధతులను పాటించింది. జనంలో ఉంటూ జనం ఆశలకు వ్యతిరేకంగా పనిచేసేవారితో, రాజ్యవ్యవస్థ ప్రలోభాలకు గురై తన వేలితో తమ కంటినే పొడిచేవారితో మావోయిస్టులు వ్యవహరించే తీరు చర్చనీయాంశం కావచ్చు. పైగా ఒక బలమైన రాజ్యానికి వ్యతిరేకంగా సైనిక నిర్మాణాలతో సహా పోరాటానికి సంసిద్ధమైనట్లు చెబుతున్న వారు, తమ వ్యతిరేక బలగాలతో పూర్తి స్థాయిలో తలపడుతున్నప్పుడు జరుగుతున్న తప్పులను మొత్తంగా వర్గ శత్రునిర్మూలనగా ముద్రించలేమనుకుంటాను.

  పైగా మావోయిస్టులు వర్గ శత్రునిర్మూలనను నమ్ముతున్న, లేదా పూర్తిస్తాయిలో పాటిస్తున్న చరిత్ర ఉంటే ఈ దేశంలో చాలామంది బతికి ఉండరేమో అని నా సందేహం.

  కాని సమకాలీన ఉద్యమ చరిత్రలో అత్యంత వివాదాస్పదంగా మారిన ఈ వర్గశత్రునిర్మూలనపై చర్చకు ఇది వేదిక కాదని నా అభిప్రాయం.

  6. అన్నిటికంటే మించి ‘సింపతీ’ గురించి చిన్న వివరణ.
  సానుభూతి చూపటం, చూపకపోవడానికీ కూడా వర్గ స్వభావం ఉందనుకుంటాను. బాబా రామ్‌దేవ్‌ పట్ల సింపతీ చూపటం, అన్నా హజారే ఉద్యమం పట్ల సింపతీ చూపటం, మణిపూర్లో పన్నెండేళ్లుగా నిరాహార దీక్షతో భారత సైనికబలగాల ఆకృత్యంపై కనీవినీ ఎరుగని రీతిలో ఆసుపత్రినుంచే నిరసన ప్రకటిస్తున్న షర్మిల దీక్ష పట్ల సింపతీ చూపటం, వాకపల్లి ఆదివాసీ మహిళల మాన గౌరవం పట్ల సింపతీ చూపటం, దేశ విదేశీ కార్పొరేట్ సంస్థల పేరాశ కారణంగా మూలాలనే కోల్పోతూ తమ నేలమీద నుంచి తరిమివేయబడుతున్న మధ్యభారత గిరిజనుల జీవన్మరణ సమస్య పట్ల సింపతీ చూపటం ఇవన్నీ ఏక స్థాయిలో జరుగుతున్నట్లు అనిపించడం లేదు.

  మావోయిస్టులే హింసను ప్రేరేపిస్తున్నారు అనే మాట నిజమే అయితే కాళ్లకింది నేలతో సహా తమ సర్వస్వాన్ని కోల్పోతున్న ఆదివాసుల పట్ల ఈ దేశం మొత్తంగా, ముఖ్యంగా భద్రసమాజం -గడ్డన ఉండి ప్రపంచాన్ని పరికించే సమాజం- నిజంగా కరుణ చూపాలి. వారికి బాసటగా నిలవాలి. భద్రలోగ్ అని చెప్పుకుంటున్న వారు, అంతో ఇంతో స్థిరమైన, మంచి జీవితం గడుపుతున్నవారు మన కళ్లముందు జరుగుతున్న ఈ ఆకృత్యాన్ని, ఘోరాన్ని నిరసించి ఆదివాసీ ప్రజలకు సంఘీభావం ప్రదర్శిచడానికి ముందుకు రాకపోవడమే దారుణమైన విషయం. కళ్లముందు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ కూడా స్పందించని వారు, మౌలిక పరిష్కారం కనుచూపు మేరలో కూడా దొరకని అవినీతి వ్యతిరేక పోరాటాలకే జీవితాలను అకితం చేస్తున్నవారు ఈ దేశంలోని 20 కోట్లమంది ఆదివాసుల మనుగడ సమస్యపట్ల సరైన రీతిలో స్పందించే ఉంటే వారికి ఏ మావోయిస్టులూ బాసటగా ఉండవలసిన అవసరం లేదు. మావోయిస్టులను ఏరిపారవేయడానికి అడవుల్లోకి దిగిన సైనిక బలగాలు ఆదివాసులకు అండగా నిలిచి ఉంటే ఈ దేశంలో న్యాయం ఒక పాదంమీద అయినా నడుస్తోందని మనందరం నమ్మవచ్చు.

  సింపతీ అనేది వర్గస్వభావంతో కూడుకుని ఉంది కనుకే, ఈ దేశంలో ఎవరికి నిజంగా సింపతీ అవసరమో వారికి అది దొరకటం లేదు. సింపతీ కోల్పోయిన వారు, ఏ బాసటా లేనివారు తమ జీవితాలను అధోగతిలోకి నెట్టేవారిని రాళ్లతో తరిమికొట్టే పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నప్పుడు, వారిని హింసా మార్గ అవలంబీకులని, మావోయిస్టు పడగనీడలోకి వెళ్లిపోయారని విమర్శిస్తున్నారు. 20 కోట్ల మంది ప్రజల జీవన్మరణ సమస్య గురించి పట్టించుకోనివారు హింసా మార్గం గురించి మాట్లాడటంలో కనీస న్యాయం ఉందంటారా? మళ్లీ చెబుతున్నాను. భారత భద్రసమాజం ఆదివాసుల సమస్యను పట్టించుకుంటే వారికి ఏ మావోయిస్టుల తోడూ, బాసటా అవసరం లేదు. 13 రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ విస్తరించవలసిన అవసరమూ లేదు.

  ఈ మొత్తం చర్చలో మరో కోణాన్ని కూడా ఎత్తి చూపాలనే తప్ప మరే దురుద్దేశమూ లేదని గ్రహించగలరు.

 7. రాజశేఖర రాజు గారూ, మావోయిస్టు పార్టీ ‘చారుమజుందారు పంధా’ ను తమ పంధాగా చెప్పుకుంది. వర్గ శత్రు నిర్మూలను తమ విధానంగా చారు మజుందార్ నగ్జల్బరీ, శ్రీకాకుళం పోరాటాల్లో అమలు చేసారు. గోదావరి లోయ లో కూడా పీపుల్స్ వార్ పార్టీగా ఉన్నపుడు వారు అనేక మందిని కాళ్ళూ చేతులూ నరకడం, ఇన్ఫార్మర్ల పేరుతో చంపడం చేశారు. విప్లవ పార్టీలుగా ఉన్న ఇతర పార్టీల కార్యకర్తలను, నాయకులను కూడా రివిజనిస్టులనీ, ఇన్ఫార్మర్లనీ ఆధారాలు లేని ఆరోపణలు చేసి చంపారు. కాళ్ళూ, చేతులూ నరికారు. కుల వివాదంపై (కర్నూలులో జిల్లాలో అనుకుంటా) ఒక్కొక్కరినీ చాటుకి తీసుకెళ్ళి గొంతు కోసి చంపారు. శ్రీపాదరావు, మాగుంట సుబ్బరామిరెడ్ది లాంటివారిని చంపడం ఎందుకు? పోలీసుల్ని టార్గెట్ చేసి చంపుతున్నారు. ఎ.ఓ.బిలో పోలీసులను పదులమందిని చంపడాన్ని తమ విజయంగా కోబాడ్ గాంధీ గారో, మరొకరో పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఇన్ఫార్మర్ల పేరుతో ఇప్పటికీ చంపుతున్నారు. రెండు, మూడు రోజుల క్రితమే ఇన్ఫార్మర్ పేరుతో చంపినట్లు వార్త వచ్చింది. ఇవన్నీ దేనికిందకి వస్తాయి? వర్గ శత్రు నిర్మూలన కాకపోతే ఈ అవసరంలేని, హింసను అలా సమర్ధించుకుంటారు? మీ అవగాహన వివరించండి.

  వర్గ శత్రు నిర్మూలన తమ విధానం అని చారు మజుందార్ పంధా స్వీకరించడం ద్వారా పీపుల్స్ వార్ చెప్పలేదా? విధ్వంసం కోసమే విధ్వంసం చేయాలని మావోయిస్టు పార్టీ డాక్యుమెంట్లలో ఉందో లేదో నాకు తెలియదు. కానీ వారి చర్యలు దానినే సూచించడం నిజం కాదా? రాజనీతి పద్ధతులతో విప్లవకారుల నీతిని పోల్చవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఆసలు రాజనీతిలతో పోల్చడమే సరైంది కాదు కదా? విప్లవకారులకు విప్లవనీతితోనే పని తప్ప రాజనీతిలతో కాదు. ప్రజల ప్రయోజనాలను అడ్డుకునేవారి పట్ల ఎలా వ్యవహరించాలి? చంపడం ద్వారా వ్యవరించాలని ఏ మహోపాధ్యాయుడూ చెప్పలేదు. పైగా ఎంత భూస్వామీ అయినా వారు మారడానికి ఎంతో అవకాశం ఇచ్చి చూడాలని కూడా మావో బోధనలలో కనిపిస్తుంది. విప్లవం వచ్చాక కూడా భూస్వాములు మారడానికి అవకాశం ఇచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. భూస్వాముల సంగతి అటుంచి పొట్టకూటి కోసం ఉద్యోగాలు చేసుకునే పోలీసులను టార్గెట్ చేసి చంపడం విప్లవం ఎలా అవుతుంది? విప్లవ పోరాటమే ప్రాధమిక దశలో ఉన్న రోజుల్లో ఇటువంటి చర్యలు ప్రజలను సమీకరించడానికి దోహదపడగలవా? దొర్లుతున్న తప్పులుగా మీరు అంటున్నారు గానీ ఫలానా వారిని చంపడం తప్పు అని మావోయిస్టులు ఏ విషయాలలో సమీక్షించుకున్నారు? వివరించండి.

 8. విశేఖర్ గారూ,
  ఆలస్యంగా చూస్తున్నాను.

  మీరు 1974కీ ముందు చారుమజుందార్ పంధా గురించి ప్రస్తావిస్తున్నారనుకుంటున్నాను. వర్గ శత్రు నిర్మూలన తప్ప మరే పోరాటరూపాన్ని అంగీకరించని పంధానుంచి 1974లో చేసుకున్న ఆత్మవిమర్శనా డాక్యుమెంట్‌తో పీపుల్స్ వార్ ప్రజాసంఘాలను పెద్ద ఎత్తున ఏర్పర్చడానికి ప్రయత్నించింది. దీనికి తాత్కాలికంగా ఎమర్జెన్సీలో అడ్డుకట్ట పడినప్పటికీ జనతా పార్టీ విజయం తర్వాత లభించిన వెసులుబాటును ఉపయోగించుకుని జగిత్యాల జైత్రయాత్రకు ఆ పార్టీ నాంది పలికింది. 1978 నుంచి 1985 దాకా పీపుల్స్ వార్ చరిత్ర ప్రజా సంఘాల ద్వారా లక్షలాది మందిని కదిలించి, విస్తృత స్థాయిలో లీగల్ పోరాటాలకు దిగిన చరిత్రే.. ఆయుధ బలం నామమాత్రంగా ఉపయోగించిన ఈ కాలంలో ఆ పార్టీ చరిత్ర భూస్వామ్య శక్తులచేత, పోలీసులచేత వేటాడబడిన చరిత్ర.. ఆ ఏడేళ్లకాలంలో కొన్ని వందలమంది కార్యకర్తలు నిరాయుధంగా లేదా నామమాత్రపు ఆయుధాలతో గ్రామాలతో తిరుగుతూ శత్రు వేటకు గురై చంపబడ్డారు. ప్రమోషన్లకోసం వెర్రెత్తి ముందుకు వస్తున్న శత్రు బలగాల దూకుడును అడ్డుకోవాలని కేంద్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయంతో దాదాపు పదేళ్ళ తర్వాత పార్టీ చరిత్రలో 1985 నుంచే సాయుధ దాడులు తిరిగి మొదలయ్యాయని నాకు గుర్తు.

  “విప్లవ పార్టీలుగా ఉన్న ఇతర పార్టీల కార్యకర్తలను, నాయకులను కూడా రివిజనిస్టులనీ, ఇన్ఫార్మర్లనీ ఆధారాలు లేని ఆరోపణలు చేసి చంపారు. కాళ్ళూ, చేతులూ నరికారు.”
  ఒక ఘటన జరగడానికి ముందుగా, దాని వెనుక సాగిన గొలుసుకట్టు చర్యల ప్రతిఫలనాలను మీరు పూర్తిగా మరుగున ఉంచి కేవలం దాని అంతిమ ఫలితాన్ని మాత్రమే బయటకు తీసుకువస్తున్నారు. నాకు తెలిసినంతవరకు ఆ కాలంలో దాడులకు ప్రతిదాడులకు దిగకుండా, ఆరోపణలు గుప్పించకుండా, ఏ ఇతర పార్టీలుకూడా అతీతంగా లేవు. ఇన్నేళ్ల తర్వాత వాటికి ఆధారాలను ససాక్ష్యంగా చూపడానికి నావద్ద వనరులుకూడా లేవు.

  మాగుంట సుబ్బరామిరెడ్డిని ఒకానొక బృహత్ లక్ష్యంకోసం అదుపులోకి తీసుకోవాలని పీపుల్స్ వార్ పార్టీ చేసిన ప్రయత్నం ఎంపీ గన్‌మెన్ కాల్పుల నేపధ్యంలో విషాదాంతంగా ముగిసింది. ఆయనను హతమార్చాలని కోస్తా రీజనల్ కమిటీ ఏ దశలోనూ తీర్మానించుకోలేదు. ఘటన జరిగిన తర్వాత పార్టీ చేసిన ప్రకటనను మీరు పూర్తిగా విస్మరించారని అనుకుంటున్నాను.

  “ఫలానా వారిని చంపడం తప్పు అని మావోయిస్టులు ఏ విషయాలలో సమీక్షించుకున్నారు? వివరించండి.”
  నాకు తెలిసి సాయుధ పోరాట చరిత్రలో పీపుల్స్ వార్ తన తప్పులను సమీక్షించుకున్నంత తీవ్రస్థాయిలో ఏ పార్టీ కూడా సమీక్షించుకోలేదు. సరళను పోలీస్ ఏజెంట్‌గా లేదా ముసుగులోని పోలీస్ అధికారిగా భావించి చంపిన చర్యను పార్టీ కేంద్రకమిటీ తన ఘోరాపరాధంగా 92లోనే ప్రకటించి ప్రజలకు క్షమాపణ ప్రకటించింది. తెలంగాణా గ్రామాలన్నింటా ఇన్ఫార్మర్ల నెట్‌వర్క్‌ను నింపివేసి దళాల కదలికలను కూడా పసిగడుతూ శత్రువు దాడులు చేపడుతున్న క్రమలో, దళంను కలవాలని ఈ నాగరిక యువతి రోజుల తరబడి గ్రామాల్లో తిరిగిన ఘటనను హేతుబద్ధంగా అంచనా వేయలేక స్థానిక నాయకత్వం తీసుకున్న త్వరిత చర్య నాటి పార్టీని దిగ్భ్రాంతి పరిచిందన్నది సత్యం. ప్రాణం తీశాక క్షమాపణ చెప్పి వెక్కిరించడం కాదిది. ఇన్ఫార్మర్లు, కోవర్ట్ కార్యకలాపాలతో తెలంగాణాలో దళాల ఉనికి కూడా సాధ్యం కాకుండా పోయిన పరిస్థితిలో జరిగిన అనూహ్య ఘటనగానే పార్టీ ఆత్మవిమర్శ చేసుకుంది తప్పితే దీన్ని దాచిపెట్టాలని ఎన్నడూ అనుకోలేదు.

  వేంపెంటలో అమానుష దాడులకు దిగి దళితులను ఊచకోత కోసిన ఘటనలో అగ్రవర్ణాలు, బిసి కులాలకు చెందిన వారిని కూడా చర్చలకు పిలిచి చంపటం రాజకీయంగా ఘోర తప్పిదంగా పార్టీ అప్పట్లోనే ప్రకటించింది. శత్రువైనా సరే నమ్మి దగ్గరికి వచ్చినప్పుడు విచక్షణ పాటించక పోవడం విప్లవ నీతి కాదనే ఉద్దేశమే కాని ఇక్కడ ఆత్మకూరు ఎంఎల్ఎ బుడ్డా వెంగళరెడ్డి తొత్తులుగా దళితవాడలో అంతకుముందు మారణ కాండను జరిపిన వారిపై ఏ చర్యా తీసుకోకూడదన్నది పార్టీ ఉద్దేశం కాదు. ఘోర దాడులకు గురైన స్థానిక ప్రజల ఒత్తిళ్లకు దళాలు లోనవుతున్నప్పుడు విచక్షణ కోల్పోకుండా వ్యవహరించడంలో పై నాయకత్వం సమర్థంగా వ్యవహరించకపోవడమే ఇలాంటి చర్యకు దారితీసింది తప్పితే ఇది పాలసీ కాదు. నిజంగా పాలసీలో భాగంగా చర్యలు చేపట్టినప్పుడు పార్టీ ఏరోజు కూడా వాటిని దాచిపెట్టలేదన్నది నాకు తెలిసిన విషయం. అలా పాలసీ ప్రకారం మీరు విమర్శించవచ్చు. తప్పులేదు.

  ప్రజల ప్రయోజనాలను అడ్డుకునేవారి పట్ల ఎలా వ్యవహరించాలి? చంపడం ద్వారా వ్యవరించాలని ఏ మహోపాధ్యాయుడూ చెప్పలేదు.” ఇది పూర్తిగా ఆదర్శవాదమే. పలానా భూస్వామిని, శత్రువును నిర్మూలించాలని చైనా కమ్యూనిస్టు పార్టీ డాక్యుమెంట్లలో పొందుపర్చలేదేమో కాని 1927లో యానాన్‌లో ఒకే రోజు లక్షమంది యువతీయువకులు కమ్యూనిస్టులుగా ముద్రించబడి చాంగై షేక్ సైన్యాల దాడిలో ఊచకోతకు గురైన తర్వాత 1949 వరకు సాగిన సైనిక దాడుల క్రమంలో చైనా కమ్యూనిస్టుపార్టీ, ఎర్రసైన్యం కూడా కొన్ని లక్షలమంది శత్రుసైనికులను మట్టుపెట్టాయి. 1930 తర్వాత చైనాపై జపాన్ దురాక్రమణ అనంతరం అసాధారణ స్థాయిలో జాతీయ ఐక్య సంఘటనను నెలకొల్పవలసిన స్థితిలో చైనా పార్టీ చేపట్టిన ఎత్తుగడలను భారతీయ పరిస్థితులతో పోల్చడం సబబు కాదనుకుంటాను.

  ఇలా అంటున్నానని కనిపించిన భూస్వాములను కనిపించినట్లు చంపడమే పార్టీ కార్యక్రమంగా ఉండాలని నేను చెప్పడం లేదు. శ్రీకాకుళం తిరుగుబాటుకు మూలకారకుల్లో ఒకడైన మేడిత సత్యంపై పార్టీ 20 ఏళ్లపాటు చేయివేయలేదని మీరు గుర్తించాలి. ప్రజలకు కీడు తలపెట్టిన ప్రతి ఒక్కరినీ వారు భూస్వాములు కావచ్చు ఇన్ఫార్మర్లు కావచ్చు.. బహిర్గతమైన ప్రతి ఒక్కరినీ మట్టుపెట్టడమే పార్టీ కార్యక్రమమైతే గతం పాతికేళ్లలో పార్టీ చర్య తీసుకున్న వారి సంఖ్య వేలలోనే ఉంటుంది.

  “పొట్టకూటి కోసం ఉద్యోగాలు చేసుకునే పోలీసులను టార్గెట్ చేసి చంపడం విప్లవం ఎలా అవుతుంది?”
  శేఖర్ గారు మీరు ఒక్క రోజు సాయుధ పోరాటంలో పాల్గొని ఉన్నా, విప్లవోద్యమ ఆచరణను కలిగి ఉన్నా మీరు ఈ వ్యాఖ్యను చేసి ఉండరని నా అభిప్రాయం. మిమ్మల్ని అవమానించడానికి ఇలా అనడం లేదు. పోలీసు, అర్థ సైనిక బలగాల పద ఘట్టనలలో నిత్యం నలుగుతున్న అప్రకటిత యుద్ధ పరిస్థితులను మీరు నమ్ముతున్న పంధా కొద్దికాలమైనా ఎదుర్కొని ఉంటే మీరు ఈ వ్యాఖ్యను చేసి ఉండేవారు కాదు. ప్రజలను అన్యాయంగా పీడించవద్దని, దోపిడీ పాలకుల, పోలీసు అధికారుల క్రూర ఆజ్ఞలకు లోబడి ప్రజలపై, గూడేలపై, దాడులు చేయవద్దని, వర్గ సోదరులుగా ప్రజలపట్ల అమానుషంగా వ్యవహరించవద్దని పీపుల్స్ వార్ పార్టీ కొన్ని వందలసార్లు ఉద్యమం జరుగుతున్న అన్ని ప్రాంతాల్లోనూ ప్రకటించింది. పత్రికా ప్రకటనలే కాదు వందలాది పోలీస్ స్టేషన్లకు పోస్ట్ ద్వారా కరపత్రాలు పంపింది.

  వ్యవస్థలో జరుగుతున్న ఏ అన్యాయాన్ని ఎదుర్కొనడానికీ సాహసం లేని, ప్రజల, ఆదివాసుల పక్షాన ఒకరోజు నిలబడిన చరిత్రలేని పోలీసు బలగాలు, వేటకుక్కల్లాగా జనావాసాలపై విరుచుకుపడి, జనాలను, దళాలను కూడా నిర్మూలించడానికి దూసుకొస్తున్నప్పుడు నిలవరించడం, వారి దూకుడుకు అడ్డుకట్టు వేయడం పోలీసులను టార్గెట్ చేయడం అవుతుందా? దళాలకు దళాలను నిర్మూలిస్తున్నప్పుడు, వెంటాడి చంపుతున్నప్పుడు మాన ప్రాణాలను నిలువునా హరిస్తున్నప్పుడు, ఈ ఘోరాలు చేయడానికి రక్తపు కూడుకు ఆశపడి ముందుకు వస్తున్నదీ పొట్టకూటికి ఉద్యోగాలు చేసుకునే పోలీసులే అనే విషయం మీరు మర్చిపోతున్నారా?

  మిమ్మల్ని అవమానించాలని, హేళన చేయాలని ఇలా అనడం లేదు. మీరు ఒడ్డున ఉండి పరిస్థితిని అంచనావేస్తున్నారు. ఇది ప్రజలకు ఉపయోగకరమైన స్పందన కాదేమో మరోసారి ఆలోచించాలని కోరుతున్నాను.

  చివరగా, పీపుల్స్ వార్ కాని, మావోయిస్టు పార్టీ కాని తాము రాజకీయపరంగా, పంధా పరంగా చేస్తున్న తప్పులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఫలితాలను అనుభవిస్తూనే ఉన్నాయి. వాటిని దాచిపెట్టే ఉద్దేశం నాకు లేదని గమనించగలరు.

 9. పింగ్‌బ్యాక్: రాజశేఖర్ గారూ.. విశేఖర్ గారి టపాలో మీవ్యాఖ్యకు నా సమాధానం..!! « కలల ప్రపంచం

 10. పింగ్‌బ్యాక్: రాజశేఖర్ గారూ.. విశేఖర్ గారి టపాలో మీవ్యాఖ్యకు నా సమాధానం..!! « కమ్యూ 'నిజం'

 11. ఒకవేళ వర్గ శతృ నిర్మూలన అనేది నిజంగా జరిగి ఉంటే సిద్దార్థ శంకర్ రే (పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి), కర్పూరీ ఠాకూర్ (బీహార్ ముఖ్యమంత్రి), జలగం వెంగళరావు(ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి) 1970ల టైమ్‌లోనే చనిపోయేవాళ్ళు కదా. కర్పూరీ ఠాకూర్‌కి నిరాయుధులైన రైతులపై కాల్పులు జరిపించిన చరిత్ర కూడా ఉంది. అయినా కర్పూరీ ఠాకూర్ ఎందుకు హత్యకి గురవ్వలేదు?

 12. పోలీసులు పొట్టకూటి కోసం ఉద్యోగంలో చేరడం విషయానికొద్దాం. సివిల్ పోలీసుల కంటే స్పెషల్ పార్టీ పోలీసులకే జీతాలు ఎక్కువగా వస్తాయనే విషయం గుర్తుంచుకోవాలి. ఆ మాత్రం జీతాలు ఇవ్వకపోతే పోలీసులు తాము చెప్పినట్టు చెయ్యరు అని పాలకవర్గంవాళ్ళకి తెలిసే సాధారణ పోలీసుల కంటే ఎక్కువ జీతాలు అందుకునే స్పెషల్ పార్టీ పోలీసులని ఏర్పాటు చేస్తారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s