చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం, అమెరికా ఎగుమతులపై చైనా అదనపు సుంకాలు


చైనా, అమెరికాల వాణిజ్య యుద్ధంలో మరో ముందడుగు పడింది. చైనా నుండి ఎగుమతి అవుతున్న గ్రీన్ ఉత్పత్తుల వలన అమెరికా గ్రీన్ ఉత్పత్తులకు నష్టం వాటిల్లుతున్నదంటూ అమెరికా ఉత్పత్తిదారులు ఇచ్చిన ఫిర్యాదును పురస్కరించుకుని అమెరికా ప్రభుత్వం దర్యాప్తు కమిటీని నియమించిన తర్వాత చైనా ప్రతీకార చర్య చేపట్టింది. అమెరికానుండి కార్లు పెద్ద ఎత్తున డంప్ చేస్తున్నారని ఆరోపిస్తూ అక్కడి నుండి దిగుమతి అవుతున్న కార్లపైన చైనా వివిధ స్ధాయిల్లో అదనపు సుంకాలను విధించింది.

అమెరికా కేవలం దర్యాప్తు కమిటీ మాత్రమే నియమించగా చైనా ఏకంగా చర్యలోకే నేరుగా దిగింది. గత కొన్ని సంవత్సరాలుగా పర్యావరణ సంబంధిత తెలివిడి అన్ని దేశాలకూ అధికం కావడంతో తత్సంబంధిత ఉత్పత్తులకు గిరాకి పెరుగుతోంది. మునుముందు ఈ ఉత్పత్తులకు డిమాండు మరింత పెరగనుంది. ఇటువంటి గ్రీన్ ఉత్పత్తులలో చైనా ఇప్పటికే వేగంగా దూసుకు వెళుతోంది. చైనా వేగాన్ని అమెరికా, యూరప్ లకు తలనొప్పిగా పరిణమించింది. చైనా ఉత్పత్తులు చౌక శ్రమతో తయారైనందున అంతర్జాతీయ మార్కెట్ లో తక్కువ ధరలు పలుకుతున్నాయి. దానితో చైనా ఉత్పత్తులు ఇస్తున్న పోటీని అమెరికా, యూరప్ ల కంపెనీలు తట్టుకోలేకున్నాయి. చైనా పోటీని ఎదుర్కొవడానికి అమెరికా అడ్డదారి ఎంచుకుని డంపింగ్ చట్టాలను ప్రయోగించి చైనా ఎగుమతులపైన సుంకాలను పెంచాలని చూస్తోంది. అందులో భాగంగా దర్యాప్తు కమిటిని నియమించింది.

అయితే చైనా దర్యాప్తు లాంటివేవీ పెట్టుకోలేదు. పెద్ద కార్లు, స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్.యు.వి) లాంటి వాహనాలను పెద్ద ఎత్తున చైనా మార్కెట్లోకి డంప్ చేస్తున్నారని ఆరోపిస్తూ, దాన్ని అడ్దుకోవడానికి 22 శాతం వరకూ అదనపు పన్నులు విధిస్తామని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రపంచంలో మొదటి రెండు అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధలైన అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ఆ విధంగా బహిరంగంగా ముందుకొచ్చిందని భావించవచ్చు. కరెన్సీ యుద్ధం గురించి దాదాపు సంవత్సరం న్నర క్రితమే ఐ.ఎం.ఎఫ్ మాజీ అధిపతి డొమినిక్ స్ట్రాస్ కాన్ హెచ్చరించాడు. అప్పట్లో ఆయన ‘కరెన్సీ వార్’ పరిస్ధితులు ఏర్పడుతున్నాయని హెచ్చరించాడు. అది ఇప్పుడు వాణిజ్య యుద్ధంగా బహిరంగ రూపు సంతరించుకుందని భావించవచ్చు.

‘జనరల్ మోటార్స్’ కంపెనీ తయారు చేసే కాడిల్లాక్ ఎస్.ఆర్.ఎక్స్, క్రిస్లర్ గ్రూప్ తయారు చేసే జీపులు, అలాగే బి.ఎం.డబ్ల్యూ ఎక్స్3 కార్లు… ఈ వాహనాలపై అపరాధ పన్నులు విధించనున్నట్లు చైనా వాణిజ్య శాఖ తెలిపింది. ఈ మూడు రకాల వాహనాలను చైనా మార్కెట్ లోకి డంప్ చేస్తున్నారనీ అందువల్ల చైనా దేశీయ పరిశ్రమకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతున్నదనీ చైనా ఆరోపించింది. అమెరికా, చైనా ల మధ్య సంబంధాలు స్వల్ప స్ధాయిలోనైనా దెబ్బతింటున్న పరిస్ధితుల్లో తాజాగా చెలరేగుతున్న వాణిజ్య యుద్ధం మరిన్ని ఉద్రిక్తతలను పెంచుతుందనడంలో సందేహం లేదు. చైనా కరెన్సీ, వాణిజ్య విధానాలపైన అమెరికా, యూరప్ లు అదేపనిగా విమర్శిస్తున్నాయి. ఈ రెండు దేశాలతో చైనాకు భారీగా వాణిజ్య మిగులు ఉండడమే దానికి కారణం.

గురువారం పెంచిన సుంకాలు అమల్లోకి వస్తాయని తెలిపింది. బి.ఎం.డబ్ల్యూ ఎక్స్3 కార్ల పైన రెండు శాతం లెవీ విధించిన చైనా జి.ఎం వాహనాలపైన ఇరవై రెండు శాతం, క్రిస్లర్ వాహనాలపైన పదిహేను శాతం సుంకాలు విధించింది. చైనా చర్యపై తీసుకోవలసిన చర్యల గురించి కాంగ్రెస్ తోనూ, సంబంధిత భాగస్వామ్యులతోనూ చర్చిస్తామని అమెరికా వాణిజ్య అధికారులు తెలిపారు. చైనా చర్యలు తమని నిరాశపరిచాయని అమెరికా వాణిజ్య ప్రతినిధి స్పోక్స్ పర్సన్ కారోల్ గుధ్రీ వ్యాఖ్యానించింది. అమెరికా దిగుమతులపై చైనా చేస్తున్న పరిశోధనలు సమస్యలు సృష్టిస్తున్నాయని తాము ఎప్పటినుండో చెపుతున్నాయని ఆమె తెలిపింది.

కొత్త పన్నుల వల్ల చైనాలో తమ వ్యాపారాలపైన పెద్దగా ప్రభావం ఉండదని బి.ఎం.డబ్ల్యూ తెలిపింది. అమెరికా చైనాల వాణిజ్య ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని జి.ఎం తెలిపింది. ఆర్ధిక సంక్షోభం సందర్భంగా అమెరికా ప్రభుత్వం జి.ఎం, క్రిస్లర్ కంపెనీలకు పెద్ద ఎత్తున బెయిలౌట్లు మంజూరు చేసింది. అలాగే అమెరికా ఎనర్జీ విభాగం జి.ఎం, ఫోర్డ్ కంపెనీలకు సబ్సిడీ లోన్లను మంజూరు చేశాయి. దాదాపు అమెరికాలోని ఆటో కంపెనీలన్నీ స్ధానిక ప్రభుత్వాలు మంజూరు చేసిన టాక్స్ క్రెడిట్లు నుండి ఇతర అనేక సబ్సిడీల రూపంలో బాగా లబ్ది పొందాయి. చైనా లోని కార్ మార్కెట్ లో డెబ్భై శాతం అమెరికా, యూరప్, జపాన్, సౌత్ కొరియా దేశాలే ఆక్రమించాయి. చైనా ఆటో పరిశ్రమ ఇంకా పశ్చిమ దేశాల స్ధాయికి వృద్ధి చెందలేదు.

క్రిస్లర్ లాంటి కంపెనీలు చైనాలో ఉత్పత్తి కార్యక్రమాలు పెంచాలను యోచిస్తున్న తరుణంలో వాణిజ్య యుద్ధం ప్రారంభం కావడం ఆ కంపెనీలకు తాత్కాలిక ఇబ్బంది ఏర్పడుతుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s